
ఆమె పేరు స్ఫూర్తిరావు..
పుట్టుకతో వచ్చిన గాత్రానికి దైవదత్తమైన సంగీతాన్ని చేర్చి రాణించిన కళాకారిణి! పదేళ్ల క్రితమే ‘సూపర్ సింగర్ జూనియర్ -4’ పోటీ విజేత!
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన విదుషీమణులు రంజని, గాయత్రీల శిష్యురాలు!
ఎన్నో చోట్ల కచేరీలు చేసింది... భగవంతుడికి భక్తిపూర్వకంగా నాలుగు రాగాలు ఆలాపించింది.
అలాంటి స్ఫూర్తి రావు .. భజనచేస్తూ వీధుల వెంబడి భిక్షాటన చేస్తున్న ఓ కళాకారుడి గొంతు విని... వచ్చిన పని వదిలేసి ఆతడి వెంట పరుగులు పెట్టడం..
శ్రీ వాదిరాజ తీర్థ విరచిత కళాకృతి ‘ఒందు బారి’ పాటలో అడిగి మరీ గొంతు కలపడం...
ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పుడు వేగంగా చక్కర్లు కొడుతోంది!
వారం రోజుల క్రితం... కర్ణాటకలోని ఉడుపి శ్రీకృష్ణ దేవస్థానం వద్ద చోటు చేసుకున్న ఈ ఘటన పూర్తి వివరాలు స్ఫూర్తి రావు మాటల్లోనే...
‘‘ఉడుపి శ్రీకృష్ణుడి దివ్య దర్శనమైంది. జీవితపు ఈ మలుపులో ఓ స్పష్టత, దారి చూపమని ఆ దేవదేవుడిని కోరుకుంటున్న (కన్నీళ్లు ఎంతకీ ఆగకున్నా...) వేళ... మిట్టమధ్యాహ్నపు ఎండల్లో మఠం వద్దనే వీధుల్లో ఓ దుకాణం నీడలో ఓ భజన వినిపించింది. అతడి గాత్రం అద్భుతంగా ఉంది. గొంతు నిండా భక్తి. ఆగలేకపోయా. వారి వద్దకు కాళ్లు వడివడిగా నడిచాయి. అబ్బురంగా వారి పాట వింటూ ఉన్నా. శ్రీ వాదిరాజ తీర్థ విరచిత ‘ఒందు బారి’ పాటను వారు పాడుతున్న తీరుకు అచ్చెరుపొందా. కలిసి పాడొచ్చా? అని అడిగి మరీ వారితో గొంతు కలిపా. (స్టార్‌హీరోను చూసి మురిసిపోయే ఫ్యాన్ లా ఉంది నా పరిస్థితి. పాటలోని పదం కమలే అంటూ తలూపారు.)
ఈ అనుభవం నాకు లభించిన ఆశీర్వాదమే. నీ మనసేం చెబుతోందో దాన్నే పాటించమని ఆ దేవదేవుడే నాకు చెప్పినట్లు అయ్యింది. నీకు సంతోషాన్ని ఇచ్చేదాన్ని వదిలేయవద్దని చెబుతూ... సంగీతంతో వచ్చే ఆనందం ఎంత అందమైందో గుర్తు చేసినట్లు అయ్యింది. ఈ ఘటన నా ఆత్మపై శాశ్వతంగా ముద్రేసుకుపోతుంది. జీవితాంతం దీన్ని కృతజ్ఞతతో మోస్తా. అంతేకాదు.. ఆ కళాకారుడితో గొంతు కలిపిన తరువాత రోజంతా సంతోషంతో పళ్లికిలిస్తూనే ఉన్నా. అదే రోజు సాయంత్రం మణిపాల్‌లో మా కాలేజీ మ్యూజిక్ ట్రిప్ కూడా అంతే అందంగా ముగిసింది.
ఈ ఘటన నా జ్ఞాపకాల్లో, గుండెలో శాశ్వతంగా రికార్డై పోయింది. కానీ.. మిత్రులు నా వెంట పరుగెత్తుకు వచ్చి ఏం జరుగుతోందో అన్న కుతూహలంతో అన్నింటినీ ఇలా కెమెరాలో బంధించినందుకు కృతజ్ఞురాలిని!!!