పెరుగుతున్న గరిష్టస్థాయి ఉష్ణోగ్రతలు
అత్యధికంగా 43.4 డిగ్రీలు
ప్రతిరోజూ ఎండలు మండిపోతున్నాయి. ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుండగా.. 40 నుంచి 45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత నమోదవుతోంది. సోమవారం 40 నుంచి 42 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు అల్లాడిపోయారు. ఇకపై ఈ ఎండ తీవ్రత మరింత ఎక్కువయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు సూచిస్తున్నారు. అందుకు తగు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఎంతగానో ఉంది.
ఎండ తీవ్రత ఇలా..
ఈ ఏడాది వేసవిలో ఉష్ణోగ్రతలు కొంత హెచ్చతగ్గులతో కొనసాగుతున్నాయి. ఫిబ్రవరి నుంచి ఎండల తీవ్రత ప్రారంభం కాగా.. మార్చి ఆరంభంలో 32 నుంచి 34 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత నమోదు కావాల్సి ఉన్నా ఈసారి మాత్రం 35 నుంచి 39 డిగ్రీల మధ్య నమోదైంది. మునుపెన్నడూ లేని విధంగా రాష్ట్రవ్యాప్తంగా పోలిస్తే జిల్లాలోనే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
మార్చి మూడో వారానికి 40 డిగ్రీలు దాటగా, ఏప్రిల్ మొదటి వారంలో మరింతగా పెరిగాయి. ఏప్రిల్ 7న కొన్ని చోట్ల 44.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకాగా.. ఆతర్వాత మధ్యలో అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఉష్ణోగ్రత కాస్త తగ్గుముఖం పట్టింది. మళ్లీ ఈనెల రెండో వారం నుంచి సగటున 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుండడం ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది.
కాగా, ఇప్పటికే వడదెబ్బల ఘటనలు చోటుచేసుకున్నాయి. వాతావరణంలో ఎలాంటి మార్పు లేకుండడంతో రాబోవు ముందు రోజులు ఎండ తీవ్రత పెరిగే అవకాశంఉందని, తగిన జాగ్రత్తలో పాటు, ఆరోగ్యం విషయంలో ఎప్పటికప్పుడు వైద్యులని సంప్రదించాలని వాతావరణశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment