శ్వేతసౌధంలో చిరు చొరబాటు | Child slips through fencing at White House and is intercepted by Secret Service | Sakshi
Sakshi News home page

శ్వేతసౌధంలో చిరు చొరబాటు

Published Fri, Mar 28 2025 5:46 AM | Last Updated on Fri, Mar 28 2025 5:46 AM

Child slips through fencing at White House and is intercepted by Secret Service

ఫెన్సింగ్‌ చువ్వల మధ్యల్లోంచి వైట్‌హౌస్‌ గార్డెన్‌లోకి వచ్చిన చిన్నారి

ఎత్తుకెళ్లి క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించిన సీక్రెట్‌ సర్వీస్‌ ఏజెంట్లు

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ అభ్యర్థిగా డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రచారం చేస్తున్న వేళ కాల్పుల ఘటనతో ఉలిక్కిపడిన సీక్రెట్‌ సర్వీస్‌ ఏజెంట్లు ఆనాటి నుంచి అనుక్షణం అప్రమత్తంగా ఉంటున్నారు. ఈ ఏజెంట్లకు బుధవారం ఒక చిన్నారి కాస్తంత పనిచెప్పాడు. తల్లిదండ్రులతో కలిసి వాషింగ్టన్‌ డీసీలో అధ్యక్షుని అధికార నివాసం వైట్‌హౌస్‌ ఉన్న ప్రాంతానికి వచ్చాడు. 

రోడ్డుకు, శ్వేతసౌధానికి మధ్య గోడ కాకుండా కేవలం నిలువెత్తు ఇనుప చువ్వల ఫెన్సింగ్‌ మాత్రమే ఉంటుంది. హఠాత్తుగా రోడ్డు మీద నుంచి ఆ ఫెన్సింగ్‌ చువ్వల సందుల్లోంచి సులభంగా దూరిపోయి వైట్‌హౌస్‌ గార్డెన్‌లోకి వచ్చి అంతా కలియ తిరగడం మొదలెట్టాడు. ఇది చూసి సీక్రెట్‌ సర్వీస్‌ ఏజెంట్లు చకచకా వచ్చేసి చిన్నారిని ఎత్తుకుని తీసుకెళ్లారు. బయటివైపు పిల్లాడి కోసం చూస్తున్న తల్లిదండ్రులకు అప్పగించారు.

 ఉత్తరం వైపు పచ్చికబయళ్ల వద్ద బుధవారం సాయంత్రం 6.30 గంటలకు ఈ ఘటన జరిగిందని సీక్రెట్‌ సర్వీస్‌ అధికార ప్రతినిధి ఆంటోనీ గుగెల్మీ చెప్పారు. నీలం రంగు హూడీ చొక్కా వేసుకున్న చిన్నారిని సీక్రెట్‌ సర్వీస్‌ ఏజెంట్‌ ఎత్తుకునిరావడం, పిల్లాడు అతని గడ్డంతో ఆడుకుంటున్న దృశ్యాలున్న వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో తెగ చక్కర్లు కొడుతోంది. ‘‘ ఎంతోమంది నిరసనకారులు ఆ ఫెన్సింగ్‌ దాటేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. 

కానీ ఈ పిల్లాడు రెప్పపాటులో ఫెన్సింగ్‌ దాటేశాడు’’ అని ఒక నెటిజన్‌ కామెంట్‌ చేశాడు. ‘‘ వైట్‌హౌస్‌లో ఈజీగా వెళ్లిపోయానని భవిష్యత్తులో చెప్పుకోవడానికి ఆ పిల్లాడికి ఇది ఒక చిరస్మరణీయ ఘటనగా నిలిచిపోతుంది’’ అని మరో నెటిజన్‌ వ్యాఖ్యానించారు. ‘‘ అతను ఒకవేళ ఎలాన్‌ మస్క్‌ డజను మంది సంతానంలో ఒకరై ఉంటారు. తండ్రి ఆఫీస్‌ ఇదేననుకుని వచ్చాడేమో’’ అని మరొకరు ట్వీట్‌చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement