శేఖర్, రామచంద్రమ్మ, చాకలి లక్ష్మి మృతదేహాలు
పరిగి: కరెంట్ షాక్ ముగ్గురిని కాటేసింది. తొలుత ఓ మహిళ విద్యుదాఘాతానికి గురికాగా.. ఆమెను కాపాడే యత్నంలో మరో ఇద్దరు మృతి చెందారు. ముగ్గురి మరణంతో వికారాబాద్ జిల్లా పరిగి మండలం లఖ్నాపూర్‌లో విషాదం అలుముకుంది. లఖ్నాపూర్‌లో చల్లా రామచంద్రమ్మ అనే మహిళ సోమవారం గృహప్రవేశం చేసింది. రాత్రి 7 గంటలకు గ్రామస్తులను భోజనానికి ఆహ్వానించాలని ఊరిలోకి బయలుదేరింది. చాకలి మొగులయ్యకు చెందిన రెండు ఇళ్ల మధ్య గల్లీలో విద్యుత్ తీగలు తేలి ఉన్నాయి.
అక్కడే మరో ఇనుప తీగ వేలాడుతూ ఉంది. ఆ ఇనుప తీగకు సందులో తేలి ఉన్న విద్యుత్‌తీగ తగిలింది. చీకట్లో అటుగా వెళ్లిన రామచంద్రమ్మ (62)కు ఆ ఇనుప తీగ తగలడంతో కరెంట్ షాక్‌కు గురైంది. వెంటనే ఆమె కేకలు వేస్తూ అక్కడే కుప్పకూలింది. పొరుగింటి చాకలి లక్ష్మి(55) గమనించి రామచంద్రమ్మను రక్షించేందుకు యత్నించింది. ఆమెకు కూడా షాక్ కొట్టడంతో కుప్పకూలింది. వీరి కేకలు విని ఏం జరిగిందోనని సమీపంలో ఉన్న గోనెల శేఖర్ (25) పరుగెత్తు కుంటూ వచ్చా డు. వారిని తన భుజాలపై ఎత్తుకుని పక్కకు తీసుకెళ్లే యత్నం చేశాడు.
ఆ ప్రదేశమంతా తడిగా ఉండటంతో శేఖర్ కూడా షాక్‌కు గురై అక్కడే పడిపోయాడు. స్థానికులు గమనించి విద్యుత్ సరఫరా నిలిపివేశారు. రామచంద్రమ్మ ఘటనాస్థలంలోనే మృతి చెందగా, పరిగి ఆస్పత్రికి తరలిస్తుండగా లక్ష్మి, శేఖర్ మార్గమధ్యంలో మృతి చెందారు. శేఖర్‌కు భార్య లలిత, ఇద్దరు కుమారులున్నారు. ఒకే గ్రామంలో ముగ్గురు మృతి చెందటంతో స్థానికుల్లో విషాదం అలుముకుంది.
Comments
Please login to add a commentAdd a comment