వేసవిలో మనుషులే కాదు పశువులూ వడదెబ్బకు గురవుతాయి. నిర్లక్ష్యం చేస్తే పశువులు మరణించే ప్రమాదం ఉంది. వడదెబ్బ నివారణ గురించి పశువైద్యాధికారి సగ్గం మహేశ్ రైతులకు అందిస్తున్న సలహాలు, సూచనలు ఆయన మాటల్లోనే..
‘ఉష్ణోగ్రత పెరిగి గాలిలో తేమ తగ్గినప్పుడు పశువులు ఎక్కువగా వడదెబ్బకు గురవుతాయి. గాలి ప్రసరణ సరిగా లేకపోవడం, పశువులు షెడ్లలో ఎక్కువ సంఖ్యలో ఉండటం, నీటి సౌకర్యం అందుబాటులో లేకపోవడం, వడగాల్పుల తాకిడికి వడదెబ్బకు గురవుతాయి. తెల్లజాతి కంటె నల్లజాతి పశువులు ఎక్కువగా వడదెబ్బబారిన పడతాయి.’
వడదెబ్బ ప్రాణాంతకమే..
వేసవి కాలంలో బయటి ఉష్ణోగ్రత పశువుల శరీర ఉష్ణోగ్రత కన్నా ఎక్కువైనప్పుడు మెదడులోని హైపోథాలమస్ స్వేద గ్రంథులపై నియంత్రణ కోల్పోతుంది. దీంతో చర్మంపై గల స్వేద రంధ్రాలు చెమటను అధికంగా విడుదల చేసి శరీరంలోని ఎలక్ట్రోలైట్లను కోల్పోయి శరీర పక్రియ మందగిస్తుంది. తద్వారా శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. శ్వాస, గుండె, నాడి వేగం పెరుగుతాయి. మూత్ర పిండాలు సరిగా పనిచేయకపోవడంతో మూత్ర విసర్జన కుంటు పడుతుంది. పశువుల ఆరోగ్య పరిస్థితి విషమించి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోతాయి. శ్వాస ఆడక మరణిస్తాయి.
నివారణకు ముందస్తు చర్యలు..
వేసవిలో ముఖ్యంగా పశువులను పగటి వేళలో మేతకు వదలరాదు. ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రమే బయటకు పంపాలి. తాగునీరు అన్నివేళలా అందుబాటులో ఉంచాలి. పశువులను రోజుకు కనీసం రెండుసార్లు చల్లని నీళ్లతో కడగాలి. చెరువులు, కుంటల్లో ఈద నివ్వాలి. గాలి వెలుతురు ప్రసారమయ్యేలా ఎత్తయిన కొట్టాలను గడ్డితో నిర్మించాలి. రేకులు ఉంటే మధ్యాహ్నం వేళల్లో వరిగడ్డి పరిచి నీరు చల్లాలి.
వేసవిలో దాహంతో ఉన్న పశువులు కలుషిత నీరు తాగకుండా జాగ్రత్త వహించాలి. షెడ్డుపై వరిగడ్డివేసి మధ్యాహ్నం వేళ్లలో నీరివ్వాలి. షెడ్ల నిర్మాణం తూర్పు, పడమర దిశలలోనే జరగాలి. దీనివల్ల వడ గాల్పుల నుంచి, తూర్పు, పడమర ఎండల నుంచి రక్షణ లభిస్తుంది. పాడి గేదెలకు ఉదయం, సాయంత్రం పాలు పితికేటప్పుడు పొదుగును చల్లని నీటిలో కడగాలి. పశువులకు గోమార్లు లేకుండా చూసుకోవాలి. పరిశుభ్రమైన నీరు ఎల్లవేళలో అందుబాటులో ఉంచాలి.
వడదెబ్బ లక్షణాలు..
- వడదెబ్బ తగిలిన పశువుల శరీర ఉష్ణోగ్రత 103 డిగ్రీల ఫారన్ హీట్ కన్నా ఎక్కువగా ఉంటుంది.
- చర్మ సున్నితత్వం కోల్పోయి గట్టిపడుతుంది.
- పశువులు సరిగ్గా నడవలేక తూలుతూ పడుకోవడానికి ప్రయత్నిస్తాయి.
- నీడ కోసం చెట్ల కిందకు చేరుతాయి.
- అధిక దాహం ఉంటుంది.
- శరీర ఉష్ణోగ్రత 104 ఫారన్హీట్ దాటితే శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది.
- ఫిట్స్ లక్షణాలతో క్రమంగా అపస్మారక స్థితిలోకి వెళ్లి మరణిస్తాయి.
- శరీర ఉష్ణోగ్రత 109 డిగ్రీలు దాటితే ప్రాణపాయం సంభవిస్తుంది.
- వడదెబ్బ ప్రభావంతో చూలు పశువుల్లో గర్భస్రావం జరిగే ప్రమాదం ఉంది.
- పశువుల్లో పునురుత్పత్తి ప్రక్రి య కుంటుపడుతుంది.
- పాడి పశువుల్లో పాల ఉత్పత్తి బాగా తగ్గిపోతుంది.
చికిత్స ఇలా..
వడదెబ్బకు గురైన పశువులను వెంటనే చల్లని గాలి వీచే ప్రాంతానికి మార్చాలి. శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థాయికి తీసుకరావడానికి పలుమార్లు కడగాలి. తాగు నీటిని అందుబాటులో ఉంచాలి. వెంటనే పశువైద్య సిబ్బందికి సమాచారం ఇవ్వాలి. వైద్యుల పర్యవేక్షణలో శరీర ఉష్ణోగ్రతలు తగ్గించడానికి ఇంజెక్షన్లు వేయించాలి. రక్తంలోకి సైలెన్ ద్వారా గ్లూకోజు, ఎలక్ట్రోలైట్స్ అందిస్తే నీరసం నుంచి పశువులు బయటపడతాయి.
- సగ్గం మహేశ్, పశువైద్యాధికారి
Comments
Please login to add a commentAdd a comment