ఊటీలో రెచ్చిపోతున్న నరభక్షక పులి
పర్యాటకానికి ప్రసిద్ధి చెందిన ఊటీ జిల్లాలో ఇప్పుడో నరభక్షక పులి రెచ్చిపోతోంది. ఇప్పటివరకు ముగ్గరు వ్యక్తులను చంపి తిన్న ఆ పులి.. తాజాగా ఓ ఆవును లాక్కెళ్లిపోయింది. దాన్ని పట్టుకోడానికి తాము చేస్తున్న ప్రయత్నాలకు కొన్ని స్వచ్ఛంద సంస్థలు అడ్డుపడుతున్నాయని అటవీ శాఖాధికారులు అంటున్నారు. ఆవును లాక్కెళ్లడంతో భయకంపితులైన కపాచి గ్రామస్థులు వెంటనే ఆ పులిని పట్టుకోవాలని లేదా కాల్చి చంపాలని డిమాండ్ చేశారు. కానీ, దాన్ని చంపకూడదని స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు అడ్డుపడుతున్నారు.
నరభక్షకిగా మారిన పులిని పట్టుకోడానికి పట్టుకోడానికి ప్రయత్నాలను అటవీ శాఖాధికారులు ముమ్మరం చేశారు. తాను క్రికెట్ ఆడుకుంటుండగా పొదల చాటున ఆ పులి కనిపించిందని ఓ స్కూలు పిల్లడు చెప్పడంతో ఈ ప్రయత్నాలు వేగవంతం అయ్యాయి. షార్ప్ షూటర్లు, స్పెషల్ టాస్క్ఫోర్స్ సిబ్బంది సహా దాదాపు 300 మంది దీని వేటలో ఉన్నారు. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వస్తే, 24 గంటల్లోనే పులిని కాల్చిచంపగలమని సిబ్బంది అంటున్నా, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు మాత్రం వారిని అడ్డుకుంటున్నారు. పులి భయంతో ఈ ప్రాంతంలోని 17 పాఠశాలలు మూసేయాలని తాము చెప్పినా, ఈరోజు తెరిచారని, అయితే విద్యార్థులు మాత్రం ఎవరూ రాలేదని చెప్పారు. ఎస్టేట్ వర్కర్లు కూడా ప్రాణభయంతో పనికి వెళ్లడంలేదు. ఇప్పటివరకు ఇద్దరు మహిళలు సహా ముగ్గురిని ఈ పులి చంపేసింది.