Shooting incident
-
అమెరికాలో కాల్పులు.. నలుగురు దుర్మరణం
బిర్మింగ్హమ్: అమెరికాలోని అలబామా రాష్ట్రం బిర్మింగ్‌హమ్‌లో జరిగిన కాల్పుల ఘటనలో నలుగురు చనిపోగా, 18 మంది గాయాలపాలయ్యారు. శనివారం అర్ధరాత్రి సమయంలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని పోలీసులు తెలిపారు. నగరంలో రెస్టారెంట్లు, బార్లకు నిలయమైన ఫైవ్ పాయింట్స్ సౌత్ ఎంటర్టెయిన్మెంట్ డిస్ట్రిక్ట్ పరిధిలో ఘటన చోటుచేసుకుందని చెప్పారు. ఆ ప్రాంతంలో గుమికూడిన జనం పైకి కొందరు విచక్షణారహితంగా కాల్పులకు దిగినట్లు గుర్తించామన్నారు. -
అమెరికాలో కాల్పులు.. ఇద్దరు మృతి
మిన్నెపొలిస్: అమెరికాలోని మిన్నెపొలిస్‌లో శనివారం తెల్లవారు జామున జరిగిన కాల్పుల ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా ముగ్గురు గాయపడ్డారు. డౌన్‌టౌన్ ప్రాంతంలో చోటుచేసుకున్న ఘటనలో ఐదుగురు గాయపడ్డారు. వీరిలో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. క్షతగాత్రుల్లో ముగ్గురు యువతులున్నారని, వీరెవరికీ ప్రాణాపాయం లేదని పోలీసులు తెలిపారు. ఘటన నేపథ్యంలో హెన్నెపిన్ కౌంటీ, మెట్రో ట్రాన్సిట్ పోలీసులతో కలిసి గస్తీ పెంచినట్లు చెప్పారు. -
వెస్ట్‌బ్యాంక్–జోర్డాన్ సరిహద్దుల్లో కాల్పులు ముగ్గురు ఇజ్రాయెలీలు మృతి
అల్లెన్బీ క్రాసింగ్: వెస్ట్‌బ్యాంక్–జోర్డాన్ సరిహద్దుల్లోని అల్లెన్ బీ క్రాసింగ్ వద్ద ఆదివారం జరిగిన కాల్పుల ఘటనలో ముగ్గురు ఇజ్రాయెలీలు చనిపోయారు. జోర్డాన్ వైపు నుంచి ట్రక్‌లో క్రాసింగ్ వద్దకు చేరుకున్న సాయుధులు భద్రతా బలగాల వైపు కాల్పులకు దిగారు. ఈ కాల్పుల్లో ముగ్గురు ఇజ్రాయెలీ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. బలగాల ఎదురుకాల్పుల్లో ఆగంతకుడు చనిపోయాడని ఆర్మీ తెలిపింది. ఘటనపై జోర్డాన్ దర్యాప్తు చేపట్టింది. జోర్డాన్ నదిపై ఈ మార్గాన్ని ఎక్కువగా పాలస్తీనియన్లు, విదేశీ టూరిస్టులు, సరుకు రవాణాకు వినియోగిస్తుంటారు. తాజా ఘటన నేపథ్యంలో ఈ క్రాసింగ్‌ను అధికారులు మూసివేశారు. అమెరికా, పశ్చిమదేశాలకు అనుకూలంగా పేరున్న జోర్డాన్ 1994లో ఇజ్రాయెల్‌లో శాంతి ఒప్పందం చేసుకుంది. -
అమెరికాలో కాల్పులు.. నలుగురు మృతి
ఫ్లోరెన్స్: అమెరికాలో కెంటకీ రాష్ట్రం ఫ్లోరెన్స్‌లోని ఓ ఇంట్లో బర్త్ డే పార్టీ సందర్భంగా జరిగిన కాల్పుల ఘటనలో నలుగురు చనిపోగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. శనివారం వేకువజామున ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కాల్పులకు కారకుడిగా భావిస్తున్న యువకుడిని పోలీసులు వెంటాడారు. ఛేజింగ్ సమయంలో అతడు కారు సహా లోయలో పడిపోయాడని పోలీసులు తెలిపారు. అతడు తనను తాను కాల్చుకున్నాడని, గాయాలతో ఆస్పత్రిలో మృతి చెందాడని చెప్పారు. ఘటనకు కారణాలు తెలియాల్సి ఉందన్నారు. -
అమెరికాలో కాల్పులు.. ముగ్గురు నల్లజాతీయులు మృతి
జాక్సన్‌విల్లె: అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం జాక్సన్‌విల్లెలో శనివారం మధ్యాహ్నం చోటుచేసుకున్న కాల్పుల ఘటన కలకలం రేపింది. ఎడ్వర్డ్ వాటర్స్ యూనివర్సిటీకి సమీపంలోని డాలర్ జనరల్ స్టోర్ వద్ద ఓ యువకుడు(20) జరిపిన కాల్పుల్లో ముగ్గురు నల్ల జాతీయులు ప్రాణాలు కోల్పోయారు. ఇది జాతి విద్వేష ఘటన అని పోలీసులు తెలిపారు. అనంతరం దుండగుడు తనను తాను కాల్చుకుని చనిపోయాడు. నిందితుడు నల్ల జాతీయులను ద్వేషించే వాడని, ఇతర గ్రూపులతో అతడికి సంబంధాలున్నట్లు ఎటువంటి ఆధారాలు లేవని పోలీసులు స్పష్టం చేశారు. అతడు హ్యాండ్గన్తోపాటు, సెమీ ఆటోమేటిక్ రైఫిల్‌తో కాల్పులకు తెగబడ్డాడన్నారు. ఒక తుపాకీపై స్వస్తిక్ గుర్తు ఉందని వివరించారు. పొరుగునే ఉన్న క్లె కౌంటీ నుంచి నల్లజాతీయులు ఎక్కువగా నివసించే ఈ ప్రాంతానికి వచ్చాడు. కాల్పులకు కొద్దిసేపటి ముందు తన తండ్రికి మెసేజీ పంపించాడని, దాని ప్రకారం నిందితుడి కంప్యూటర్ ఓపెన్ చేసి చూడగా విద్వేషపూరిత రాతలు కనిపించాయని పోలీసులు వివరించారు. -
మెక్సికోలో కాల్పులు.. 8 మంది మృతి
మెక్సికో సిటీ: మెక్సికోలో కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. జెరెజ్ టౌన్‌లోని ఓ నైట్‌క్లబ్‌లో సాయుధ దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దీంతో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. దుండగులు పెద్ద సంఖ్యలో ఆయుధాలతో రెండు వాహనాల్లో ఎల్‌వానాడిటో నైట్‌క్లబ్‌కు చేరుకొని, అక్కడున్న జనంపై కాల్పులు జరిపారని పోలీసులు వెల్లడించారు. ఈ కాల్పుల్లో ఆరుగురు అక్కడికక్కడే మరణించారని, ఆసుపత్రి చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారని పేర్కొన్నారు. మృతులు, క్షతగాత్రుల్లో క్లబ్ ఉద్యోగులు, సంగీత కళాకారులు, వినియోగదారులు ఉన్నారని తెలిపారు -
అమెరికాలో కాల్పులు..పోలీస్ సహా ఐదుగురు మృతి
రేలీ: అమెరికాలోని నార్త్ కరోలినా రాజధాని రేలీలో గురువారం సాయంత్రం చోటు చేసుకున్న కాల్పుల ఘటనలో ఒక పోలీసు అధికారి సహా ఐదుగురు చనిపోగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. న్యూస్ రివర్ గ్రీన్‌వేలో నివాస ప్రాంతంలో రోడ్డుపై నడిచి వెళ్తున్న వారిపై ఒక బాలుడు(15)తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులు జరిపి, పరారయ్యాడు. భారీగా రంగంలోకి దిగిన పోలీసులు అతడిని పట్టుకునేందుకు మూడు కిలోమీటర్ల ప్రాంతాన్ని దిగ్బంధించి సోదాలు చేపట్టారు. రాత్రి 9.30 గంటల సమయంలో ఓ ఇంట్లో దాక్కున్న బాలుడిని అరెస్ట్ చేశారు. -
హైదర్‌పురా కాల్పులపై న్యాయ విచారణ
శ్రీనగర్: కశ్మీర్‌లోని హైదర్‌పురాలో సోమవారం జరిగిన కాల్పుల ఘటనపై లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా న్యాయ విచారణకు ఆదేశించారు. విచారణాధికారిగా శ్రీనగర్ అదనపు జిల్లా మేజిస్ట్రేట్ ఖుర్షీద్ అహ్మద్ షాను నియమించారు. హైదర్‌పురాలో ఓ ఇంట్లో జరిగిన ఎన్కౌంటర్లో ఒక పాక్ ఉగ్రవాది, అతడి సహాయకుడు మహ్మద్ అమీర్ మాగ్రే, ఇంటి యజమాని మహ్మద్ అల్తాఫ్ భట్, అందులో అద్దెకు ఉండే ముదాసిర్ గుల్ మృతిచెందారు. మాగ్రే, అల్తాఫ్ భట్, ముదాసిర్ గుల్కు ఉగ్రవాదులతో సంబంధం లేదని వారి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మృతదేహాలను అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ, నాలుగు మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించామని పోలీసులు చెప్పారు. మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించాలంటూ నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా శ్రీనగర్‌లో ధర్నా చేశారు. బాధిత కుటుంబాలకు మద్దతుగా హురియత్ కాన్ఫరెన్స్ శుక్రవారం బంద్‌కు పిలుపునిచ్చింది. అల్లర్లు జరుగుతాయన్న అనుమానంతో పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ(పీడీపీ) అధినేత మహబూబా ముఫ్తీని పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. ఆ పార్టీకి చెందిన ఇద్దరు నాయకులను అరెస్టు చేశారు. మహ్మద్ భట్, గుల్ మృతదేహాలను వెలికితీసి, కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. -
సరిగ్గా 20 ఏళ్ల కిందట.. 2000 సంవత్సరం
సాక్షి, హైదరాబాద్: సరిగ్గా 20 ఏళ్ల కిందట.. 2000 సంవత్సరం ఆగస్టు 28న తెలుగుదేశం పార్టీ అధినేత, నాటి సీఎం చంద్రబాబు నాయుడి నిరంకుశ పాలనలో హైదరాబాద్ నడిబొడ్డున, అసెంబ్లీకి కూతవేటు దూరంలో పోలీసుల తుపాకీ గుళ్లకు ముగ్గురు నేలకొరిగారు. ప్రపంచబ్యాంక్ షరతులకు తలొగ్గి ప్రైవేటీకరణ విధానాల అమలు, విద్యుత్‌రంగ సంస్కరణల్లో భాగంగా చంద్రబాబు సర్కార్ విద్యుత్‌చార్జీలు పెంచుతూ తీసుకున్న నిర్ణయంపై అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు భగ్గుమన్నాయి. గణనీయంగా పెరిగిన గృహావసరాల కరెంట్ చార్జీలను తగ్గించాలంటూ పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వెల్లువెత్తినా సీఎం చంద్రబాబు పట్టించుకోలేదు. తొలుత సీపీఐ, సీపీఎం, న్యూడెమోక్రసీ, ఇతర వామపక్షాలు కలిసి రాష్ట్రవ్యాప్త ఆందోళన చేపట్టాయి. దాదాపు నాలుగు నెలలపాటు సాగిన నిరసనల సందర్భంగా 25 వేలకు పైబడి కార్యకర్తలపై కేసులు నమోదయ్యాయి. మరోవైపు అప్పటి సీఎల్పీ నేత రాజశేఖరరెడ్డి ఆధ్వర్యంలోనూ విద్యుత్ చార్జీల ఉద్యమం ఉధృతమైంది. ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో 90 మంది ఎమ్మెల్యేలతో విపక్షనేత డాక్టర్ వైఎస్సార్ నిరవధిక నిరాహారదీక్షను మొదలుపెట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక్కసారిగా షాక్ తగిలేలా చేశారు. విద్యుత్ చార్జీలను భారీగా పెంచి ప్రజలపై భారం మోపడాన్ని నిరసిస్తూ చంద్రబాబుకు నేటి తెలంగాణ సీఎం, నాటి డిప్యూటీ స్పీకర్ కె.చంద్రశేఖరరావు లేఖ ద్వారా తమ అసంతృప్తిని తెలిపారు. ఆ తర్వాత డిప్యూటీ స్పీకర్ పదవికి, టీడీపీకి కేసీఆర్ రాజీనామా చేసి, మలిదశ ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని చేపట్టేందుకు, తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటునకు విద్యుత్‌చార్జీల ఉద్యమం, కాల్పుల ఘటన పరోక్షంగా కారణమైంది. ఆ రోజు ఏమైందంటే... విద్యుత్ చార్జీల వ్యతిరేక ఉద్యమం తీవ్రమవుతున్న దశలోనే శాసనసభ సమావేశాల నిర్వహణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా, ఆగస్టు 28న వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీ విడివిడిగా ‘చలో అసెంబ్లీ’కి పిలుపునిచ్చాయి. అడుగడుగునా పోలీసులు అడ్డంకులు కల్పించినా వేలాదిమంది కార్యకర్తలు ఇందిరాపార్కు ధర్నాచౌక్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి శాంతియుతంగా గుంపులు గుంపులుగా అసెంబ్లీ వైపు కదిలారు. ఇనుప కంచెలు, బ్యారికేడ్లతో నిలువరించే ప్రయత్నం చేసినా వాటిని తోసుకుంటూ ప్రదర్శనగా బషీర్‌బాగ్ వైపు సాగారు. బషీర్‌బాగ్ చౌరస్తాలోని ఫ్లైఓవర్ కింద పెద్దసంఖ్యలో పోలీసులను మోహరించారు. అశ్వికదళాలు సైతం కదంతొక్కాయి. అక్కడకు కార్యకర్తలు చేరుకోకుండా పోలీసులు ఎక్కడికక్కడ లాఠీచార్జీలు, భాష్పవాయుగోళాలు ప్రయోగించి, గుర్రాలతో అడ్డుకునే చర్యలు తీవ్రం చేశారు. అయినప్పటికీ అసెంబ్లీ వైపునకు పరుగులు తీస్తున్న కార్యకర్తలపై చివరకు పోలీసు కాల్పులు జరపడంతో సత్తెనపల్లి రామకృష్ణ, బాలస్వామి, విష్ణువర్ధన్‌రెడ్డిలకు తుపాకీ గుళ్లు తగిలి అసువులు బాశారు. ఆ విధంగా బషీర్‌బాగ్ ప్రాంతం రక్తసిక్తమైంది. చంద్రబాబు పాలనకు కౌంట్‌డౌన్.. చంద్రబాబు ఆధ్వర్యంలోని టీడీపీ పాలనకు కాల్పుల ఘటనతో కౌంట్‌డౌన్ మొదలైంది. ఆ ప్రభుత్వ ప్రజా వ్యతిరేకచర్యలు, తీవ్ర కరువు పరిస్థితుల్లోనూ వ్యవసాయాన్ని, రైతాంగాన్ని ఆదుకునే చర్యలు చేపట్టకపోవడాన్ని నిరసిస్తూ డా.వైఎస్సార్ చేపట్టిన చరిత్రాత్మక పాదయాత్ర చంద్రబాబు ఆధ్వర్యంలోని ప్రజా వ్యతిరేక పాలనకు చరమగీతం పాడేలా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలను చైతన్యవంతులను చేసిం ది. 2004లో టీడీపీ పాలనను అంతమొందిస్తూ డా.వైఎస్సార్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే బషీర్‌బాగ్ ఫ్లైఓవర్ కింద ముగ్గురు నేలకొరిగిన ప్రాంతం లో విద్యుత్ అమరవీరుల జ్ఞాపకార్థం ‘షహీద్‌చౌక్’ను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ప్రతి ఏడాది ఆగస్టు 28న నాటి క్రూరమైన కాల్పుల ఘటనను గుర్తుచేసుకుంటూ వామపక్షాలు, ఇతర పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు ఆ ముగ్గురు యోధులకు నివాళి, జోహార్లు అర్పించి వారిని గుర్తుచేసుకుంటున్నారు. -
అగ్రరాజ్యంలో కాల్పుల అలజడి
వాషింగ్టన్/హ్యూస్టన్: వరుస కాల్పుల ఘటనలతో అగ్రరాజ్యం అమెరికా షాక్‌కు గురైంది. 24 గంటల్లో చోటుచేసుకున్న రెండు కాల్పుల ఘటనల్లో మృతుల సంఖ్య 30కి చేరుకుంది. ఇందులో ఒకటి విద్వేషపూరిత ఘటన కావడం సంచలనం కలిగిస్తోంది. టెక్సస్ రాష్ట్రం ఎల్‌పసో పట్టణంలో శనివారం ఉదయం ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. కొద్ది గంటల వ్యవధిలోనే ఓహియో రాష్ట్రం డేటన్ నగరంలో జరిగిన మరో ఘటనలో అగంతకుడు సహా 10 మంది చనిపోయారు. రెండు ఘటనల్లో 40 మందికిపైగా గాయపడ్డారు. ఎల్‌పసో ఘటనను అధ్యక్షుడు ట్రంప్ ఖండించారు. త్రుటిలో తప్పిన పెనుప్రమాదం నైట్‌క్లబ్బులు, షాపింగ్ మాల్స్‌కు పేరుగాంచిన డేటన్ నగరం ఓరెగన్ డిస్ట్రిక్ట్‌లో శనివారం అర్థరాత్రి(స్థానిక కాలమానం) దాటిన తర్వాత జరిగిన కాల్పుల్లో 9 మంది చనిపోయారు. క్షణాల్లో అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితుడిని మట్టుపెట్టారు. ఈ ఘటనకు కారణాలు, అగంతకుడి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనలో గాయపడిన 16 మందిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. అగంతకుడు అక్కడికి దగ్గర్లోని బార్ వైపునకు వెళ్తూ తన వద్ద ఉన్న .223 హైకెపాసిటీ గన్‌తో కాల్పులు జరిపాడని పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని అగంతకుడిని కాల్చి చంపారని, లేకుంటే మరింత ఘోరం జరిగి ఉండేదన్నారు. జాత్యహంకార ఘటన.. అంతకుముందు శనివారం ఉదయం(స్థానిక కాలమానం) టెక్సస్ రాష్ట్రం ఎల్‌పసో పట్టణంలోని వాల్‌మార్ట్ స్టోర్‌లో దుండగుడు జరిగిన కాల్పుల్లో 20 మంది చనిపోగా 26 మంది క్షతగాత్రులయ్యారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని, విచారణ జరుపుతున్నారు. ‘శనివారం ఉదయం వాల్‌మార్ట్ స్టోర్ కొనుగోలుదారులతో కిక్కిరిసి ఉంది. అదే సమయంలో దుండగుడు(21) వెంట తెచ్చుకున్న అసాల్ట్ రైఫిల్‌తో యథేచ్ఛగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో 20 మంది చనిపోగా 26 మంది గాయాలపాలయ్యారు’ అని ఎల్‌పసో పోలీస్ చీఫ్ గ్రెగ్ అలెన్ తెలిపారు. క్షతగాత్రుల్లో 2 ఏళ్ల బాలుడు సహా 9 మంది పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కాల్పులకు తెగబడిన అనంతరం నిందితుడు పాట్రిక్ క్రుసియస్(21) పోలీసులకు లొంగిపోయాడు. ‘డల్లస్కు చెందిన క్రుసియస్ శ్వేత జాత్యంహకార, విద్వేషపూరిత ధోరణితో ఈ ఘోరానికి పాల్పడ్డాడు. దేశంలోకి హిస్పానిక్, లాటిన్ అమెరికా దేశాల ప్రజల వలసల కారణంగానే టెక్సస్‌లో స్థానికులకు ఉద్యోగాలు దొరకకుండా పోయాయని ఆగ్రహం వ్యక్తం చేస్తూ సామాజిక మాధ్యమం ట్విట్టర్లో పలు పోస్టులు చేశాడు. అధ్యక్షుడు ట్రంప్ విధానాలను, మెక్సికో సరిహద్దుల్లో గోడ నిర్మాణాన్ని సమర్థించాడు’ అని అధికారులు తెలిపారు. కాల్పుల ఘటన అనంతరం అతడి ట్విట్టర్ ఖాతాను పోలీసులు మూసివేశారు. అతడిపై ఉగ్రవాదం కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు జరుపుతున్నారు. రోదిస్తున్న బాధితురాలు -
ఇంగ్లండ్‌లో కాల్పుల కలకలం
లండన్: బ్రిటన్‌లో మంగళవారం జరిగిన కాల్పుల ఘటనలో ముగ్గురు మరణించారు. మృతుల్లో దాడిచేసిన వ్యక్తితో పాటు ఇద్దరు మహిళలు ఉన్నారు. మహిళలను తల్లీకూతురుగా భావిస్తున్నారు. ఈ ఘటనలో ఉగ్రవాదులకు సంబంధం లేదని పోలీసులు తెలిపారు. లింకన్‌షైర్‌లో కాస్ట్లె స్విమ్మింగ్ పూల్ సమీపంలో నిందితుడు ఇద్దరు మహిళలను కాల్చి చంపి, తర్వాత తానూ కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వీరు ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. -
అమెరికా స్టూడియోలో కాల్పులు; ఇద్దరు మృతి
ఫోర్ట్ వర్త్: ఆర్లెండో క్లబ్ నరమేథం విషాదం మరువకముందే అమెరికాలోని ఓ స్టూడియోలో కాల్పుల ఘటన కలకలం రేపింది. టెక్సాస్ రాష్ట్రంలోని ఫోర్ట్‌వర్త్ సిటీలోని ‘స్టూడియో 74’ డ్యాన్స్ స్టూడియోలో శుక్రవారం అర్ధరాత్రి కొందరు అనుమతిలేకుండా ప్రవేశించి పార్టీ చేసుకున్నారని.. ఈ సందర్భంగా జరిగిన కాల్పుల్లో ఇద్దరు మరణించారని పోలీసులు తెలిపారు. -
బుల్లెట్లు తగిలినా భద్రంగా..
బ్యాంకాక్: దుండగుల కాల్పుల్లో తనకు బుల్లెట్లు తగిలినా మెరుపువేగంతో బస్సు నడిపి బస్సులోని మొత్తం ప్రయాణికుల ప్రాణాలు కాపాడాడు ఓ డ్రైవర్. లావోస్ దేశంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం వాంగ్ వియాంగ్లో ఈ కాల్పుల ఘటన చోటుచేసుకుంది. నైరుతి చైనాలోని కున్మింగ్ పట్టణం నుంచి 28 మంది ప్రయాణికులతో బయల్దేరిన బస్సు బుధవారం రాత్రి సమయంలో వాంగ్వియాంగ్కు చేరుకోగానే సాయుధులైన దుండగులు బస్సుపై తుపాకులతో కాల్పులు ప్రారంభించారు. ఊహించని ఈ పరిణామంతో భయపడకుండా ఆ బస్సు డ్రైవర్ వెంటనే బస్సును ముందుకు పోనిచ్చి సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లాడు. ఈ క్రమంలో డ్రైవర్ శరీరంలోకి బుల్లెట్లు దూసుకుపోయాయి. బస్సులో ఉన్న ఆరుగురు చైనా ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను దగ్గర్లోని స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు. చైనీయులపై లావోస్‌లో ఇలా మెరుపుదాడులు జరగడం ఈ ఏడాదిలో ఇది మూడోసారి.