ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, అమరావతి: సిజేరియన్ ప్రసవాలు పెరుగుతుండటం దుష్పరిణామాలు కలిగించే అంశమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచవ్యాప్తంగా జరగాల్సిన దానికంటే 6.2 మిలియన్‌లు అంటే 62 లక్షల సిజేరియన్ ప్రసవాలు అధికంగా జరుగుతున్నాయనేది డబ్ల్యూహెచ్‌వో అంచనా. తాజాగా సిజేరియన్ ప్రసవాలపై డబ్ల్యూహెచ్‌వో అన్ని దేశాలకు ఓ నివేదిక ఇచ్చింది. కోత ద్వారా ప్రసవం చేయడానికి ఎలాంటి కారణమూ చూపలేని పరిస్థితులు ఉన్నాయని, ఒత్తిడి వల్లనో, వాణిజ్యపరంగా లాభాలను ఆశించో, మరే ఇతర కారణాల వల్లనో గర్భిణి చేరిన గంటల వ్యవధిలోనే కోతల ద్వారా బిడ్డను బయటకు తీస్తున్నారని, ఇది భవిష్యత్‌లో తీవ్ర దుష్ఫలితాలను ఇస్తుందని పేర్కొంది.
వైద్యపరంగా తీవ్ర ప్రతికూల పరిస్థితుల్లో మాత్రమే సిజేరియన్ ప్రసవం చేయాల్సి ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితులను చూస్తే 90 శాతం మంది డాక్టర్లు ఎందుకు సిజేరియన్ ప్రసవం చేయాల్సి వచ్చింది అనేందుకు సరైన కారణాలు చెప్పలేకపోతున్నారని పేర్కొంది. సిజేరియన్ ప్రసవానికి సాక్ష్యాలతో కూడిన క్లినికల్ ఆధారాలను చూపించేలా చర్యలు తీసుకోవాలని ప్రపంచ దేశాలకు డబ్ల్యూహెచ్‌వో సూచించింది.
చదవండి: గర్భిణులకు కోవిడ్ సోకితే, నెలలు నిండకముందే ప్రసవం
క్రాస్ ఆడిట్‌కు ప్రభుత్వం నిర్ణయం
రాష్ట్రంలోనూ కోతల ప్రసవాల సంఖ్య పెరుగుతున్నట్టు గణాంకాలను బట్టి తెలుస్తోంది. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఇష్టారాజ్యంగా సిజేరియన్ ప్రసవాలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, గడిచిన నాలుగైదు మాసాల్లో ప్రభుత్వ పరిధిలోని పెద్దాసుపత్రుల్లోనూ సిజేరియన్ ప్రసవాలు ఎక్కువగానే ఉన్నాయి. రాత్రి 8 గంటల సమయం నుంచి ఉదయం 8 గంటల ముందు ఆస్పత్రిలో చేరిన వారికి ఎక్కువగా సిజేరియన్ ప్రసవాలు చేస్తున్నట్టు వెల్లడైంది. ఈ నేపథ్యంలో సిజేరియన్‌ల వల్ల కలిగే నష్టాలపై రాష్ట్రవ్యాప్తంగా అవగాహన కల్పించేందుకు వైద్య ఆరోగ్య శాఖ కార్యాచరణ చేపట్టింది. కోతల ప్రసవాలపై కలిగే నష్టాలపై ప్రతి గ్రామంలోనూ అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని భావిస్తోంది. ఇకపై ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులో క్రాస్ ఆడిట్ నిర్వహిస్తారు. ఒక జిల్లాలో జరిగిన ప్రసవాలపై మరో జిల్లా అధికారులతో క్రాస్ ఆడిట్ నిర్వహించి, అకారణంగా కోతలు నిర్వహించిన వారిపై చర్యలు తీసుకోనున్నారు.
చదవండి: గర్భధారణ సమయంలో టిఫా స్కానింగ్ ఎందుకు చేస్తారు?
25 శాతానికి మించకూడదు
మొత్తం ప్రసవాల్లో 25 శాతానికి మించి కోతల ప్రసవాలు జరగకూడదు. అలాంటిది ప్రైవేటు ఆస్పత్రుల్లో 65 శాతం పైగా జరుగుతున్నాయి. ప్రభుత్వ పరిధిలోనూ 35 నుంచి 40 శాతం జరుగుతున్నాయి. అవగాహన లేక కొంతమంది గర్భిణుల తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు ‘మా బిడ్డ నొప్పులు భరించలేదు.. ఆపరేషన్ చేయండి డాక్టర్..’ అంటున్నారు. లేదంటే ‘ఈ రోజు మంచి రోజు.. ప్రసవం ఈ రోజు జరిగితే బావుంటుందని పంతులు చెప్పారు..’ అంటూ ఒత్తిడి చేస్తున్నారు. ఇది చాలా బాధాకరం. ఇలాంటి నిర్ణయాల వల్ల తల్లికీ బిడ్డకూ నష్టం చేసిన వారవుతారు.
– డా.గీతాప్రసాదిని, ప్రజారోగ్య సంచాలకులు
సిజేరియన్‌తో ఆరోగ్య సమస్యలు
►సాధారణ ప్రసవం ద్వారా పుట్టిన వారికంటే సిజేరియన్ ప్రసవం ద్వారా పుట్టిన పిల్లలకు ఐక్యూ తక్కువగా ఉంటుంది.
►చిన్న వయసులోనే తల్లులకు నడుము నొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువ. సిజేరియన్ వల్ల చాలామంది తల్లులు స్థూలకాయం బారిన పడుతున్నారు.
►పిల్లల్లో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటోంది.
2021 మార్చి నుంచి జూన్ వరకు ప్రభుత్వ పెద్దాసుపత్రుల్లో ప్రసవాలు ఇలా..
ఆస్పత్రి | మొత్తం ప్రసవాలు | సిజేరియన్ ప్రసవాలు |
జీజీహెచ్, అనంతపురం | 2,150 | 945 |
జీజీహెచ్, విజయవాడ | 2,351 | 1,173 |
జీజీహెచ్, కాకినాడ | 1,900 | 645 |
జీజీహెచ్, కర్నూలు | 2,119 | 921 |
కింగ్‌జార్జి, విశాఖపట్నం | 2,484 | 1087 |
జీజీహెచ్, శ్రీకాకుళం | 583 | 308 |
జీజీహెచ్, గుంటూరు | 1,986 | 971 |
జీజీహెచ్, నెల్లూరు | 1,074 | 596 |
జీజీహెచ్, కడప | 1,536 | 826 |
జీజీహెచ్, ఒంగోలు | 260 | 143 |
Comments
Please login to add a commentAdd a comment