మట్టిలో ‘కలిసి’పోయారు | shells house collapse and three dead | Sakshi
Sakshi News home page

మట్టిలో ‘కలిసి’పోయారు

Published Thu, Oct 5 2017 8:35 AM | Last Updated on Mon, Aug 13 2018 3:11 PM

shells house collapse and three dead  - Sakshi

మృతి చెందిన ముగ్గురి మృతదేహాలు (ఇన్‌సెట్‌) నయాజ్‌ (ఫైల్‌)

వర్షానికి పెంకుల ఇల్లు కూలి దంపతులు సహా మనుమడు మృతి చెందడంతో రామకుప్పంలోని రాజుపేటలో తీవ్ర విషాదం నెలకొంది. దశాబ్దాలుగా ఇటుక బట్టీలో కూలీలుగా జీవనం సాగి స్తున్న ఆ భార్యాభర్తలు చివరికి గోడకూలి మట్టిలోనే కలిశారంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.

చిత్తూరు, రామకుప్పం: వర్షానికి నానిన గోడ కూలి ఒకే ఇంట్లో ముగ్గురు దుర్మరణం చెందడం రామకుప్పంలో తీవ్ర విషాదం నింపింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. రెక్కాడితేగానీ డొక్క నిండని కుటుంబం సుక్కుర్‌సాబ్‌ది. బతుకు దెరువు కోసం రాజుపేట నుంచి కర్ణాటక సరిహద్దు రాజుపేటరోడ్డుకు వెళ్లా రు. అక్కడ బాడుగ ఇంట్లో ఉంటూ సుక్కుర్‌సాబ్‌ (60), అతని భార్య పాతిమా(50) ఇటుక బట్టీలో పనిచేస్తున్నారు. పని ఎక్కువగా ఉన్న సమయంలో బట్టీ వద్ద యజ మాని ఏర్పాటు చేసిన పెంకుల ఇంటిలోనే నిద్రించేవారు. తెల్లవారుజామున పనుల్లో నిమగ్నమయ్యేవారు. వయసు మీదపడినా పొట్ట కూటి కోసం శక్తివంచన లేకుం డా కష్టపడి ఇటుకలు తయారు చేసే వారు. వీరి పాలిట పెంకుల ఇల్లు మృత్యుపాశమైంది. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇటుకుల బట్టీలో ఇద్దరు కలిసి ఇటుకలు తయారు చేశారు.

రాత్రి పెంకుల ఇంటిలోనే తలదాచుకున్నారు. అక్కడే భోజనం చేశారు. నిద్రకు జారుకునే సమయంలో తమ కుమార్తె ఆశ ఐదేళ్ల కొడుకు నయాజ్‌తో కలిసి ఇటుకుల బట్టీ వద్దకు వచ్చి తల్లిదండ్రులను కలిసింది. కొద్దిసేపు మాట్లాడి ఇంటికి తిరిగి వెళ్లే సమయంలో చిన్నారి నయాజ్‌ అమ్మమ్మ తాతయ్య దగ్గరే ఉంటానని మారాం చేయడంతో ఆశ తన కుమారుడుని అక్కడే వదిలి వెళ్లింది. రాత్రి 11 గంటల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. ఈ క్రమంలో బుధవారం తెల్లవారు జామున 3.30 గంటల ప్రాంతంలో పెంకుల ఇంటి గోడలు ఒక్కసారిగా కుప్ప కూలాయి. పెంకులు, కట్టెలు మీదపడడంతో గాఢ నిద్రలో ఉన్న సుక్కుర్‌సాబ్, పాతిమా, నయాజ్‌(05) ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు గుర్తించి కాపాడే ప్రయత్నం చేసినా.. అప్పటికే రక్తపు మడుగులో చిక్కుకుని మృతి చెందారు. కుటుంబ సభ్యుల రోదనలతో ఆ ప్రాంతం శోకసంద్రంగా మారింది. రాజుపేటరోడ్డులో అంత్యక్రియలు నిర్వహించారు.

ఒక్కరాత్రి గడిచి ఉంటే..
మృతి చెందిన చిన్నారి నయాజ్‌ తల్లి ఆశ రోదనలు స్థానికులను కలచివేశాయి. బెంగళూరులో కూలి పనులకు వెళ్లేందుకు బుధవారం ప్రయాణానికి అంతా సిద్ధం చేసినట్లు ఆమె వాపోయింది. ఈ ఒక్క రాత్రి గడిచి ఉంటే తన బిడ్డ బతికి ఉండే వాడని కన్నీరుమున్నీరైంది. తన బిడ్డకు అప్పడే నూరేళ్లు నిండాయంటూ గుండెలు బాదుకుంది.

మృత్యువులోనూ వీడని సంబంధం
సుక్కుర్‌సాబ్‌కు భార్య పాతిమా మొద టి నుంచి పనుల్లో చేదోడువాదోడుగా ఉండేది. 30 ఏళ్ల క్రితం ఒక్కటైన ఈ జంట.. మరణంలోనూ తమ బం ధాన్ని వీడలేదని స్థానికులు వాపోయారు.

ప్రాణాలు తీసిన ఇటుకల బట్టీ..
కూలీల కోసం ఏర్పాటు చేసిన పెంకుల ఇల్లు శిథిలావస్థకు చేరుకుంది. అయినా యాజమాని ఏం పట్టించుకోక నిర్లక్ష్యంగా ఉండడంతో ప్రమాదం జరిగినట్టు పలువురు ఆరోపిస్తున్నారు. అనధికారికంగా ఏర్పాటు చేసిన ఇటుక బట్టీల వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, అధికారులు చర్యలు తీసుకుని పేద కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు.

                           వర్షానికి కూలిపోయిన పెంకుటిల్లు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement