సాక్షి, హైదరాబాద్: ప్లాటు కోసం వినియోగదారు నుంచి వాయిదాల పద్ధతిలో డబ్బు వసులు చేసి రిజిస్ట్రేషన్ చేయని నార్నే రియల్ ఎస్టేట్ సంస్థకు తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల కమిషన్ భారీ జరిమానా విధించింది. వినియోగదారు చెల్లించిన మొత్తాన్ని 18%తో తిరిగి చెల్లించాలని, వినియోగదారు మరో ప్లాట్ తీసుకునేందుకు ఆసక్తి చూపితే వెంటనే రిజిస్ట్రేషన్ చేయాలని తీర్పు చెప్పింది. దీంతోపాటుగా నష్టపరిహారంగా రూ.లక్ష, ఖర్చుల కింద రూ.5 వేలు చెల్లించాలని కమిషన్ అధ్యక్షుడు జస్టిస్ బి.ఎన్.రావు నల్లా, సభ్యులు పాటిల్ విఠల్‌రావులతో కూడిన ధర్మాసనం తీర్పునిచ్చింది.
రిజిస్ట్రేషన్లు ఆపేసిందన్న సాకుతో..
నార్నే రియల్ ఎస్టేట్స్ సంస్థ హైదరాబాద్ శివారులోని ఈస్ట్ సిటీ వెంచర్ వేసింది. అందులోని 250 గజాల స్థలాన్ని కర్ణాటకలోని బీజాపూర్‌కు చెందిన శ్రీలక్ష్మి ఎం.కొత్వాల్ అనే మహిళ వాయిదాల పద్ధతిలో కొనుగోలు చేశారు. ప్రభుత్వం రిజిస్ట్రేషన్లను నిలిపివేసిందనే కారణంతో నార్నే సంస్థ ఆమెకు ప్లాట్‌ను రిజిస్ట్రేషన్ చేయలేదు. నిమ్స్ నిర్మాణం వల్ల 500 ప్లాట్లు పోతున్నాయని, అందుకు గజానికి రూ.1500 వరకూ తిరిగి చెల్లిస్తామని శ్రీలక్ష్మికి నార్నే సంస్థ లేఖ రాసింది.
అయితే జాతీయ రహదారి విస్తరణలో ప్లాట్ పోయిందని, మరో వెంచర్‌లో ప్లాట్ తీసుకోవాలని నార్నే సంస్థ తెలిపింది. స్థలం రిజిస్ట్రేషన్ చేయాలని 2009 నుంచి 2011 వరకూ ఆ సంస్థకు లేఖలు రాసినా ఫలితం లేకపోవడంతో శ్రీలక్ష్మి జిల్లా వినియోగదారుల ఫోరంలో కేసు వేసి గెలుపొందారు. దీనిని నార్నే సంస్థ రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌లో అప్పీల్ చేసింది. శ్రీలక్ష్మి చెల్లించిన మొత్తం డబ్బును నార్నే సంస్థ తిరిగి ఆమెకు చెల్లించకపోవడమే కాకుండా జాతీయ రహదారి కోసం జరిగిన భూసేకరణలో ఆమెకిచ్చిన పరిహారా న్ని కూడా ఆ సంస్థే తీసేసుకుంది. ఈ కేసును విచారించిన కమిషన్ పైవిధంగా తీర్పునిచ్చింది.
‘నార్నే’ సంస్థకు భారీ జరిమానా
Published Sat, May 12 2018 2:37 AM | Last Updated on Sat, May 12 2018 2:37 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment