summer problems
-
వేసవి ఉష్ణోగ్రత పెరగనుంది.. జర జాగ్రత్త! : వాతావరణశాఖ హెచ్చరిక
ప్రతిరోజూ ఎండలు మండిపోతున్నాయి. ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుండగా.. 40 నుంచి 45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత నమోదవుతోంది. సోమవారం 40 నుంచి 42 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు అల్లాడిపోయారు. ఇకపై ఈ ఎండ తీవ్రత మరింత ఎక్కువయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు సూచిస్తున్నారు. అందుకు తగు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఎండ తీవ్రత ఇలా.. ఈ ఏడాది వేసవిలో ఉష్ణోగ్రతలు కొంత హెచ్చతగ్గులతో కొనసాగుతున్నాయి. ఫిబ్రవరి నుంచి ఎండల తీవ్రత ప్రారంభం కాగా.. మార్చి ఆరంభంలో 32 నుంచి 34 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత నమోదు కావాల్సి ఉన్నా ఈసారి మాత్రం 35 నుంచి 39 డిగ్రీల మధ్య నమోదైంది. మునుపెన్నడూ లేని విధంగా రాష్ట్రవ్యాప్తంగా పోలిస్తే జిల్లాలోనే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మార్చి మూడో వారానికి 40 డిగ్రీలు దాటగా, ఏప్రిల్ మొదటి వారంలో మరింతగా పెరిగాయి. ఏప్రిల్ 7న కొన్ని చోట్ల 44.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకాగా.. ఆతర్వాత మధ్యలో అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఉష్ణోగ్రత కాస్త తగ్గుముఖం పట్టింది. మళ్లీ ఈనెల రెండో వారం నుంచి సగటున 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుండడం ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. కాగా, ఇప్పటికే వడదెబ్బల ఘటనలు చోటుచేసుకున్నాయి. వాతావరణంలో ఎలాంటి మార్పు లేకుండడంతో రాబోవు ముందు రోజులు ఎండ తీవ్రత పెరిగే అవకాశంఉందని, తగిన జాగ్రత్తలో పాటు, ఆరోగ్యం విషయంలో ఎప్పటికప్పుడు వైద్యులని సంప్రదించాలని వాతావరణశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇవి చదవండి: వేసవిలో మనుషులకే కాదు.. పశువులకూ ఆ డేంజర్! -
ప్రమాద ఘంటికలు!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: భూగర్భ జలాలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. రోజురోజుకీ మరింతగా అడుగంటడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. దశాబ్ద కాలంలో ఈ ఏడాది నీటిమట్టం గణనీయంగా పడిపోవడం కరువుకు సంకేతాలని చెప్పవచ్చు. ఒక్క ఏడాది కాలంలోనే సుమారు ఐదు మీటర్ల లోతుకు నీటిమట్టం దిగజారి పోయింది. తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉండటంతోపాటు పెద్దఎత్తున భూగర్భ జలాలను వినియోగిస్తుండటమే ఇందుకు ప్రధాన కారణమని భూగర్భ జల శాఖ అధికారులు వివరిస్తున్నారు. ఆందోళనకరంగా.. ఈ ఏడాది జనవరి నెలాఖరు నాటికి జిల్లా సాధారణ వర్షపాతం 643.4 మిల్లీమీటర్లుకాగా.. ఇప్పటివరకు 447.8 మి.మీ వర్షపాతమే కురిసింది. అంటే 30.4 శాతం లోటు వర్షపాతం నమోదైందన్నమాట. భూగర్భ జలాలు పెరగడానికి ప్రధాన వనరు వర్షమే. అయితే ఎన్నడూ లేని విధంగా పోయినేడు కనీసం సాధారణ స్థాయిలో కూడా కురవలేదు. రోజువారీ అవసరాలు, పంటల కోసం విస్తృతంగా బోర్లపైనే జిల్లా ఆధారపడింది. ఎటువంటి రిజర్వాయర్లు, ఆనకట్టలు లేకపోవడంతో పంటల సాగుకు బోరు బావులే ఆయువుగా మారాయి. ఇలా అన్ని వైపుల నుంచి భూగర్భ జలాలపై భారం పడుతుండడం.. ఆ స్థాయిలో భూమిలోకి నీరు ఇంకే పరిస్థితులు లేకపోవడంతో భూగర్భ నీటిమట్టం పాతాళానికి చేరుకుంటోంది. జిల్లాలో 27 మండలాలు ఉండగా.. చౌదరిగూడం, కొందర్గు మండలాల్లో మాత్రమే సాధారణానికి మించి వానలు కురిశాయి. మిగిలిన 25 మండలాల్లో లోటు వర్షపాతమే. అత్యధికంగా మంచాల మండలంలో 58.6 శాతం, శంకర్పల్లి మండలంలో 53.8 శాతం, చేవెళ్లలో 49 శాతం, శంషాబాద్లో 47.4 శాతం, కొత్తూరు మండలంలో 45.6 శాతం, మహేశ్వరం మండలంలో 43.7 శాతం లోటు వర్షంపాతం నమోదైందని అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఒక్క బోరుబావిలోనూ పెరగని వైనం జిల్లాలో వివిధ ప్రాంతాల్లోని 40 బోరుబావుల్లో నీటిమట్టాన్ని జిల్లా భూగర్భశాఖ అధికారులు ఏడాది పాటు పరిశీలించగా ఆసక్తికర ఫలితాలు వచ్చాయి. ఈ బావుల్లో గతేడాది జనవరి నెలలో సగటున 12.46 మీటర్ల లోతులో నీళ్లు ఉండగా.. ఈ ఏడాది జనవరి వచ్చేసరికి నీటిమట్టం 17.37 మీటర్ల లోతుకు పడిపోయింది. అంటే ఏడాదికాలంలోనే 4.91 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. మున్ముందు ఇవే గడ్డు పరిస్థితులు ఎదురైతే పంటల విషయం పక్కనబెడితే.. తాగేందుకు కూడా నీళ్లు కూడా లభ్యంకావని అధికారులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. వాననీటి సంరక్షణే మార్గం ఆరు మండలాల్లో 20కుపైగా మీటర్ల లోతుకు, 9 మండలాల్లో 15 నుంచి 20 మీటర్ల లోతులో, 11 మండలాల్లో 10 నుంచి 15 మీటర్ల లోతులో భూగర్భ జలాలు ఉన్నాయి. 5 నుంచి 10 మీటర్ల లోతులో ఒక్క మండలంలోనూ నీటి జాడ ఉంది. ఇటువంటి దుర్భిక్ష పరిస్థితుల్లో వాననీటి ప్రణాళికాబద్ధంగా ఒడిసిపట్టడంతోపాటు విధిగా భూమిలోకి ఇంకించే చర్చలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. భారీగా వాననీటి సంరక్షణ చర్యలు చేపట్టడంతోపాటు ఉన్న నీటిని చక్కగా నిర్వహించుకుంటేనే గడ్డు పరిస్థితుల నుంచి గట్టెక్కగలం. ముఖ్యంగా మెట్ట పంటలు సాగు చేసుకోవడంతోపాటు అత్యవసరమైతే డ్రిప్, స్ప్రింక్లర్ల విధానంలో పంటలు సాగుచేసుకోవాలని జిల్లా భూగర్భ జల అధికారి చంద్రారెడ్డి పేర్కొన్నారు. -
మూగ జీవుల రోదన
► పశుగ్రాసం, నీటి కొరత కారణంగా అల్లాడిపోతున్న వైనం ► భగ్గుమంటున్న వరి గడ్డి ధరలు, కానరాని నీటి తొట్టెలు శావల్యాపురం : పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో పచ్చిక బయళ్ళు సైతం ఎండుముఖం పట్టాయి. ఎటుచూసిన ఎండిపోయిన చెత్త, ఇంకిపోయిన కుంటలు మూగజీవాలకు దర్శనం ఇస్తున్నాయి. వరి గడ్డి ధర అమాంతంగా పెరగటంతో పాడిరైతులపై ఆర్థికభారం పడుతోంది. మండలంలో 15 గ్రామ పంచాయతీల్లో 12వేల గేదెలు, 30వేల జీవాలు సూమారుగా ఉన్నాయి. పశుగ్రాసం కొరతతో యజమానులు జీవాలను దూరప్రాంతాలకు తరలిస్తున్నారు. వినుకొండ నియోజకవర్గంలో బొల్లాపల్లి మండలంలో తండా ప్రాంతాల్లో ఆవులు ఆధికంగా ఉండటంతో పశుగ్రాసం, నీటి కొరత కారణంగా తెనాలి, ఇతర ప్రాంతాలకు కుటుంబ సభ్యులతో తరలిపోతున్నారు. గతంలో వరిగడ్డి ధర ఎకరం రూ.3వేలు ఉండగా ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు నెలకొనటంతో వరిగడ్డి కొరత ఏర్పడి ట్రాక్టరు గడ్డి రూ.15 వేలు ఉంది. దానికితోడు పశుపోషకులు వివిధ ప్రాంతాలు కృష్ణా,ప్రకాశం,తదితర జిల్లాలు నుంచి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. పశుగ్రాసం కొరత కారణంగా పాలదిగుబడి తగ్గిపోతోంది. గడ్డిధరలు పెరగటంతో పాటు దాణా కట్టలు, తవుడు ధరలు విపరీతంగా పెరగటంతో పశుపోషకులపై ఆర్థిక భారం పడుతోంది. నిర్వహణ ఖర్చులు భరించలేని రైతులు ఇప్పటికే పశువులు అమ్ముకుంటున్న ఘటనలు సంభవిస్తున్నాయి. కొరవడిన ప్రభుత్వ ప్రణాళికలు: గ్రామీణ ప్రాంతాల్లో పశువులకు పశుగ్రాసానికి కొరత ఏర్పడకుండా ప్రభుత్వం ఉపాధి పథకంతో పాటు పశుసంవర్థక అధికారులతో సమన్వయంతో ప్రణాళికలు రూపొందించాల్సి ఉంది.వేసవిలో నీటి ఎద్దడిని దృష్టిలో పెట్టుకొని పశువులు ఉన్న ప్రాంతాల్లో బోరుగాని, నీటి తొట్టెలు ఏర్పాటు చేయాల్సి ఉంది.ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాటు చూపకపోవటంతో పాడిపోషకుల పరిస్థితి దయనీయంగా మారింది.ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం సమస్య పరిష్కారించలేకపోవటం శోచనీయమని రైతులు వాపోతున్నారు.