మూగ జీవుల రోదన
► పశుగ్రాసం, నీటి కొరత కారణంగా అల్లాడిపోతున్న వైనం
► భగ్గుమంటున్న వరి గడ్డి ధరలు, కానరాని నీటి తొట్టెలు
శావల్యాపురం : పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో పచ్చిక బయళ్ళు సైతం ఎండుముఖం పట్టాయి. ఎటుచూసిన ఎండిపోయిన చెత్త, ఇంకిపోయిన కుంటలు మూగజీవాలకు దర్శనం ఇస్తున్నాయి. వరి గడ్డి ధర అమాంతంగా పెరగటంతో పాడిరైతులపై ఆర్థికభారం పడుతోంది. మండలంలో 15 గ్రామ పంచాయతీల్లో 12వేల గేదెలు, 30వేల జీవాలు సూమారుగా ఉన్నాయి. పశుగ్రాసం కొరతతో యజమానులు జీవాలను దూరప్రాంతాలకు తరలిస్తున్నారు.
వినుకొండ నియోజకవర్గంలో బొల్లాపల్లి మండలంలో తండా ప్రాంతాల్లో ఆవులు ఆధికంగా ఉండటంతో పశుగ్రాసం, నీటి కొరత కారణంగా తెనాలి, ఇతర ప్రాంతాలకు కుటుంబ సభ్యులతో తరలిపోతున్నారు. గతంలో వరిగడ్డి ధర ఎకరం రూ.3వేలు ఉండగా ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు నెలకొనటంతో వరిగడ్డి కొరత ఏర్పడి ట్రాక్టరు గడ్డి రూ.15 వేలు ఉంది. దానికితోడు పశుపోషకులు వివిధ ప్రాంతాలు కృష్ణా,ప్రకాశం,తదితర జిల్లాలు నుంచి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. పశుగ్రాసం కొరత కారణంగా పాలదిగుబడి తగ్గిపోతోంది. గడ్డిధరలు పెరగటంతో పాటు దాణా కట్టలు, తవుడు ధరలు విపరీతంగా పెరగటంతో పశుపోషకులపై ఆర్థిక భారం పడుతోంది. నిర్వహణ ఖర్చులు భరించలేని రైతులు ఇప్పటికే పశువులు అమ్ముకుంటున్న ఘటనలు సంభవిస్తున్నాయి.
కొరవడిన ప్రభుత్వ ప్రణాళికలు: గ్రామీణ ప్రాంతాల్లో పశువులకు పశుగ్రాసానికి కొరత ఏర్పడకుండా ప్రభుత్వం ఉపాధి పథకంతో పాటు పశుసంవర్థక అధికారులతో సమన్వయంతో ప్రణాళికలు రూపొందించాల్సి ఉంది.వేసవిలో నీటి ఎద్దడిని దృష్టిలో పెట్టుకొని పశువులు ఉన్న ప్రాంతాల్లో బోరుగాని, నీటి తొట్టెలు ఏర్పాటు చేయాల్సి ఉంది.ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాటు చూపకపోవటంతో పాడిపోషకుల పరిస్థితి దయనీయంగా మారింది.ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం సమస్య పరిష్కారించలేకపోవటం శోచనీయమని రైతులు వాపోతున్నారు.