Govt Doctor
-
ప్రభుత్వాస్పత్రిలో ప్రసవానికి డబ్బుల డిమాండ్
ఐ.పోలవరం: నిండు గర్భిణి పురిటి నొప్పులతో ప్రభుత్వాస్పత్రిని ఆశ్రయించగా అక్కడ సిబ్బంది తీరుతో ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. మురముళ్ల గ్రామానికి చెందిన గోడ లావణ్య అనే గర్భిణికి పురుడునొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు టి.కొత్తపల్లి సామాజిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి గైనకాలజిస్టు అన్ని పరీక్షలు చేసి, వెంటనే ఆపరేషన్ చేయాలని లేదంటే ప్రమాదమని చెప్పారు. అయితే ఆపరేషన్ కోసం మత్తు డాక్టరుకు రూ.5 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో లావణ్య బంధువులకు ఏం చేయాలో పాలుపోలేదు. డబ్బులు లేవని ప్రాధేయపడినా వైద్య సిబ్బంది కనికరం చూపకపోవడంతో గర్భిణిని ఇంటికి తీసుకెళ్లిపోయారు. కాగా.. ఆస్పత్రిలో ఎదురైన చేదు అనుభవాన్ని లావణ్య స్వయంగా విలేకరులకు తెలిపారు. దీనిపై ఆస్పత్రి ఇన్చార్జి డాక్టర్ డయానాను వివరణ కోరగా ఆ విషయం తన దృష్టికి రావడంతో ఆస్పత్రికి వెళ్లానన్నారు. మత్తు డాక్టరుకు ఇవ్వాలంటూ అక్కడి వైద్యురాలు డబ్బులు డిమాండ్ చేశారన్న బాధితుల ఆరోపణపై విచారణ చేయిస్తామని తెలిపారు. -
ఎన్నికల్లో ఓడిపోతే మళ్లీ ఉద్యోగం
జైపూర్: రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రభుత్వ డాక్టర్ దీపక్ ఘోగ్రా(43)కు రాష్ట్ర హైకోర్టు అనుమతి మంజూరు చేసింది. ఒకవేళ ఎన్నికల్లో ఓడిపోతే ఆయన మళ్లీ ఉద్యోగంలో చేరడానినికి అంగీకరించింది. దీపక్ భారతీయ ట్రైబల్ పార్టీ టికెట్‌పై దుంగార్పూర్ స్థానం నుంచి పోటీకి దిగుతున్నారు. పరాజయం పాలైతే ఉద్యోగంలో చేర్చుకోవాలంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు సానుకూలంగా స్పందించింది. ఎన్నికల్లో దీపక్ ఓడిపోతే మళ్లీ ఉద్యోగంలో చేర్చుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. -
Andhra Pradesh: ఆ వైద్యుడి చికిత్స ఖర్చు ప్రభుత్వానిదే..!
ఒంగోలు/కవిటి: కోవిడ్ బాధితులకు అలుపెరగని సేవలందించిన ప్రభుత్వ వైద్యుడు కరోనా బారిన పడి ఆస్పత్రి పాలవగా.. ఆయన చికిత్సకు అయ్యే ఖర్చును భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం కొత్తపుట్టుగకు చెందిన డాక్టర్ ఎన్.భాస్కరరావు ప్రకాశం జిల్లా కారంచేడు పీహెచ్సీ వైద్యాధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉన్నతాధికారుల ఆదేశాలతో సుమారు 6 వేల మందికి కోవిడ్–19 నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. పాజిటివ్‌గా తేలిన వారెందరికో అండగా నిలబడ్డారు. ఆయన అందించిన వైద్యంతో వేలాది మంది కోవిడ్ బారినుంచి బయటపడ్డారు. ఏప్రిల్ 24న ఆయనకు కరోనా సోకింది. నెలాఖరు వరకు హోమ్ ఐసోలేషన్‌లో ఉండి వైద్యం పొందారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో భార్య డాక్టర్ భాగ్యలక్ష్మి ఆయనను విజయవాడ ఆయుష్ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ 10 రోజుల వైద్యం తరువాత మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ యశోదా హాస్పిటల్, తరువాత గచ్చిబౌలిలోని కేర్ హాస్పిటల్లో చికిత్స పొందారు. ఊపిరితిత్తులు పూర్తిగా పాడవటంతో శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది కలుగుతుండటంతో ఆయనను వెంటిలేటర్‌పై ఉంచి వైద్యం అందిస్తున్నారు. ఆయనకు ఊపిరితిత్తులు మార్చాలని తేల్చిన వైద్యులు అందుకు రూ.1.50 కోట్లకు పైగా ఖర్చవుతుందని చెప్పారు. అంత ఆర్థిక స్థోమత లేకపోవడంతో డాక్టర్ భాస్కరరావు కుటుంబ సభ్యులు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని ఆశ్రయించారు. బాలినేని ఈ విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. తక్షణం స్పందించిన ముఖ్యమంత్రి అతడి వైద్య ఖర్చుల నిమిత్తం రూ.కోటి వెంటనే చెల్లించాలని, అవసరమైతే మరో రూ.50 లక్షలు చెల్లించేందుకు ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారని మంత్రి బాలినేని తెలిపారు. చదవండి: సకల సౌకర్యాలతో జర్మన్ హ్యాంగర్ ఆస్పత్రి -
ఫిజియోథెరపి చేస్తూ.. కాళ్లు విరగ్గొట్టాడు
-
కాళ్లు విరగ్గొట్టారు.. రామంతాపూర్‌లో దారుణం
సాక్షి, హైదరాబాద్ : రామంతాపూర్‌లోని ప్రభుత్వ హోమియోపతి ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. రెండున్నరేళ్ల బాలుడికి ఫిజియోథెరపి చేస్తూ.. వైద్యుడు ఏకంగా కాళ్లు విరగ్గొట్టాడు. ఈ ఘటనపై బాలుడి కుటుంబసభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ హోమియోపతి ఆస్పత్రికి చెందిన వైద్యుడు కిరణ్‌కుమార్ బాలుడికి ఫిజియోథెరపీ చేస్తూ.. కాళ్లు విరగ్గొట్టాడు. డాక్టర్ కిరణ్‌కుమార్ తీవ్ర నిర్లక్ష్యంతో వ్యవహరించి తమ చిన్నారి కాళ్లు విరగ్గొట్టాడని కుటుంబసభ్యులు మండిపడుతున్నారు. దీనిపై వైద్యుడిని నిలదీశారు. ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించుకోవాలని చెప్పి.. సదరు వైద్యుడు చేతులు దులుపుకున్నాడు. వైద్యుడి నిర్వాకంపై ఫిర్యాదు చేసినా ఆస్పత్రి ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని బాలుడి కుటుంబసభ్యులు చెప్తున్నారు. కాళ్లు విరగడంతో తీవ్రమైన నొప్పులతో నడవలేని స్థితిలో బాలుడు ఉన్నాడు. దీంతో ఆ చిన్నారి కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యపూరిత ప్రవర్తనపై బాలుడి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. -
డాక్టర్ ‘చైతన్య’సుధ
గర్భిణులకు మెరుగైన సేవలు రాయికల్ ప్రభుత్వాస్పత్రి వైద్యురాలు ఆదర్శం దూర ప్రాంతాల నుంచి ‘సర్కార్’ వైద్యం కోసం వస్తున్న మహిళలు రాయికల్ : వైద్యోనారాణో హరి. దేవుళ్లతో సమానంగా వైద్యులను కొలుస్తారు. అవును ఆమె కనిపించే దేవతే!.. రాయికల్ ప్రభుత్వాస్పత్రి వైద్యురాలు చైతన్యసుధ. పేరుకుతగట్టు సేవలందిస్తున్నారు.. వైద్య వృత్తికే వన్నె తెస్తున్నారు.. ప్రజలకు అందుబాటులో ఉంటూ నేనున్నాన ంటూ భరోసా కల్పిస్తున్నారు. రోగుల మన్ననలు అందుకుంటున్నారు.. అవార్డులు.. రివార్డులు సొంతం చేసుకుంటున్నారు. రాయికల్ 30 పడకల ప్రభుత్వాసుపత్రి.. రోగులు ఇక్కడికి రావాడానికి భయపడేవారు. సర్కారు దవాఖానా కదా... సేవలు సరిగ్గా అందుతాయో లేదోనని ప్రైవేట్ ఆస్పత్రుల బాట పట్టేవారు. మూడేళ్ల క్రితం పరిస్థితులు మారాయి. 2013లో చైతన్యసుధ స్త్రీవైద్య నిపుణులు ఆస్పత్రి వైద్యురాలిగా బాధ్యతలు చేపట్టారు. విధుల్లో చేరినవెంటనే మండల ప్రజలతో సమావేశం ఏర్పాటుచేసి రోగులందరూ స్థానికంగా చికిత్స పొందేలా అవగాహన కల్పించారు. గర్భిణులు స్థానికంగా వైద్య పరీక్షలు చేయించుకునేలా ప్రోత్సహించారు. అలా ఆస్పత్రికి వచ్చే వారికి మెరుగైన వైద్యసేవలు అందిస్తూ ప్రభుత్వ వైద్యంపై నవ్ముకాన్ని పెంచారు. పెరిగిన ప్రసవాలు.. ప్రభుత్వ వైద్యంపై నమ్మకం కలగడంతో రాయికల్ ఆస్పత్రిలో ప్రసవాల సంఖ్య క్రమంగా పెరిగింది. 2013లో 150 ప్రసవాలు, 2014లో 282, 2015లో 300 ప్రసవాలు జరిగాయి. ఇందులో ఎక్కువగా సాధారణ ప్రసవాలే జరగడం విశేషం. డాక్టరమ్మ సేవలను గుర్తించిన చాలామంది రాయికల్‌లో చికిత్సల కోసం క్యూకడుతున్నారు. జగిత్యాల డివిజన్లోని రాయికల్, మల్లాపూర్, సారంగపూర్, కోరుట్ల, మెట్పల్లి, మేడిపెల్లి మండలాల నుంచి పెద్దసంఖ్యలో మహిళలు వైద్య సేవలకోసం వస్తున్నారు. ఆమె సేవలను గుర్తించిన ఉన్నతాధికారులూ మూడుసార్లు ఉత్తమ వైద్యురాలిగా ఎంపికచేశారు. పలుమార్లు ప్రశంసించారు. కు.ని.లో రికార్డు.. ప్రసవాల సంఖ్య పెంచడంతో పాటు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లలో సైతం చైతన్యసుధ రికార్డు నెలకొల్పారు. జగిత్యాల డివిజన్లో కోరుట్ల, మల్యాల, కొడిమ్యాల, ధర్మపురి, సారంగాపూర్, మెట్‌పెల్లి, రాయికల్ ప్రభుత్వాసుపత్రిలో వారంకు ఒకరోజు చొప్పున కేటాయిస్తు ఆపరేషన్లు చేస్తున్నారు. 2013లో 400, 2014లో 600, 2015లో 600లకు పైగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా మంత్రుల చేతుల మీదుగా ఉత్తమ వైద్యురాలిగా చైతన్యసుధ ప్రశంసపత్రాన్ని అందుకున్నారు. మల్లాపూర్ నుంచి వచ్చిన.. – నాగమణి, రాఘవపేట్, మల్లాపూర్ మండలం మాది మల్లాపూర్ మండలం రాఘవపేట. రాయికల్ హాస్పిటల్ చైతన్యసుధ డాక్టరమ్మ మంచిగా వైద్యం చేస్తున్నారని చెప్పడంతో ఇక్కడికి వచ్చాను. జాయిన్ చేసుకుని వైద్యసేవలు అందించారు. వారం రోజుల క్రితం బాబు పుట్టాడు. బాబు, నేను క్షేమంగా ఉన్నాం. నమ్మకంతో వస్తున్నాం.. – భూమిక, రేచ్పెల్లి సారంగపూర్ మండలం మాకు జగిత్యాల దగ్గరగా ఉన్నప్పటికీ 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాయికల్ ప్రభుత్వాసుపత్రికి వస్తున్నాం. ఇక్కడి వైద్యురాలి పర్యవేక్షణలో కాన్పు చేయించుకున్నాను. నాకు పాప పుట్టింది. ఇద్దరం క్షేమంగా ఉన్నాం. సేవలు బాగున్నాయ్.. – కవిత, భూపతిపూర్ రాయికల్ ప్రభుత్వాస్పత్రిలో సేవలు బాగున్నాయ్. గర్భిణులకు అన్ని రకాల పరీక్షలు నిర్వహించడంతో పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తున్నారు. పలుగ్రామాల గర్భిణిలు ఇక్కడ కాన్పు చేయించుకుంటున్నారు. వైద్యసేవలతో సంతృప్తి – చైతన్యసుధ, వైద్యురాలు గర్భిణిలు నన్ను నమ్మకుని ఆస్పత్రికి వస్తారు. కాన్పు చేసే సమయంలో తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నప్పుడే నాకు నిజమైన సంతృప్తినిస్తుంది. మొట్టమొదటిసారిగా పాప ఏడుపు...తల్లిలో చిరునవ్వు చూడగానే ఆనందంగా ఉంటుంది. -
నంద్యాల ప్రభుత్వ వైద్యుడు హత్య.
-
నంద్యాల ప్రభుత్వ వైద్యుడు హత్య
-
నంద్యాలలో దారుణం
కర్నూలు : కర్నూలు జిల్లా నంద్యాలలోని శ్రీనివాస్ సెంటర్లో దారుణం చోటు చేసుకుంది. మంగళవారం తెల్లవారుజామున ప్రభుత్వ వైద్యుడు శైలేంద్రరెడ్డిని నలుగురు యువకులు బండరాయితో మోది హతమార్చారు. కర్నూలు జిల్లా మహానంది మండలం గాజులపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యునిగా శైలేంద్రరెడ్డి విధులు నిర్వహిస్తున్నారు. అయితే డాక్టర్ శైలేంద్రరెడ్డి తన నలుగురు స్నేహితులతో కలిసి సోమవారం రాత్రి నంద్యాల వచ్చారు. నంద్యాల బస్టాండు సమీపంలో ఉన్న ఓ మద్యం దుకాణంలో మద్యం కోనుగొలు చేసి.. అందరూ బాగా తాగారు. ఆ క్రమంలో వారి మధ్య మాటామాటా పెరిగి నలుగురు యువకులు డాక్టర్ శైలేంద్రరెడ్డిని బండరాయితో తలపై మోది హతమార్చి రోడ్డుపై పడేసి పరారైయ్యారు. రాత్రి పెట్రోలింగ్‌లో నిర్వహిస్తున్న పోలీసులు ... వైద్యుడు రోడ్డుపై పడి ఉండటాన్ని గమనించి స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ డాక్టర్ శైలేంద్రరెడ్డి మరణించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా సీసీ కెమెరా ఫుటేజ్‌లను పోలీసులు పరిశీలించి.... నలుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.