సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి ఖమ్మం జిల్లా సాగు, తాగు అవసరాలు తీర్చేందుకు ఉద్దేశించిన సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణంలో కీలక ముందడుగు పడింది. కేంద్ర అటవీ మరియు పర్యావరణ మం త్రిత్వ శాఖ ప్రాజెక్టుకు అవసరమైన తుది పర్యావరణ అనుమతికి పచ్చజెండా ఊపింది. ఈ మేరకు పర్యావరణ మంత్రిత్వ శాఖ డైరెక్టర్ డాక్టర్ యస్.కర్కెట్ట అనుమతుల మంజూరుకు సంబంధించి ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ వి.సుధాకర్‌కు మంగళవారం లేఖ పం పించారు. గతేడాది నవంబర్ 27న జరిగిన ఎన్విరాన్‌మెంటల్ అప్రైజల్ కమిటీ (ఈఏసీ) సమావేశంలో సీతారామ ప్రాజెక్టుకు తుది పర్యావరణ అనుమతిని మంజూరు చేయాలని ఈ ప్రాజెక్టు అధికారులు కేంద్ర పర్యావరణ శాఖకు సిఫారసు చేసిన సంగతి తెలి సిందే. వారి సిఫారసు మేరకు పర్యావరణ మంత్రిత్వ శాఖ తుది అనుమతిని జారీ చేసింది.
పనులకు తొలగిన అడ్డంకి
దుమ్ముగూడెం ఆనకట్ట నుండి గోదావరి నీటిని తరలించి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబా బాద్ జిల్లాల్లో 1,33,085 హెక్టార్ల కొత్త ఆయకట్టుకు మరియు 1,39,836 హెక్టార్ల స్థిరీకరణ చేసేలా సీతారామ ప్రాజెక్టు చేపట్టారు. ఆ ప్రాజెక్టుతో 3 జిల్లాల్లో 180 గ్రామాలకు ప్రయోజనం చేకూరుతోంది. ఈ ప్రాజెక్టు ద్వారా ఆయకట్టుకు నీరు అందించడంతో పాటు దారి పొడుగునా చిన్న నీటి చెరువులను నింపడం, పూర్తయిన ప్రాజెక్టులకు నీటి సరఫరా చేసేలా డిజైన్ చేశారు. ప్రాజెక్టులో భాగంగా దుమ్ముగూడెం ఆనకట్ట వద్ద ఒక హెడ్ రెగ్యులేటర్‌ని, 372 కిలోమీటర్ల కాలువ తవ్వకం, 4 పంప్‌హౌజ్‌ల నిర్మాణం, డెలివరీ సిస్టర్న్ నిర్మాణం, 9 కిలోమేటర్ల పైప్ లైన్, వాగులపై క్రాస్ డ్రైనేజ్ స్ట్రక్చర్, టన్నెల్స్, కాలువలపై క్రాస్ రెగ్యులేటర్లు మరియు తూముల నిర్మాణం చేపట్టనున్నారు.
ఈ నిర్మాణాలకు మొత్తంగా 8,476 హెక్టార్ల భూమి అవసరం ఉండగా అందులో 1,531 హెక్టార్ల అటవీ భూమి ఉంది. ఈ భూముల వినియోగానికి పర్యావరణ అనుమతి తప్పనిసరి. ప్రాజెక్టుకు తుది పర్యావరణ అనుమతి పొందేందుకు గత ఆగ స్టులో మూడు జిల్లాల్లో ప్రజాభిప్రాయ సేకరణ జరిపారు. ఈ అభిప్రాయ సేకరణ వివరాలతో కూడి న నివేదికను సాగునీటి శాఖ ఈఏసీకి సమర్పించగా, అన్ని పరిశీలించిన ఈఏసీ శాఖ అధికారులు.. ఇచ్చిన వివరణలపై సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రాజెక్టుకు తుది పర్యావరణ అనుమతి మంజూరు చేయాలని కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖకు సిఫారసు చేశారు. వారి సిఫారసు మేరకు పర్యావరణ ప్రభావ అంచనా నోటిఫికేషన్ – 2006కి లోబడి మంత్రిత్వ శాఖ ఈ నెల 7న తుది పర్యావరణ అనుమతులు మంజూరు చేస్తూ ప్రాజెక్టు చీఫ్ ఇంజనీరుకు లేఖ రాసింది. ఈ అనుమతి పదేళ్ళ వరకు మనుగడలో ఉంటుందని లేఖలో పేర్కొంది.
వచ్చే ఖరీఫ్ నాటికే తొలి ఫలితాలు
ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయం రూ.13,384.80 కోట్లు కాగా, ప్రభుత్వం ఈ ప్రాజెక్టును మూడేళ్లల్లో పూర్తి చేయడానికి ప్రణాళికలు సిద్దం చేసింది. తొలి ఫలితాలు మాత్రం ఈ జూన్, జూలై నాటికి పొందేలా కార్యాచరణ రూపొందించింది. ప్రాజెక్టుల పరిధిలోమూడు పంప్‌హౌజ్‌ల నిర్మాణం చేయనుండగా ఇం దులో మొదటి పంప్‌హౌజ్‌ను జూన్, జూలై నాటికి, రెండో పంప్‌హౌజ్‌ను ఆగస్టు, సెప్టెంబర్ నాటికి, మూడో పంప్‌హౌజ్‌ను అక్టోబర్, నవంబర్‌నాటికి పూర్తి చేసేలా సోమవారం జరిగిన సమీక్ష సందర్భంగా కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. నాగార్జునసాగర్ పరిధిలో ఖమ్మం జిల్లాలో నీళ్లందని ఆయకట్టుకు సీతారామ ద్వారా వచ్చే ఖరీఫ్‌లోనే నీళ్లందించాలని సూచించారు. దీనికోసం 130 కిలోమీటర్ల కాల్వల తవ్వకాన్ని వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కాల్వల తవ్వకం పూర్తయితే.. అవసరమైన చోట తూములు ఏర్పాటు చేసి సాగర్ కింది కాల్వలకు కలపాలని, వీలైనన్ని ఎక్కువ చెరువులు నిలపాలని సైతం సీఎం సూచించినట్లుగా తెలిసింది.
ఫలించిన కేసీఆర్ దౌత్యం
కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర పర్యావరణ మంత్రి హర్షవర్ధన్‌ని కలిసి ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతిని మంజూరు చేయాలని కోరారు. అనంతరం మంత్రి హర్షవర్ధన్ హైదరాబాద్ వచ్చిన సందర్భంగానూ ఈ అంశాన్ని కేసీఆర్ మరోసారి లేవనెత్తారు. ఈ దౌత్యం ఫలించి అనుమతులు మంజూరయ్యాయని అధికారులంటున్నారు. పర్యావరణ అనుమతిని మంజూరు చేసినందుకు కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌కు ధన్యవాదాలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment