ఆషాడంలో గోరింటాకు పెట్టుకుని మురిసిపోతాం. మునగాకు తినాలని కూడా చెప్పారు పెద్దవాళ్లు. మహిళల ఆరోగ్యాన్ని సంప్రదాయాల పట్టికలో చేర్చారు. పెద్దవాళ్లు చెప్పిన పద్ధతులను పాటిద్దాం... ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.
కొబ్బరి మునగాకు వేపుడు..
కావలసినవి..
మునగాకు పావు కేజీ;
పసుపు – పావు టీ స్పూన్;
పచ్చి కొబ్బరి తురుము– పావు కప్పు;
ఉల్లిపాయ ముక్కలు– పావు కప్పు;
ఉప్పు – అర టీ స్పూన్;
మిరప్పొడి– టీ స్పూన్;
నూనె – టేబుల్ స్పూన్;
ఆవాలు– అర టీ స్పూన్;
పచ్చి శనగపప్పు – టేబుల్ స్పూన్;
వెల్లుల్లి రేకలు– 4;
కరివేపాకు– 2 రెమ్మలు.
తయారీ..
మునగాకులో పుల్లలు తీసివేసి, ఆకును శుభ్రంగా కడిగి నీరు పోయేటట్లు చిల్లుల పాత్రలో వేయాలి.
అరగంటసేపు పక్కన ఉంచాలి. బాగా ఆరిన తర్వాత ఒక పాత్రలోకి తీసుకుని అందులో కొబ్బరి తురుము, పసుపు వేసి కలపాలి.
బాణలిలో నూనె వేడి చేసి ఆవాలు, ఎండుమిర్చి, పచ్చి శనగపప్పు వేసి అవి వేగిన తర్వాత వెల్లుల్లి రేకలు, ఉల్లిపాయ ముక్కలు, మిరప్పొడి, కరివేపాకు వేసి వేయించాలి.
అవి వేగిన తర్వాత ముందుగా కలిపి సిద్ధంగా ఉంచుకున్న మునగాకు, కొబ్బరి మిశ్రమం, ఉప్పు వేసి కలిపి మూత పెట్టి సన్న మంట వేగనివ్వాలి.
మధ్యలో మూత తీసి కలుపుతూ ఆకులో పచ్చిదనం, తేమ పోయే వరకు వేగనిచ్చి ఉప్పు సరిచూసుకుని ఆపేయాలి.
మొరింగా ఆమ్లెట్..
కావలసినవి..
కోడిగుడ్లు – 2;
మునగాకు – అర కప్పు;
ఉప్పు – పావు టీ స్పూన్;
మిరియాలపొడి– పావు టీ స్పూన్;
వెన్న లేదా నెయ్యి– టేబుల్ స్పూన్.
తయారీ..
మునగాకులో పుల్లలు ఏరివేసి ఆకును శుభ్రంగా కడిగి నీరంతా పోయేటట్లు చిల్లుల పాత్రలో వేయాలి.
నీరు కారిపోయిన తర్వాత తరిగి ఒక పాత్రలో వేయాలి.
అందులో ఉప్పు, మిరియాల పొడి వేసి కలపాలి.
ఆ తర్వాత కోడిగుడ్లు కొట్టి సొనవేసి కలపాలి.
పెనం వేడిచేసి వెన్న లేదా నెయ్యి వేసి కరిగిన తర్వాత మునగాకు, కోడిగుడ్ల మిశ్రమాన్ని వేయాలి.
ఒకవైపు కాలిన తర్వాత తిరగేసి రెండోవైపు కూడా దోరగా కాలనిచ్చి స్టవ్ ఆపేయాలి.
గమనిక: కోడిగుడ్డు సొన కాలే సమయంలో మునగాకు కూడా మగ్గిపోతుంది. పచ్చివాసన వస్తుందని సందేహం ఉంటే మునగాకును పెనం మీద పచ్చివాసన పోయే వరకు వేయించి ఆ తర్వాత మిగిలిన దినుసులను కలిపి ఆమ్లెట్ వేసుకోవాలి.
ఇవి చదవండి: ఆషాఢంలో అత్తాకోడళ్లు ఒక గడప దాటకూడదా?
Comments
Please login to add a commentAdd a comment