
ఎస్సారెస్పీ కెనాల్‌లో పడిన కారు.. తండ్రి, ఇద్దరు పిల్లల మృతి
స్థానికుల సాయంతో ప్రాణాలతో బయటపడిన తల్లి
వరుసగా సెలవులు రావడంతో స్వగ్రామానికి
కారులో వెళ్తున్న కుటుంబం
గుండెనొప్పి రావడంతో కారు స్టీరింగ్ తిప్పలేని పరిస్థితి..
నేరుగా కాల్వలోకి దూసుకెళ్లడంతో ప్రమాదం
మేచరాజుపల్లిలో విషాదఛాయలు
వరుసగా రెండు రోజులు సెలవులు. సరదాగా పిల్లలను తీసుకుని సొంతూరుకు బయలుదేరారు. కారులో భార్యాభర్తలు పిల్లలతో ముచ్చట్లు పెట్టుకుంటూ వెళ్తున్నారు. నానమ్మ, తాతయ్య దగ్గరికి వెళ్తున్నామన్న ఆనందం మనుమరాలిది. కానీ విధి వక్రించింది. మార్గమధ్యలో కారు నడుపుతుండగానే ఇంటిపెద్దకు గుండెపోటు తీవ్రం కావడంతో నేరుగా కాల్వలోకి దూసుకెళ్లింది. భర్త, కూతురు, రెండేళ్ల కుమారుడు జలసమాధి అయ్యారు. భార్య ప్రాణాలతో బయటపడినా ఒంటరిగా మిగిలిపోయింది. వరంగల్ జిల్లా (Warangal District) పర్వతగిరి మండలం కొంకపాక గ్రామశివారులో శనివారం(Saturday) మధ్యాహ్నం జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదం నింపింది.
12.25 గంటలకు : కారు మార్గమధ్యలోని సంగెం మండలం తీగరాజుపల్లి ఎస్సారెస్పీ కాల్వ (కొంకపాక గ్రామశివారు) దాటి 200 మీటర్లు ముందుకెళ్లాక ప్రవీణ్‌కుమార్ తనకు ఛాతిలో నొప్పిగా ఉందని భార్య కృష్ణవేణికి చెప్పాడు. దీంతో కారు కాసేపు ఆపారు. టీ తాగితే తగ్గుతుందని కృష్ణవేణి అనడంతో కారును వెనక్కి తిప్పి తీగరాజుపల్లి వైపు బయలుదేరారు.
12.30 గంటలకు : కారు వంద మీటర్ల ముందుకు రాగా, గుండెనొప్పి (Heart Attack) అధికం కావడం.. స్టీరింగ్ తిప్పే పరిస్థితి లేకపోవడంతో కృష్ణా(భార్యపేరును తలుస్తూ).. కాల్వలో పడిపోతున్నామంటూ ప్రవీణ్ చెప్పాడు. వెంటనే కృష్ణవేణి కారు డోర్ తెరిచి చేతిలో ఉన్న బాబును బయటకు విసిరివేసి వంగింది. అంతలోనే నీటి ప్రవాహంలో కృష్ణవేణి బయటకు వచ్చి కాళ్లు ఆడిస్తున్నది.
12.40 గంటలకు : అదే సమయంలో సమీపంలో ఉన్న చౌటుప్పల్‌కి చెందిన నవీన్, సందీప్, రవి వెంటనే కాల్వ వద్దకు చేరుకుని అలానే కాళ్లు ఆడించండి అని చెప్పి తాడు తీసుకువచ్చి కృష్ణవేణిని బయటకు తీశారు. ఇంతలో బాబు నీటిపై తేలుతుండడంతో అతడిని బయటకు తీశారు. కానీ, అప్పటికే చనిపోయాడు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండ డం, వెనక కూర్చున్న కూతురితో సహా తండ్రి కారులోనే నీటిలో మునిగిపోయారు.
1.10 గంటలకు : ఫైర్ సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కాల్వలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో అధికారులు పర్వతగిరి వైపు నీటిని ఎక్కువగా వదిలి.. వర్ధన్నపేట వైపు తగ్గించారు.
4.35 గంటలకు : నీటి ప్రవాహం తగ్గడంతో కారు కనిపించగా తాళ్లసాయంతో బయటికి లాగారు. కారు డ్రైవింగ్ సీట్లో ప్రవీణ్‌కుమార్, వెనుక సీట్లో కూతురు చైత్రసాయి విగతజీవులుగా బయటపడ్డారు.
నాన్నా..పిల్లలతో వస్తున్నా..
మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మేచరాజుపల్లి గ్రామానికి చెందినసోమారపు సారంగపాణి, పద్మకు ఇద్దరు కొడుకులు. వీరిలో చిన్న కొడుకు ప్రవీణ్‌కుమార్ (పప్పి) కష్టపడి చదువుకుని హనుమకొండ ఎల్‌ఐసీలో డెవలప్‌మెంట్ ఆఫీసర్‌గా ఉద్యోగం సాధించాడు. భార్య కృష్ణవేణి, ఒక కూతురు, ఒక కుమారుడు ఉన్నారు. పదేళ్లుగా హనుమకొండలోని రాంనగర్‌లో నివాసం ఉంటున్నారు. సెలవు రోజుల్లో ఊరులో ఉన్న అమ్మానాన్న వద్దకు వచ్చివెళ్లేవాడు.
‘రెండు రోజులు సెలవులు ఉన్నాయి. పిల్లలతో సహా ఇంటికి వస్తున్నాం. అర్ధగంటలో చేరుకుంటాం’ అని ప్రవీణ్‌కుమార్ శనివారం ఉదయం తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పాడు. అదే అర్ధగంటలో కారు కాల్వలో పడిందని సమాచారం అందడంతో ‘అర్ధ గంటలో ఇంట్లో ఉంటానంటివి గద బిడ్డో... అంటూ’ ఆ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా విలపించారు. ఇంటికి వచ్చినప్పుడు అందరితో సరదాగా ఉండే ప్రవీణ్ కుమార్ చనిపోయాడని తెలియడంతో అయ్యో.. దేవుడు మంచి మనిషిని తీసుకెళ్లాడు’ అంటూ స్నేహితులు, గ్రామస్తులు కంటతడిపెట్టారు.
నా భర్త, పిల్లలను బతికించండి..
స్థానికుల సహాయంతో ప్రాణాలతో బయటపడిన కృష్ణవేణి తన పిల్లలను, భర్తను బతికించండని అక్కడున్న వారిని ప్రాధేయపడింది. రెండేళ్ల కుమారుడిని బయటికి తీసుకువచ్చాక ‘లే నాన్నా.. లే’ అంటూ తట్టిలేపుతున్న కృష్ణవేణిని చూసి ప్రతి ఒక్కరూ కంట తడిపెట్టారు.
నువ్వు వస్తావా.. నన్నే రమ్మంటావా..
‘నా మనుమరాలు చైత్ర ఉదయం ఫోన్‌లో మాట్లాడింది. హనుమకొండకు నువ్వు వస్తావా.. లేదా నన్నే రమ్మంటావా..’ అని ముద్దుగా చెప్పిందని తాత సారంగపాణి అక్కడున్న వారికి చెబుతూ రోదించారు. అప్పుడే నూరేళ్లు నిండాయా తల్లి అంటూ కన్నీటిపర్యంతమయ్యాడు. ప్రవీణ్ అంటే దయగల గుణం అని, అందరూ తనవాళ్లేనని అంటుండేవాడని, ఆస్పత్రుల్లో బంధువులుంటే వారికి అన్నం పెట్టేవాడని, అందరితో మంచివాడని పేరు తెచ్చుకున్న నా కొడుకుకు అప్పుడే నూరేళ్లు నిండి దేవుడి వద్దకు వెళ్లాడా. చైత్రకు నాన్న ప్రవీణ్ అంటే అమితమైన ప్రేమ అని, చివరికి తండ్రితో కలిసే పరలోకాలకు చేరింది’ అంటూ అని పద్మ గుండెలవిసేలా రోదించింది.
రెయిలింగ్ లేకనే ప్రమాదాలు
రెయిలింగ్ లేకపోవడంతో కొంకపాక గ్రామ శివారులోని ఎస్సారెస్పీ డీబీఎం–48 కాల్వ వద్ద తరచూ ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతున్నారు. రెండేళ్ల క్రితం కారు వేగంగా కాల్వలోకి వెళ్లి ఒక ప్రభుత్వ టీచర్, మరో ఇద్దరు మృతి చెందారు. అంతేకాకుండా ట్రాక్టర్ బోల్తాపడి మరొకరు మృత్యువాతపడ్డారు. శనివారం ఎస్సారెస్పీ కాల్వలో కారు పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. కాల్వ చుట్టూ రెయిలింగ్, ప్రమాద సూచికలు లేకపోవడంతోనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని పలువురు ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి రక్షణ చర్యలు చేపట్టి ప్రమాదాలను నివారించాలని వాహనదారులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment