
సాక్షి, హైదరాబాద్ : రామంతాపూర్‌లోని ప్రభుత్వ హోమియోపతి ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. రెండున్నరేళ్ల బాలుడికి ఫిజియోథెరపి చేస్తూ.. వైద్యుడు ఏకంగా కాళ్లు విరగ్గొట్టాడు. ఈ ఘటనపై బాలుడి కుటుంబసభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ హోమియోపతి ఆస్పత్రికి చెందిన వైద్యుడు కిరణ్‌కుమార్ బాలుడికి ఫిజియోథెరపీ చేస్తూ.. కాళ్లు విరగ్గొట్టాడు. డాక్టర్ కిరణ్‌కుమార్ తీవ్ర నిర్లక్ష్యంతో వ్యవహరించి తమ చిన్నారి కాళ్లు విరగ్గొట్టాడని కుటుంబసభ్యులు మండిపడుతున్నారు. దీనిపై వైద్యుడిని నిలదీశారు. ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించుకోవాలని చెప్పి.. సదరు వైద్యుడు చేతులు దులుపుకున్నాడు. వైద్యుడి నిర్వాకంపై ఫిర్యాదు చేసినా ఆస్పత్రి ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని బాలుడి కుటుంబసభ్యులు చెప్తున్నారు.
కాళ్లు విరగడంతో తీవ్రమైన నొప్పులతో నడవలేని స్థితిలో బాలుడు ఉన్నాడు. దీంతో ఆ చిన్నారి కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యపూరిత ప్రవర్తనపై బాలుడి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment