మ్యాంగో ఇన్‌స్టంట్ పికిల్, చనా మేథీ మ్యాంగో పికిల్, మామిడి తురుము పచ్చడి
మామిడి కాయల సీజన్ కదా.. ఎక్కడ చూసినా గుట్టలు గుట్టలుగా మామిడి కాయలు కనిపిస్తున్నాయి. అలాగని తొందరపడి ఆవకాయ, మాగాయ పెట్టేయకూడదు. ఎందుకంటే ఎండలు ఇంకాస్త ముదరాలి. ఎండలతోపాటే మామిడి కాయలు కూడా బాగా టెంకపట్టాలి. అప్పుడయితేనే ఏడాదంతా నిల్వ ఉంటుంది ఆవకాయ. అయితే అప్పటిదాకా చూస్తూ ఊరుకోవాలా? ఏమక్కరలేదు. ఆవకాయ పెట్టేలోగా రెండు మూడు వారాల నుంచి నెలరోజుల దాకా తాజాగా ఉండే ఈ పచ్చళ్లు ట్రై చేద్దామా మరి!
మ్యాంగో ఇన్‌స్టంట్ పికిల్..
కావలసినవి: పచ్చి మామిడికాయ – ఒకటి; కశ్మీర్ మిరప్పొడి – టేబుల్ స్పూన్; నువ్వుల నూనె– 3 టేబుల్ స్పూన్‌లు; ఆవాలు– టీ స్పూన్; మెంతులు – అర టీ స్పూన్; పసుపు – అర టీ స్పూన్; ఇంగువ – పావు టీ స్పూన్; ఉప్పు – టీ స్పూన్.
తయారీ..
- మామిడికాయను శుభ్రంగా కడిగి తుడిచి, సొన పోయేటట్లు తొడిమను తొలగించాలి. గింజను తొలగించి, తొక్కతో సహా ముక్కలు తరగాలి.
- ముక్కలకు ఉప్పు కలిపి పక్కన పెట్టాలి. సుమారు ఒక కప్పు ముక్కలు వస్తాయి.
- బాణలిలో మెంతులు వేసి (నూనె లేకుండా) దోరగా వేయించాలి.
- చల్లారిన తర్వాత మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి.
- అదే బాణలిలో నువ్వుల నూనె వేడి చేసి అందులో ఆవాలు వేసి చిటపటలాడిన తర్వాత ఇంగువ, మెంతిపొడి, మిరప్పొడి, పసుపు వేసి స్టవ్ ఆపేయాలి.
- వేడి తగ్గిన తర్వాత ఈ పోపును మామిడి ముక్కల్లో వేసి కలపాలి.
- అరగంట సేపటికి ఉప్పు, కారం, మసాలా దినుసుల రుచి ముక్కలకు పడుతుంది.
- ఈ పచ్చడిని తేమ లేని పాత్రలో నిల్వ చేసుకుంటే నాలుగు రోజుల వరకు తాజాగా ఉంటుంది.
చనా మేథీ మ్యాంగో పికిల్..
కావలసినవి: పచ్చి మామిడి ముక్కలు – కప్పు; మామిడి తురుము – కప్పు; పచ్చి శనగలు – అర కప్పు; మెంతులు – అర కప్పు; ఆవాలు›– అర కప్పు; ఉప్పు – అర కప్పు; మిరప్పొడి– అర కప్పు, నూనె – కప్పు.
తయారీ..
- మందపాటి బాణలి వేడి చేసి పచ్చి శనగపప్పును దోరగా వేయించి పక్కన పెట్టాలి.
- ఆ తర్వాత మెంతులు, ఆవాలను (నూనె లేకుండా) వేయించి చల్లారిన తర్వాత పొడి చేసుకోవాలి.
- ఒక పాత్రలో మామిడి ముక్కలు, మామిడి తురుమును వేయాలి.
- అందులో శనగలు, మెంతిపొడి, ఆవపిండి, మిరప్పొడి, ఉప్పు, పసుపు వేసి కలపాలి.
- ఈ మిశ్రమాన్ని తడిలేని సీసాలో కూరినట్లు పెట్టి గట్టిగా మూతపెట్టాలి.
- మూడు రోజుల తర్వాత నూనెను మరిగించి చల్లార్చిన తర్వాత ఆ నూనెను సీసాలో ఉన్న మిశ్రమం పై నుంచి పోయాలి.
- ఈ పచ్చడిని మూడు రోజుల తర్వాత తినవచ్చు.
- నెల రోజుల పాటు తాజాగా ఉంటుంది. ఇది గుజరాతీ శైలి మామిడి పచ్చడి.
మామిడి తురుము పచ్చడి..
కావలసినవి: మామిడి తురుము – 2 కప్పులు; మిరప్పొడి– పావు కప్పు; ఉప్పు – పావు కప్పు; ఆవ పిండి– టేబుల్ స్పూన్; మెంతిపిండి– టేబుల్ స్పూన్; వెల్లుల్లి రేకల తురుము – టేబుల్ స్పూన్; నల్లజీలకర్ర (కలోంజి) – అర టీ స్పూన్; మెంతులు – టీ స్పూన్; ఇంగువ – అర టీ స్పూన్; ఆవ నూనె – పావు కప్పు; పసుపు – టీ స్పూన్; జీలకర్ర – టీ స్పూన్. తయారీ..
- మామిడి తురుములో పసుపు, ఉప్పు, వెల్లుల్లి, కలోంజి వేసి బాగా కలిపి పక్కన ఉంచాలి.
- బాణలి వేడి చేసి (నూనె లేకుండా) మెంతులు, జీలకర్ర వేయించి చల్లారిన తర్వాత మిక్సీలో పొడి చేసి మామిడి తురుములో వేసి కలపాలి.
- ఇప్పుడు మామిడి తురుములో ఆవపిండి, మెంతిపిండి, మిరప్పొడి, నూనె వేసి కలిపి ఉప్పు సరి చూసుకోవాలి.
- అవసరమైతే మరికొంత ఉప్పు కలుపుకోవచ్చు. ఇది నాలుగు రోజుల నుంచి వారం వరకు తాజాగా ఉంటుంది.
- మామిడి తురుమును పలుచని వస్త్రంలో కట్టి నీరు పోయేటట్లు చేసిన తర్వాత మసాలా దినుసులు కలిపి, నూనె పైకి తేలేటంత మోతాదులో పోసినట్లయితే ఆ పచ్చడి నెలలపాటు నిల్వ ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment