సాక్షి, రంగారెడ్డి జిల్లా: భూగర్భ జలాలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. రోజురోజుకీ మరింతగా అడుగంటడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. దశాబ్ద కాలంలో ఈ ఏడాది నీటిమట్టం గణనీయంగా పడిపోవడం కరువుకు సంకేతాలని చెప్పవచ్చు. ఒక్క ఏడాది కాలంలోనే సుమారు ఐదు మీటర్ల లోతుకు నీటిమట్టం దిగజారి పోయింది. తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉండటంతోపాటు పెద్దఎత్తున భూగర్భ జలాలను వినియోగిస్తుండటమే ఇందుకు ప్రధాన కారణమని భూగర్భ జల శాఖ అధికారులు వివరిస్తున్నారు.
ఆందోళనకరంగా..
ఈ ఏడాది జనవరి నెలాఖరు నాటికి జిల్లా సాధారణ వర్షపాతం 643.4 మిల్లీమీటర్లుకాగా.. ఇప్పటివరకు 447.8 మి.మీ వర్షపాతమే కురిసింది. అంటే 30.4 శాతం లోటు వర్షపాతం నమోదైందన్నమాట. భూగర్భ జలాలు పెరగడానికి ప్రధాన వనరు వర్షమే. అయితే ఎన్నడూ లేని విధంగా పోయినేడు కనీసం సాధారణ స్థాయిలో కూడా కురవలేదు. రోజువారీ అవసరాలు, పంటల కోసం విస్తృతంగా బోర్లపైనే జిల్లా ఆధారపడింది. ఎటువంటి రిజర్వాయర్లు, ఆనకట్టలు లేకపోవడంతో పంటల సాగుకు బోరు బావులే ఆయువుగా మారాయి. ఇలా అన్ని వైపుల నుంచి భూగర్భ జలాలపై భారం పడుతుండడం.. ఆ స్థాయిలో భూమిలోకి నీరు ఇంకే పరిస్థితులు లేకపోవడంతో భూగర్భ నీటిమట్టం పాతాళానికి చేరుకుంటోంది. జిల్లాలో 27 మండలాలు ఉండగా.. చౌదరిగూడం, కొందర్గు మండలాల్లో మాత్రమే సాధారణానికి మించి వానలు కురిశాయి. మిగిలిన 25 మండలాల్లో లోటు వర్షపాతమే. అత్యధికంగా మంచాల మండలంలో 58.6 శాతం, శంకర్‌పల్లి మండలంలో 53.8 శాతం, చేవెళ్లలో 49 శాతం, శంషాబాద్‌లో 47.4 శాతం, కొత్తూరు మండలంలో 45.6 శాతం, మహేశ్వరం మండలంలో 43.7 శాతం లోటు వర్షంపాతం నమోదైందని అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
ఒక్క బోరుబావిలోనూ పెరగని వైనం
జిల్లాలో వివిధ ప్రాంతాల్లోని 40 బోరుబావుల్లో నీటిమట్టాన్ని జిల్లా భూగర్భశాఖ అధికారులు ఏడాది పాటు పరిశీలించగా ఆసక్తికర ఫలితాలు వచ్చాయి. ఈ బావుల్లో గతేడాది జనవరి నెలలో సగటున 12.46 మీటర్ల లోతులో నీళ్లు ఉండగా.. ఈ ఏడాది జనవరి వచ్చేసరికి నీటిమట్టం 17.37 మీటర్ల లోతుకు పడిపోయింది. అంటే ఏడాదికాలంలోనే 4.91 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. మున్ముందు ఇవే గడ్డు పరిస్థితులు ఎదురైతే పంటల విషయం పక్కనబెడితే.. తాగేందుకు కూడా నీళ్లు కూడా లభ్యంకావని అధికారులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
వాననీటి సంరక్షణే మార్గం
ఆరు మండలాల్లో 20కుపైగా మీటర్ల లోతుకు, 9 మండలాల్లో 15 నుంచి 20 మీటర్ల లోతులో, 11 మండలాల్లో 10 నుంచి 15 మీటర్ల లోతులో భూగర్భ జలాలు ఉన్నాయి. 5 నుంచి 10 మీటర్ల లోతులో ఒక్క మండలంలోనూ నీటి జాడ ఉంది. ఇటువంటి దుర్భిక్ష పరిస్థితుల్లో వాననీటి ప్రణాళికాబద్ధంగా ఒడిసిపట్టడంతోపాటు విధిగా భూమిలోకి ఇంకించే చర్చలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. భారీగా వాననీటి సంరక్షణ చర్యలు చేపట్టడంతోపాటు ఉన్న నీటిని చక్కగా నిర్వహించుకుంటేనే గడ్డు పరిస్థితుల నుంచి గట్టెక్కగలం. ముఖ్యంగా మెట్ట పంటలు సాగు చేసుకోవడంతోపాటు అత్యవసరమైతే డ్రిప్, స్ప్రింక్లర్ల విధానంలో పంటలు సాగుచేసుకోవాలని జిల్లా భూగర్భ జల అధికారి చంద్రారెడ్డి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment