Three Dead
-
మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన హింస
ఇంఫాల్: మణిపూర్‌లో మరోసారి ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. తౌబల్ జిల్లా లిలాంగ్ చింగ్జావో ప్రాంతంలో సోమవారం సాయంత్రం పోలీసు దుస్తుల్లో వచ్చిన దుండగులు జరిపిన కాల్పుల్లో నలుగురు చనిపోగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. దాంతో తౌబల్‌తోపాటు ఇంఫాల్ ఈస్ట్, ఇంఫాల్ వెస్ట్, కాక్చింగ్, బిష్ణుపూర్ జిల్లాల్లో కర్ఫ్యూ విధించారు. దాంతో ఆగ్రహించిన ఒక వర్గం వారు నాలుగు కార్లకు నిప్పుపెట్టారు. కార్లు ఎవరివనే విషయం తెలియాల్సి ఉంది. కాల్పుల ఘటనను సీఎం బీరేన్ సింగ్ తీవ్రంగా ఖండించారు. ఇప్పటి వరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదన్నారు. పోలీసులు దీనిపై దర్యాప్తు జరుపుతున్నట్లు చెప్పారు. దోషులను పట్టుకుని, చట్టం ముందు నిలబెడతామని ఆయన స్పష్టం చేశారు. మణిపూర్‌లో గత ఏడాది మే 3వ తేదీన ట్రైబల్ సాలిడారిటీ మార్చ్ అనంతరం కొనసాగుతున్న జాతుల మధ్య వైరంతో 180 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. మణిపూర్ జనాభాలో 53 శాతం మంది మొయితీలున్నారు. కొండ ప్రాంత జిల్లాల్లో నివసించే నాగాలు, కుకీలు కలిపి 40 శాతం వరకు ఉంటారు. -
అమెరికాలో కాల్పులు.. ముగ్గురు నల్లజాతీయులు మృతి
జాక్సన్‌విల్లె: అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం జాక్సన్‌విల్లెలో శనివారం మధ్యాహ్నం చోటుచేసుకున్న కాల్పుల ఘటన కలకలం రేపింది. ఎడ్వర్డ్ వాటర్స్ యూనివర్సిటీకి సమీపంలోని డాలర్ జనరల్ స్టోర్ వద్ద ఓ యువకుడు(20) జరిపిన కాల్పుల్లో ముగ్గురు నల్ల జాతీయులు ప్రాణాలు కోల్పోయారు. ఇది జాతి విద్వేష ఘటన అని పోలీసులు తెలిపారు. అనంతరం దుండగుడు తనను తాను కాల్చుకుని చనిపోయాడు. నిందితుడు నల్ల జాతీయులను ద్వేషించే వాడని, ఇతర గ్రూపులతో అతడికి సంబంధాలున్నట్లు ఎటువంటి ఆధారాలు లేవని పోలీసులు స్పష్టం చేశారు. అతడు హ్యాండ్గన్తోపాటు, సెమీ ఆటోమేటిక్ రైఫిల్‌తో కాల్పులకు తెగబడ్డాడన్నారు. ఒక తుపాకీపై స్వస్తిక్ గుర్తు ఉందని వివరించారు. పొరుగునే ఉన్న క్లె కౌంటీ నుంచి నల్లజాతీయులు ఎక్కువగా నివసించే ఈ ప్రాంతానికి వచ్చాడు. కాల్పులకు కొద్దిసేపటి ముందు తన తండ్రికి మెసేజీ పంపించాడని, దాని ప్రకారం నిందితుడి కంప్యూటర్ ఓపెన్ చేసి చూడగా విద్వేషపూరిత రాతలు కనిపించాయని పోలీసులు వివరించారు. -
ఉక్రెయిన్‌పై రష్యా దాడులు
కీవ్: ఉక్రెయిన్‌పై రష్యా సైన్యం శనివారం ఉదయం జరిపిన దాడుల్లో ముగ్గురు మృతి చెందగా, మరో 17 మంది గాయపడ్డారు. తూర్పు, దక్షిణ ప్రాంతాల్లో ఈ కాల్పులు జరిగినట్లు ఉక్రెయిన్ తెలిపింది. డొనెట్స్క్ ప్రాంతంలోని బఖ్ముత్, లీమాన్, మరింకా నగరాల పరిసరాల్లో రెండు సైన్యాలకు మధ్య భీకర పోరు సాగుతోంది. ఇలా ఉండగా, ఉక్రెయిన్ నుంచి రష్యా బలగాలను వెళ్లగొట్టేందుకు జరుగుతున్న పోరాటంలో తుది వరకు యూరప్‌తోపాటు ఈయూ మద్దతుగా నిలుస్తాయని స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ హామీ ఇచ్చారు. శనివారం ఈయూ అధ్యక్ష బాధ్యతలను స్పెయిన్ చేపట్టిన నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేశారు. -
మణిపూర్‌లో హింసకు మరో ముగ్గురు బలి
కోల్‌కతా: నివురుగప్పిన నిప్పులా మారిన మణిపూర్ మరో ముగ్గురు అమాయకుల ప్రాణాలు బలితీసుకుంది. రాష్ట్రంలోని పశ్చిమ ఇంఫాల్ జిల్లాలో చిన్నారిని తరలిస్తున్న ఒక అంబులెన్సుకు అల్లరిమూక నిప్పుపెట్టింది. దీంతో అంబులెన్సులో ఉన్న ఎనిమిదేళ్ల బాలుడు, అతని తల్లి, మరో బంధువు ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ ఘటన తాలూకు వివరాలు తాజాగా వెలుగుచూశాయి. సంబంధిత వివరాలను అధికారులు వెల్లడించారు. కాంగ్‌చుప్ ప్రాంతంలోని అస్సాం రైఫిల్స్ బలగాల శిబిరం వద్ద మెయిటీ వర్గానికి చెందిన ఒకావిడ తన కుమారుడితో కలిసి నివసిస్తోంది. ఆదివారం సాయంత్రం క్యాంప్‌పైకి కాల్పులు మొదలయ్యాయి. ఈ ఘటనలో బాలుడి తలకు బుల్లెట్ గాయమైంది. దీంతో బాలుడిని హుటాహుటిన అంబులెన్సులో తల్లి, ఆమె బంధువు తరలిస్తున్నారు. కొంతదూరం వీరికి రక్షణగా వచ్చిన అస్సాం రైఫిల్స్ బలగాలు తర్వాత ఆ బాధ్యతను స్థానిక పోలీసులకు అప్పజెప్పి వెనుతిరిగారు. కాంగ్పోకీ జిల్లా సరిహద్దుకు రాగానే ఐసోసెంబా ప్రాంతంలో అంబులెన్సును ఓ అల్లరిమూక అడ్డుకుని తగలబెట్టింది. దీంతో మంటల్లో చిక్కుకుని బాలుడు, అతని తల్లి, బంధువు ప్రాణాలు కోల్పోయారు. ఘటన జరిగిన ప్రాంతంలో కుకీ గిరిజనుల గ్రామాలు ఎక్కువ. మృతులు మెయిటీ సామాజిక వర్గానికి చెందినవారు. ఈ ప్రాంతంలో కొద్దిరోజులుగా ఇరువర్గాల మధ్య హింస, ఎదురుకాల్పుల ఘటనలు జరుగుతున్నాయి. షా ఇంటివద్ద కుకీ వర్గీయుల నిరసన ఢిల్లీలోని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నివాసం వద్ద మణిపూర్ కుకీ వర్గీయులు నిరసనకు దిగారు. ‘కుకీల ప్రాణాలు కాపాడండి’ అంటూ నినాదాలు ఇచ్చారు. నలుగురు కుకీ ప్రతినిధులను షా ఇంట్లోకి సమావేశం కోసం అనుమతించామని మిగతా వారిని జంతర్‌మంతర్‌కు తరలించామని ఢిల్లీ పోలీసులు చెప్పారు. కుకీ, మెయిటీ వర్గాల మధ్య మొదలైన జాతి వైరం హింసాత్మకంగా మారి నెలరోజుల వ్యవధిలో 98 మంది ప్రాణాలు బలిగొంది. -
నీటికుంటలో మునిగి ముగ్గురు మృతి
పులివెందుల: సరదాగా ఈతకు వెళ్లి.. నీటి కుంటలో మునిగి ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. ఈ ఘటన వైఎస్సార్ జిల్లా పులివెందుల మండలంలోని నామాలగుండు వద్ద చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు.. ప్రొద్దుటూరు టౌన్‌లోని మోడంపల్లెకు చెందిన సంజీవరాయుడు కుమారుడు సంజీవ కుమార్(29) టైల్స్ వ్యాపారం చేస్తుంటాడు. వ్యాపారం నిమిత్తం సత్యసాయి జిల్లా కదిరికి వెళ్లేందుకు మంగళవారం ఉదయం తన తమ్ముడు బాలశేఖర్(19)తో కలిసి కారును అద్దెకు తీసుకున్నాడు. పొట్లదుర్తికి చెందిన డ్రైవర్ గోపాల్‌దాస్(22)తో కలిసి కదిరి వెళ్లి టైల్స్ కొనుగోలు చేశారు. తిరిగి వస్తూ కదిరి–పులివెందుల రోడ్డులోని నామాలగుండు వద్ద కారు ఆపారు. ఆ పరిసరాల్లో ఫొటోలు తీసుకొని.. ఈత కోసం నీటి కుంటలో దిగారు. కొద్దిసేపటికి సుడిగుండంలో చిక్కుకొని ముగ్గురూ మృతి చెందారు. రాత్రి అయినా వాళ్లు రాకపోవడంతో కుటుంబసభ్యులు ఫోన్ చేశారు. ఎలాంటి స్పందన లేకపోవడంతో.. కుటుంబసభ్యులు వెంటనే కారు యజమానిని కలిసి జీపీఎస్ సాయంతో నామాలగుండుకు చేరుకున్నారు. కారు అక్కడే ఉండటంతో చుట్టుపక్కల వెతికారు. నీటి కుంట వద్ద చెప్పులు, దుస్తులు కనిపించడంతో వెంటనే పులివెందుల అర్బన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. డీఎస్పీ శ్రీనివాసులు, ఎస్ఐ చిరంజీవి ఘటనా స్థలికి చేరుకుని గజ ఈతగాళ్లతో గాలించగా బుధవారం మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతదేహాలను పోస్టుమార్టానికి పులివెందుల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
విషాదం: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం
సాక్షి, కర్నూలు: జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. గూడూరు సమీపంలో ఓ కరెంట్ సబ్ స్టేషన్ దగ్గర బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న ట్రాక్టర్, బైక్ పరస్పరం ఢీకొనడంతో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకొని మృత దేహాలను స్వాధీనం చేసుకున్నారు. పత్తి తీసేందుకు ట్రాక్టర్లో వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించినట్లు పోలీసులు తెలిపారు. మృతులు బ్రాహ్మణ దొడ్డి గ్రామంలోని ఒకే కుటుంబానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
విద్యుత్ తీగ తెగి పడి.. ఒకే కుటుంబంలో ముగ్గురి మృతి
నెల్లూరు రూరల్: విద్యుత్ లైన్ తీగ తెగి పడటంతో ఓ కుటుంబంలోని ముగ్గురు మృత్యువాత పడిన విషాద ఘటన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రంలోని కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డులో శనివారం చోటుచేసుకుంది. స్థానికులు, రూరల్ పోలీసుల కథనం మేరకు... ఎంఐబీ– 207 ఇంటిలో గోవిందు వేణుగోపాల్ (54) కుటుంబం నివసిస్తోంది. ఆయన సైదాపురం మండలం కలిచేడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. శనివారం సాయంత్రం 6.30 గంటల సమయంలో కొరియర్ రావడంతో కవర్‌ను అందుకుని డబ్బులు ఇచ్చే సమయంలో పైనున్న విద్యుత్ లైను తీగ తెగి కొరియర్ బాయ్ టోపీపై పడింది. అతను త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకోగా ఆ తీగ వేణుగోపాల్‌పై పడింది. ఆయన అరుపులకు ఇంటి నుంచి బయటకు వచ్చిన భార్య లత (45) భర్తను కాపాడే క్రమంలో విద్యుత్‌షాక్‌కు గురయ్యారు. వేణుగోపాల్ తల్లి బుజ్జమ్మ (71) కూడా బయటకు రాగా ఆమె కూడా విద్యుత్ షాక్‌కు గురికావడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. వేణుగోపాల్‌కు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడుకి ఇటీవలే బ్యాంక్‌లో ఉద్యోగం వచ్చింది. కుమార్తె డిప్లొమా పరీక్షలు రాయడానికి అనంతపురం వెళ్లింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
గుజరాత్లో విషాదం: ముగ్గురు మృతి
గాంధీనగర్: గుజరాత్లో విషాదం చోటు చేసుకుంది. రాష్టంలోని వడోదర జిల్లా బవమన్‌పురాలో నిర్మాణంలో ఉన్న ఓ భవనం సోమవారం అర్ధరాత్రి కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఒకరు తీవ్రంగా గాయపడగా స్థానిక ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందకున్న స్థానిక పోలీసులు, రెస్కూ టీం ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రమాద స్థలిలో శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికి తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఇళ్లు కూలి ముగ్గురు మృతి
మరికల్ (నారాయణపేట): మండలంలోని కన్మనూర్‌కు చెందిన అనంతమ్మ (68) ఇంటి గోడ కూలి మరణించింది. మధ్యాహ్నం 12గంటలకు భోజనం చేసిన అనంతరం ఇంటిముందు ఉన్న శిథిలావస్థకు చేరిన గోడ సమీపంలో కూర్చొంది. అకస్మాత్తుగా గోడ కూలడంతో వృద్ధురాలు దుర్మరణం చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. మృతురాలికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నాసర్ తెలిపారు. కుడికిళ్లలో.. కొల్లాపూర్ రూరల్: మండలంలోని కుడికిళ్లకు చెందిన సంకె దేవమ్మ(65) మంగళవారం అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా మట్టి మిద్దె కూలి మరణించింది. భారీగా వర్షం కురిసే సమయంలో ఈ ఘటన జరిగినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఆమెకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్‌రావు సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ధన్వాడ: మండలకేంద్రంలోని ఎస్సీ కాలనీకి చెందిన గ్రామ పంచాయతీ పారుశుద్ధ్య కార్మికుడు తిరుమలేష్ పెద్ద కుమారుడు గౌతం(3) బుధవారం మట్టి మిద్దె కూలి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉదయం 11గంటలకు వర్షం తగ్గడంతో పిల్లాడి తల్లి పల్లవి గౌతంకు అన్నం తినిపించి వంట రూంలోని మంచంపై పడుకోపెట్టి బట్టలు ఉతికేందుకు బయటకు వచ్చింది. 5నిమిషాలకే మిద్దెకూలి భారీ శబ్ధం రావడంతో అక్కడే ఉన్న తిరుమలేష్‌తో పాటు చుట్టు పక్కలవారు వచ్చి మట్టిని తొలగించి చిన్నారిని బయటకు తీశారు. వెంటనే జిల్లాకేంద్రంలోని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చిన్నారిని పరీక్షించి అప్పటికే మరణించినట్లు ధ్రువీకరించడంతో తల్లితండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ విషయం తెలుసుకున్న తహసీల్దార్, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. గ్రామంలో మట్టి మిద్దెలు ఉన్న వారు జాగ్రత్తగా ఉండాలని చాటింపు వేయించారు. మూడేళ్లకే నూరేళ్లు నిండాయ్.. మంగళవారం రాత్రి మూడోఏట పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నాడు. ఉదయం చుట్టుపక్కల పిల్లలతో సరదాగా ఆడుకున్నాడు. ఈ సమయంలో అమ్మచేతి గోరు ముద్దలు తిన్నాడు. నిద్ర వస్తుందనో లేక మృత్యువు పిలిచిందో తెలియదు కాని ఇంట్లోకి వెళ్లాడు. పిల్లాడిని చూసిన అమ్మ దగ్గరికి పిలుచుకుని మంచంపై పడుకోబెట్టి బయటకు పనులు చూసుకునేందుకు వెళ్లింది. బయటకు వెళ్లినా నిమిషాల్లో మట్టి మిద్దె ఉన్నపాటుగా కుప్పకూలింది. ఈ హృదయ విషాదకర ఘటన గ్రామస్తులను కలిచివేసింది. -
కారు బోల్తా: ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులు మృతి
సాక్షి, పశ్చిమగోదావరి: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం తణుకు సమీపంలో ఓ కారు అదపు తప్పి పంట కాలువలో బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు ఉద్యోగులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతి చెందిన వారిలో ఒకరు స్థానిక మున్సిపల్ ఆఫీసులో సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న జీవన శేఖర్, ఆర్టీఓ ఆఫీస్‌లో పని చేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ శ్రీను, వెలుగు డిపార్ట్మెంట్ ఉద్యోగిని సుభాషిణిగా పోలీసులు గుర్తించారు. వీరు విధులకు హాజరుకావడానికి భీమవరం నుంచి తణుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. తణుకు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఆర్టీఓ కార్యలయంలో ఉద్యోగి శ్రీను జీవన శేఖర్ మునిసిపల్ ఉద్యోగి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సుభాషిణి -
జమ్మూలో విషాదం: ముగ్గురు మృతి
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్లో విషాదం చోటు చేసుకుంది. పిడుగుపాటుకు ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. ఈ ఘటన సోమవారం గమ్‌సార్ ప్రాంతంలో జరిగింది. మెరుపులతో కూడిన పిడుగుపాటుకు ఓ జంట, మరో వ్యక్తి మరణించినట్లు పూంచ్ జిల్లా సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ రమేష్ కుమార్ అంగ్రాల్ తెలిపారు. మృతులను సూరన్‌కోట్‌లోని లాథోంగ్ గ్రామానికి చెందిన మహ్మద్‌దిన్ కుమారుడు మహ్మద్ హసీక్(38), అతని భార్య జరీనా కౌసర్(30), మరో వ్యక్తి జావేద్ అహ్మద్(38)గా పోలీసులు గుర్తించారు. వీరు పశువుల పెంపకం ద్వారా జీవనం సాగించే సంచార జాతికి చెందినవారని తెలిపారు. పిడుగుపాటుకు పెద్ద సంఖ్యలో జంతువులు కూడా మృత్యువాత పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. (రాజీవ్ గాంధీ హంతకురాలు నళిని ఆత్మహత్యాయత్నం) -
లండన్‌లో ముగ్గురు సిక్కుల హత్య
లండన్: ఒకే వర్గానికి చెందిన రెండు గ్రూపుల మధ్య జరిగిన గొడవలో ముగ్గురు సిక్కులు మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. లండన్‌లోని స్కాట్లాండ్ యార్డ్‌లో ఈ ఘటన జరిగింది. పోలీసులు ఆ ప్రాంతంలో ఎమర్జెన్సీ ప్రకటించారు. 29 ఏళ్ల వయసున్న ఇద్దరు అనుమానితులను అరెస్టు చేసినట్లు చెప్పారు. కత్తుల గాయాల వల్ల వారు మృతిచెందినట్లు చెప్పారు. మృతుల వయస్సు 20–30 ఏళ్ల మధ్య ఉంటుందని పోలీసులు చెప్పారు. -
డివైడర్‌ను ఢీకొన్న డీసీఎం వ్యాన్: ముగ్గురి మృతి
పహాడీషరీఫ్: డీసీఎం వ్యాన్ అదుపు తప్పి డివైడర్‌ను ఢీ కొట్టిన ఘటనలో ముగ్గురు కూలీలు మార్బుల్స్ మధ్య నలిగిపోయి దుర్మరణం పాలయ్యారు. పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకున్న ఘటన వివరాలిలా ఉన్నాయి. శంషాబాద్ నుంచి డీసీఎం వ్యాన్ (ఏపీ 28 టీఏ2410) కల్వకుర్తి వైపు మార్బుల్స్ లోడ్‌తో ఏడుగురు కార్మికులను ఎక్కించుకుని వెళుతోంది. ఓఆర్ఆర్ ఎగ్జిట్ రోడ్డు తుక్కుగూడ గ్రామం వద్దకు రాగానే డీసీఎం డ్రైవర్ నియంత్రణ కోల్పోయి వాహనాన్ని టోల్గేట్ డివైడర్‌కు ఢీ కొట్టాడు. ఈ ఘటనలో షాపూర్ గ్రామానికి చెందిన రాములు(32), సాయిలు(40), కూకట్‌పల్లికి చెందిన శ్రీను(35)లు మార్బుల్స్ మధ్య నలిగిపోయి అక్కడికక్కడే మృతి చెందారు. ఎ.సంగయ్య(50), సత్యనారాయణ(48), పండరీ (32), ఎర్ర సాయిలు(40)కు తీవ్రంగా గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పహాడీషరీఫ్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. -
గ్రానైట్ లారీ బోల్తా, ముగ్గురు మృతి
సాక్షి, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. గ్రానైట్ రాళ్ల లోడ్‌తో వెళుతున్న లారీ బ్రేక్ ఫెయిలై డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో గ్రానైట్ రాళ్లు మీదపడి ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాలను పోస్ట్‌మార్టంకు తరలించారు. ఇందుకు సంబందించి పూర్తివ వివరాలు తెలియాల్సి ఉంది. -
దుబాయ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం
గోల్కొండ: దుబాయ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నగరానికి చెందిన ముగ్గురు మృతి చెందగా ఓ నాలుగేళ్ళ చిన్నారి తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. కుటుంబ సభ్యులు, స్నేహితులు తెలిపిన వివరాల ప్రకారం..వరంగల్‌కు చెందిన గౌస్‌ఉల్లా ఖాన్(30) నగరంలోని టోలిచౌకీలో ఉంటూ ఉద్యోగరీత్యా యూఏఈ వెళ్ళాడు. కాగా, ఇతడు శుక్రవారం ఉల్లాఖాన్‌తో పాటు భార్య అయేషా (30), కుమారుడు హమ్జ (8 నెలలు), కుమార్తె హానియా సిద్ధిఖి(3)లతో కలసి దుబాయ్ సలాల హైవే మీదుగా మస్కట్‌కు కారులో బయల్దేరి వెళ్తున్నాడు. అయితే ఎదురుగా వస్తున్న వాహనం వీరి కారును ఢీకొట్టడంతో గౌస్‌ఉల్లా, అయేషా, హమ్జలు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన కుమార్తె హానియాను చికిత్స నిమిత్తం దుబాయ్‌లోని కౌలా ఆస్పత్రిలో పోలీసులు చేర్పించారు. కాగా సమాచారం అందుకున్న గౌస్ఉల్లాఖాన్ కుటుంబ సభ్యులు శనివారం మధ్యాహ్నం మస్కట్‌కు వెళ్ళారు. ఆదివారం ఉదయం మృతదేహాలను నగరానికి తీసుకువస్తారని తెలిసింది. కాగా, ఆదివారం టోలిచౌకీ సాలార్జంగ్ కాలనీలోని మజ్జీద్ ఎ సాలార్‌జంగ్‌లో మధ్యాహ్నం 1ః30 గంటలకు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తామని స్థానికులు తెలిపారు. -
పిడుగుపాటుకు ఒకే కుటుంబంలో ముగ్గురి మృతి
ధారూరు(వికారాబాద్): పిడుగుపాటుకు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బలి అయ్యారు. ఈ ఘటనలో తల్లి, కూతురు, కుమారుడు మృతి చెందగా కుటుంబపెద్ద తీవ్రంగా గాయపడ్డాడు. కూతురు ఇటీవల పదో తరగతి ఉత్తీర్ణురాలైంది. వికారాబాద్ జిల్లా ధారూరు మండలం రాజాపూర్కి చెందిన ఫక్రుద్దీన్(43)కు ఇద్దరు భార్యలు. చిన్న భార్య ఖాజాబీ(38), ఆమె కుమారుడు అక్రమ్ (12), కూతురు తబస్సుమ్(15)లతో కలసి సోమ వారం పొలానికి వెళ్లాడు. మొక్కజొన్న పంటను మెషీన్ ద్వారా తీయించి మధ్యాహ్నం భోజనం తర్వాత మొక్కజొన్న గింజలను సంచుల్లో నింపే పనిమొదలు పెట్టారు. సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం రావడంతో వారంతా కలసి పొలంలో ఉన్న మంచె వద్దకు చేరుకున్నారు. అదే సమయంలో వారి సమీపంలో పిడుగు పడింది. దీంతో ఖాజాబీ, అక్రమ్, తబస్సుమ్ ఘటనాస్థలంలోనే తుదిశ్వాస వదిలారు. వీరి పక్కన ఉన్న రెండు మేకలు కూడా చనిపోయాయి. ఫక్రుద్దీన్ తీవ్రంగా గాయపడటంతో సమీప పొలాల రైతులు, పెద్ద భార్య కుమారుడు ఫయాజ్ గమనించి అతనిని వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఫక్రుద్దీన్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. కాలేజీకి వెళ్లాల్సిన కూతురు పరలోకానికి.. ఫక్రుద్దీన్ పెద్ద భార్యకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. ఆమె అనారోగ్యంతో మృతి చెందిన తర్వాత ఖాజాబీని రెండో వివాహం చేసుకున్నాడు. ఆమెకు కూతురు, కుమారుడు సంతానం. చిన్న కొడుకు అక్రమ్ కొడంగల్ రెసిడెన్షియల్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. కూతురు పరిగి మండలం మిట్టకోడూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతిలో ఇటీవల 9.0 గ్రేడ్‌తో ఉత్తీర్ణురాలై స్కూల్ ఫస్ట్ వచ్చింది. -
ప్రాణాలు తీసిన మాంజా
అహ్మదాబాద్: పతంగులు ఎగురవేస్తూ వాటి పదునైన దారాలు లోతుగా గీరుకుపోవడంతో గొంతు తెగి ఓ బాలుడు(8)సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. గుజరాత్లో ఉత్తరాయణ్ పండగ సందర్భంగా సోమవారం ఈ విషాద ఘటనలు చోటుచేసుకున్నాయి. మెహ్సనా పోలీస్‌స్టేషన్ పరిధిలోని తెహజీబ్ ఖాన్(8) సైకిల్‌పై వెళుతుండగా పతంగు దారం మెడకు గీసుకుపోయి చనిపోయాడు. అహ్మదాబాద్ జిల్లా ఢోల్కా సమీపంలో మోటారు సైకిల్‌పై వెళ్తున్న అశోక్ పంచాల్(45) కూడా పతంగు దారం గొంతుకు గీరుకుపోవడంతో తీవ్ర రక్తస్రావం అయి చనిపోయాడు. ఆనంద్ జిల్లా కత్తానా గ్రామ సమీపంలో పతంగు ఎగురవేస్తూ మెడకు దారం గీరుకుని గాయపడ్డాడు. సోమవారం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. అహ్మదాబాద్, రాజ్‌కోట్, సూరత్, వడోదరా జిల్లాల్లో ఆదివారం సాయంత్రం వరకు పతంగులు ఎగురవేసే క్రమంలో ఇళ్లపై నుంచి పడి 117 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. -
దూసుకొచ్చిన మృత్యువు
సాక్షి, సిద్దిపేట/హైదరాబాద్: ఆగివున్న టాటా ఏస్ వాహనాన్ని మృత్యువులా దూసుకొచ్చిన లారీ ఢీకొట్టిన ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో 24 మందికి తీవ్ర గాయాలయ్యాయి. శుక్రవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం రిమ్మనగూడలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. మర్కూక్ మండలం పాములపర్తికి చెందిన అక్కారం కిష్టయ్య కుటుంబ సభ్యులు, బంధువులు కలసి చేర్యాల మండలం నాగపురి గ్రామంలో మృతి చెందిన తమ సమీప బంధువైన మల్లేశం అంత్యక్రియలకు టాటా ఏస్ వాహనంలో వెళ్తున్నారు. రిమ్మనగూడ స్టేజీ వద్దకు రాగానే మరో బంధువు దాచారం నుంచి వస్తున్నానని కబురు పెట్టడంతో పక్కనే వాహనాన్ని ఆపి వేచి చూడసాగారు. ఇదే సమయంలో హైదరాబాద్ నుంచి సిద్దిపేట వైపు వస్తున్న లారీ (ఏపీ 15టీవీ 9129) వీరి వాహనాన్ని ఢీకొట్టింది. ఈ సంఘటనలో టాటా ఏస్‌లో ఉన్న అక్కారం కిష్టయ్య (55), అక్కారం సాయమ్మ (60), అక్కారం పోచయ్య (35) అక్కడికక్కడే మృతి చెందారు. మరో 24 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని మొదట గజ్వేల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షలు నిర్వహించిన అనంతరం 21 మంది పరిస్థితి విషమంగా ఉందని గుర్తించి, హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. మరో ముగ్గురికి గజ్వేల్ ప్రభుత్వాసుపత్రిలోనే చికిత్స చేస్తున్నారు. విషయం తెలుసుకున్న ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు భూంరెడ్డి, భూపతిరెడ్డి, సిద్దిపేట పోలీస్ కమిషనర్ జోయెల్ డేవిస్, అదనపు డీసీపీ నర్సింహారెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఆసుపత్రికి వచ్చి మృతుల కుటుంబాలను పరామర్శించారు. కాగా, రిమ్మనగూడ వద్ద జరిగిన ప్రమాద ఘటన గురించి తెలుసుకున్న ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతి చెందిన వారికి సంతాపం తెలిపారు. గాయాలపాలైన వారికి అవసరమైన వైద్య సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. మంత్రి హరీశ్ రావు మృతుల కుటుంబాలతో ఫోన్లో మాట్లాడారు. అనంతరం గజ్వేల్ ప్రభుత్వాస్పత్రి వైద్యులతో మాట్లాడి క్షతగాత్రుల పరిస్థితిపై ఆరా తీశారు. నిమ్స్ కు తరలించిన వారికి మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఒక్కరు మినహా.. అందరి పరిస్థితి విషమం! నిమ్స్‌కు తీసుకు వచ్చిన 21 మంది క్షతగాత్రులకు వైద్యులు అత్యవసర విభాగంలో చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్లో రాములు (55), చంద్రమ్మ (40), భిక్షపతి (40), చంద్రయ్య (50), అమృతయ్య (55), చంద్రమ్మ (45), స్వామి (40), ఐలమ్మ (40), బాల నర్సయ్య (75), నర్సింహులు (65), భాగ్య (35), కమలమ్మ, పోశయ్య, మ రో ఎనిమిది మంది ఉన్నారు. వీరిలో ఒకరు మినహా మిగిలిన అందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వై ద్యుల ద్వారా తెలిసింది. నిమ్స్‌లో బాధితులను పరామర్శించిన హరీశ్ నిమ్స్‌లో చికిత్స పొందుతున్న బాధితులను ఆపద్ధర్మ మంత్రి హరీశ్‌రావు శుక్రవారం పరామర్శించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు. తక్షణ ఖర్చుల నిమిత్తం క్షతగాత్రుల సహాయకులకు రూ.10 వేల చొప్పున అందజేశారు. అంత్యక్రియలకు తక్షణమే పదివేల రూపాయల చొప్పున స్వయంగా వెళ్లి మృతుల కుటుంబాలకు అందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. -
అస్సాంలో బోటు పల్టీ.. ముగ్గురి మృతి
గువాహటి: అస్సాంలో ఘోర ప్రమాదం సంభవించింది. గువాహటి నుంచి దాదాపు 36 మందితో బ్రహ్మపుత్ర నది మీదుగా ఉత్తర గువాహటి నగరానికి వెళుతున్న నాటు పడవ బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, 11 మంది గల్లంతయ్యారు. ప్రమాద ఘటన జరిగిన వెంటనే రంగంలోకి దిగిన విపత్తు నిర్వహణ అధికారులు 10 మందిని రక్షించగా, మరో 12 మంది ఈదుతూ ఒడ్డుకు చేరుకున్నారు. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ఇంజిన్ చెడిపోవడంతో నాటు పడవ సమీపంలోని ఓ రాయిని ఢీకొని పల్టీ కొట్టిందని కామరూప్ జిల్లా డిప్యూటీ కమిషనర్ కమల్ కుమార్ తెలిపారు. ఈ పడవలో నిబంధనలకు విరుద్ధంగా 18 మోటార్‌సైకిళ్లను తీసుకెళ్తున్నారనీ, మొత్తం ప్రయాణికుల్లో 22 మందికే సరైన టికెట్లు ఇచ్చారని వెల్లడించారు. ఈ ఘటనపై సీఎం సోనోవాల్ విచారణకు ఆదేశించారు. -
కేరళకు ‘నిపా’ దెబ్బ
కొజికోడ్: నిపా అనే అరుదైన వైరస్ కారణంగా కేరళలోని కొజికోడ్ జిల్లాలో గత పక్షం రోజుల్లో ముగ్గురు మరణించారు. ఈ వైరస్ సోకిన ఒకరికి ప్రస్తుతం చికిత్స అందిస్తుండగా, మరో 8 మందిని వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. అధిక జ్వరంతో మరో ఇద్దరు నర్సులు కూడా ఆసుపత్రిలో చేరారు. చనిపోయిన ముగ్గురూ ఒకే కుటుంబానికి చెందినవారే. నిపా వైరస్ కారణంగా మొదట మే 5న ఈ కుటుంబంలోని ఓ యువకుడు (23), మే 18న అతని అన్న (25), మే 19న ఆ కుటుంబంలోని 50 ఏళ్ల మహిళ మరణించారు. ఆ యువకుల తండ్రికి కూడా ఈ వ్యాధి సోకడంతో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. చనిపోయిన ముగ్గురు చికిత్స పొందుతున్న సమయంలో వారి బాగోగులు చూసుకున్న నర్సు లినీ కూడా సోమవారం మరణించారు. అయితే ఆమె కూడా నిపా వైరస్ సోకడం వల్లే చనిపోయారా లేదా మరేదైనా కారణం ఉందా అన్న విషయాన్ని ఇంకా నిర్ధారించాల్సి ఉంది. అటు కొజికోడ్ పొరుగు జిల్లా మలప్పురంలోనూ నిపా వైరస్ సోకిన లక్షణాలతోనే ఐదుగురు చనిపోయారు. అయితే వీరికి కూడా కచ్చితంగా వైరస్ సోకిందా లేదా అనే విషయాన్ని ఇంకా తేల్చాల్సి ఉందని ఆరోగ్య శాఖ అధికారులు చెప్పారు. కొజికోడ్‌లో ముగ్గురు చనిపోయిన ఇంటిలోని బావిలో గబ్బిలం కనిపించడంతో ఆ బావిని మూసివేశామని అధికారులు తెలిపారు. కేరళలో హై అలర్ట్.. నిపా వైరస్ వ్యాప్తి చెందుతున్నందున సీఎం పినరయి విజయన్ కేరళ అధికారులను అప్రమత్తం చేశారు. మరిన్ని ప్రాణాలు పోకుండా చూసేందుకు అత్యంత శ్రద్ధతో పనిచేస్తున్నట్లు ఆయన తెలిపారు. కేరళ ఆరోగ్య శాఖ మంత్రి శైలజ కొజికోడ్ జిల్లా అధికారులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. వైరస్ వ్యాప్తి చెందకుండా నియంత్రించేందుకు అవసరమైన అన్ని చర్యలనూ తీసుకుంటున్నామని శైలజ తెలిపారు. కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా కూడా శైలజతో మాట్లాడి జాతీయ వ్యాధుల నియంత్రణ కేంద్రం నుంచి ఉన్నత స్థాయి వైద్యుల బృందాన్ని కొజికోడ్కు పంపారు. గబ్బిలాలను పట్టుకుంటున్న సిబ్బంది 1998లో తొలిసారి.. నిపా వైరస్‌ను తొలిసారిగా 1998లో గుర్తించారు. మలేసియాలోని కాంపుంగ్ సుంగై నిపా అనే ప్రాంతంలో ఈ వైరస్‌ను మొదట గుర్తించటంతో దానికి ఆ పేరు పెట్టారు. నిఫాలో ఇది పందుల ద్వారా వ్యాపించింది. ఈ సూక్ష్మక్రిమిని నిరోధించే వ్యాక్సిన్ లేదు. పండ్లు తినే గబ్బిలాలు, పందుల నుంచి ఈ వైరస్ సంక్రమిస్తోంది. వైరస్ సోకిన గబ్బిలాలు, పందులకి దగ్గరగా మసలడం వల్ల, నిపా వ్యాధి ఉన్న పక్షులు, జంతువులు కొరికి వదిలేసిన పండ్లను తినడం, వైరస్ బారిన పడిన వ్యక్తులను నేరుగా తాకడం వల్ల ఇది వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్ సోకినవారిలో సగటున 70 శాతం మంది వరకు మరణించే అవకాశాలు అధికంగా ఉన్నాయి. నిపా వైరస్ భారతదేశంలో తొలిసారిగా 2001 సంవత్సరంలో పశ్చిమబెంగాల్లోని సిలిగుడిలో వెలుగులోకి వచ్చింది. అప్పట్లో 66 కేసులు నమోదైతే 45 మంది (68 శాతం) మరణించారు. ఆ తర్వాత 2007 సంవత్సరం పశ్చిమ బెంగాల్లోనే నాడియాలోనూ నిపా వైరస్ కనిపించింది. కేరళలో ఈ వైరస్‌ను గుర్తించడం ఇదే తొలిసారి. లక్షణాలు ఇవీ: నిపా వైరస్ సోకితే జ్వరం, తలనొప్పి, వాంతులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వస్తాయి. ఎప్పుడు చూసినా నిద్రమత్తుగా ఉండడం, మానసికంగా గందరగోళానికి గురవడం కూడా ఈవ్యాధి లక్షణమే. ఒక్కోసారి ఈ మానసిక ఆందోళన మెదడువాపునకు కూడా దారితీస్తుంది. వైరస్ సోకిన అయిదు నుంచి 14 రోజుల్లో వ్యాధి లక్షణాలు బయటకొస్తాయి. గబ్బిలాలున్న బావిని మూసేస్తున్న దృశ్యం – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
రహదారులు రక్తసిక్తం
జిల్లాలోని రోడ్లు గురువారం రక్తసిక్తమయ్యాయి. యాదమరి, బుచ్చినాయుడుకండ్రిగ, పుంగనూరు మండలాల్లో వేర్వేరుగా జరిగిన ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. పోలీసులు కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆటోను ఢీకొన్న కర్ణాటక ఆర్టీసీ బస్సు యాదమరి : మండల పరిధిలోని లక్ష్మయ్యకండ్రిగ వద్ద బెంగళూరు–చెన్నై జాతీయ రహదారిలో బుధవారం రాత్రి ఆటోను కర్ణాటక ఆర్టీసీ బస్సు ఢీకొంది. దీంతో ఒకరు మృతి చెందగా, ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఎస్ఐ మనోహర్ కథనం మేరకు.. బంగారుపాళెం మండలం గుండ్లకట్టమంచికి చెందిన ఉమాపతి కుటుంబ సభ్యులతో కలిసి ఆటోలో తమిళనాడులోని వళ్లిమలైలోని మురుగన్ ఆలయానికి వెళ్లారు. స్వామి వారి దర్శనం అనంతరం తిరిగి వస్తుండగా యాదమరి మండలంలోని లక్ష్మయ్య కండ్రిగ వద్ద బెంగళూరు నుంచి తిరుపతికి వెళుతున్న కర్ణాటక ఆర్టీసీ బస్సు ఢీకొంది. దీంతో ఉమాపతి(47) అక్కడికక్కడే మృతి చెందాడు. అతని కుటుంబ సభ్యులు పల్లవి(23), ఇంద్రాణి(27), మునెమ్మ(40), విజయలక్ష్మి(47), శ్రీధర్(07), మౌనిష్(07), ఆటో డ్రైవర్ వేణు(35) తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారిని చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో పల్లవిని తిరుపతికి, ఇంద్రాణి, మౌనిష్ను వేలూరు సీఎంసీకి తరలించారు. కేసు దర్యాపు చేస్తున్నట్లు ఎస్ఐ మనోహర్ తెలిపారు. బైక్‌ను లారీ ఢీకొని.. పుంగనూరు : మండలంలోని సుగాలిమిట్ట సమీపంలో గురువారం రాత్రి ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొనడంతో యువకుడు మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు.. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం సన్నువారిపల్లెకు చెందిన రామయ్య కుమారుడు రవీంద్రారెడ్డి(28) ఎస్ఆర్కే రోడ్ కన్స్ట్రక్షన్ కంపెనీలో ఇంజినీరుగా పనిచేస్తున్నాడు. గురువారం రాత్రి మదనపల్లె నుంచి పుంగనూరుకు ద్విచక్ర వాహనంలో బయలుదేరాడు. ముందు వెళ్తున్న లారీని ఓవర్టేక్ చేసే సమయంలో లారీ డ్రైవర్ ఎటువంటి సిగ్నల్స్ ఇవ్వకుండా రాంగు సైడులోకి లారీని పోనిచ్చాడు. ఈ సంఘటనలో అతన్ని లారీ లాక్కెళ్లింది. తీవ్రంగా గాయపూడిన అతన్ని స్థానికులు పుంగనూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ అతను మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చెట్టును ఢీకొన్న బైక్ బుచ్చినాయుడుకండ్రిగ : మండల కేంద్రమైన బుచ్చినాయుడుకండ్రిగ సమీపంలో ద్విచక్రవాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొనటంతో యువకుడు దుర్మరణం చెందాడు. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని పద్మావతిపురం దళితవాడకు చెందిన గురవయ్య (25) బుచ్చినాయుడుకండ్రిగలోని హోటల్లో వంట మాస్టర్‌గా పనిచేస్తున్నాడు. అతను బుధవారం రాత్రి హోటల్లో పనిముగించుకుని ద్విచక్ర వాహనంలో ఇంటికి బయలుదేరాడు. బుచ్చినాయుడుకండ్రిగ సమీపంలో వస్తుండగా ద్విచక్ర వాహనం అదుపు తప్పి కేటీరోడ్డు పక్కనున్న చెట్టును ఢీకొంది. తీవ్రంగా గాయపడిన గురవయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. దీన్ని గమనించిన వాహనదారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్ఐ రామ్మోహన్ అక్కడికి చేరుకుని గురవయ్య మృతదేహాన్ని శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. -
వివాహానికి వచ్చి.. మృత్యు ఒడిలోకి..
సరదాగా వివాహ వేడుకకు వచ్చిన ముగ్గురు యువకులు మృత్యుఒడికి చేరారు. బహిర్భూమికని వచ్చి ఈత కొట్టేందుకు చెరువులో దిగిన ఓ యువకుడిని కాపాడబోయి మరో ఇద్దరు యువకులు మృతిచెందిన సంఘటన మండలంలోని మాందారిపేట(తహరాపూర్) గ్రామంలో చోటుచేసుకుంది. మృతులంతా వరంగల్‌లోని కొత్తవాడకు చెందిన చిన్ననాటి స్నేహితులే కావడంతో ఆ కుటుంబాల్లో విషాదం అలుముకుంది. శాయంపేట(భూపాలపల్లి): వివాహానికి హాజరయ్యేందుకు వచ్చిన స్నేహితుల బృందంలో విషాదం చోటుచేసుకుంది. ఈత సరదాతో కుంటలోకి దిగి మునిగిపోతున్న ఓ స్నేహితుడిని కాపాడబోయి మరో ఇద్దరు స్నేహితులు కూడా మృత్యుఒడికి చేరారు. వరంగల్ రూరల్ జిల్లా శాయంపేట మండలం మాందారిపేటలో జరిగిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. మాందారిపేట గ్రామానికి చెందిన మాజీ ప్రజాప్రతినిధి కూతురు వివాహానికి వరంగల్‌కు చెందిన బంధువులు ఆలేటి విజయ–స్వామి దంపతులతోపాటు వారి పెద్ద కుమారుడు సునీల్(19) హాజరయ్యారు. అతడితోపాటు అతడి చిన్ననాటి స్నేహితులు ఎనిమిది మంది పెళ్లికి వచ్చారు. భోజనాల అనంతరం సునీల్‌తోపాటు వరంగల్ కొత్తవాడకు చెందిన దేవులపల్లి అరుణ–సురేష్ దంపతుల కుమారుడు వంశీ(19), రంగు సునీత–మార్కండేయ దంపతుల కుమారుడు సాయికృష్ణ(17) సమీపంలోని గోగుకుంటలోకి బహిర్భూమికి వెళ్లారు. ఈ క్రమంలో దేవులపల్లి వంశీ ఈత కొట్టేందుకు కుంటలోకి దిగాడు. వంశీకి ఈత రాకపోవడంతో లోతుగా ఉన్న ఆ కుంటలో మునిగిపోతూ కనిపించడంతో పక్కనే ఉన్న సునీల్ అతడిని కాపాడేందుకు నీళ్లలోకి దూకాడు. సునీల్‌ను వంశీ గట్టిగా పట్టుకోవడంతో ఇద్దరు మునిగిపోతూ కనిపించారు. దీంతో గట్టుపై ఉన్న సాయికృష్ణ మిగతా స్నేహితులకు సమాచారమిచ్చి అతడు కూడా వారిని కాపాడేందుకు చెరువులోకి దూకాడు. అయితే సాయికృష్ణకు కూడా ఈత రాకపోవడంతో ఇద్దరు కలిసి సునీల్‌ను గట్టిగా పట్టుకోవడంతో ముగ్గురు అందులోనే మునిగిపోయారు. మిగతా స్నేహితులు వచ్చేసరికే ముగ్గురు యువకులు మునిగిపోయారు. వెంటనే వారు అందులోకి దిగి మునిగిన ముగ్గురిని ఒడ్డుకు చేర్చారు. అప్పటికే వారు మృత్యుఒడికి చేరారు. వరంగల్‌లోని కొత్తవాడకు చెందిన సాయికృష్ణ, వంశీ కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి వచ్చారు. కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. పరకాల ఏసీపీ సుధీంద్ర, తహసీల్దార్ వెంకటభాస్కర్, సీఐ షాదుల్లాబాబా, ఎస్సైలు రాజబాబు, బాబుమోహన్ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అనంతరం కుటుంబ సభ్యుల అనుమతితో మృతిచెందిన ముగ్గురిని పరకాల సివిల్ ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం పంపించారు. మృతులు సునీల్, వంశీ నర్సంపేటలోని బిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలలో బీటెక్ సెకండియర్ చదువుతుండగా, సాయికృష్ణ హన్మకొండలోని భద్రకాళి జూనియర్ కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. కాగా మృతుల కుటుంబాలను టీఆర్ఎస్ నాయకుడు గండ్ర సత్యనారాయణరావు పరామర్శించారు. -
విద్యుదాఘాతానికి ముగ్గురి బలి
పరిగి: కరెంట్ షాక్ ముగ్గురిని కాటేసింది. తొలుత ఓ మహిళ విద్యుదాఘాతానికి గురికాగా.. ఆమెను కాపాడే యత్నంలో మరో ఇద్దరు మృతి చెందారు. ముగ్గురి మరణంతో వికారాబాద్ జిల్లా పరిగి మండలం లఖ్నాపూర్‌లో విషాదం అలుముకుంది. లఖ్నాపూర్‌లో చల్లా రామచంద్రమ్మ అనే మహిళ సోమవారం గృహప్రవేశం చేసింది. రాత్రి 7 గంటలకు గ్రామస్తులను భోజనానికి ఆహ్వానించాలని ఊరిలోకి బయలుదేరింది. చాకలి మొగులయ్యకు చెందిన రెండు ఇళ్ల మధ్య గల్లీలో విద్యుత్ తీగలు తేలి ఉన్నాయి. అక్కడే మరో ఇనుప తీగ వేలాడుతూ ఉంది. ఆ ఇనుప తీగకు సందులో తేలి ఉన్న విద్యుత్తీగ తగిలింది. చీకట్లో అటుగా వెళ్లిన రామచంద్రమ్మ (62)కు ఆ ఇనుప తీగ తగలడంతో కరెంట్ షాక్‌కు గురైంది. వెంటనే ఆమె కేకలు వేస్తూ అక్కడే కుప్పకూలింది. పొరుగింటి చాకలి లక్ష్మి(55) గమనించి రామచంద్రమ్మను రక్షించేందుకు యత్నించింది. ఆమెకు కూడా షాక్ కొట్టడంతో కుప్పకూలింది. వీరి కేకలు విని ఏం జరిగిందోనని సమీపంలో ఉన్న గోనెల శేఖర్ (25) పరుగెత్తు కుంటూ వచ్చా డు. వారిని తన భుజాలపై ఎత్తుకుని పక్కకు తీసుకెళ్లే యత్నం చేశాడు. ఆ ప్రదేశమంతా తడిగా ఉండటంతో శేఖర్ కూడా షాక్‌కు గురై అక్కడే పడిపోయాడు. స్థానికులు గమనించి విద్యుత్ సరఫరా నిలిపివేశారు. రామచంద్రమ్మ ఘటనాస్థలంలోనే మృతి చెందగా, పరిగి ఆస్పత్రికి తరలిస్తుండగా లక్ష్మి, శేఖర్ మార్గమధ్యంలో మృతి చెందారు. శేఖర్‌కు భార్య లలిత, ఇద్దరు కుమారులున్నారు. ఒకే గ్రామంలో ముగ్గురు మృతి చెందటంతో స్థానికుల్లో విషాదం అలుముకుంది. -
తెల్లారిన బతుకులు
రెక్కాడితేగానీ డొక్కాడని కుటుంబాలు వారివి. ఇంట్లో పెద్దలు చిందీలను సఫాయి చేయాలి.. ఆడబిడ్డలు నైటీలు, లంగాలు, జుబ్బాలు, నైట్ ప్యాంట్లో.. ఇలా ఏవి అందుబాటులో ఉంటే వాటిని కుట్టి తీరాలి. మగవారు ర్యాగ్స్ కటింగ్‌తో దుస్తుల తయారీకి సహకరించాలి. ఇలా కుటుంబసభ్యులందరూ శ్రమిస్తే తప్ప పూట గడవని దుర్భర జీవితాలు. కాసింత నాలుగు పైసలు కళ్లతో చూడాలనుకుంటే ఉత్పత్తులను ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లి విక్రయించాలి. బతుకు పోరులో అలుపెరగని శ్రమజీవులపై విధి వింత పాచిక విసిరింది. పొరుగున ఉన్న రాష్ట్రంలో దుస్తులు విక్రయించేందుకు వెళుతున్న వారి బతుకులు చీకట్లు వీడకముందే రోడ్డు ప్రమాదంతో తెల్లారిపోయాయి. పామిడికి చెందిన ముగ్గురు వ్యాపారులు దుర్మరణం చెందారు. డిసెంబర్లో జరిగిన పోలీస్ బ్రదర్స్ మరణం నుంచి కోలుకోకముందే మరో విషాదం పామిడి వాసులను విషాదంలో ముంచెత్తింది. పామిడి: కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చిందీ వ్యాపారులు ముగ్గురు మృత్యువాత పడ్డారు. వివరాలిలా ఉన్నాయి. బెంగళూరులోని రామనగర్‌లో జరుగుతున్న ఇజ్తెమాలో జుబ్బాలు, నైట్ ప్యాంట్లు విక్రయించడం కోసం పామిడికి చెందిన 11మంది ముస్లిం వ్యాపారులు శనివారం రాత్రి పదిన్నర గంటలకు అనంతపురానికి చెందిన మహీంద్రా బొలెరో వాహనంలో బయల్దేరారు. ఆదివారం వేకువజామున 3.30 గంటలకు చిక్‌బళ్లాపూర్ దాటి పది కిలోమీటర్లు వెళ్లగానే వెనుకచక్రం బరెస్ట్ కావడంతో బొలెరో వాహనం పల్టీలు కొట్టింది. ట్రాలీలో కూర్చున్న నెహ్రూకాలనీ వాసి ఎన్.ఖాదర్‌వలి (38), బొడ్రాయి వీధికి చెందిన అనుంపల్లి ఖాజాహుసేన్ (42)లు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. తీవ్రంగా గాయపడిన షేక్ ఇబ్రహీం (48)ను హుటాహుటీన బెంగుళూరులోని ప్రో లైఫ్ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం ఇబ్రహీం మృతి చెందాడు.ఇదే ప్రమాదంలో షెక్షావలి, రసూల్, శింగనమల మహమ్మద్, తరిమెల హాజీవలి, దేవరపల్లి బాషా గాయాలపాలయ్యారు. క్యాబిన్లో కూర్చున్న డీఎం బాషా, షేక్ జాఫర్, హన్నూ సురక్షితంగా బయటపడ్డారు. ♦ మృతుడు ఖాదర్‌వలికి భార్య యాస్మిన్, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. అనుంపల్లి ఖాజాహుసేన్‌కు భార్య ఫకృన్నీ, ఇద్దరు కుమారులు, షేక్ ఇబ్రహీమ్‌కు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ♦ ఆదివారం సాయంత్రం పామిడికి చేరుకున్న ఎన్.ఖాదర్‌వలి, ఖాజాహుసేన్ల మృతదేహాలకు కుటుంబ సభ్యులు అంత్యక్రియలు పూర్తి చేశారు. షేక్ ఇబ్రహీం మృతదేహం ఆదివారం రాత్రికి వచ్చింది. సోమవారం అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. కూతురు వద్దన్నా వెళ్లి.. ఇజ్తెమాకు వెళుతున్న ఖాదర్‌వలిని మూడేళ్ల కూతురు వెళ్లొద్దంటూ అడ్డుపడింది. పాపను సముదాయించి బయల్దేరిన ఖాదర్‌వలి రోడ్డుప్రమాదంలో మరణించడం కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. అప్పుడే నూరేళ్లు నిండినా అంటూ తల్లి, భార్య, సోదరులు రోదించడం చూపరుల హృదయాలను కలచివేసింది. వెంటాడిన మృత్యువు.. ఖాజాహుసేన్ గత రంజాన్ మాసంలో చిందీ వ్యాపారం కోసం బళ్లారికి ద్విచక్రవాహనంలో వెళ్లి ప్రమాదానికి గురయ్యాడు. కాలు విరిగింది. కుటుంబ పోషణ కోసం తప్పనిసరి పరిస్థితుల్లో శనివారం రాత్రి బెంగళూరుకు వెళుతుండగా రోడ్డు ప్రమాద రూపంలో మృత్యువు కబళించింది. మరణవార్త తెలియగానే తల్లి జహీరాబీ, భార్య ఫకృన్నీ గుండెలవిసేలా రోదించారు. తనయుడి ఎదుటే తండ్రి మరణం షేక్ ఇబ్రహీంకు తనయుడు షేక్ జాఫర్ వ్యాపారంలో చేదోడువాదోడుగా ఉండేవాడు. బెంగళూరుకు తండ్రితోపాటు బయల్దేరాడు. రోడ్డు ప్రమాదంలో తనయుడి కళ్లెదుటే ఇబ్రహీమ్ ప్రాణాలు విడిచాడు. ఆ బాధ నుంచి జాఫర్ కోలుకోలేదు. కుటుంబ యజమాని మృతితో తామెట్ల బతికేదంటూ ఇబ్రహీం భార్య గుల్జార్ విలపించింది. -
పెళ్లి చూపులకు వెళుతూ..
కొడుకుకు పెళ్లి సంబంధం చూసేందుకు తల్లి తన కుమార్తె, మనుమరాలితో కలిసి బయలుదేరారు. విధి వక్రించింది. లారీ రూపంలో దూసుకువచ్చింది. ముగ్గురిని కబళించింది. దీంతో రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఈ సంఘటన శాంతిపురం మండలంలో ఆదివారం జరిగింది. శాంతిపురం/గుడుపల్లి:లారీ దూసుకెళ్లడంతో ముగుగరు దుర్మరణం చెందారు. మృతులు ఒకే కుటుంబానికి చెందిన వారు. పోలీసుల కథనం మేరకు.. గుడుపల్లి మండలం అగరం కొత్తపల్లికి చెందిన నారాయణమ్మ (40) తన కుమారుడు రాజప్పకు శాంతిపురం మండలంలోని నడింపల్లిలో వివాహ సంబంధం చూసింది. వెంకటాపురంలో ఉన్న కుమార్తె మమత(21)కు పెళ్లి కుమార్తెను చూపించాలని భావించింది. ఈ క్రమంలో ఆదివారం మమత, ఆమె కుమార్తె యశ్వంతిక(1)ను తీసుకుని కొడుకు రాజప్ప ద్విచక్ర వాహనంలో నడింపల్లికి బయలుదేరారు. సి.బండపల్లి సమీపంలో ఎదురుగా వచ్చిన లారీకి ఉన్న టార్పాలిన్ గాలికి ఎగిరి వీరిపైకి వచ్చింది. దీన్ని గుర్తించిన రాజప్ప పక్కకు తప్పుకునేలోపే టార్పాలిన్ పట్ట వెను క కూర్చున్న తల్లి, చెల్లి, మేనకోడలిని రోడ్డుపై పడేసింది. ఈ క్రమంలో రాళ్లు తరలించే భారీ లారీ వెనుక చక్రాలు ముగ్గురిపైనా దూసుకుపోయాయి. దీంతో ముగ్గురూ దుర్మరణం చెందారు. ఈ విషయం తెలు సుకున్న కుప్పం సీఐ రాజశేఖర్, గుడుపల్లి, రాళ్లబూ దుగూరు ఎస్ఐలు భాస్కర్, వెంకటశివకుమార్ అక్కడికి చేరుకున్నారు. మృతదేహాలను కుప్పం ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. రాజప్ప స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. రెండు గ్రామాల్లో విషాదం ప్రమాదంలో ముగ్గురు మృతి చెందడంతో నారాయణమ్మ స్వగ్రామం అగరం కొత్తపల్లి, మమత అత్తగారి ఊరు వెంటాపురంలో విషాదం నెలకొంది. పోస్టుమార్టం అనంతరం నారాయణమ్మకు అగరం కొత్తపల్లిలో, మమత, చిన్నారి యశ్వంతికలకు వెంటాపురంలో అంత్యక్రియలు నిర్వహించారు. పెళ్లి చూపులకని వెళ్లి శవాలుగా ఇంటికి రావడంతో కుటుంబ సభ్యులు చేస్తున్న రోదనలు చూసి స్థానికులు కంటతడి పెట్టారు. ఏడాదికే నూరేళ్లు నిండిపోయాయా తల్లీ నీకు అంటూ చిన్నారి యశ్వంతిక మృతదేహంపై పడి కుటుంబ సభ్యులు బోరున విలపించారు. మృతుల బంధువుల ఆగ్రహం ఇరుకుగా ఉన్న రోడ్డులో రాళ్లు రవాణా చేసే భారీ టారాస్ లారీ రావడంతోనే ప్రమాదం జరిగిందని మృతుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వాహనాలను ఎందుకు అనుమతిస్తున్నారని అధికారులతో వాదనకు దిగారు. అధికారులు, లారీ డ్రైవరు నిర్లక్ష్యంతోనే మూడు ప్రాణాలు పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. సమీపంలోని రత్నా మినరల్స్ క్వారీపై దాడి చేశారు. అక్కడ ఉన్న జనరేటర్, ఇతర వస్తువులకు నిప్పు పెట్టారు. అదనపు బలగాలు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చాయి.