మాజీ డీజీపీ మనవడి దుర్మరణం
పటాన్‌చెరులో ఓ శుభకార్యానికి వెళ్లి వస్తుండగా దుర్ఘటన
వరుణ్‌తో పాటు పెదనాన్న కుమారుడు అమిత్, స్నేహితుడు జ్ఞాన్‌దేవ్ కూడా మృతి
పాల ట్యాంకర్‌ను అమిత వేగంతో ఢీకొట్టిన స్కోడా కారు
పొగమంచు వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసుల అంచనా
సాక్షి, హైదరాబాద్
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ను చుట్టి ఉన్న ఔటర్ రింగ్‌రోడ్డుపై మరో ఘోర ప్రమాదం జరిగింది. మాజీ డీజీపీ, తెలంగాణ పర్యాటక సంస్థ చైర్మన్ పేర్వారం రాములు మనవడు వరుణ్ పవార్ (21)తో పాటు మరో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. ఔటర్ రింగ్ రోడ్డుపై కోకాపేట ప్రాంతంలో బుధవారం ఉదయం ఆరున్నర గంటల సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. వారు ప్రయాణిస్తున్న స్కోడా కారు.. ముందు వెళుతున్న పాల ట్యాంకర్‌ను బలంగా ఢీకొట్టింది. దీంతో కారు తునాతునకలైంది. అందులో ప్రయాణిస్తున్న వరుణ్ పవార్‌తో పాటు అమిత్ పవార్ (21), జ్ఞాన్‌దేవ్ (21) మరణించారు. మరో యువకుడు రాహుల్ పవార్ (22) తీవ్రగాయాలతో కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
శుభకార్యానికి వెళ్లివస్తూ..
పేర్వారం రాములు కుమార్తె రేవతి కుమారుడే వరుణ్ పవార్. రేవతి పదేళ్ల క్రితమే మరణించడంతో వరుణ్ తాతయ్య వద్దే ఉంటున్నాడు. అమిత్ పవార్, రాహుల్ పవార్ వరుణ్ పెదనాన్న కుమారులు. మంగళవారం రాత్రి పటాన్‌చెరులో ఓ స్నేహితుడి ఇంట్లో శుభాకార్యానికి వరుణ్ పవార్, అమిత్‌పవార్, రాహుల్‌పవార్‌లతో పాటు వారి స్నేహితుడు కుందన్‌బాగ్‌కు చెందిన జ్ఞాన్‌దేవ్ కలసి వెళ్లారు. అర్ధరాత్రి కావడంతో పటాన్‌చెరులోని ఫాంహౌస్‌లోనే ఉండి బుధవారం ఉదయం ఇంటికి బయలుదేరారు. ఉదయం 6.30 ప్రాంతంలో ఓఆర్‌ఆర్‌పై కోకాపేట్ ప్రాంతంలో ప్రయాణిస్తుండగా అమిత వేగంతో ఉన్న వారి వాహనం అదుపుతప్పి ముందు వెళుతున్న పాల ట్యాంకర్ (టీఎస్ 08 యూఏ 0086)ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వరుణ్, అమిత్, జ్ఞాన్‌దేవ్ అక్కడికక్కడే మృతిచెందారు. రాహుల్‌కు తీవ్ర గాయాలు కావడంతో కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో ఈ కారును వరుణ్ నడుపుతుండగా.. ముందు సీట్లో జ్ఞాన్‌దేవ్, వెనుక సీట్లలో మిగతా ఇద్దరూ కూర్చున్నారు.
నుజ్జునుజ్జయిన కారు..
ట్యాంకర్ వెనుక ఇరుక్కున్న స్కోడా వాహనాన్ని పోలీసులు, స్థానికులు క్రేన్ సహాయంతో బయటికి తీశారు. అమిత వేగంతో ఢీకొట్టడంతో కారు నుజ్జునుజ్జయిపోవడంతో తీసేందుకు దాదాపు గంటసేపు పట్టింది. అనంతరం కారు ముందు భాగం నుంచి ఇద్దరి మృతదేహాలను తీసి, ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. పంజగుట్ట ద్వారకాపూరి కాలనీలోని పేర్వారం నివాసానికి మృతదేహాలను తరలించారు. ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ముల పిల్లలు మృతి చెందడంతో బంధువులంతా శోకసంద్రంలో మునిగిపోయారు. కుటుంబ సభ్యులు మృతదేహాలపై పడి రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, సైబరాబాద్ కమిషనర్ సి.వి.ఆనంద్, పలువురు ప్రముఖులు అక్కడికి వచ్చి పేర్వారం రాములును పరామర్శించారు. మృతదేహాల్ని వారి స్వస్థలం నిజామాబాద్ జిల్లాకు తరలించారు.
ప్రమాదానికి పొగమంచే కారణమా?
కోకాపేట్ ప్రాంతంలో ఔటర్ రింగ్‌రోడ్ చుట్టూ దట్టమైన చెట్లు, కొండలు ఉన్నాయి. ఉదయం వేళల్లో పొగమంచు అధికంగా ఉంటుంది. ఆ కారణంగానే ముందు వెళుతున్న వాహనాన్ని వరుణ్ గమనించక ఢీకొట్టి ఉంటారని పోలీసులు అంచనా వేస్తున్నారు. పాల ట్యాంకర్ వెనుక బంపర్ ఎత్తులో ఉండటంతో పాటు కమాన్‌పట్టీలను ఎక్కువగా ఏర్పాటు చేశారు. ఇదికూడా ప్రమాద తీవ్రతను పెంచాయని చెబుతున్నారు. ట్యాంకర్ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తమ్ముళ్లు చనిపోయారు.. అన్నది బతుకుపోరాటం
నిజామాబాద్‌కు చెందిన దివంగత మాజీ ఎమ్మెల్యే సతీశ్‌పవార్ సోదరులు దిగంబర్ పవార్, సుభాష్ పవార్. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న దిగంబర్ పవార్ కుమారులే రాహుల్, అమిత్. మేడ్చల్‌లోని సీఆర్‌పీ కాలేజీలో రాహుల్ బీటెక్ ఫైనలియర్, అమిత్ బీటెక్ సెకండియర్ చదువుతున్నారు. రోడ్డు ప్రమాదంలో అమిత్ చనిపోగా.. రాహుల్ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు.
---------------
నీలో కూతురిని చూసుకుంటున్నా..
నిజామాబాద్‌లో ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుడిగా పనిచేస్తున్న సుభాష్‌పవార్, పేర్వారం రాములు కుమార్తె రేవతి దంపతులు. వారికి వరుణ్ (23) ఏకైక కుమారుడు. రేవతి పదేళ్ల క్రితమే మరణించడంతో వరుణ్ తాతయ్య పేర్వారం రాములు ఇంట్లోనే ఉంటున్నాడు. వరుణ్‌ను రాములు భార్య ఇందిర ప్రాణంగా చూసుకుంటారు.11:19 గంటలకు 11/25/2015 ప్రమాదంలో వరుణ్ మరణించడంతో ఆమె ఆవేదనలో కూరుకుపోయారు. ‘నీలో నా బిడ్డను చూసుకుంటున్నా.. ఇక ఎవరిని చూడాలి’ అని ఆమె చేసిన రోదనలు కంటతడిపెట్టించాయి.
---------------
టీమ్1లో చేరతానని అన్నాడు
‘‘వరుణ్ బీఆర్క్ ఐదో సంవత్సరం చదువుతున్నాడు. చివరి ఏడాది ట్రైనింగ్ పేరిట కాలేజీ బయటే జాబ్ చేస్తుంటారు. వరుణ్‌కు గచ్చిబౌలిలోని టీమ్1 కంపెనీలో ఉద్యోగం వచ్చింది. బుధవారం అందులో చేరుతున్నానని మంగళవారమే మాకు చెప్పాడు. కానీ అదేరోజున మరణించాడు. వరుణ్ ఇక లేడన్న విషయం జీర్ణించుకోలేకపోతున్నాం..’’
- ప్రొఫెసర్ కేజేఏబీ బాబు, వైష్ణవి స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్ట్ అండ్ ప్లానింగ్