మమత, నారాయణమ్మ, యశ్వంతిక (ఫైల్ ఫొటోలు)
కొడుకుకు పెళ్లి సంబంధం చూసేందుకు తల్లి తన కుమార్తె, మనుమరాలితో కలిసి బయలుదేరారు. విధి వక్రించింది. లారీ రూపంలో దూసుకువచ్చింది. ముగ్గురిని కబళించింది. దీంతో రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఈ సంఘటన శాంతిపురం మండలంలో ఆదివారం జరిగింది.
శాంతిపురం/గుడుపల్లి:లారీ దూసుకెళ్లడంతో ముగుగరు దుర్మరణం చెందారు. మృతులు ఒకే కుటుంబానికి చెందిన వారు. పోలీసుల కథనం మేరకు.. గుడుపల్లి మండలం అగరం కొత్తపల్లికి చెందిన నారాయణమ్మ (40) తన కుమారుడు రాజప్పకు శాంతిపురం మండలంలోని నడింపల్లిలో వివాహ సంబంధం చూసింది. వెంకటాపురంలో ఉన్న కుమార్తె మమత(21)కు పెళ్లి కుమార్తెను చూపించాలని భావించింది. ఈ క్రమంలో ఆదివారం మమత, ఆమె కుమార్తె యశ్వంతిక(1)ను తీసుకుని కొడుకు రాజప్ప ద్విచక్ర వాహనంలో నడింపల్లికి బయలుదేరారు. సి.బండపల్లి సమీపంలో ఎదురుగా వచ్చిన లారీకి ఉన్న టార్పాలిన్ గాలికి ఎగిరి వీరిపైకి వచ్చింది. దీన్ని గుర్తించిన రాజప్ప పక్కకు తప్పుకునేలోపే టార్పాలిన్ పట్ట వెను క కూర్చున్న తల్లి, చెల్లి, మేనకోడలిని రోడ్డుపై పడేసింది. ఈ క్రమంలో రాళ్లు తరలించే భారీ లారీ వెనుక చక్రాలు ముగ్గురిపైనా దూసుకుపోయాయి. దీంతో ముగ్గురూ దుర్మరణం చెందారు. ఈ విషయం తెలు సుకున్న కుప్పం సీఐ రాజశేఖర్, గుడుపల్లి, రాళ్లబూ దుగూరు ఎస్‌ఐలు భాస్కర్, వెంకటశివకుమార్ అక్కడికి చేరుకున్నారు. మృతదేహాలను కుప్పం ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. రాజప్ప స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.
రెండు గ్రామాల్లో విషాదం
ప్రమాదంలో ముగ్గురు మృతి చెందడంతో నారాయణమ్మ స్వగ్రామం అగరం కొత్తపల్లి, మమత అత్తగారి ఊరు వెంటాపురంలో విషాదం నెలకొంది. పోస్టుమార్టం అనంతరం నారాయణమ్మకు అగరం కొత్తపల్లిలో, మమత, చిన్నారి యశ్వంతికలకు వెంటాపురంలో అంత్యక్రియలు నిర్వహించారు. పెళ్లి చూపులకని వెళ్లి శవాలుగా ఇంటికి రావడంతో కుటుంబ సభ్యులు చేస్తున్న రోదనలు చూసి స్థానికులు కంటతడి పెట్టారు. ఏడాదికే నూరేళ్లు నిండిపోయాయా తల్లీ నీకు అంటూ చిన్నారి యశ్వంతిక మృతదేహంపై పడి కుటుంబ సభ్యులు బోరున విలపించారు.
మృతుల బంధువుల ఆగ్రహం
ఇరుకుగా ఉన్న రోడ్డులో రాళ్లు రవాణా చేసే భారీ టారాస్ లారీ రావడంతోనే ప్రమాదం జరిగిందని మృతుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వాహనాలను ఎందుకు అనుమతిస్తున్నారని అధికారులతో వాదనకు దిగారు. అధికారులు, లారీ డ్రైవరు నిర్లక్ష్యంతోనే మూడు ప్రాణాలు పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. సమీపంలోని రత్నా మినరల్స్ క్వారీపై దాడి చేశారు. అక్కడ ఉన్న జనరేటర్, ఇతర వస్తువులకు నిప్పు పెట్టారు. అదనపు బలగాలు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment