ఎల్‌పసో వాల్‌మార్ట్ స్టోర్ వద్ద మోహరించిన పోలీసు బలగాలు
వాషింగ్టన్/హ్యూస్టన్: వరుస కాల్పుల ఘటనలతో అగ్రరాజ్యం అమెరికా షాక్‌కు గురైంది. 24 గంటల్లో చోటుచేసుకున్న రెండు కాల్పుల ఘటనల్లో మృతుల సంఖ్య 30కి చేరుకుంది. ఇందులో ఒకటి విద్వేషపూరిత ఘటన కావడం సంచలనం కలిగిస్తోంది. టెక్సస్ రాష్ట్రం ఎల్‌పసో పట్టణంలో శనివారం ఉదయం ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. కొద్ది గంటల వ్యవధిలోనే ఓహియో రాష్ట్రం డేటన్ నగరంలో జరిగిన మరో ఘటనలో అగంతకుడు సహా 10 మంది చనిపోయారు. రెండు ఘటనల్లో 40 మందికిపైగా గాయపడ్డారు. ఎల్‌పసో ఘటనను అధ్యక్షుడు ట్రంప్ ఖండించారు.
త్రుటిలో తప్పిన పెనుప్రమాదం
నైట్‌క్లబ్బులు, షాపింగ్ మాల్స్‌కు పేరుగాంచిన డేటన్ నగరం ఓరెగన్ డిస్ట్రిక్ట్‌లో శనివారం అర్థరాత్రి(స్థానిక కాలమానం) దాటిన తర్వాత జరిగిన కాల్పుల్లో 9 మంది చనిపోయారు. క్షణాల్లో అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితుడిని మట్టుపెట్టారు. ఈ ఘటనకు కారణాలు, అగంతకుడి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనలో గాయపడిన 16 మందిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. అగంతకుడు అక్కడికి దగ్గర్లోని బార్ వైపునకు వెళ్తూ తన వద్ద ఉన్న .223 హైకెపాసిటీ గన్‌తో కాల్పులు జరిపాడని పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని అగంతకుడిని కాల్చి చంపారని, లేకుంటే మరింత ఘోరం జరిగి ఉండేదన్నారు.
జాత్యహంకార ఘటన..
అంతకుముందు శనివారం ఉదయం(స్థానిక కాలమానం) టెక్సస్ రాష్ట్రం ఎల్‌పసో పట్టణంలోని వాల్‌మార్ట్ స్టోర్‌లో దుండగుడు జరిగిన కాల్పుల్లో 20 మంది చనిపోగా 26 మంది క్షతగాత్రులయ్యారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని, విచారణ జరుపుతున్నారు. ‘శనివారం ఉదయం వాల్‌మార్ట్ స్టోర్ కొనుగోలుదారులతో కిక్కిరిసి ఉంది. అదే సమయంలో దుండగుడు(21) వెంట తెచ్చుకున్న అసాల్ట్ రైఫిల్‌తో యథేచ్ఛగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో 20 మంది చనిపోగా 26 మంది గాయాలపాలయ్యారు’ అని ఎల్‌పసో పోలీస్ చీఫ్ గ్రెగ్ అలెన్ తెలిపారు. క్షతగాత్రుల్లో 2 ఏళ్ల బాలుడు సహా 9 మంది పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
కాల్పులకు తెగబడిన అనంతరం నిందితుడు పాట్రిక్ క్రుసియస్(21) పోలీసులకు లొంగిపోయాడు. ‘డల్లస్‌కు చెందిన క్రుసియస్ శ్వేత జాత్యంహకార, విద్వేషపూరిత ధోరణితో ఈ ఘోరానికి పాల్పడ్డాడు. దేశంలోకి హిస్పానిక్, లాటిన్ అమెరికా దేశాల ప్రజల వలసల కారణంగానే టెక్సస్‌లో స్థానికులకు ఉద్యోగాలు దొరకకుండా పోయాయని ఆగ్రహం వ్యక్తం చేస్తూ సామాజిక మాధ్యమం ట్విట్టర్‌లో పలు పోస్టులు చేశాడు. అధ్యక్షుడు ట్రంప్ విధానాలను, మెక్సికో సరిహద్దుల్లో గోడ నిర్మాణాన్ని సమర్థించాడు’ అని అధికారులు తెలిపారు. కాల్పుల ఘటన అనంతరం అతడి ట్విట్టర్ ఖాతాను పోలీసులు మూసివేశారు. అతడిపై ఉగ్రవాదం కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు జరుపుతున్నారు.
రోదిస్తున్న బాధితురాలు
Comments
Please login to add a commentAdd a comment