
నాగర్ కర్నూల్, సాక్షి: దాదాపు ఐదేళ్లపాటు నిలిచిపోయిన సొరంగం పనులు మళ్లీ మొదలయ్యాయి. ఆ పనుల సన్నాహాకాల కోసం కార్మికులు, ఇంజినీర్ సిబ్బంది ఉత్సాహంగా లోపలికి వెళ్లారు. బోర్ టన్నెల్ మిషన్‌ను ఆన్ చేశారు. అంతే.. భూకంపం వచ్చినట్లుగా టన్నెల్ మొత్తం ఒక్కసారిగా ఊగిపోయింది. పై నుంచి మట్టి.. బరద ముంచెత్తడంతో లోపల ఉన్నవాళ్లంతా కాళ్లకు బలం కూడదీసుకుని బయటకు పరుగులు తీశారు. కట్ చేస్తే.. టన్నెల్ ట్రాజెడీ జరిగి నెలకావస్తున్నా ఇంకా ఏడుగురి మృతదేహాల ఆనవాళ్లను కూడా బయటకు తీసుకురాలేకపోయారు.
.. ఫిబ్రవరి 22వ తేదీన నాగర్‌కర్నూల్ జిల్లా దోమలపెంట శివారులో శ్రీశైలం ఎడమ గట్టు కాలువ(ఎస్‌ఎల్‌బీసీ) సొరంగం పైకప్పు కూలిన దుర్ఘటన చోటు చేసుకుంది. ఉదయం 8.30గం. ప్రాంతంలో ప్రమాదం జరగ్గా.. సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. ఒక్కొక్కరిగా మొత్తం 42 మందిని సురక్షితంగా మధ్యాహ్నాంలోపు బయటకు తీసుకొచ్చారు. సొరంగంలో చిక్కుకున్న 8 మంది సిబ్బంది కోసం సహాయక చర్యలను ముమ్మరం చేశారు.

- ఫిబ్రవరి 22వ తేదీన.. ప్రమాదం జరిగిన కొన్ని గంటలకే ఇటు సింగరేణి నుంచి అటు సైన్యం దాకా పలు రాష్ట్రాల నుంచి ప్రత్యేక సహాయక బృందాలు రంగంలోకి దిగి ముమ్మరంగా చర్యలు చేపట్టాయి.
- దేశంలోనే అత్యుత్తమ కేంద్ర, రాష్ట్ర ఏజెన్సీల బృందాలు దాదాపు వెయ్యి మందితో మూడు షిఫ్టుల్లో 24 గంటలూ పని చేస్తున్నాయి. అయినా పురోగతి కనిపించడం లేదు.
- మానవ అవశేషాలను గుర్తించడంలో దిట్ట అయిన కేరళ ప్రత్యేక జాగిలాలు రంగంలోకి దిగినా.. ప్రయోజనం లేకుండా పోయింది!
- మార్చి 9వ తేదీన ఒక్క మృతదేహాం మాత్రమే దొరికింది. అది గుర్‌ప్రీత్‌సింగ్ మృతదేహంగా నిర్ధారించారు.
- ఎస్‌ఎల్‌బీసీలో అనుమానిత ప్రాంతాలుగా D1-D2 మార్క్ చేసి.. విస్త్రతంగా తవ్వకాలు జరుపుతున్నారు
- మిగతా ఏడుగురి జాడ గుర్తించేందుకు దేశంలోని అత్యుత్తుమ ఏజెన్సీలతో సహాయక చర్యలు కొనసాగిస్తున్నా పురోగతి కనిపించట్లేదు.
- ఈ సొరంగం ప్రమాదం దేశంలోనే అరుదైనదిగా నిపుణులు చెబుతున్నారు. భారీగా వస్తున్న ఊటనీరు,బురదతో సహయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది.

- సొరంగంలో 13.85వ కి.మీ. వద్ద పైకప్పు కూలింది. మట్టి, రాళ్లు, బురద, సీసీ సెగ్మెంట్స్, నీరు, టీబీఎం శిథిలాలన్నీ సొరంగంలో 11వ కి.మీ. నుంచి 13.85 కి.మీ. వరకు పేరుకుపోయాయి. నిమిషానికి 5 వేల లీటర్ల నీటి ఊట వస్తుండటంతో మట్టి తడిసి చాలా గట్టిగా మారింది. తవ్వాల్సిన మట్టి గట్టిగా ఉండటం, పైకప్పు బలహీనంగా ఉండటంతో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.
- సాంకేతికంగా చూసుకుంటే.. లోకో ట్రైన్స్, కన్వేయర్ బెల్టులు, హైకెపాసిటీ పంపులతో నీరు, బురదను బయటకు పంపిస్తున్నా లాభం కనిపించడం లేదు. అడ్వాన్స్‌డ్ సెంట్ డిటెక్షన్, టన్నెల్ బోరింగ్ మెషిన్.. భారీ ట్రాన్స్‌ఫార్మర్లను కత్తిరించేందుకు అల్ట్రా థర్మల్ కట్టర్లను ఉపయోగిస్తున్నారు. అయితే రోబో సహయక చర్యలు ప్రారంభం కాలేదు.
- తమవారు సురక్షితంగా బయటకు వస్తారని ఎదరు చూసిన కుటుంబ సభ్యులకు, బంధువులకు.. గుర్‌ప్రీత్ సింగ్ మృతదేహాం చూశాక ఆ ఆశలు ఆవిరైపోయాయి. నెల రోజుల తర్వాత కూడా మృతదేహాల కోసం బాధిత కుటుంబాలు టన్నెల్ వద్దే ఎదురుచూపులు చూస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment