మనుషులు భిన్న వైరుధ్యాలతో ఉంటారు. ఉన్న వారు, లేనివారు అని మాత్రమే కాదు. మంచి వాళ్లు, చెడ్డవాళ్లు; రూపసులు, కురూపులు; ఇంకా... ఉల్లాసంగా ఉండేవాళ్లు, ఉసూరుమంటూ పడి వుండే వాళ్లు; ఆలోచనాపరులు, ఉద్వేగప్రాణులు; తియ్యగా మాట్లాడేవారు, మాటలసలే రానివాళ్లు, అలాగే ఉత్తి పుణ్యానికి భగ్గుమనేవారు కొందరైతే, కోపమే తెచ్చుకోని వారు మరికొందరు. ఈ జాబితా లోని చివరి వైరుధ్యం గురించే నేను ఈ వారం మాట్లాడబోతున్నది. దీనికి కారణం ఏమిటంటే, నేను ఇట్టే చికాకు పడిపోతాను. మర్యాదస్తుల సమాజం నన్ను ‘షార్ట్ టెంపర్డ్’ అంటుంది. అయితే మీరు నన్ను ఓర్పు లేని, సహనం లేని మనిషి అనవచ్చు. చివరికి కోపధారి అని కూడా.
నాలోని వైరుధ్యం ఏమిటంటే... శాంతంగా ఉండేందుకు నేను ప్రయ త్నిస్తున్నానని నాకు అనిపించటంతోనే నేను నా ప్రసన్నతను కోల్పోతూ ఉంటాను. ఎంతగానంటే కోపాన్ని అణచుకోవటం నాకు అలవిమాలిన సవా లుగా అనిపిస్తుంది. ఉదాహరణకు, ఒక వ్యక్తి ఇంగితజ్ఞానం లేకుండా, ఉద్దేశ పూర్వకంగా నన్ను రెచ్చగొడుతున్నప్పుడు కొద్ది నిముషాలు మాత్రమే నన్ను నేను నిగ్రహించుకుని ఉండగలను. తర్వాత, హఠాత్తుగా పెను వేగంతో నా చిరునవ్వు మాయమవటం మొదలై, నా మెదడు పదునైన మాటలతో పొంగి పొర్లి దెబ్బకు దెబ్బా తిప్పికొట్టటానికి నేను సిద్ధమౌతాను. ఒక మెరుపుదాడిలా నా కోపం బయటికి బద్ధలౌతుంది.
వెసూవియస్ అగ్నిపర్వతంలా అది సత్వర మే చిత్రంగా అంతటా వ్యాప్తి అవుతుంది. అదృష్టవశాత్తూ మరిగి ఉన్న టీ పాత్రలా నేను వేగంగా చల్లబడ తాను. కానీ మళ్లీ లావా లాగా – లేదా, చింది పడిన వేడి నీళ్ల మాదిరిగా – ఆ నష్టం చాలా ఎక్కువ కాలం ఉంటుంది. దురదృష్టం ఏమిటంటే నేను కోపం ప్రదర్శించిన వ్యక్తులు గుంభనంగా ఉండిపోతారు. వాళ్లు అంత తేలిగ్గా బద్దలవరు. నిజానికి వాళ్లు అలా బద్దలవటానికి సిద్ధపడేముందు చాలా సమయం తీసుకుంటారు. ఒకసారి బద్దలయ్యాక రోజుల పాటు వారు రగిలి పోతూ ఉంటారు. వెంటనే చల్లారటం ఉండదు.
అలాంటి మనిషి నా భార్య నిషా. మా తొలి తగాదా చాలా చిన్నదైన ఒక విషయం మీద జరిగింది. అది ఇలా సాగింది: తన ధ్యాస నాపై ఉండటాన్ని నేను కోరుకుంటానన్న సంగతి నిషాకు బాగా తెలుసు. నేను ఆశించినట్లే తను ఉండేది. సమస్యేమిటంటే... నేను ఆశిస్తున్నట్లు తను ఉంటున్నానన్న గమనింపును నిషా నాలో కలిగించేది. దాంతో ఆమె నన్ను ఆట పట్టిస్తోందని నాకు తెలిసిపోయింది. అటువంటి సందర్భాలలో నిషా నన్ను ‘కె.టి. బాబా’ అని పిలిచేది. అలా పిలవటంలో ప్రేమా ఉండేది, నవ్వులాటా ఉండేది.
ఆమె నన్ను ఆట పట్టిస్తోందని నా గ్రహింపునకు వచ్చినప్పుడు మొదట నేను జోక్‌గానే తీసుకున్నాను. కానీ జోకులతో సమస్య ఏమిటంటే మిగతా వారు కూడా వాటిల్లోకి చొరబడతారు. నా బెస్ట్ ఫ్రెండ్ ప్రవీణ్, ఇంకా అఫ్తాబ్, మరొక స్నేహితుడు నిషా మాటల్ని పట్టుకుని నాపైకి నవ్వులాటకు వచ్చేవారు. నిమి షాల వ్యవధిలోనే అది అటువైపు ముగ్గురు, ఇటువైపు ఒక్కరు అయ్యేది. ఆ తర్వాత నా మతిస్థిమితం నాపై విజయం సాధించి హాస్యమంతా పాడైపో టానికి ఎంతో సమయం పట్టేది కాదు.
నా ఉద్వేగం నా తలలోకి పరుగులు పెట్టేది. నా ముఖం ఎర్రబడేది. నా గొంతు పైకి లేచేది. దురదృష్టవశాత్తూ, ఇలా జరగటం అన్నది రాబోయే ప్రమాదం నుంచి వాళ్లను హెచ్చరించటానికి బదులుగా వాళ్లను మరింతగా నవ్వులాటకు పురిగొల్పేది. ఆ మాటల యుద్ధంలో నేను తలదూర్చేలా నా కోసం వల పన్ని వేడుకగా చూస్తుండేవారు.
ఆ ముగ్గురితో నేను గొడవ పడేవాడినని చెప్పటం సరిగ్గా ఉంటుంది. అయితే ప్రవీణ్, ఆఫ్తాబ్ నవ్వుతూ కొట్టి పడేస్తే, నిషా నా కోపాన్ని తను చిన్నతనంగా భావించి బాధపడేది. మీరు కనుక పెళ్లయినవారైతే భార్యలు... భర్తల (అలాంటి) తత్వాన్ని అక్కడ ఉన్నదాని కంటే చాలా ఎక్కువగా తీసుకుంటారని తెలుస్తుంది. వాళ్లంతా వెళ్లాక నిషా నాపై తన కోపాన్ని కుమ్మరించింది.
‘‘మీరొక పరమ బుద్ధిహీనుడిలా ప్రవర్తించారు.’’ ‘‘నవ్వులాటను తేలిగ్గా తీసుకోలేరా?’’ అని నిషా. ‘‘అదేం తమాషాగా లేదు’’ అని నేను. ‘‘అందరికీ తెలుసు అదంతా తమాషాకేనని. కానీ అది మీ మీద జోక్ కనుక మీకు కోపం వచ్చింది’’ – నిషా. ఇరవై నిముషాల తర్వాత నా కోపం అంతా చల్లారిపోయింది. నేను ప్రశాంతచిత్తుడినై ఉండిపోయాను. కానీ నిషా ఇంకా తన కోపాన్ని లోలోపల అణచుకునే ఉంది.
‘‘కాఫీ’’ అని అడిగాను. మౌనం! ‘‘టీ?’’ అన్నాను, అది కాకపోతే ఇది అన్నట్లు. మరింతగా మౌనం! ‘‘ఏంటి నీ బాధ?’’ అని పెద్దగా అరిచాను... ఆమె నాతో మాట్లాడటానికి తిరస్కరిస్తున్నందువల్ల వచ్చిన కోపంతో. అప్పుడు కూడా మౌనం! ‘‘ఛీ పో...’’ అన్నాను. ‘‘నువ్వే ఛీ పో’’ అంటూ అప్పుడు నోరు తెరిచి, మళ్లీ మౌనంగా ఉండిపోయింది. ఇదంతా సర్దుకోడానికి రెండు రోజులు పట్టింది.
ఏమైనా, బయటివాళ్లతో వచ్చే తగాదాలు బద్దలయ్యేంతగా గానీ, దీర్ఘ కాలం కొనసాగేంతగా గానీ ఉండవు. ఇట్టే అవి చెలరేగితే చెలరేగి ఉండొచ్చు గాక. నాకిప్పుడు తెలుస్తోంది నా ప్రారంభ ప్రతిస్పందన ఆత్మనిగ్రహం లేని దిగా, సాధారణంగా నా వైపు నుండే తప్పును ఎత్తి చూపించేదిలా ఉంది అని. కానీ ఏం చేయటం, నాకు తెలివి వచ్చేటప్పటికే బాగా అలస్యం అయిపోయింది. తర్వాత నేను చేయగలిగిందంతా నేనే మొదట క్షమాపణలు చెప్పి పరిస్థితిని చక్కబరచుకోవటం. కొన్నిసార్లు అది పని చేస్తుంది కానీ అన్నిసార్లూ కాదు. ఆఫీసులో నా సహోద్యోగులు కొందరు రోజుల తరబడి బిగదీసుకుని ఉండేవారున్నారు.
గతవారం, మానవ ప్రవర్తనల్ని విశ్లేషించే ఒక అమెరికన్ ఇచ్చిన వివరణ అనుకోకుండా నా దృష్టికి వచ్చింది. ‘‘షార్ట్ టెంపర్డ్‌గా ఉండేవాళ్లకు, అంటే... తేలిగ్గా, తరచు తప్పుగా కోపం తెచ్చుకునేవాళ్లకు మనసులో ఏమీ ఉండదు. అంతా పైకే కనబరిచేస్తారు. తమను ఎగతాళి చెయ్యటాన్ని వారు నవ్వుతూ తీసుకుంటారు. అయితే దాని వల్ల వారు తరచు అన్యాయంగా వెక్కిరింపులు పడవలసి వస్తుంది. దాంతో అదుపు తప్పుతారు. వాళ్ల మాదిరిగా నియంత్రణ కోల్పో వటం మంచిదే. కానీ అందులో మీరు నిజాయితీగా ఉండండి. దారి మళ్లించటానికి, మనసులో ఉన్నది దాచిపెట్టుకోటానికి మాత్రమే నిజమైనది కాని మౌనాన్ని కొనసాగించండి.’’
నిషా ఈ మాటల్లోని సమర్థనీయతను అంగీకరించి ఉండేదా అని నా ఆశ్చర్యం. లేదంటే, ఆమె పెద్దగా నవ్వి, ‘‘కె.టి. బాబా ఇదంతా మీరు కల్పించారు కదా? వినటానికైతే బాగుంది’’ అని ఉండేదా? కావచ్చు. అప్పుడైతే అది మానవ ప్రవృత్తిలోని గొప్ప విషయం.
– కరణ్ థాపర్, వ్యాసకర్త, సీనియర్ జర్నలిస్ట్
Comments
Please login to add a commentAdd a comment