హీనా ఖాన్ ప్రముఖ నటి. హిందీ టీవీరంగంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటి. కెరీర్ కాంతిపుంజంలా వెలుగుతున్న కాలంలో అనారోగ్యం ఆమె మీద దాడి చేసింది. ఆమె తాను బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు గుర్తించేటప్పటికే మూడవ దశకు చేరినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. అయితే క్యాన్సర్ బారిన పడినందుకు ఏ మాత్రం కుంగిపోవడంలేదు. కీమోథెరపీ చేయించుకుంటూ తన ఆరోగ్యంతోపాటు ఫిట్‌నెస్ మెయింటెయిన్ చేసుకోవడానికి క్రమం తప్పకుండా జిమ్‌కెళ్తోంది. వివరాల్లోకి వెళితే...
కాళ్లు మొద్దుబారుతున్నాయి..
కీమోథెరపీ బాధలు, న్యూరోపతిక్ పెయిన్‌ను భరిస్తూ కూడా హెల్దీ లైఫ్ స్టయిల్‌ను అనుసరిస్తోంది. ‘కీమోథెరపీ దేహాన్ని పిండేస్తుంది. వర్కవుట్స్ చేసేటప్పుడు కాళ్లు పట్టుతప్పుతున్నాయి, ఒక్కసారిగా పడిపోతున్నాను’ అని ఒక పోస్ట్ చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా వ్యాయామాన్ని నిర్లక్ష్యం చేయడం లేదామె. మెంటల్, ఫిజికల్ వెల్‌నెస్ కోసం నొప్పుల బాధలను పళ్లబిగువున భరిస్తూ వ్యాయామం చేస్తోంది. ‘అనారోగ్యంతో కుంగిపోయిన వ్యక్తిలా అభివర్ణించుకోవడం నాకిష్టం లేదు. పడినప్పటికీ తిరిగి లేచి నిలబడాలి. వర్కవుట్ చేసే ప్రతిసారీ ‘గెట్టింగ్ బ్యాక్ అప్... అని నాకు నేను చెప్పుకుంటాను.
అలా చెప్పుకోకపోతే మానసిక శక్తి రాదు. మానసిక శక్తి లోపిస్తే వ్యాయామం చేయడానికి దేహం సహకరించదు’ అని తన ఇన్‌స్టా్రగామ్ ఫాలోవర్స్‌తో పంచుకుంది. ఈ నేపథ్యంలో ఆమె రకరకాల వీడియోలను కూడా పోస్ట్ చేసింది. ఒక వీడియోలో జుత్తును తల నుంచి చివరి వరకు నిమిరి అరచేతిలోకి వచ్చిన జుత్తును చూపించింది. గుండు గీసుకుంటూ ఒక వీడియో పోస్ట్ చేసింది. మరొక వీడియోలో వర్షంలో గొడుగు వేసుకుని, ప్రోటీన్ షేక్ ఉన్న ఫ్లాస్క్ పట్టుకుని జిమ్ ఆవరణలో ప్రవేశించింది. గొడుగు మూస్తూ హాయ్ అని పలకరించి విక్టరీ సింబల్ చూపించి జిమ్ గదిలోకి వెళ్లడంతో వీడియో పూర్తయింది. ‘స్టే స్ట్రాంగ్’ అంటూ ఆమె ఫ్లయింగ్ కిస్ విసిరి వీక్షకులకు మనోధైర్యాన్నిచ్చింది.
మీ ఆదరణకు కృతజ్ఞతలు..
సోషల్ మీడియాలో ఫాలోవర్స్ నుంచి అందుతున్న ఆదరణకు ఎప్పటికప్పుడు ప్రతిస్పందిస్తూ ‘మీ అభిమానానికి, ప్రేమకు కృతజ్ఞతతో ఉంటాను. ఈ చాలెంజ్‌లో నేను గెలుస్తాను’ అన్నది. కష్టం వచ్చినప్పుడు ధైర్యాన్ని కోల్పోకూడదు. అనారోగ్యం వస్తే డీలా పడిపోకూడదు. పోరాడి గెలవాలి అనే సందేశం ఇస్తున్న ఆమె వీడియోలు పలువురికి స్ఫూర్తినిస్తున్నాయి. వైద్యం ఎంతగా అభివృద్ధి చెందిందో వివరిస్తూ, క్యాన్సర్‌కు చికిత్స చేయించుకున్న తర్వాత సాధారణ వ్యక్తుల్లాగే క్వాలిటీ లైఫ్‌ను లీడ్ చేయడం మనచేతుల్లోనే ఉందని సమాజానికి ధైర్యం చెబుతున్న వారిలో హీనాఖాన్ ఒకరు.
ఫిట్‌నెస్ చాలెంజ్..
అమెరికాలోని స్లోన్ కెట్టెరింగ్ క్యాన్సర్ సెంటర్ సూచనల మేరకు...
తేలికపాటి వ్యాయామాలు... రిలాక్స్‌డ్ బైకింగ్ (గంటకు ఐదు మైళ్లకంటే తక్కువ వేగంతో సాఫీగా ఉన్న నేల మీద సైక్లింగ్), స్లో వాకింగ్ (చదునుగా ఉన్న నేల మీద గంటకు మూడు మైళ్లకంటే తక్కువ వేగంతో నడవడం). చిన్న చిన్న ఇంటిపనులు, తాయ్ చాయ్ (దేహాన్ని నిదానంగా కదిలిస్తూ దీర్ఘంగా శ్వాస తీసుకోవడం), ప్లేయింగ్ క్యాచ్ (బాల్‌ను లేదా ఫ్రిస్‌బీ ప్లేట్‌ను గురి చూసి విసరడం)
తీవ్రమైన వ్యాయామాలు...
బైకింగ్... (గంటకు పది మైళ్లకు మించకుండా సైక్లింగ్), బ్రిస్క్ వాక్ (గంటకు మూడు నుంచి నాలుగున్నర మైళ్ల వేగం), ఇంటి పనుల్లో బరువైనవి కూడా, యోగసాధన, టెన్నిస్ వంటి ఆటలు.
– అమెరికన్ కాలేజ్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్, అమెరికన్ క్యాన్సర్ సొసైటీలు... క్యాన్సర్ పేషెంట్‌లు వారానికి 150 నుంచి 300 నిమిషాలపాటు వ్యాయామం చేయాలని, రోజుకు అరగంట చొప్పున వారానికి ఐదు రోజుల వర్కవుట్ షెడ్యూల్ ఉండాలని చెప్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment