srsp canal
-
చివరిశ్వాస వరకూ ‘అమ్మవారి’తోనే..
సాక్షి, జగిత్యాల: నవరాత్రులు అమ్మవారికి నిత్యపూజలు చేశాడు.. ఆమె ధ్యాసలోనే గడిపాడు.. కాలువలో జారిపడినా.. ఆ దేవతా విగ్రహాన్ని మాత్రం వదిలిపెట్టలేదు.. చివరిశ్వాస వరకూ అమ్మవారినే నమ్ముకుని తన ప్రాణాలు అర్పించాడు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం తాటిపల్లి గ్రామ శివారులోని ఎస్సారెస్పీ కాలువలో బుధవారం గల్లంతైన పూజారి సుమారు పది కిలోమీటర్ల మేర అమ్మవారి విగ్రహాన్ని వదిలిపెట్టక కొట్టుకుపోయాడు.. గ్రామస్తుల కథనం ప్రకారం.. మల్యాల మండలం తాటిపల్లికి చెందిన పూజారి బింగి ప్రసాద్(46) ఈనెల 5న దుర్గాదేవి నిమజ్జనం కోసం సమీపంలోని ఎస్సారెస్పీ కాలువ వద్దకు వెళ్లాడు. తొలుత ఇటీవల ఓ భక్తుడు సమర్పించిన వెండి అమ్మవారి విగ్రహాన్ని శుభ్రం చేసేందుకు కాలువలోకి దిగాడు. విగ్రహాన్ని శుభ్రం చేస్తుండగా కాలుజారి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. గమనించిన యువకులు కాలువలోకి దూకి రక్షించేందుకు ప్రయత్నించి విఫలయ్యారు. తర్వాత పూజారి కోసం శుక్రవారం వరకూ గాలింపు చర్యలు కొనసాగించారు. ఈక్రమంలో చొప్పదండి మండలం రేవల్లెలో ఎస్సారెస్పీ కాలువ గేట్ల వద్ద పూజారి శవమై కనిపించాడు. పది కి.మీ. అమ్మవారి విగ్రహంతోనే.. ప్రసాద్ రెండు దశాబ్దాలుగా పౌరోహిత్యం చేస్తున్నారు. జాతకాలు చూస్తున్నారు. వాస్తుదోషంలోనూ ఆరితేరాడు. కరీంనగర్, వరంగల్, ధర్మపురి వంటి దూరప్రాంతాల ప్రజలకూ సుపరిచితులు. తాటిపల్లి మార్కండేయ ఆలయంలో దశాబ్దకాలంగా అమ్మవారి విగ్రహం వద్ద పూజలు చేస్తున్నాడు. నిత్యం అమ్మవారి ధ్యానంలోనే ఉంటున్నాడు. ఉపవాస దీక్ష చేపడుతూ ఆధ్యాత్మికత పెంపొందిస్తున్నాడు. ఈక్రమంలో ఎస్సారెస్పీ కాలువలో జారిపడి సుమారు 10కి.మీ. మేర కొట్టుకుపోయినా చివరిశ్వాస వరకూ దుర్గాదేవి అమ్మవారి విగ్రహాన్ని వదిలిపెట్టలేదు. పాక్షికంగా ఈత వచ్చినా, అమ్మవారి ఒడిలో చివరిశ్వాస విడిచాడు. స్థానికులు రేవల్లె వద్ద మృతదేహాన్ని వెలికితీసే క్రమంలో ప్రసాద్‌కు నడుముకు అమ్మవారి విగ్రహం చూసి ఆశ్చర్యపోయారు. మృతదేహానికి రేవల్లె వద్ద పోస్టుమార్టం నిర్వహించి, తాటిపల్లికి తరలించి, దహన సంస్కారాలు నిర్వహించారు. మృతుడికి భార్య మంజుల, కూతురు, కుమారుడు ఉన్నారు. -
గణేశుడి నిమజ్జనంలో అపశ్రుతి
సాక్షి, సూర్యాపేట: గణేశుడి నిమజ్జనంలో అపశ్రుతి చోటు చేసుకుంది. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండలంలోని కోటినాయక్ తండాలోని ఎస్సారెస్పీ కాల్వలో శుక్రవారం వినాయకుడి విగ్రహాన్ని నిమజ్జనం చేసే క్రమంలో ఇద్దరు గల్లంతయ్యారు. వారిలో ఒకరు మృతిచెందగా.. మరొకరి ఆచూకీ లభ్యం కాలేదు. తండాలో ప్రతిష్టించిన గణేశ్ విగ్రహానికి ప్రజలు ఘనంగా శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం తండా శివారులోని ఎస్సారెస్పీ కాలువ 71 డీబీఎం 36ఎల్ వద్ద నిమజ్జనానికి తీసుకువెళ్లారు. ఈ క్రమంలో తండాకు చెందిన బానోత్ సూర్య(55) కాల్వలోని మెట్లు దిగుతూ కాలుజారి నీళ్లలో పడ్డాడు. నీటి ప్రవాహానికి సూర్య కొట్టుకుపోతుండగా అతడిని రక్షించేందుకు ఆయన అన్న కుమారుడు బానోత్ నాగు(36) నీళ్లలోకి దూకాడు. నిమజ్జనం చేసేచోట కాలువ రెండుగా విడిపోతుండడంతో గేట్ల వద్ద నీటి ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. దీంతో వారు రెప్పపాటులోనే గల్లంతయ్యారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గాలింపుల చర్యలు చేపట్టారు. రాత్రి ఘటనా స్థలానికి కిలోమీటరు దూరంలో సూర్య మృతదేహం లభ్యం అయింది. కానీ బానోత్ నాగు ఆచూకీ తెలియాల్సి ఉంది. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఘటన స్థలాన్ని సూర్యాపేట డీఎస్పీ నాగభూషణం, సీఐ ఆంజనేయులు సందర్శించి గాలింపు చర్యలను పర్యవేక్షించారు. -
గోదావరిలో జల సవ్వడి
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు.. మొన్నటి వరకు కొనసాగిన కాళేశ్వరం ఎత్తిపోతల నేపథ్యంలో గోదావరిలో జల సవ్వడి నెలకొంది. మేడిగడ్డ మొదలు సిద్దిపేట జిల్లాలోని కొండపోచమ్మసాగర్ వరకు బ్యారేజీలు, రిజర్వాయర్లన్నీ జలకళను సంతరించుకున్నాయి. ఇప్పటికే ఎల్లంపల్లి, కడెం, మిడ్‌మానేరు, లోయర్ మానేరులో పూర్తిస్థాయిలో నీటిని నిల్వ చేయగా రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఎస్సారెస్పీలోకి సైతం ప్రవాహాలు పెరిగాయి. ప్రస్తుత సాగు అవసరాలను దృష్టిలో పెట్టుకొని లోయర్ మానేరు నుంచి ఎస్సారెస్పీ కాల్వలకు నీటిని విడుదల చేసేందుకు ఇరిగేషన్ శాఖ సిద్ధమవుతోంది. అవసరాలకు తగ్గట్లు ఆయకట్టుకు.. జూన్ తొలి వారంలో వర్షాలు కురిసినా ఆ తర్వాత క్రమంగా తగ్గుముఖం పట్టడంతో అప్రమత్తమైన ప్రభుత్వం.. జూన్ మూడో వారం నుంచి కాళేశ్వరం ఎత్తిపోతలు చేపట్టింది. ప్రాణహితలో వచ్చిన నీటిని వచ్చినట్లుగా 12 టీఎంసీల మేర నీటిని మేడిగడ్డ నుంచి దిగువ కొండపోచమ్మ వరకు తరలించింది. ప్రస్తుతం పంపులను పూర్తిగా నిలిపివేయగా మేడిగడ్డ వద్ద 55 వేల క్యూసెక్కులకుపైగా నీటి ప్రవాహాలు కొనసాగుతున్నాయి. 25 గేట్లు పైకెత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. అన్నారంలో 10.87 టీఎంసీలకుగాను ప్రస్తుతం 8.50 టీఎంసీల మేర నిల్వ ఉండగా సుందిళ్లలో 8.83 టీఎంసీలకుగాను 6 టీఎంసీల మేర నిల్వ ఉంది. ఎల్లంపల్లిలో 20 టీఎంసీలకుగాను సోమవారం 17.25 టీఎంసీల మేర నీటి నిల్వ ఉండగా 15 వేల క్యూసెక్కులకుపైగా ప్రవాహాలు వస్తున్నాయి. దీంతోపాటు కాళేశ్వరం ద్వారా ఇప్పటికే లోయర్ మానేరు, మిడ్ మానేరును నింపారు. లోయర్ మానేరులో 24 టీఎంసీలకుగాను 21.10 టీఎంసీలు నిల్వ ఉండగా 4 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతోంది. ఇక్క డి నుంచి సూర్యాపేట వరకు ఎస్సారెస్పీ కాల్వల కింద నీటిని అందించేందుకు గేట్లు ఎత్తాలని ఇరిగేషన్ శాఖ నిర్ణయించింది. మిడ్‌మానేరులో సైతం 25.87 టీఎంసీలకుగాను 23.34 టీఎంసీల నిల్వ ఉంది. ఇక మిడ్‌మానేరు నుంచి నీటిని ఎత్తిపోయ డంతో మలక్‌పేట, రంగనాయక్సాగర్లలో మూడే సీ టీఎంసీల నిల్వలు ఉండగా 15 టీఎంసీల కొండపోచమ్మ సాగర్‌లో సైతం 6.80 టీఎంసీల నిల్వ ఉం ది. బ్యారేజీలు, రిజర్వాయర్లలో ఉన్న నీటితో అవసరాలకు తగ్గట్లుగా ఆయకట్టు కాల్వలకు నీటిని విడుదల చేయనున్నారు. ఇక గోదావరి బేసిన్‌లోని ఎస్సారెస్పీకి వరద ప్రవాహం పెరిగింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వస్తున్న వరదనీటి ఇన్‌ఫ్లో సోమవారం రాత్రి 9 గంటలకు 90 వేల క్యూసెక్కులకు చేరింది. నీటి మట్టం 1075.20 (40.203 టీఎంసీలు) అడుగులకు చేరింది. సమ్మక్క బ్యారేజీ నుంచి 1.35 లక్షల క్యూసెక్కులు విడుదల ఏటూరునాగారం: ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం సమ్మక్క బ్యారేజీ గేట్లను ఇరిగేషన్ అధికారులు సోమవారం తెరిచారు. 59 గేట్లలో 36 గేట్లను తెరిచి లక్షా 35 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. బ్యారేజీ నీటి నిల్వ సామర్థ్యం 6.9 టీఎంసీలుకాగా ప్రస్తుతం 1.3 టీఎంసీలను నిల్వ చేశారు. -
మే 23న కూతురి పెళ్లి.. అంతలోనే జలసమాధి
సాక్షి, జగిత్యాల/ మేడిపల్లి (వేములవాడ): దైవ దర్శనానికి వేకువజామునే సొంతూరుకు బయల్దేరిన ఓ కుటుంబంపై విధి చిన్నచూపు చూసింది. కారు అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ప్రమాదాన్ని గమనించినా తేరుకునే లోపే మృత్యువు కాటేసింది. నీట మునిగి ముగ్గురు కుటుంబసభ్యులు దుర్మరణం చెందారు. ‘‘అమ్మకు ఈత రాదు. అమ్మను తీసుకొని బయటకు వెళ్దాం..’’అని తండ్రి ధైర్యం చెప్పినా... తేరుకొని బయటపడే ప్రయత్నం చేసే లోపే కారులో నీరు నిండిపోయింది. దంపతులు, కూతురు దుర్మరణం చెందగా... కుమారుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ సంఘటన జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం కట్లకుంట శివారులో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. జగిత్యాల జిల్లా కేంద్రంలోని హౌసింగ్‌బోర్డుకు చెందిన న్యాయవాది కటికనేని అమరేందర్‌రావు (55), ఆయన భార్య శిరీష (45), కూతురు శ్రేయ (23), కుమారుడు జయంత్ కలిసి సోమవారం స్వగ్రామమైన కోరుట్ల మండలం జోగన్ పెల్లికి బయల్దేరారు. ఊరిలో సోమవారమే ప్రారంభమైన వేంకటేశ్వరస్వామి ఉత్సవా లకు హాజరయ్యేందుకు తెల్లవారుజామున 5.15 గంటలకు బయల్దేరారు. ఆ తర్వాత 15 నిమిషాలకే కారు అదుపుతప్పి మేడిపల్లి మండలం కట్లకుంట శివారులో రోడ్డు పక్కనున్న ఎస్సారెస్పీ కాలువలో పడిపోయింది. ఆ సమయంలో అమరేందర్‌రావు కారు నడుపుతుండగా, కుమారుడు జయంత్ పక్కన కూర్చున్నాడు. భార్య శిరీష, కూతురు శ్రేయ వెనుక సీట్లో కూర్చున్నారు. కారు కాలువలో పడి సుమారు 20 మీటర్ల దూరం వరకు వెళ్లి మోటారు పైపునకు తట్టుకుని ఆగింది. కుమారుడు జయంత్ కారు డోరు తీసు కుని... ఈదుకుంటూ సురక్షితంగా బయట పడినప్పటికీ అమరేందర్‌రావుతో పాటు భార్య శిరీష, కూతురు శ్రేయ కారులో ఇరు క్కుపోవడంతో నీటిలోనే మునిగి మరణిం చారు. స్థానికులు సహాయ చర్యలు చేపట్టినప్పటికీ అప్పటికే ముగ్గురు చనిపోయారు. చదవండి: (నా భార్యను నేనే చంపేశా.. ఇక దేనికైనా సిద్ధమే) కాలువలో పడ్డ కారును బయటకు తీస్తున్న పోలీసులు నిద్రమత్తులోనే ప్రమాదం తెల్లవారుజామునే జగిత్యాల నుంచి బయల్దేరిన కారు మేడిపల్లి మీదుగా కోరుట్ల మండలం జోగిన్‌పల్లికి వెళ్లేమార్గంలో కట్లకుంట వద్దనున్న ఎస్సారెస్పీ కెనాల్ బ్రిడ్జి ముందు నుంచే కాలువలోకి దూసుకెళ్లింది. బ్రిడ్జి దగ్గరకు రాగానే నేరుగా బీటీ రోడ్డు వైపు వెళ్లకుండా కుడివైపునకు మళ్లించడంతో అదుపుతప్పి కారు కాల్వలో పడింది. నిద్రమత్తు కారణంగానే ప్రమాదం సంభవించినట్లు పోలీసులు భావిస్తున్నారు. ముగ్గురికి ఈత వచ్చినా.. కారు కాలువలోకి దూసుకెళ్లగా.. అమరేందర్‌రావు, ఆయన భార్య, పిల్లలు అందులో నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేశారు. ‘‘ఎవరూ కంగారు పడొద్దు. మన ముగ్గురికీ ఈత వస్తుంది.. అమ్మను మెల్లగా బయటకు తీసు కొద్దాం..’’అని అమరేందర్‌రావు పిల్లలకు చెప్పారు. కానీ.. కారు డోర్లు తీయలేక పోవడంతో లోపలే ఇరుక్కుపోయారు. కారులో నీళ్లు నిండుతున్నాయని శిరీష, శ్రేయలు కారు మునిగిపోయే సమయంలో అరిచినట్లు జయంత్ చెప్పాడు. మూడు నెలల్లో కూతురు పెళ్లి.. ఢిల్లీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్న శ్రేయకు వరంగల్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్‌తో ఇటీవలే పెళ్లి కుదిరింది. మే 23న పెళ్లి పెట్టుకున్నారు. సోమవారం జోగిన్‌పల్లిలో దైవ దర్శనం తరువాత హైదరాబాద్‌కు వెళ్లి పెళ్లి పనులు, షాపింగ్ పూర్తి చేసుకోవాలని అమరేందర్‌రావు కుటుంబీకులు భావించారు. ఈలోపే ప్రమాదం చోటుచేసుకొని తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. జగిత్యాల ఆసుపత్రిలో మృతదే హాలను ఎమ్మెల్యే సంజయ్‌కుమార్, కలెక్టర్ రవి, ఎస్పీ సింధుశర్మ పరిశీలించారు. రెయిలింగ్ లేక ప్రమాదాలు ఐదు రోజుల క్రితం వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండలం తీగరాజు పల్లి శివారులో ఎస్సారెస్పీ కాలువలో కారు పడి ఇద్దరు మృతి చెందిన ఘటన మరువకముందే సోమవారం జగి త్యాల జిల్లా కట్లకుంట శివారులో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఎస్సా రెస్పీ కెనాల్ మీదుగా వెళుతున్న రహదారులపై బ్రిడ్జీలకు ఇరువైపులా సుమారు 100 మీటర్ల వరకు రెయిలింగ్ ఏర్పాటు చేయాల్సి ఉండగా రక్షణ చర్యలు లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. గత ఏడాది ఫిబ్రవరి 16న కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ శివారులో ఎస్సారెస్పీ ప్రధాన కాలువలో పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి బంధువులు ప్రయాణిస్తున్న కారు కాలువలో పడి ముగ్గురు మృతిచెందారు. ఇక్కడే జనవరి 25న సుల్తానాబాద్‌కు చెందిన దంపతులు కారు రివర్స్ తీస్తుండగా ప్రమాదవశాత్తు కాల్వలో పడి ఇద్దరు మృతిచెందారు. ఇదే ప్రాంతంలో వేర్వే రు ఘటనలో రెండు బైక్ ప్రమాదాల్లో నలుగురు మరణించారు. అమ్మను కూడా తీసుకెళ్దాం అన్నారు ‘కారులో బయల్దేరాక నాన్నకు నిద్ర వస్తోందని నేను డ్రైవ్ చేస్తానన్నాను. పర్లేదు బిడ్డా... టెన్షన్ పడకు నేను నడుపుతా అన్నారు. బ్రిడ్జి వద్దకు రాగానే కారు అదుపుతప్పడంతో కాలువలో పడిపోయింది. వెంటనే నాన్నా కారు నుంచి బయటకు వెళ్దాం అన్నాను. ఏమీ కాదులే.. నీకు, నాకు, అక్కయ్యకు ఈతవచ్చు. అమ్మకు ఈత రాదు కాబట్టి ఆమెను తీసుకొని బయటకు వెళ్దాం అన్నారు. నాన్న ఆ మాట చెప్పేలోపే కారు నీటిలో మునిగిపోయింది. నేను డోరు తీసుకొని బయటకు వచ్చాను. కానీ నాన్న, అమ్మ, అక్క కారులోనే ఇరుక్కుపోయారు. కళ్లముందే అంతా అయిపోయింది.’ – జయంత్, కుమారుడు -
కాల్వలోకి కారు.. ప్రాణాలు కోల్పోయిన అడ్వకేట్
సాక్షి, జగిత్యాల: జిల్లాలో సోమవారం ఉదయం దారుణం చోటు చేసుకుంది. మేడిపల్లి మండలం కట్లకుంట వద్ద ఘోర ప్రమాదం జరిగింది. కారు ఎస్సారెస్పీ కెనాల్లోకి దూసుకెళ్లడంతో ముగ్గురు గల్లంతయ్యారు. ఒకరు సురక్షితంగా బయటపడ్డారు. గల్లంతైన వారు కోరుట్ల మండలం జోగినిపల్లికి చెందిన న్యాయవాది అమరేందర్ రావు కుటుంబసభ్యులుగా గుర్తించారు. అమరేందర్ రావు భార్య శిరీషా కూతురు శ్రేయా, కుమారుడు జయంత్ నలుగురు కారులో హైదరాబాద్ వెళ్ళి తిరిగి వస్తుండగా ప్రమాదానికి గురయ్యారు. సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. ముగ్గురు కారుతో సహ గల్లంతయ్యారు. ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డ జయంత్ బయటికి వచ్చి చెప్పేవరకు కారు కెనాల్లో పడ్డ విషయం ఎవరికీ తెలియదు. ప్రమాదం గురించి తెలిసిన పోలీసులు, రెవెన్యూ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని కెనాల్లో నీటిని నిలిపివేసి గాలింపు చర్యలు చేపట్టారు. కాలువలో గల్లైంతన అమరేందర్ రావు, ఆయన భార్య శిరీషా, కూతురు శ్రేయా ముగ్గురు మరణించారు. అధికారులు క్రేన్ సాయంతో కారును బయటకు తీశారు. అమరేందర్ రావు జగిత్యాలలో న్యాయవాదిగా పనిచేస్తారని స్థానికులు తెలిపారు. బయటపడ్డ జయంత్ మాట్లాడేందుకు నిరాకరించారు. చదవండి: వరంగల్: కాలువలోకి దూసుకెళ్లిన కారు -
వరంగల్: కాలువలోకి దూసుకెళ్లిన కారు
సాక్షి, వరంగల్ : వేగంగా దూసుకువస్తున్న కారు కెనాల్ పడిపోయింది. వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండలంలోని కొంకపాక శివారులో కారు అదుపు తప్పి ఎస్సారెస్పీ కెనాల్లో పడడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కారులో ప్రయాణిస్తున్న వారిలో ముగ్గురు వ్యక్తులు గల్లంతు అయ్యారు. ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా.. అందులో ఒకరు ప్రభుత్వ ఉపాధ్యాయుడుగా తెలుస్తోంది. గల్లంతైన వారి వివరాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయ చర్యలను చేపట్టారు. కారును కెనాల్ నుంచి బయటకు తీశారు. మృతదేహాలను ఒడ్డుకు చేర్చి గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు. -
దీనికి ప్రభుత్వం అనుమతిచ్చింది: ఈటల
సాక్షి, కరీంనగర్: ఎస్ఆర్ఎస్పీ వరద కాలువ ఎగువ నీటిని వినియోగించుకునేలా ప్రభుత్వం అనుమతిని ఇచ్చిందని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతంలో నీళ్ళకోసం పోరాడితే కేసులు పెట్టిన చరిత్ర చుశామన్నారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని, మండు వేసివిలో కూడా చెరువులు మత్తడి కుతున్నాయన్నారు. ఎస్ఆర్ఎస్పీ వరద కాలువ చివరి భూములకు నీరు అందే విధంగా ఇరువైపులా చెరువు కుంటలు నింపాలని నిర్ణయంచామని చెప్పారు. ఎస్ఆర్ఎస్పీ కాలువ మొత్తాన్ని వెయ్యి కోట్లతో రిపేర్ చేసి 6 వేల క్యూసెక్కుల నీటిని తరలించాలని నిర్ణయించినట్లు చెప్పారు. మిడ్ మానేర్ కింది భాగంలో 77 వేల ఎకరాలకు సాగునీరు అందించేలా కృషి చేస్తున్నామని, మొక్కజోన్న స్థానంలో కంది పంట వేయాలని నిర్ణయించామన్నారు. ఇక కరీంనగర్ సీడ్ బౌల్ ఆఫ్ తెలంగాణగా, రైస్ బౌల్ ఆఫ్ తెలంగాణగా మారబోతుందని మంత్రి పేర్కొన్నారు. (కరోనా: టెస్టులు చేయకుండానే డిశ్చార్జి) -
జలదిగ్బంధంలో ఎడ్జెర్ల
మరిపెడ రూరల్: మబ్బు పట్టలేదు.. వర్షం కురవలేదు.. కానీ ఆ గ్రామం రాత్రికి రాత్రే జలమయమైంది. తెల్లవారేసరికి ఏ వీధిలో చూసినా సెలయేరులా నీటి ప్రవాహం కనిపిస్తోంది. ఇదీ మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఎడ్జెర్ల గ్రామంలోని పరిస్థితి. గ్రామస్తుల కథనం ప్రకారం.. ఇటీవల ప్రభుత్వం ఎస్సారెస్పీ కాల్వల ద్వారా మండలానికి గోదావరి జలాలను విడుదల చేసింది. అయితే ఎడ్జెర్ల గ్రామ శివారులో ఉన్న పెద్ద చెరువును నింపేందుకు జేసీబీతో తాత్కాలికంగా ఓ కాల్వను తవ్వుతున్నారు. ఈ క్రమంలో కాల్వ సగం తవ్విన తర్వాత మధ్యలో ఓ రైతు తన పంట పొలం నుంచి కాల్వ తవ్వడానికి కుదరదని అడ్డుకున్నాడు. కాగా, ఇదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు శనివారం రాత్రి పది గంటల సమయంలో గ్రామ సమీపం నుంచి ప్రవహిస్తున్న ఎస్సారెస్పీ కాల్వకు గండి పెట్టి తాత్కాలికంగా తవ్విన కాల్వలోకి నీటిని వదిలారు. ఆ నీరంతా పల్లపు ప్రాంతంలోని గ్రామంలోకి చేరింది. వీధులు, ఇళ్లచుట్టూ నీరు చేరడంతో రాత్రంతా ప్రజలు భయంతో బిక్కుబిక్కుమంటూ గడిపారు. గ్రామాన్ని నీరు ముంచెత్తడంతో సర్పంచ్ ఆదివారం స్థానిక రైతులతో కలసి వెళ్లి ఎస్సారెస్పీ కాల్వకు పెట్టిన గండిని పూడ్చారు. దీంతో గ్రామంలోకి నీటి ప్రవాహం ఆగిపోయింది. -
కాలువలో ఎమ్మెల్యే పీఏ గల్లంతు
జగిత్యాలక్రైం : కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు పీఏ గిరీశ్ (38) ఎస్సారెస్పీ కెనాల్లో గల్లంతయ్యారు. ఆదివారం ఆయన జగిత్యాలకు చెందిన నలుగురు స్నేహితులతో కలసి అంతర్గాం శివారులో విందు చేసుకున్నారు. అనంతరం ఎస్సారెస్పీ కాలువలో స్నానం చేసేందుకు వెళ్లారు. అయితే నీటి ప్రవాహ వేగానికి గిరీశ్ కొట్టుకుపోయారు. ఆయనను రక్షించేందుకు స్నేహితులు ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదు. ఈ విషయం తెలుసుకున్న జగిత్యాల రూరల్ పోలీసులు, ప్రత్యేక పోలీసు బృందం ఎస్సారెస్పీ ప్రధాన కాలువ వెంట గాలింపు చర్యలు చేపట్టారు. -
ఇరవై రోజుల్లో ఎస్సారెస్పీకి కాళేశ్వరం నీళ్లు..
సాక్షి, నిజామాబాద్: మరో ఇరవై రోజుల్లో కాళేశ్వరం నీళ్లు శ్రీరాంసాగర్ జలాశయంలో పడబోతున్నాయని రాష్ట్ర రవాణా, రోడ్లుభవనాలు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రకటించారు. ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకంలోభాగంగా ఇప్పటికే జగిత్యాల జిల్లా రాంపూర్, రాజేశ్వర్‌రావుపేట్ పంప్‌హౌజ్‌ల ట్రయల్ రన్ నిర్వహించామని అన్నారు. జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు సమీపంలో ముప్కాల్ వద్ద నిర్మిస్తున్న మూడో పంప్‌హౌజ్ పనులను మంత్రి బుధవారం పరిశీలించారు. పైప్లైన్లు, గేట్లు తదితర పనుల ప్రగతిపై నీటి పారుదలశాఖ అధికారులతో సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సెప్టెంబర్ మాసంలో 30 టీఎంసీల కాళేశ్వరం నీటిని ఎస్సారెస్పీకి తరలిస్తామని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నీరు మొదటగా మిడ్‌మానేరు, ఎస్సారెస్పీకి వస్తున్నాయని, ముప్కాల్ వద్ద నిర్మిస్తున్న మూడో పంప్‌హౌజ్ పనులు పూర్తి కాకపోయినప్పటికీ., మొదటి, రెండు పంపుల ద్వారా రోజుకు 0.6 టీఎంసీల చొప్పున నీటిని తరలించేందుకు వీలు కలుగుతుందని మంత్రి స్పష్టం చేశారు. రెండు పంప్‌హౌజ్‌ల ద్వారా నీటిని తరలిస్తుండగా, నిర్మాణంలో ఉన్న మూడో పంప్‌హౌజ్‌లోకి నీళ్లు వెళ్లకుండా గేట్ల నిర్మాణం కూడా త్వరలోనే పూర్తవుతుందని చెప్పారు. కాళేశ్వరం నీటితో ఎస్సారెస్పీ కళకళలాడితే కన్నుల పండువగా ఉంటుందని, చూసి తరించి పోవాలని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. 200 కిలోమీటర్ల కింది కాళేశ్వరం వద్ద నుంచి గోదావరి నదిని మళ్లిస్తూ రూ.1,060 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టు మహా అద్భుతమైనదని వ్యాఖ్యానించారు. నిజామాబాద్, కరీంగనర్, వరంగల్, నల్గొండ, ఖమ్మం ఉమ్మడి జిల్లాల రైతాంగం ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రాజెక్టును చేపట్టినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఇంజనీరింగ్ చరిత్రలో ఈ రివర్స్ పంపింగ్ పథకం ఓ వండర్లా నిలిచిపోతుందని అన్నారు. ఎస్సారెస్పీ వరద కాలువ ఏడాదంతా నిండుకుండలా ఉండే అవకాశం ఉన్నందున కాలువకు ఇరువైపులా సమీపంలోని చెరువులను నింపేందుకు వీలుగా తూముల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని నీటిపారుదలశాఖ అధికారులను ఆదేశించారు. ఎస్సారెస్పీ రివర్స్ పంపింగ్ పనులు త్వరలో పూర్తవుతున్న నేపథ్యంలో ఏయే చెరువులను నింపవచ్చో స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి క్షేత్రస్థాయి పరిశీలన జరపాలన్నారు. ఇప్పటికే 15 తూములు ఏర్పాటు చేయాలని నిర్ణయించినందున మరిన్ని ఏర్పాట్లకు చర్యలు చేపట్టాలని సూచించారు. ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకంలో భాగంగా వరద కాలువ జీరో పాయింట్ వద్ద రూ.420 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న మూడో పంప్‌హౌజ్ పనులను మంత్రి బుధవారం పరిశీలించారు. తదనంతరం పనులు జరుగుతున్న స్థలంలోనే నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్ ఉన్నతాధికారులతో అక్టోబర్ మాసంలో మోటార్ల పనులన్నీ పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. డిసెంబర్లో ట్రయల్ రన్ నిర్వహిస్తామని పేర్కొన్నారు. -
‘సీతారామ’లో ముందడుగు
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి ఖమ్మం జిల్లా సాగు, తాగు అవసరాలు తీర్చేందుకు ఉద్దేశించిన సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణంలో కీలక ముందడుగు పడింది. కేంద్ర అటవీ మరియు పర్యావరణ మం త్రిత్వ శాఖ ప్రాజెక్టుకు అవసరమైన తుది పర్యావరణ అనుమతికి పచ్చజెండా ఊపింది. ఈ మేరకు పర్యావరణ మంత్రిత్వ శాఖ డైరెక్టర్ డాక్టర్ యస్.కర్కెట్ట అనుమతుల మంజూరుకు సంబంధించి ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ వి.సుధాకర్‌కు మంగళవారం లేఖ పం పించారు. గతేడాది నవంబర్ 27న జరిగిన ఎన్విరాన్మెంటల్ అప్రైజల్ కమిటీ (ఈఏసీ) సమావేశంలో సీతారామ ప్రాజెక్టుకు తుది పర్యావరణ అనుమతిని మంజూరు చేయాలని ఈ ప్రాజెక్టు అధికారులు కేంద్ర పర్యావరణ శాఖకు సిఫారసు చేసిన సంగతి తెలి సిందే. వారి సిఫారసు మేరకు పర్యావరణ మంత్రిత్వ శాఖ తుది అనుమతిని జారీ చేసింది. పనులకు తొలగిన అడ్డంకి దుమ్ముగూడెం ఆనకట్ట నుండి గోదావరి నీటిని తరలించి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబా బాద్ జిల్లాల్లో 1,33,085 హెక్టార్ల కొత్త ఆయకట్టుకు మరియు 1,39,836 హెక్టార్ల స్థిరీకరణ చేసేలా సీతారామ ప్రాజెక్టు చేపట్టారు. ఆ ప్రాజెక్టుతో 3 జిల్లాల్లో 180 గ్రామాలకు ప్రయోజనం చేకూరుతోంది. ఈ ప్రాజెక్టు ద్వారా ఆయకట్టుకు నీరు అందించడంతో పాటు దారి పొడుగునా చిన్న నీటి చెరువులను నింపడం, పూర్తయిన ప్రాజెక్టులకు నీటి సరఫరా చేసేలా డిజైన్ చేశారు. ప్రాజెక్టులో భాగంగా దుమ్ముగూడెం ఆనకట్ట వద్ద ఒక హెడ్ రెగ్యులేటర్‌ని, 372 కిలోమీటర్ల కాలువ తవ్వకం, 4 పంప్‌హౌజ్‌ల నిర్మాణం, డెలివరీ సిస్టర్న్ నిర్మాణం, 9 కిలోమేటర్ల పైప్ లైన్, వాగులపై క్రాస్ డ్రైనేజ్ స్ట్రక్చర్, టన్నెల్స్, కాలువలపై క్రాస్ రెగ్యులేటర్లు మరియు తూముల నిర్మాణం చేపట్టనున్నారు. ఈ నిర్మాణాలకు మొత్తంగా 8,476 హెక్టార్ల భూమి అవసరం ఉండగా అందులో 1,531 హెక్టార్ల అటవీ భూమి ఉంది. ఈ భూముల వినియోగానికి పర్యావరణ అనుమతి తప్పనిసరి. ప్రాజెక్టుకు తుది పర్యావరణ అనుమతి పొందేందుకు గత ఆగ స్టులో మూడు జిల్లాల్లో ప్రజాభిప్రాయ సేకరణ జరిపారు. ఈ అభిప్రాయ సేకరణ వివరాలతో కూడి న నివేదికను సాగునీటి శాఖ ఈఏసీకి సమర్పించగా, అన్ని పరిశీలించిన ఈఏసీ శాఖ అధికారులు.. ఇచ్చిన వివరణలపై సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రాజెక్టుకు తుది పర్యావరణ అనుమతి మంజూరు చేయాలని కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖకు సిఫారసు చేశారు. వారి సిఫారసు మేరకు పర్యావరణ ప్రభావ అంచనా నోటిఫికేషన్ – 2006కి లోబడి మంత్రిత్వ శాఖ ఈ నెల 7న తుది పర్యావరణ అనుమతులు మంజూరు చేస్తూ ప్రాజెక్టు చీఫ్ ఇంజనీరుకు లేఖ రాసింది. ఈ అనుమతి పదేళ్ళ వరకు మనుగడలో ఉంటుందని లేఖలో పేర్కొంది. వచ్చే ఖరీఫ్ నాటికే తొలి ఫలితాలు ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయం రూ.13,384.80 కోట్లు కాగా, ప్రభుత్వం ఈ ప్రాజెక్టును మూడేళ్లల్లో పూర్తి చేయడానికి ప్రణాళికలు సిద్దం చేసింది. తొలి ఫలితాలు మాత్రం ఈ జూన్, జూలై నాటికి పొందేలా కార్యాచరణ రూపొందించింది. ప్రాజెక్టుల పరిధిలోమూడు పంప్‌హౌజ్‌ల నిర్మాణం చేయనుండగా ఇం దులో మొదటి పంప్‌హౌజ్‌ను జూన్, జూలై నాటికి, రెండో పంప్‌హౌజ్‌ను ఆగస్టు, సెప్టెంబర్ నాటికి, మూడో పంప్‌హౌజ్‌ను అక్టోబర్, నవంబర్‌నాటికి పూర్తి చేసేలా సోమవారం జరిగిన సమీక్ష సందర్భంగా కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. నాగార్జునసాగర్ పరిధిలో ఖమ్మం జిల్లాలో నీళ్లందని ఆయకట్టుకు సీతారామ ద్వారా వచ్చే ఖరీఫ్‌లోనే నీళ్లందించాలని సూచించారు. దీనికోసం 130 కిలోమీటర్ల కాల్వల తవ్వకాన్ని వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కాల్వల తవ్వకం పూర్తయితే.. అవసరమైన చోట తూములు ఏర్పాటు చేసి సాగర్ కింది కాల్వలకు కలపాలని, వీలైనన్ని ఎక్కువ చెరువులు నిలపాలని సైతం సీఎం సూచించినట్లుగా తెలిసింది. ఫలించిన కేసీఆర్ దౌత్యం కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర పర్యావరణ మంత్రి హర్షవర్ధన్ని కలిసి ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతిని మంజూరు చేయాలని కోరారు. అనంతరం మంత్రి హర్షవర్ధన్ హైదరాబాద్ వచ్చిన సందర్భంగానూ ఈ అంశాన్ని కేసీఆర్ మరోసారి లేవనెత్తారు. ఈ దౌత్యం ఫలించి అనుమతులు మంజూరయ్యాయని అధికారులంటున్నారు. పర్యావరణ అనుమతిని మంజూరు చేసినందుకు కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌కు ధన్యవాదాలు తెలిపారు. -
కాకతీయ కెనాల్‌కు భారీ గండి
గొల్లపల్లి (ధర్మపురి): కాకతీయ మెయిన్ కెనాల్‌కు బుధవారం భారీ గండి పడింది. దీంతో పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. సుమారు 2 వేల ఎకరాల్లో పంట నీట మునిగింది. కట్టలు తెగిపోయే ప్రమాదం నెలకొనడంతో అధికారులు ఇసుక బస్తాలతో పూడ్చివేశారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం భీమన్నగుడి వద్ద ఎస్సారెస్పీ కాకతీయ మెయిన్ కెనాల్‌కు 88.66కి.మీల రాయి (యూటీ) వద్ద భారీ గండి పడింది. నీటి ప్రవాహం బీబీరాజ్‌పల్లి, శ్రీరాములపల్లి, శంకర్రావుపేట, మల్లన్నపేట, వెంగళాపూర్, నందిపల్లి గ్రామాలను ముంచెత్తింది. నీటి ఉధృతికి శ్రీరాములపల్లి పెద్ద చెరువు, చిన్నచెరువు నిండి తెగిపోయే పరిస్థితికి చేరగా.. రెవెన్యూ అధికారులు గ్రామస్తులను అప్రమత్తం చేసి ఇసుక బస్తాలతో పూడ్చి వేయించారు. చెరువు కట్టకు గండికొట్టారు. ఆ నీరు శంకర్రావుపేట చెరువునూ నింపేసింది. ఆ చెరువు కూడా నిండిపోవడంతో అధికారులు జేసీబీతో కట్టకు గండిపెట్టారు. అక్కడి నుంచి వరదనీటిని మల్లన్నపేట గుడి చెరువు మీదుగా.. వెంగళాపూర్, నందిపల్లి మధ్య బ్రిడ్జి నుంచి శెకల్లవాగుకు మళ్లించారు. శ్రీరాములపల్లి, బీబీరాజ్‌పల్లి, శంకర్రావుపేటకు రాకపోకలు నిలిచిపోయాయి. మరమ్మతులు చేపట్టకపోవడంతోనే.. ఎస్సారెస్పీ ప్రధాన కాలువకు చాలా ఏళ్లుగా మరమ్మతు చేపట్టకపోవడంతో శిథిలావస్థకు చేరింది. కరీంనగర్ శివారు ఎల్ఎండీని నింపేందుకు ఈ నెల 22న కాకతీయ కాలువ ద్వారా 8 వేల క్యూసెక్కుల నీరు వదిలారు. ఆ నీటి ఉధృతికి గండిపడింది. -
నీళ్లిచ్చి మా పంటల్ని బతికించండి: రైతులు
సాక్షి, కరీంనగర్: రైతు శ్రేయస్సే తమకు ముఖ్యమని చెప్పుకునే తెలంగాణ ప్రభుత్వం తమ పంటలు నీళ్లు లేక ఎండిపోతున్నా పట్టించుకోవడం లేదంటూ రైతులు ఆందోళనబాట పట్టారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల వద్ద జగిత్యాల-కరీంనగర్ రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. ఎల్లంపల్లి నీటిని ఎస్సారెస్పీ వరద కాలువకు విడుదల చేసి ఎండుతున్న పంటల్ని కాపాడాలని కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి సుద్దాల దేవయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ధర్నా నిర్వహిస్తున్న ప్రదేశానికి చేరుకున్న పోలీసులు సుద్దాల దేవయ్య, మేడిపల్లి సత్యం, గజ్జెల కాంతం తదితరుల్ని అరెస్టు చేశారు. రాస్తారోకో కారణంగా జగిత్యాల-కరీంనగర్ రూట్లో ట్రాఫిక్ భారీగా జామ్ కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. -
ముగిసిన కేసీఆర్ ప్రాజెక్ట్‌ల సందర్శన
సాక్షి, హైదరాబాద్ : ఉత్తర తెలంగాణాలో ముఖ్యమంత్రి కేసిఆర్ చేపట్టిన ప్రాజెక్టుల సందర్శన ముగిసింది. మూడు రోజులపాటు ఐదు జిల్లాల్లో కాళేశ్వరం ప్రాజెక్టుతోపాటు ఎస్సారెస్పీ పునర్జీవ పనులను ప్రత్యక్షంగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇద్దరు మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి సీఎం రెండు హెలికాప్టర్లలో పర్యటించి నాలుగు బ్యారేజీలు, ఏడు పంప్ హౌజ్ లు, రెండు అండర్ టన్నెల్, సర్జిపూల్, సబ్ స్టేషన్ పనులు పరిశీలించారు. మిడ్ మానేర్ ప్రాజెక్టు పనులను ఏరియల్ సర్వే చేసిన ముఖ్యమంత్రి శనివారం ప్రాజెక్టు పనుల పురోగతిపై హైదరాబాద్‌ని ప్రగతి భవన్లో సమీక్ష నిర్వహించనున్నారు. కాగా ముఖ్యమత్రి తొలిరోజు జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల్లోని పలు బ్యారేజీలు, పంప్ హౌజ్ పనులు పరిశీలించారు. రెండో రోజు పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపిసిలో తెలంగాణ విద్యుత్ కేంద్రం తొలిదశ 1600 మెగావాట్ల రెండు ప్లాంట్ల పనులను పర్యవేక్షించారు. అక్కడి నుంచి నేరుగా ధర్మారం మండలం నంది మేడారానికి చేరుకుని కాళేశ్వరం ప్రాజెక్టులో 6వ ప్యాకేజి పంప్ హౌజ్, టన్నెల్ పనులు పరిశీలించారు. మేడిగడ్డ నుంచి వరదకాలువ ద్వారా నీటిని తరలించేందుకు ఏడు పంపులకు గాను వచ్చే జూన్ వరకు రెండు పంపులు, డిసెంబర్ నాటికి మిగతావి సిద్ధం చేస్తామని అధికారులు తెలిపారు. -
ఐదు వేల ఎకరాల్లో మామిడి మొక్కలు
ఎస్సారెస్పీ, దేవాదుల కాలువల పక్కన నాటేందుకు కార్యాచరణ మహిళా గ్రూపులకు పరిరక్షణ బాధ్యత అంగన్వాడీ వాకిట్లో మూడు చెట్లు కలెక్టర్ వాకాటి కరుణ ప్రణాళిక సాక్షిప్రతినిధి, వరంగల్ : హరితహారం కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. హరితహారం అమలుతీరును ప్రజాప్రతినిధులు, అధికారుల పనితీరుకు కొలమానంగా భావిస్తామని చెబుతోంది. ఈ కార్యక్రమాన్ని జిల్లా యంత్రాంగం సైతం అదే స్థాయిలో అమలు చేస్తోంది. ప్రస్తుత సీజన్లో జిల్లా వ్యాప్తంగా నాలుగు కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆగస్టు ఒకటి వరకు 2.04 కోట్ల మొక్కలు నాటారు. లక్ష్యం మేరకు మొక్కలు నాటే కార్యక్రం కొనసాగిస్తూనే... జిల్లా కలెక్టరు వాకాటి కరుణ వినూత్న ప్రణాళిక రూపొందించారు. సాగునీటి ప్రాజెక్టుల కాలువల వెంట ఉన్న ప్రభుత్వ భూములలో మామిడి మొక్కలను పెంచాలని నిర్ణయించారు. జిల్లా వ్యాప్తంగా ఐదు వేల మామిడి మొక్కల పెంపకం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. మొదటి దశలో 400 ఎకరాల్లో మామిడి మొక్కల పెంపకం చేపట్టనున్నారు. మామిడి మొక్కల పెంపకం బాధ్యతను ఆయా ప్రాంతాల్లోని స్వయం సహాయ మహిళా సంఘాలకు అప్పగించనున్నారు. మొక్కలు పెరిగిన తర్వాత వచ్చే మామిడి పళ్ల సేకరణ, అమ్మకం వ్యవహారాలు మహిళా సంఘాలకే అప్పగిస్తారు. ఆర్థికపరమైన అంశాల్లో మహిళా సంఘాలకు ఇబ్బందులు రాకుండా ఉండేందుకు దీనిపై అధికారికంగా నిర్ణయం తీసుకోనున్నారు. శ్రీరాంసాగర్(ఎస్పారెస్పీ), దేవాదుల ప్రాజెక్టుల నీటి సరఫరా కోసం జిల్లా వ్యాప్తంగా కాలువులను నిర్మించారు. కాలువల నిర్మాణం కోసం సాగునీటి శాఖ భూములను సేకరించింది. కాలువల నిర్మాణం తర్వాత రెండు వైపులా సాగునీటి శాఖ భూములు జిల్లా వ్యాప్తంగా వందల ఎకరాల్లో ఉన్నాయి. ఏడాదిలో కనీసం మూడు నెలలు ఈ కాలువల్లో నీటి ప్రవాహం ఉంటుంది. ఈ నేపథ్యంలో కాలువలకు ఇరువైపులా ఉండే సాగునీటి శాఖ భూములలో మామిడి మొక్కలను పెంచాలని జిల్లా కలెక్టరు ప్రణాళిక సిద్ధం చేశారు. తొలి దశలో గ్రేటర్ వరంగల్ పరిధిలోని ఎస్సారెస్పీ కాలువ వెంట ఉన్న 100 ఎకరాల భూముల్లో మొక్కలు నాటనున్నారు. వారం రోజుల్లో ఈ పని పూర్తి చేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అనంతరం గ్రేటర్ వరంగల్‌ను ఆనుకుని ఉన్న ప్రాంతాల్లోని కాలువల వెంట 300 ఎకరాల్లో మామిడి మొక్కలను నాటనున్నారు. ఐదు వేల ఎకరాలు లక్ష్యం : వాకాటి కరుణ, జిల్లా కలెక్టరు సాగునీటి కాలువల నిర్మాణం కోసం సేకరించిన భూములో కొంత స్థలంలోనే నిర్మాణాలు ఉంటాయి. కాలువులకు రెండు వైపులా సాగునీటి శాఖ భూములు ఉన్నాయి. హరితహారం కార్యక్రమంలో భాగంగా ఈ భూముల్లో మామిడి మొక్కలు నాటాలని ప్రణాళిక సిద్ధం చేశాం. తొలిదశలో వరంగల్ నగరంలోని కాలువలకు పక్కన ఉన్న 100 ఎకరాల్లో మామిడి మొక్కలు నాటుతాం. దశల వారీగా లక్ష్యాన్ని పూర్తి చేస్తాం. సాగునీటి శాఖ దీంట్లో క్రియాశీలంగా వ్యవహరిస్తుంది. అంగన్వాడీ వాకిట్లో మూడు చెట్లు మహిళా, శిశు సంక్షేమంలో ప్రధానమైన అంగన్వాడీ కేంద్రాలకు హరితహారంతో కొత్త కళను సంతరించే ప్రయత్నం జరుగుతోంది. అంగన్వాడీ కేంద్రాల్లో ప్రత్యేకమైన మొక్కలు నాటాలని జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ నిర్ణయించారు. మొక్కల పెంపకానికి అనువైన స్థలం ఉన్న కేంద్రాలన్నింటిలో మునగ, కరివేప, నిమ్మ మొక్కలు పెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అవసరమైన మొక్కలను సేకరించే ప్రక్రియ జరుగుతోంది. మొక్కలు రాగానే అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో ఒకేరోజు ఈ మూడు రకాల మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించనున్నారు. మహిళలు, పిల్లల్లో పోషకాహార లోపాలను నివారించే లక్ష్యంతో ఏర్పాౖటెన అంగన్వాడీ కేంద్రాల ఆవరణలో పోషకాలు ఉండే మొక్కలను పెంచడం వల్ల భవిష్యత్తులో ఉపయోగాలు ఉంటాయని భావిస్తున్నారు. ఇక్కడ నాటేందుకు మునగ, కరివేప, నిమ్మ మొక్కలను ఎంపిక చేసినట్లు కలెక్టర్ కరుణ ‘సాక్షి’కి తెలిపారు. 12 వేల మొక్కలను అంగన్వాడీ కేంద్రాల ఆవరణలో నాటేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. మహిళాభివృద్ధి శిశు సంక్షేమ సంస్థ(ఐసీడీఎస్)కు సంబంధించి జిల్లాలో 18 ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి పరిధిలో 4196 అంగన్వాడీ కేంద్రాలు, మరో 327 మినీ కేంద్రాలు నిర్వహిస్తున్నారు. ఈ కేంద్రాల ద్వారా గర్భిణులు, పిల్లలు కలిపి సగటున 2.18 లక్షల మంది లబ్ధిపొందుతున్నారు. గర్భిణులకు, ఆరేళ్లలోపు చిన్నారులకు పౌష్టికాహార పంపిణీ జరుగుతోంది. -
కెనాల్లో పడ్డ ఆటో
పర్వతగిరి : వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం గ్రామశివారులోని ఎస్సారెస్పీ కెనాల్లో ఆదివారం ఉదయం ఓ ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో సీతమ్మ(53), విజయమ్మ(49) అనే ఇద్దరు మహిళలు అక్కడిక్కడే మృతిచెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో ఆటోలో 12 మంది ఉన్నారు. క్షతగాత్రులను హుటాహుటిన ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కాగా వీరంతా ఓ పెళ్లికి హాజరయ్యేందుకు వెళ్తున్నట్లు సమాచారం.