గర్భిణిని రూ.5 వేలు అడిగిన వైద్యురాలు
టి.కొత్తపల్లిలో ఘటన
ఐ.పోలవరం: నిండు గర్భిణి పురిటి నొప్పులతో ప్రభుత్వాస్పత్రిని ఆశ్రయించగా అక్కడ సిబ్బంది తీరుతో ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. మురముళ్ల గ్రామానికి చెందిన గోడ లావణ్య అనే గర్భిణికి పురుడునొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు టి.కొత్తపల్లి సామాజిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి గైనకాలజిస్టు అన్ని పరీక్షలు చేసి, వెంటనే ఆపరేషన్ చేయాలని లేదంటే ప్రమాదమని చెప్పారు. అయితే ఆపరేషన్ కోసం మత్తు డాక్టరుకు రూ.5 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
దీంతో లావణ్య బంధువులకు ఏం చేయాలో పాలుపోలేదు. డబ్బులు లేవని ప్రాధేయపడినా వైద్య సిబ్బంది కనికరం చూపకపోవడంతో గర్భిణిని ఇంటికి తీసుకెళ్లిపోయారు. కాగా.. ఆస్పత్రిలో ఎదురైన చేదు అనుభవాన్ని లావణ్య స్వయంగా విలేకరులకు తెలిపారు. దీనిపై ఆస్పత్రి ఇన్‌చార్జి డాక్టర్ డయానాను వివరణ కోరగా ఆ విషయం తన దృష్టికి రావడంతో ఆస్పత్రికి వెళ్లానన్నారు. మత్తు డాక్టరుకు ఇవ్వాలంటూ అక్కడి వైద్యురాలు డబ్బులు డిమాండ్ చేశారన్న బాధితుల ఆరోపణపై విచారణ చేయిస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment