ఐదు వేల ఎకరాల్లో మామిడి మొక్కలు
-
ఎస్సారెస్పీ, దేవాదుల కాలువల పక్కన నాటేందుకు కార్యాచరణ
-
మహిళా గ్రూపులకు పరిరక్షణ బాధ్యత
-
అంగన్‌వాడీ వాకిట్లో మూడు చెట్లు
-
కలెక్టర్ వాకాటి కరుణ ప్రణాళిక
సాక్షిప్రతినిధి, వరంగల్ : హరితహారం కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. హరితహారం అమలుతీరును ప్రజాప్రతినిధులు, అధికారుల పనితీరుకు కొలమానంగా భావిస్తామని చెబుతోంది. ఈ కార్యక్రమాన్ని జిల్లా యంత్రాంగం సైతం అదే స్థాయిలో అమలు చేస్తోంది. ప్రస్తుత సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా నాలుగు కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆగస్టు ఒకటి వరకు 2.04 కోట్ల మొక్కలు నాటారు. లక్ష్యం మేరకు మొక్కలు నాటే కార్యక్రం కొనసాగిస్తూనే... జిల్లా కలెక్టరు వాకాటి కరుణ వినూత్న ప్రణాళిక రూపొందించారు. సాగునీటి ప్రాజెక్టుల కాలువల వెంట ఉన్న ప్రభుత్వ భూములలో మామిడి మొక్కలను పెంచాలని నిర్ణయించారు.
జిల్లా వ్యాప్తంగా ఐదు వేల మామిడి మొక్కల పెంపకం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. మొదటి దశలో 400 ఎకరాల్లో మామిడి మొక్కల పెంపకం చేపట్టనున్నారు. మామిడి మొక్కల పెంపకం బాధ్యతను ఆయా ప్రాంతాల్లోని స్వయం సహాయ మహిళా సంఘాలకు అప్పగించనున్నారు. మొక్కలు పెరిగిన తర్వాత వచ్చే మామిడి పళ్ల సేకరణ, అమ్మకం వ్యవహారాలు మహిళా సంఘాలకే అప్పగిస్తారు. ఆర్థికపరమైన అంశాల్లో మహిళా సంఘాలకు ఇబ్బందులు రాకుండా ఉండేందుకు దీనిపై అధికారికంగా నిర్ణయం తీసుకోనున్నారు.
శ్రీరాంసాగర్(ఎస్పారెస్పీ), దేవాదుల ప్రాజెక్టుల నీటి సరఫరా కోసం జిల్లా వ్యాప్తంగా కాలువులను నిర్మించారు. కాలువల నిర్మాణం కోసం సాగునీటి శాఖ భూములను సేకరించింది. కాలువల నిర్మాణం తర్వాత రెండు వైపులా సాగునీటి శాఖ భూములు జిల్లా వ్యాప్తంగా వందల ఎకరాల్లో ఉన్నాయి. ఏడాదిలో కనీసం మూడు నెలలు ఈ కాలువల్లో నీటి ప్రవాహం ఉంటుంది. ఈ నేపథ్యంలో కాలువలకు ఇరువైపులా ఉండే సాగునీటి శాఖ భూములలో మామిడి మొక్కలను పెంచాలని జిల్లా కలెక్టరు ప్రణాళిక సిద్ధం చేశారు. తొలి దశలో గ్రేటర్ వరంగల్ పరిధిలోని ఎస్సారెస్పీ కాలువ వెంట ఉన్న 100 ఎకరాల భూముల్లో మొక్కలు నాటనున్నారు. వారం రోజుల్లో ఈ పని పూర్తి చేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అనంతరం గ్రేటర్ వరంగల్‌ను ఆనుకుని ఉన్న ప్రాంతాల్లోని కాలువల వెంట 300 ఎకరాల్లో మామిడి మొక్కలను నాటనున్నారు.
ఐదు వేల ఎకరాలు లక్ష్యం : వాకాటి కరుణ, జిల్లా కలెక్టరు
సాగునీటి కాలువల నిర్మాణం కోసం సేకరించిన భూములో కొంత స్థలంలోనే నిర్మాణాలు ఉంటాయి. కాలువులకు రెండు వైపులా సాగునీటి శాఖ భూములు ఉన్నాయి. హరితహారం కార్యక్రమంలో భాగంగా ఈ భూముల్లో మామిడి మొక్కలు నాటాలని ప్రణాళిక సిద్ధం చేశాం. తొలిదశలో వరంగల్ నగరంలోని కాలువలకు పక్కన ఉన్న 100 ఎకరాల్లో మామిడి మొక్కలు నాటుతాం. దశల వారీగా లక్ష్యాన్ని పూర్తి చేస్తాం. సాగునీటి శాఖ దీంట్లో క్రియాశీలంగా వ్యవహరిస్తుంది.
అంగన్‌వాడీ వాకిట్లో మూడు చెట్లు
మహిళా, శిశు సంక్షేమంలో ప్రధానమైన అంగన్‌వాడీ కేంద్రాలకు హరితహారంతో కొత్త కళను సంతరించే ప్రయత్నం జరుగుతోంది. అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రత్యేకమైన మొక్కలు నాటాలని జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ నిర్ణయించారు. మొక్కల పెంపకానికి అనువైన స్థలం ఉన్న కేంద్రాలన్నింటిలో మునగ, కరివేప, నిమ్మ మొక్కలు పెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అవసరమైన మొక్కలను సేకరించే ప్రక్రియ జరుగుతోంది. మొక్కలు రాగానే అన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో ఒకేరోజు ఈ మూడు రకాల మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించనున్నారు. మహిళలు, పిల్లల్లో పోషకాహార లోపాలను నివారించే లక్ష్యంతో ఏర్పాౖటెన అంగన్‌వాడీ కేంద్రాల ఆవరణలో పోషకాలు ఉండే మొక్కలను పెంచడం వల్ల భవిష్యత్తులో ఉపయోగాలు ఉంటాయని భావిస్తున్నారు.
ఇక్కడ నాటేందుకు మునగ, కరివేప, నిమ్మ మొక్కలను ఎంపిక చేసినట్లు కలెక్టర్ కరుణ ‘సాక్షి’కి తెలిపారు. 12 వేల మొక్కలను అంగన్‌వాడీ కేంద్రాల ఆవరణలో నాటేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. మహిళాభివృద్ధి శిశు సంక్షేమ సంస్థ(ఐసీడీఎస్)కు సంబంధించి జిల్లాలో 18 ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి పరిధిలో 4196 అంగన్‌వాడీ కేంద్రాలు, మరో 327 మినీ కేంద్రాలు నిర్వహిస్తున్నారు. ఈ కేంద్రాల ద్వారా గర్భిణులు, పిల్లలు కలిపి సగటున 2.18 లక్షల మంది లబ్ధిపొందుతున్నారు. గర్భిణులకు, ఆరేళ్లలోపు చిన్నారులకు పౌష్టికాహార పంపిణీ జరుగుతోంది.