సెలవులొచ్చేది ఆటల కోసం, స్నేహాల కోసం బంధువుల కోసం, విహారాల కోసం, వినోదాల కోసం పిల్లలు ఇంతకాలం ఫోన్లలో కూరుకుపోయారు. వారిని ఫోన్ల నుంచి బయటకు తెండి. మీ బాల్యంలో సెలవుల్లో ఎలా గడిపారో అలా గడిపేలా చేయండి. పెద్దయ్యాక తలుచుకోవడానికి బాల్యం లేకపోవడానికి మించిన విషాదం లేదు.
ఆటస్థలాలు లేని స్కూళ్లలో చదివించడం, ఆడుకునే వీలు లేని ఇళ్లలో నివసించడం, పార్కులు లేకపోవడం, ఆడుకోవడానికి తోటి పిల్లలు లేని వాతావరణంలో జీవించడం, ఇవన్నీ ఉన్నా పిల్లలతో గడిపే సమయం తల్లిదండ్రులకు లేకపోవడం... వీటన్నింటి వల్ల పిల్లలకు స్కూల్, ఇల్లు కాకుండా తెలిసింది ఒకే ఒక్కటి. సెల్‌ఫోన్. పిల్లలకు సెల్‌ఫోన్లు ఇచ్చి వారు వాటిలో కూరుకుపోతే ‘అమ్మయ్య. మా జోలికి రావడం లేదు’ అనుకునే తల్లిదండ్రులు ఉన్న ఈ కాలంలో పిల్లలకు ఆరోగ్యకరమైన ఆటలు, విహారం, అనుబంధాల విలువ, కొత్త విషయాల ఎరుక ఎలా కలుగుతుంది?
అందుకే వేసవి సెలవలు ఒక పెద్ద అవకాశం. ఇరవై ముప్పై ఏళ్ల క్రితం వరకు తెలుగు ్రపాంతాలలో వేసవి సెలవులు వస్తే పిల్లలు ఎలా గడిపేవారో ఇప్పుడూ అలా గడిపే అవకాశం కల్పించవచ్చు. కాకుంటే తల్లిదండ్రులు ప్రయత్నించాలి. పిల్లలను మోటివేట్ చేయాలి.
బంధువులు– బంధాలు..
బంధువులు ఎవరో తెలియకపోతే బంధాలు నిలవవు. ఎంత స్వతంత్రంగా జీవిద్దామనుకున్నా, సాటి మనుషుల విసిగింపును తప్పించుకుని తెగదెంపులు చేసుకుని బతుకుదామనుకున్నా మనిషి సంఘజీవి. అతడు బంధాలలో ఉండాల్సిందే. బంధాల వల్ల బతకాల్సిందే. పిల్లలకు బంధాలు బలపడేది, బంధాలు తెలిసేది వేసవి సెలవుల్లోనే. ఇంతకు ముందు పిల్లలు వేసవి వస్తే తల్లిదండ్రులను వదిలిపెట్టి పిన్ని, బాబాయ్, పెదనాన్న, తాతయ్య... వీళ్ల ఇళ్లకు వెళ్లి రోజుల తరబడి ఉండేవారు. వారి పిల్లలతో బంధాలు ఏర్పరుచుకునేవారు.
దీని వల్ల కొత్త ఊరు తెలిసేది. ఆటలు తెలిసేవి. కలిసి వెళ్లిన సినిమా అలా ఓ జ్ఞాపకంగా మిగిలేది. ఇవాళ పెద్దల పట్టింపులు పిల్లలకు శాపాలవుతున్నాయి. రాకపోకలు లేని బంధుత్వాలతో పిల్లలు ఎక్కడకూ వెళ్లలేని స్థితి దాపురించింది. దీనిని సరి చేయాల్సిన బాధ్యత పెద్దలదే. లేకుంటే పిల్లలు ఫోన్లనే బంధువులుగా భావించి అందులోని చెత్తను నెత్తికెక్కించుకుంటారు. జీవితంలో సవాళ్లు ఎదురైన సమయంలో ఒంటరితనం ఫీలయ్యి అతలాకుతలం అవుతారు.
తెలుగు ఆటలు..
సెలవుల్లో పిల్లలకు తెలుగు ఆటలు తెలియడం ఒక పరంపర. బొంగరాలు, గోలీలు, వామనగుంటలు, పరమపదసోపాన పటం, ఒంగుళ్లు–దూకుళ్లు, నేల–బండ, ఏడుపెంకులాట, పులి–మేక, నాలుగు స్తంభాలాట, వీరి వీరి గుమ్మడిపండు, లండన్ ఆట, రైలు ఆట, ΄÷డుపుకథలు విప్పే ఆట, అంత్యాక్షరి, కళ్లకు గంతలు... ఈ ఆటల్లో మజా తెలిస్తే పిల్లలు ఫోన్ ముట్టుకుంటారా?
కథ చెప్పుకుందామా..
కథలంటే పిల్లలకు ఇష్టం. పెద్దలు చె΄్పాలి గాని. ఈ సెలవుల్లో రాత్రి పూట భోజనాలయ్యాక, మామిడి పండ్లు తిన్నాక, పక్కలు వేసుకుని అందరిని కూచోబెట్టి పెద్దలు కథలు చెప్తే ఎన్నెన్ని తెలుస్తాయి! ఎన్ని ఊహల కవాటాలు తెరుచుకుంటాయి. మర్యాద రామన్న, తెనాలి రాముడు, బేతాళుడు, సింద్‌బాద్, ఆలీబాబా, పంచతంత్రం, రామాయణం, మహాభారతం... భీముడిలోని బలం, అర్జునుడిలోని నైపుణ్యం... ఇవి కదా చె΄్పాలి.
బలం కోసం తిండి..
పిల్లలను సరిగ్గా గమనించి వారికి కావలసిన బలమైన తిండి తినిపించడానికి వీలయ్యేది ఈ సెలవుల్లోనే. బలహీనంగా ఉండే పిల్లలు, ఎదిగే వయసు వచ్చిన ఆడపిల్లలకు ఏమేమి వొండి తినిపించాలో పెద్దల ద్వారా తెలుసుకున్న తల్లిదండ్రులు ఈ కాలంలో తినిపిస్తారు. శిరోజాల సంరక్షణ, చర్మ సంరక్షణ, పంటి వరుస సరి చేయించడం, జీర్ణశక్తిని ఉద్దీపన చేయడం, బంధువుల రాక వల్ల లేదా బంధువుల ఇంటికి వెళ్లడం వల్ల పిల్లలందరికీ కలిపి వారికి వృద్ధి కలిగించే ఆహారం చేసి పెట్టవచ్చు. తోటి పిల్లలు పక్కన ఉంటే ఇష్టం లేకపోయినా పిల్లలు తింటారు.
సెలవులొచ్చేది పిల్లల మానసిక, శారీరక వికాసానికి. కదలకుండా మెదలకుండా ఫోన్ పట్టుకుని కూచుని వారు ఈ సెలవులు గడిపేస్తే నింద తల్లిదండ్రుల మీదే వేయాలి... పిల్లల మీద కాదు.
ఇవి చదవండి: Indian Navy Women Officers: సముద్రంపై సాహస సంతకం
Comments
Please login to add a commentAdd a comment