చిన్నారుల పాలిట యమపాశం సెల్ ఫోన్
తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి
పిల్లల పెరుగుదలను కబళిస్తోన్న స్మార్ట్ ఫోన్లు
ఇటీవల పరిస్థితులను గమనిస్తే చిన్నారుల నుంచి మొదలుకొని పండు ముదుసలి వరకు సెల్ ఫోన్ వాడనీ వారు లేరేమో. సంవత్సరంలోపు పిల్లలు గుక్కపట్టి ఏడిస్తే కన్నతల్లి దగ్గరకు తీసుకొని పాలు తాగించేది. భయంతో ఏడిస్తే నేనున్నానే భరోసాను నింపుతూ ఎత్తుకుని లాలించేది. గోరుముద్దలు తినిపిస్తూ జోలపుచ్చే ది. కానీ ప్రస్తుతం ఇవేవీ కనిపించడం లేదు. ఆప్యాయతలు, ప్రేమానురాగాలు కనుమరు గయ్యాయి. పిల్లవాడు మారం చేస్తేచాలు సెల్ ఫోన్ చేతిలో పెడితే ఏడుపు ఆగిపోతుంది. సెల్ ఫోన్ మన జీవతంలో ఎంత దూరం వరకు వెళ్లిందో గమనిస్తున్నామా అనిపిస్తుంది.
ప్రస్తుతం ఎవరి చేతిలో చూసినా స్మార్ట్ ఫోన్లు దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం పరిస్థితులను గమనిస్తే ఇంటిలో ఏది ఉన్నా లేక పోయినా స్మార్ట్ ఫోన్లు మాత్రం ఇంటిలో కనీస ఒక్కరికి ఉంటుంది. అదృష్టమో, దురదృష్టమో కానీ స్మార్ట్ ఫోన్ నేడు మానవ జీవతంలో ఒక భాగమైంది. చేతిలో స్మార్ట్ ఫోన్లు ఉంటే చాలు అందలమెక్కేసినట్లుగా భావిస్తున్నారు. జనం నాలుగో జనరేషన్ టెక్నాలజీ పుణ్యమా అని స్మార్ట్ ఫోన్లు మరింత స్మార్ట్ గా జనానికి చేరువైపోయింది.
అవసరం కోసం మొదలై సౌకర్యంగా అలవాటై చివరికి ఫోన్ కి బానిసలుగా మారే ప్రమాదకరం ఏర్పాడింది. స్మార్ట్ ఫోన్ల విషయంలో నియంత్రణ చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. పేరెంట్స్ ఇద్దరు ఉద్యోగస్తులు అయిన ఇళ్లల్లో ఇలాంటి సమస్య ఎక్కువగా తలెత్తుతుంది. సెల్ ఫోన్ వాడకంతో పిల్లల్లో మానసిక సామర్థ్యం కొరవడుతుంది.
సెల్ ఫోన్ నుంచి వచ్చే రేడియో ధార్మిక కిరణాల నుంచి చిన్నారుల బ్రెయిన్ పై తీవ్ర ప్రభావం చూపుతుంది. పిల్లల్లో సృజనాత్మకశక్తి, ఆలోచనాశక్తి, తెలివితేటలు, మందగిస్తాయి. ఏకాగ్రత సన్నగిల్లుతుంది. ఆత్మ విశ్వాసం లోపించడంతో పాటుగా కోపం, మానసిక ఒత్తిడి, ఆందోళనలు పెరిగే అవకాశం ఉంటుంది. సెల్ ఫోన్లలో వివిధ రకాలైన గేమ్స్ అందుబాటులోకి రావడంతో ఆ గేమ్స్ లో మునిగిపోయిన పిల్లలు పక్కనున్న ఎవరినీ పట్టించుకోని స్థితిలో ఒంటరితనానికి అలవాటుపడి మానవ సంబంధాలకు దూరంగా తల్లిదండ్రుల ఆత్మీయ స్పర్శకు నోచుకోలేక పెరుగుతారు.
మొదటగా ఎంతో చిన్నవిగా కనిపించే సమస్యలను సరైన సమయంలో పట్టించుకుని సరైన పరిష్కారాలు వెతకకపోతే అవే పెద్దవిగా మారి పిల్లల మానసిక, శారీరక ఆరోగ్యంపై త్రీవ ప్రభావాన్ని చూపిస్తాయి. పిల్లలు ఏవైనా సమస్యలతో బాధపడుతూ, ఏడుస్తూ తమ దగ్గరకు వస్తే అవి చిన్నవే కదా అని వదిలివేయకుండా వాటిని పరిశీలించి, పరిష్కరించాలి. తల్లిదండ్రులు పని ఒత్తిడిలో ఉండి సెల్ ఫోన్లోనే అన్ని సమస్యలకు పరిష్కారం ఉన్నట్లు యూట్యూబ్ గేమ్స్ కు పిల్లలను అలవాటు చేస్తున్నారు.
ఇవి పిల్లవాడి భవిష్యత్తును దెబ్బతీస్తుందని గుర్తించాలి. పిల్లల కోసమే మా జీవతం అని భావిస్తున్న తల్లిదండ్రులు పిల్లల సెల్ ఫోన్ వాడకంలో తగు జాగ్రత్తలు తీసుకోకపోతే వారి భవిష్యత్తును చేజేతులా పాడు చేసినవారవుతారు. పిల్లలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండటం చాల ముఖ్యం. సమస్య ఎదురైనప్పుడు ముందుగా గుర్తించి దాన్ని పరిష్కారం చేయగలిగితే పిల్లల భవిష్యత్ బంగారంగా మార్చుకోచ్చు.
టీనేజర్ల ప్రవర్తనపై అధ్యయనం..
టీనేజర్ల ఆరోగ్యం, ప్రవర్తన తాలూకు అంశాలపై అమెరికాలోని "శాండియాగో స్టేట్ యూనివర్సిటీ సైకాలజీ ప్రొఫెసర్ ఐజెన్ కన్సెల్టింగ్ ఫౌండర్" వైద్యురాలు 'జీన్ త్వెంగె' టీనేజర్ల ప్రవర్తనపై అధ్యయనం చేశారు. ఆమె తన బృందంతో కలసి 13 నుంచి 18 వయస్సుగల పది లక్షలకు పైగా పిల్లలపై అధ్యయనం చేశారు.
టీనేజర్లు తమ సమయాన్ని ఎలా గడుతున్నారనేదే మానసిక ఆరోగ్య కోణంలో ప్రాథమిక అంశమని ఆమె పేర్కొన్నారు. స్మార్ట్ ఫోన్ల యుగం పిల్లల్లో మానసిక సమస్యలు సర్వసాధారణమైపోయాయి. ఇందుకు సంబంధించిన ఓ బలమైన కేస్ స్టడీని ప్రపంచం ముందుంచారు జీన్ త్వెంగె. ఒంటరితనంతో బాధపడే టీనేజర్లు సంఖ్య బాగా పెరగడం, వారు తమ జీవితం వృథా అయిపోనట్లు భావిస్తుండడం వంటి లక్షణాలు గమనించారు. ఇవన్నీ డిప్రెషన్ లక్షణాలు.
ఐదేళ్లలో ఈ వ్యాధి లక్షణాలు 60 శాతం మేరకు పెరిగాయి. తమను తాము గాయపరచుకునేంతగా అవి విజృంభించాయి. బాలికల్లో ఈ ప్రమాదకర ధోరణి రెండు మూడింతలు పెరిగింది. కొన్నేళ్లలోనే టీనేజర్ల అత్మహత్యలు రెట్టింపయ్యాయి. అని జీన్ తన అధ్యయన సారాంశాన్ని వివరించారు.
"అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్" కలిసి జరిపిన అధ్యయనం ప్రకారం మన దేశంలోని కాలేజీ విద్యార్థులు రోజుకు 150 సార్లకు పైగా తమ ఫోన్లు చెక్ చేసుకుంటున్నారు. ఫోన్ చూసుకోకపోతే ఏదో మిస్ అయిపోతామనే ఆలోచన వారిని వెంటాడుతోందని, ఇదో వ్యసనంలా మారిందని పరిశోధకులు స్పష్టం చేశారు. ఈ లక్షణాలున్న వారు క్రమంగా యాంగ్జయిటీ సంబంధిత సమస్యల బారినపడే ప్రమాదముందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
ఇవి చదవండి: మచ్చల జింక, దెయ్యం అంటూ అవహేళనలు..! ఐనా..
Comments
Please login to add a commentAdd a comment