సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది కనీసం ఒక్క కొత్త రుణం కూడా రైతులకు మంజూరు కాలేదు. ఇది రాష్ట్ర చరిత్రలోనే సంచలన విషయంగా వ్యవసాయ వర్గాలు చెబుతున్నాయి. పాత బాకీలు చెల్లించిన రైతులకే రెన్యువల్స్ చేసి ఖరీఫ్ పంట రుణాలు ఇస్తున్నాయి తప్ప మిగిలినవారెవ్వరికీ ఇవ్వట్లేదు. ఇదే విషయాన్ని బ్యాంకులు గత నెలలో సర్కారుకు పంపిన పంట రుణాల నివేదికలో వెల్లడించాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా రైతుల్లో ఆందోళన మొదలైంది. భూప్రక్షాళనలో ప్రభుత్వం రైతులకు కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇంకా చాలా మందికి పాసు పుస్తకాలు ఇవ్వాల్సి ఉంది. అయితే ప్రభుత్వం పంట రుణాలకు సంబంధించి ఈసారి కొత్త నిబంధనను అమల్లోకి తెచ్చింది.
ఈ ఖరీఫ్ నుంచి కొత్త పట్టాదారు పాసు పుస్తకం తీసుకోకుండా రైతులకు రుణాలు ఇవ్వాలని బ్యాంకులను ఆదేశించింది. రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న ధరణి వెబ్‌సైట్‌లో రైతుల సమాచారం సరిచూసుకున్నాకే పంట రుణాలు ఇవ్వాలని స్పష్టం చేసింది. అయితే ఆచరణలో అది సాధ్యం కాలేదు. ధరణి వెబ్‌సైట్ ఇప్పటికీ అందుబాటులోకి రాకపోవడంతో రైతులకు రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు నిరాకరిస్తున్నాయి. దీంతో ప్రభుత్వం ఇప్పటికైనా ధరణి వెబ్‌సైట్‌తో సంబంధం లేకుండా పట్టాదారు పాసుపుస్తకం జిరాక్స్ కాపీని తీసుకొని రుణాలు ఇచ్చేలా ప్రభుత్వం ఆదేశించాలని రైతులు, వ్యవసాయాధికారులు కోరుతున్నారు.
30 శాతానికే పరిమితం..!
రాష్ట్రంలో ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం 1.08 కోట్ల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 84.56 లక్షల ఎకరాల్లో సాగైంది. అంటే 78 శాతం విస్తీర్ణంలో సాగైంది. కానీ పంట రుణం 30 శాతానికే పరిమితమైంది. ఖరీఫ్ పంట రుణాల లక్ష్యం రూ.25,496 కోట్లు. కాగా, తాజా లెక్కల ప్రకారం ఇప్పటివరకు బ్యాంకులు రూ.7,300 కోట్లే ఇచ్చాయి. సాగు విస్తీర్ణానికి, రుణాల విడుదలకు భారీ తేడా ఉంది. గత నెల 20 నాటికి పంట రుణాలు ఎన్ని ఇచ్చాయో సమగ్ర నివేదికను బ్యాంకులు ప్రభుత్వానికి సమర్పించాయి. ఆ నివేదిక ప్రకారం ఇప్పటివరకు రుణాలు తీసుకున్న రైతులంతా బాకీలు చెల్లించి రెన్యువల్ చేసుకున్నవారే. వేరే ఏ రైతుకూ కొత్తగా పంట రుణం ఇవ్వలేదని బ్యాంకు నివేదిక చెబుతోంది. భూరికార్డుల ప్రక్షాళన తర్వాత రాష్ట్రంలో 58.33 లక్షల మంది రైతులున్నారు. కానీ వారిలో 46.50 లక్షల మందికే కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు వచ్చాయి.
కొత్త రుణం ఒక్కటీ లేదు
Published Wed, Aug 8 2018 3:18 AM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment