జాక్సన్‌విల్లె: అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం జాక్సన్‌విల్లెలో శనివారం మధ్యాహ్నం చోటుచేసుకున్న కాల్పుల ఘటన కలకలం రేపింది. ఎడ్వర్డ్ వాటర్స్ యూనివర్సిటీకి సమీపంలోని డాలర్ జనరల్ స్టోర్ వద్ద ఓ యువకుడు(20) జరిపిన కాల్పుల్లో ముగ్గురు నల్ల జాతీయులు ప్రాణాలు కోల్పోయారు. ఇది జాతి విద్వేష ఘటన అని పోలీసులు తెలిపారు. అనంతరం దుండగుడు తనను తాను కాల్చుకుని చనిపోయాడు.
నిందితుడు నల్ల జాతీయులను ద్వేషించే వాడని, ఇతర గ్రూపులతో అతడికి సంబంధాలున్నట్లు ఎటువంటి ఆధారాలు లేవని పోలీసులు స్పష్టం చేశారు. అతడు హ్యాండ్‌గన్‌తోపాటు, సెమీ ఆటోమేటిక్ రైఫిల్‌తో కాల్పులకు తెగబడ్డాడన్నారు. ఒక తుపాకీపై స్వస్తిక్ గుర్తు ఉందని వివరించారు. పొరుగునే ఉన్న క్లె కౌంటీ నుంచి నల్లజాతీయులు ఎక్కువగా నివసించే ఈ ప్రాంతానికి వచ్చాడు. కాల్పులకు కొద్దిసేపటి ముందు తన తండ్రికి మెసేజీ పంపించాడని, దాని ప్రకారం నిందితుడి కంప్యూటర్ ఓపెన్ చేసి చూడగా విద్వేషపూరిత రాతలు కనిపించాయని పోలీసులు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment