Mango Products
-
సమ్మర్ సీజన్ కదా అని.. తొందరపడి పచ్చళ్లు పెట్టేస్తున్నారా!
మామిడి కాయల సీజన్ కదా.. ఎక్కడ చూసినా గుట్టలు గుట్టలుగా మామిడి కాయలు కనిపిస్తున్నాయి. అలాగని తొందరపడి ఆవకాయ, మాగాయ పెట్టేయకూడదు. ఎందుకంటే ఎండలు ఇంకాస్త ముదరాలి. ఎండలతోపాటే మామిడి కాయలు కూడా బాగా టెంకపట్టాలి. అప్పుడయితేనే ఏడాదంతా నిల్వ ఉంటుంది ఆవకాయ. అయితే అప్పటిదాకా చూస్తూ ఊరుకోవాలా? ఏమక్కరలేదు. ఆవకాయ పెట్టేలోగా రెండు మూడు వారాల నుంచి నెలరోజుల దాకా తాజాగా ఉండే ఈ పచ్చళ్లు ట్రై చేద్దామా మరి! మ్యాంగో ఇన్స్టంట్ పికిల్.. కావలసినవి: పచ్చి మామిడికాయ – ఒకటి; కశ్మీర్ మిరప్పొడి – టేబుల్ స్పూన్; నువ్వుల నూనె– 3 టేబుల్ స్పూన్లు; ఆవాలు– టీ స్పూన్; మెంతులు – అర టీ స్పూన్; పసుపు – అర టీ స్పూన్; ఇంగువ – పావు టీ స్పూన్; ఉప్పు – టీ స్పూన్. తయారీ.. మామిడికాయను శుభ్రంగా కడిగి తుడిచి, సొన పోయేటట్లు తొడిమను తొలగించాలి. గింజను తొలగించి, తొక్కతో సహా ముక్కలు తరగాలి. ముక్కలకు ఉప్పు కలిపి పక్కన పెట్టాలి. సుమారు ఒక కప్పు ముక్కలు వస్తాయి. బాణలిలో మెంతులు వేసి (నూనె లేకుండా) దోరగా వేయించాలి. చల్లారిన తర్వాత మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. అదే బాణలిలో నువ్వుల నూనె వేడి చేసి అందులో ఆవాలు వేసి చిటపటలాడిన తర్వాత ఇంగువ, మెంతిపొడి, మిరప్పొడి, పసుపు వేసి స్టవ్ ఆపేయాలి. వేడి తగ్గిన తర్వాత ఈ పోపును మామిడి ముక్కల్లో వేసి కలపాలి. అరగంట సేపటికి ఉప్పు, కారం, మసాలా దినుసుల రుచి ముక్కలకు పడుతుంది. ఈ పచ్చడిని తేమ లేని పాత్రలో నిల్వ చేసుకుంటే నాలుగు రోజుల వరకు తాజాగా ఉంటుంది. చనా మేథీ మ్యాంగో పికిల్.. కావలసినవి: పచ్చి మామిడి ముక్కలు – కప్పు; మామిడి తురుము – కప్పు; పచ్చి శనగలు – అర కప్పు; మెంతులు – అర కప్పు; ఆవాలు›– అర కప్పు; ఉప్పు – అర కప్పు; మిరప్పొడి– అర కప్పు, నూనె – కప్పు. తయారీ.. మందపాటి బాణలి వేడి చేసి పచ్చి శనగపప్పును దోరగా వేయించి పక్కన పెట్టాలి. ఆ తర్వాత మెంతులు, ఆవాలను (నూనె లేకుండా) వేయించి చల్లారిన తర్వాత పొడి చేసుకోవాలి. ఒక పాత్రలో మామిడి ముక్కలు, మామిడి తురుమును వేయాలి. అందులో శనగలు, మెంతిపొడి, ఆవపిండి, మిరప్పొడి, ఉప్పు, పసుపు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని తడిలేని సీసాలో కూరినట్లు పెట్టి గట్టిగా మూతపెట్టాలి. మూడు రోజుల తర్వాత నూనెను మరిగించి చల్లార్చిన తర్వాత ఆ నూనెను సీసాలో ఉన్న మిశ్రమం పై నుంచి పోయాలి. ఈ పచ్చడిని మూడు రోజుల తర్వాత తినవచ్చు. నెల రోజుల పాటు తాజాగా ఉంటుంది. ఇది గుజరాతీ శైలి మామిడి పచ్చడి. మామిడి తురుము పచ్చడి.. కావలసినవి: మామిడి తురుము – 2 కప్పులు; మిరప్పొడి– పావు కప్పు; ఉప్పు – పావు కప్పు; ఆవ పిండి– టేబుల్ స్పూన్; మెంతిపిండి– టేబుల్ స్పూన్; వెల్లుల్లి రేకల తురుము – టేబుల్ స్పూన్; నల్లజీలకర్ర (కలోంజి) – అర టీ స్పూన్; మెంతులు – టీ స్పూన్; ఇంగువ – అర టీ స్పూన్; ఆవ నూనె – పావు కప్పు; పసుపు – టీ స్పూన్; జీలకర్ర – టీ స్పూన్. తయారీ.. మామిడి తురుములో పసుపు, ఉప్పు, వెల్లుల్లి, కలోంజి వేసి బాగా కలిపి పక్కన ఉంచాలి. బాణలి వేడి చేసి (నూనె లేకుండా) మెంతులు, జీలకర్ర వేయించి చల్లారిన తర్వాత మిక్సీలో పొడి చేసి మామిడి తురుములో వేసి కలపాలి. ఇప్పుడు మామిడి తురుములో ఆవపిండి, మెంతిపిండి, మిరప్పొడి, నూనె వేసి కలిపి ఉప్పు సరి చూసుకోవాలి. అవసరమైతే మరికొంత ఉప్పు కలుపుకోవచ్చు. ఇది నాలుగు రోజుల నుంచి వారం వరకు తాజాగా ఉంటుంది. మామిడి తురుమును పలుచని వస్త్రంలో కట్టి నీరు పోయేటట్లు చేసిన తర్వాత మసాలా దినుసులు కలిపి, నూనె పైకి తేలేటంత మోతాదులో పోసినట్లయితే ఆ పచ్చడి నెలలపాటు నిల్వ ఉంటుంది. -
‘మామ్ మ్యాజిక్ పికెల్ ఇండియా’ గా.. సరోజ్ ప్రజాపతి
"మధ్యప్రదేశ్‌కు చెందిన సరోజ్ ప్రజాపతికి వీరాభిమానులు ఉన్నారు. అలా అని ఆమె సెలబ్రిటీ కాదు. ‘ఆమె పచ్చడి చేస్తే పండగే’ అన్నట్లుగా ఉండేది. తనలోని టాలెంట్‌ను ‘ఎంటర్ ప్రెన్యూర్షిప్’లోకి కన్వర్ట్ చేసి, 19 సంవత్సరాల కుమారుడితో కలిసి ‘మామ్ మ్యాజిక్ పికెల్ ఇండియా’ను స్టార్ట్ చేసింది. నెలకు రెండు లక్షల రూపాయల వరకు సంపాదిస్తోంది. 30 మంది మహిళలకు ఉపాధిని ఇస్తోంది." మధ్యప్రదేశ్‌లోని షాదోర అనే గ్రామంలో తన ఇంటిలో కాలక్షేపం కోసం టీవీ చానల్స్ మారుస్తోంది సరోజ్. ఈ క్రమంలో ఆమె దృష్టి ఒక బిజినెస్ ప్రోగ్రాంపై పడింది. పచ్చళ్ల వ్యాపారంలో విజయం సాధించిన బిహార్‌లోని ఇద్దరు మహిళలకు సంబంధించిన ప్రోగ్రాం అది. ఈప్రోగ్రాం ఆసక్తిగా చూస్తున్నప్పుడు ‘నేను మాత్రం వ్యాపారం ఎందుకు చేయకూడదు!’ అనుకుంది తనలో తాను. ఇద్దరు పిల్లలకు తల్లి అయిన సరోజ్‌కు ‘శభాష్’ అని అందరూ అభినందించే పని ఏదైనా చేయాలనే కోరిక ఎప్పటినుంచో ఉండేది. కాని దారి ఏమిటో తెలిసేది కాదు. ‘దారి ఏమిటో తెలియాలి అంటే ముందు నీలో ఉన్న శక్తి ఏమిటో నీకు తెలియాలి’ అంటారు పెద్దలు. టీవీప్రోగ్రాం తనలోని శక్తి, నైపుణ్యాన్ని గుర్తు తెచ్చింది. కుమారుడు అమిత్ ప్రజాపతితో తనకు వచ్చిన ఆలోచనను చెప్పింది సరోజ్. పందొమ్మిది సంవత్సరాల అమిత్ ‘బ్రాండ్ బిల్డింగ్’ అనే డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ నడుపుతున్నాడు. ‘మనకెందుకమ్మా వ్యాపారం. పెద్ద రిస్క్’ అనే మాట అమిత్ నోట వినిపించి ఉంటే కథ కంచికి వెళ్లి ఉండేది. గత సంవత్సరం ‘మామ్స్ మ్యాజిక్ పికిల్ ఇండియా’ పేరుతో ఊరగాయల వ్యాపారం మొదలుపెట్టింది సరోజ్. ‘మామ్స్ మ్యాజిక్ పికిల్ ఇండియా బ్రాండ్’ గురించి సోషల్ మీడియాలో ప్రచారం మొదలుపెట్టాడు అమిత్. ఆన్లైన్, ఆఫ్‌లైన్ డిమాండ్ల నేపథ్యంలో తమ ఇల్లు చాలదని దగ్గరలోని పెద్ద స్థలంలో ఊరగాయలు తయారు చేయడం ప్రారంభించారు. ‘అమ్మ దగ్గర సంప్రదాయ వంటకాలతో పాటు ఊరగాయలు తయారు చేయడం నేర్చుకున్నాను. అది నన్ను వ్యాపారవేత్తను చేస్తుందని ఊహించలేదు. ఫస్ట్ ఆర్డర్ వచ్చినప్పుడు ఎంతో సంతోషంగా అనిపించింది మామిడి కాయలు, కూరగాయలను స్థానికంగా కొనుగోలు చేస్తాను. ఊరగాయల తయారీలో రసాయనాలను ఉపయోగించం.’ అంటుంది సరోజ్. ‘మామిడి సీజన్లో మా ఇంటికి వచ్చే బంధువులు, స్నేహితులు వెళుతున్నప్పుడు ఊరగాయ జాడీని తీసుకువెళతారు. ఊరగాయ రుచి చూసిన ప్రతి ఒక్కరూ అద్భుతం అంటారు. ఇది గుర్తు తెచ్చుకొని మామ్ పికెల్స్ అనేది పర్ఫెక్ట్ బిజినెస్ ఛాన్స్ అనుకున్నాను. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్లలో మా బిజినెస్‌కు సంబంధించిన పేజీలను క్రియేట్ చేశాను. మంచి స్పందన వచ్చింది. జాడీలను కొని లేబుల్స్ ప్రింట్ చేయించాను. మధ్యప్రదేశ్ నుంచే కాదు దేశం నలుమూలల నుంచి ఆర్డర్లు రావడం మొదలైంది’ అంటాడు అమిత్. పదిహేను సంవత్సరాల వయసులో తొలిసారిగా పచ్చి మామిడి కాయ పచ్చడి తయారు చేసి ఇంటిల్లిపాది ‘అద్భుతం’ అనేలా చేసింది సరోజ్. ఆనాటి ‘అద్భుతం’ ఇప్పటికీ అద్భుతాలు చేయిస్తూనే ఉంది. కేవలం మామిడికాయ ఊరగాయలతో మొదలైన వ్యాపారం అనతికాలంలోనే పచ్చిమిర్చి, నిమ్మకాయ, మిక్స్డ్ వెజిటబుల్... మొదలైన వాటిలోకి విస్తరించింది. అమ్మ చేతి నైపుణ్యానికి కుమారుడి డిజిటల్ మార్కెటింగ్ స్కిల్స్ తోడు కావడంతో త్వరలోనే వ్యాపారం మంచి ఊపందుకుంది. నా కుటుంబం నా బలం! కుటుంబ సహాయసహకారాలు తోడైతే అవలీలగా విజయం సాధించవచ్చు అని చెప్పడానికి నేనే ఉదాహరణ. ఊరగాయల వ్యాపారం స్టార్ట్ చేస్తే బాగుంటుంది అన్నప్పుడు మా ఆయన, అబ్బాయి ప్రోత్సాహకంగా మాట్లాడారు. ‘నువ్వు రుచి మీద దృష్టి పెట్టు చాలు. మిగిలినవి మేము చూసుకుంటాం’ అని ధైర్యాన్ని ఇచ్చి ముందుకు నడిపించారు. ఒక టీవీ ప్రోగ్రాంలో విజేతల మాటలు విని ఆ స్ఫూర్తితో నేను కూడా వ్యాపారంలోకి దిగాను. దీనికి కారణం అప్పటికప్పుడు వచ్చిన ఉత్సాహం కాదు. నాకంటూ ఒక పేరు తెచ్చుకోవాలి అనే పట్టుదల. నా వల్ల ఇతర మహిళలు కూడా ఉపాధి పొందడం సంతోషంగా ఉంది. – సరోజ్ ప్రజాపతి ఇవి చదవండి: Ameen Sayani: పాటల పూలమాలి వెళ్లిపోయాడు..! -
అంత ధరైతే ఎట్టా! పచ్చడి పెట్టలేం.. పండ్లు తినలేం!
సాక్షి, రంగారెడ్డిజిల్లా: మధుర ఫలం పులుపెక్కింది. ఇటు పచ్చడి నిల్వ చేసుకోవాలనుకునే వారికి.. అటు పండ్ల రుచిని ఆస్వాదించాలనుకున్న వారికి నిరాశే మిగులుతోంది. కొత్తపేట పండ్ల మార్కెట్‌కు గతంలో రోజుకు 1000 టన్నుల మామిడి రాగా, ప్రస్తుతం బాటసింగారం మార్కెట్‌కు 600 టన్నులకు మించి రావడం లేదు. టన్ను ధర (కాయ సైజును బట్టి) రూ.90 వేల నుంచి రూ.1.20 లక్షల వరకు పలుకుతోంది. నాలుగు రోజుల క్రితం రికార్డుస్థాయిలో రూ.1.24 లక్షలు పలకడం విశేషం. డిమాండ్ మేర దిగుమతి లేకపోవడంతో బహిరంగ మార్కెట్లో ధరలు అమాంతం పెరిగిపోయాయి. పండ్లరసాలు కిలో రూ.150–200 వరకు విక్రయిస్తుండగా, పచ్చడి కాయలు సైజును బట్టి ఒక్కోటి రూ.15–20 చొప్పున అమ్ముతుండటం గమనార్హం. (చదవండి: పిత్తాశయంలో రాళ్లెందుకు వస్తాయి? పరిష్కారాలేమిటి? ) మార్కెట్‌కు తగ్గిన సరఫరా బాటసింగారం మార్కెట్ నుంచి మామిడి సహా ఇతర పండ్లు సరఫరా అవుతుంటాయి. రంగారెడ్డి, మేడ్చల్, మహబూబ్‌నగర్, నల్లగొండ, వరంగల్, కరీంనగర్, ఖమ్మం సహా ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర శివారు జిల్లాలకు చెందిన రైతులు తమ ఉత్పత్తులను ఇక్కడికే తెచ్చి అమ్ముతుంటారు. ప్రస్తుత సీజన్లో ఆయా జిల్లాల నుంచి రోజుకు సగటున వెయ్యి టన్నులకుపైగా మామిడి రావాల్సి ఉండగా, 500 టన్నుల లోపే వస్తోంది. పచ్చడిలో ఉపయోగించే పుల్లటి మామిడి కాయలే కాదు బంగినపల్లి, తోతాపురి, చెరుకురసం, సువర్ణ రేఖ, నీలం రకాల మామిడి పండ్లు కూడా రావడం లేదు. సాధారణంగా మార్చి చివరి నాటికి మార్కెట్లను ముంచెత్తాల్సిన ఫలరాజం ఏప్రిల్ రెండో వారంలోనూ ఆశించిన స్థాయిలో కనిపించడం లేదు. ఇటు మామిడి.. అటు నిమ్మ వాతావరణ మార్పులతో మామిడి పూత, కాత తగ్గి దిగుబడులపై ప్రతికూల ప్రభావం చూపినట్లు తెలంగాణ రాష్ట్ర కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం అధ్యయనంలో తేలింది. చలికాలంలో భారీ వర్షాలు కురవడం.. రాత్రిపూట ఉష్ణోగ్రతలు పడిపోవడం.. ఫిబ్రవరి నుంచి ఎండలు మండిపోవడం.. మార్చిలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో పూత ఎండి పిందె రాలిపోయింది. గతంలో ఒక నిమ్మ చెట్టుకు ఐదు నుంచి ఆరు బస్తాల కాయలు వచ్చేవి. చీడపీడల కారణంగా ఈసారి ఒకటి రెండు బస్తాలకే పరిమితమైంది. వ్యవసాయ మార్కెట్లో బస్తా రూ.2,500 పైగా, సైజును బట్టి రిటైల్‌గా ఒక్కో కాయ రూ.10 పలుకుతోంది. ప్రస్తుతం పచ్చళ్ల సీజన్ మొదలైంది. సాధారణంగా ఈ సీజన్లో ప్రతి ఇంట్లో మామిడి, నిమ్మ పచ్చళ్లను తయారు చేసుకుని ఏడాదంతా నిల్వ చేసుకుంటారు. మామిడి, నిమ్మ కాయల ధరలకు తోడు వంటనూనెలు, మసాల దినుసులు, కారం పొడులు కూడా భారీగా పెరగడంతో పచ్చడి మొతుకుల కోసం సామాన్య, మధ్య తరగతి ప్రజలకు ఆర్థిక భారం తప్పడం లేదు. (చదవండి: అదృశ్యమైన సస్పెండెడ్ హోంగార్డ్ రామకృష్ణ మృతి.. పరువు హత్య?) -
భలే రుచి.. భీమాళి మామిడి తాండ్ర
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఒక్కసారి కొరికితే.. నోటినిండా తియ్యటి తేనెలూరు తుంది. ఎంత తిన్నా జిహ్వ చాపల్యం తీరక.. ‘వదల భీమాళి.. నిన్నొదల’ అనాలని పిస్తుంది. విజయనగరం జిల్లా లక్కవరపుకోట మండలం భీమాళి గ్రామస్తులు తయారు చేసే మామిడి తాండ్ర రుచి అలాంటిది మరి. వేసవి వచ్చిం దంటే చాలు. గ్రామంలో మామిడి తాండ్ర హడావుడి మొదలవుతుంది. ఇక్కడ తయారయ్యే తాండ్ర రుచులు తెలుగు ప్రజలతోపాటు ఇతర రాష్ట్రాల వారి మనసునూ దోచుకుంటున్నాయి. గ్రామంలో పూర్వీకుల నుంచి మామిడి తాండ్ర తయారీ కుటీర పరిశ్రమగా వేళ్లూను కుంది. అప్పటి సంప్రదాయ రుచుల్ని నేటికీ ఆ గ్రామస్తులు నిలబెట్టుకుంటూ వస్తున్నారు. గ్రామంలో దాదాపు 400 కుటుంబాలకు అదే జీవనాధారం. ఏటా కనీసం లక్ష కేజీల మామిడి తాండ్ర ఈ ఒక్క గ్రామంలోనే తయారవు తుంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మామిడి తాండ్ర తయారీ ఉన్నప్పటికీ భీమాళి తాండ్రకు ప్రత్యేకత ఉండటంతో ఆదరణ లభిస్తోంది. తయారీ విధానమే ప్రత్యేకం మామిడి తాండ్ర తయారీకి కండ ఎక్కువ ఉండే రకాలైన కలెక్టర్, కోలంగోవ, సువర్ణ రేఖ లాంటి రకాల మామిడి పండ్ల నుంచి గుజ్జు, రసం తీసి సమపాళ్లలో చక్కెర కలుపుతారు. వెదురు చాపలపై తాండ్రగుజ్జు వేసి ఎండబెడతారు. దానిపై రోజూ గుజ్జుతో కొత్త పొరలు వేస్తుంటారు. కావాల్సిన మందానికి వచ్చే వరకు ఇలా చేస్తూనే ఉంటారు. బాగా ఎండిన తర్వాత ముక్కలుగా కోస్తారు. ఒక్కో చాపకు 60 నుంచి 70 కేజీల మామిడి తాండ్ర తయారవుతుంది. పండ్ల నుంచి తీసిన టెంకలను పాతర వేసి.. మొలక వచ్చాక వర్షా కాలంలో అంట్లు కట్టి అమ్ముతుంటారు. మామిడి పండ్ల నుంచి గుజ్జు తీస్తున్న మహిళలు జాగ్రత్త లేకుంటే నష్టం తాండ్ర తయారీలో ఎలాంటి ఫుడ్ కలర్స్, రసాయనాలు వినియోగించరు. నిత్యం మ్యాంగోజెల్లీని ఎండబెట్టి, భద్రం చేయాలి. వాతావరణం చల్లగా ఉం టే రంగు, రుచి మారే ప్రమాదం ఉంది. తాండ్ర రుచిగా ఉండాలన్నా, నిల్వ చేయాలన్నా ఎర్రటి ఎండలో ఎక్కువ కాలం ఎండబెట్టాలి. నిల్వ చేసే దారిలేదు కోల్డ్ స్టోరేజీ లేకపోవడంతో మామిడి తాండ్రను నిల్వ చేసుకోలేని పరిస్థితి నెలకొంది. దీనివల్ల దళారులను ఆశ్రయించి తక్కువ ధరకే అమ్ముకోవాల్సి వస్తోంది. పెరిగిన కూలి ఖర్చులు, సరుకుల ధరలు, గిట్టుబాటు కాని అమ్మకపు ధరతో పరిశ్రమ కునారిల్లుతోంది. పేరు పడ్డ తాండ్ర తయారీకి రుణ సదుపాయం కల్పించాలని, అమ్మకపు పన్ను రద్దు చేయాలని, కుటీర పరిశ్రమగా గుర్తిం చాలని, స్థానికంగా శీతల గిడ్డంగులు నిర్మించాలని తయారీదారులు కోరుతున్నారు. ఎండ ఉంటేనే పని ఎండ ఎర్రగా కాస్తేనే తాండ్ర వేసేందుకు అవకాశం ఉంటుంది. ఏమాత్రం మేఘాలు పట్టినా తాండ్ర వేయలేం. ఎండలో ఎంత కష్టపడినా ఫలితం దక్కటం లేదు. –జి.సత్యవతి, తయారీదారు కోల్డ్ స్టోరేజీ నిర్మించాలి ఎండలో కష్టపడి తయారు చేసిన తాండ్రను కోల్డ్ స్టోరేజీ లేకపోవడంతో వెంటనే అమ్ముకోవాల్సి వస్తోంది. దీనివల్ల మంచి ధర రావడం లేదు. విజయనగరంలోని కోల్డ్ స్టోరేజీకు తరలించి నిల్వ ఉంచితే వచ్చే లాభం కాస్తా దాని అద్దెకే సరిపోతోంది. – ఎస్.రమణ, తయారీదారు అమ్మకపు పన్ను రద్దుచేయాలి కుటీర పరిశ్రమగా తయారు చేస్తున్న తాండ్రపై ప్రభుత్వం అమ్మకపు పన్ను రద్దు చేయాలి. అప్పుడే కొనుగోలుదారులు, వ్యాపారులు గ్రామానికి వస్తారు. తాండ్ర తయారీ దారులకు రుణాలు ఇచ్చి ఆదుకోవాలి. – మిడతాన అచ్చింనాయుడు, తయారీదారు -
మామిడి తాండ్ర రుచి ... తినరా మైమరచి
తాండ్ర... ఈ పేరు వింటేనే నోరూరుతుంది. గిరిజన మహిళలు సంప్రదాయబద్ధంగా తయారు చేస్తుండడంతో మరింత గిరాకీ పెరుగుతోంది. కిలో రూ.80 వరకూ ధర పలుకుతున్నా కొనుగోలుదారులు మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. మామిడి సీజన్ అయిపోయినా వీటిని భద్ర పరుచుకొని తినే అవకాశం ఉండడంతో డిమాండ్ పెరుగుతోంది. కొనుగోలుదారుల ఆసక్తిని గమనించి మరింత ఉత్పత్తి చేయడానికి ఈ ప్రాంత వాసులు కృషి చేస్తున్నారు. కురుపాం(విజయనగరం జిల్లా): గిరిజన మహిళలు సంప్రదాయంగా తయారుచేస్తున్న కొండమామిడి తాండ్రకు మంచి గిరాకీ ఏర్పడింది. కురుపాం నియోజకవర్గ పరిధిలోని కురుపాం, గుమ్మలక్ష్మీపురం, కొమరాడ, జియ్యమ్మవలస మండలాల్లో గిరిశిఖర గ్రామాల్లో గిరిజన మహిళలు కొండమామిడి పండ్లను సేకరించి తాండ్ర తయారీకి ఉపక్రమిస్తున్నారు. ఏజెన్సీలో సహజసిద్ధంగా మామిడి చెట్లకు కాసే కొండమామిడి పండ్లను సేకరించి మామిడి తాండ్రను తయారు చేసి కిలో రూ.60 నుంచి రూ.80 వరకూ విక్రయిస్తున్నారు. తాండ్ర తయారీ ఏజెన్సీలో గిరిశిఖరాలపై మామిడి చెట్లకు కాసే కొండమామిడి పండ్లను ఇంటిల్లపాది ఉదయం, సాయంత్రం సమయాల్లో వెళ్లి పండ్లను సేకరించి వాటిని శుభ్ర పరిచి పెద్ద డబ్బాల్లో వేసి రోకలితో దంచుతారు. దంచగా వచ్చిన మామిడి రసాన్ని మేదర జంగెడలో పలుచగా వెదజల్లేలా ఆరబెడతారు. వీటిలో ఎటువంటి రసాయనాలు కలుపకుండానే పొరలు పొరలుగా వేసి వారం, పది రోజులు ఆరబెట్టి ఉండలా చుట్టి తాండ్రను తయారు చేస్తారు. తియ్యరగు మామిడి పండ్లను ఒక డబ్బాలో వేసి రోకలితో దంచగా వచ్చిన రసాన్ని తాండ్రగా తయారు చేస్తారు. మిగిలిన మామిడి తొక్కలను, టెంకలను వేరు చేసి ఎండబెడతారు. తొక్కలను తియ్యరగుగా పిలుస్తారు. వీటిని బెల్లంతో ఊరగాయగా చేసుకొని అన్నంతో కూరగా ఆరగిస్తారు. టెంకపిండి అంబలిగా... మామిడి పండ్ల నుంచి తొక్కను, రసాన్ని వేరుచేసిన తరువాత చివరిగా ఉండే మామడి టెంకలను కూడా ఎండబెట్టి పిండిగా చేస్తారు. దీన్ని ఉడగబెట్టి అంబలిగా చేసుకొని గిరిజనం ఆరగించటం ఆనవాయితీ. మార్కెట్లో మంచి గిరాకి.. ఏజెన్సీలో గిరిజనం తయారు చేసే తాండ్ర, తియ్యరకు మంచి గిరాకీ ఉంది. స్థానిక వ్యాపారులు తాండ్రను కేజీ రూ.80 వరకు కొనుగోలు చేస్తున్నారు. తియ్యరగు కేజీ రూ.50 ధర పలుకుతోంది. ఎటువంటి రసాయనాలు కలుపకుండా తయారు చేయటంతో వ్యాపారులు ఈ ప్రాంత తాండ్రపై మక్కువ చూపిస్తున్నారు. మామిడితో ఎంతో మేలు ప్రతీ ఏడాది మామిడితో గిరిజన కుటుంబాలకు అన్ని విధాలా మేలే. ఎందుకంటే మేము ఏడాదిపాటు వ్యవసాయ పనుల్లో ఉన్నప్పుడు తాండ్రను అన్నంతో, తియ్యరగు ఊరగాయగా వినియోగిస్తుంటాం, మామిడి టెంకను కూడా టెంక పిండి అంబలిగా చేసుకొని వృద్ధులు తాగుతారు. మరికొన్ని సందర్భాల్లో వ్యాపారులకు కూడా విక్రయిస్తుంటాం. మామిడితో మాకు అన్ని విధాలా మేలే. – బిడ్డిక తులసమ్మ, వలసబల్లేరు గిరిజన గ్రామం, కురుపాం మండలం -
మామిడి తాండ్ర రుచి.. తినరా మైమరచి
తాండ్ర...ఈ పేరు వింటేనే నోరూరుతుంది. గిరిజన మహిళలు సంప్రదాయబద్ధంగా తయారు చేస్తుండడంతో మరింత గిరాకీ పెరుగుతోంది. కిలో రూ.80 వరకూ ధర పలుకుతున్నా కొనుగోలుదారులు మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. మామిడి సీజన్ అయిపోయినా వీటిని భద్ర పరుచుకొని తినే అవకాశం ఉండడంతో డిమాండ్ పెరుగుతోంది. కొనుగోలుదారుల ఆసక్తిని గమనించి మరింత ఉత్పత్తి చేయడానికి ఈ ప్రాంత వాసులు కృషి చేస్తున్నారు. కురుపాం: గిరిజన మహిళలు సంప్రదాయంగా తయారుచేస్తున్న మామిడి తాండ్రకు మంచి గిరాకీ ఏర్పడింది. కురుపాం నియోజకవర్గ పరిధిలోని కురుపాం, గుమ్మలక్ష్మీపురం, కొమరాడ, జియ్యమ్మవలస మండలాల్లో గిరిశిఖర గ్రామాల్లో గిరిజన మహిళలు కొండమామిడి పండ్లను సేకరించి తాండ్ర తయారీకి ఉపక్రమిస్తున్నారు. ఏజెన్సీలో సహజసిద్ధంగా మామిడి చెట్లకు కాసే కొండమామిడి పండ్లను సేకరించి మామిడి తాండ్రను తయారు చేసి కిలో రూ.60 నుంచి రూ.80 వరకూ విక్రయిస్తున్నారు. తాండ్ర తయారీ ఏజెన్సీలో గిరిశిఖరాలపై మామిడి చెట్లకు కాసే కొండమామిడి పండ్లను ఇంటిల్లపాది ఉదయం, సాయంత్రం సమయాల్లో వెళ్లి పండ్లను సేకరించి వాటిని శుభ్ర పరిచి పెద్ద డబ్బాల్లో వేసి రోకలితో దంచుతారు. దంచగా వచ్చిన మామిడి రసాన్ని మేదర జంగెడలో పలుచగా వెదజల్లేలా ఆరబెడతారు. వీటిలో ఎటువంటి రసాయనాలు కలుపకుండానే పొరలు పొరలుగా వేసి వారం, పది రోజులు ఆరబెట్టి ఉండలా చుట్టి తాండ్రను తయారు చేస్తారు. తియ్యరగు మామిడి పండ్లను ఒక డబ్బాలో వేసి రోకలితో దంచగా వచ్చిన రసాన్ని తాండ్రగా తయారు చేస్తారు. మిగిలిన మామిడి తొక్కలను, టెంకలను వేరు చేసి ఎండబెడతారు. తొక్కలను తియ్యరగుగా పిలుస్తారు. వీటిని బెల్లంతో ఊరగాయగా చేసుకొని అన్నంతో కూరగా ఆరగిస్తారు. టెంకపిండి అంబలిగా... మామిడి పండ్ల నుంచి తొక్కను, రసాన్ని వేరుచేసిన తరువాత చివరిగా ఉండే మామడి టెంకలను కూడా ఎండబెట్టి పిండిగా చేస్తారు. దీన్ని ఉడగబెట్టి అంబలిగా చేసుకొని గిరిజనం ఆరగించటం ఆనవాయితీ. మార్కెట్లో మంచి గిరాకీ.. ఏజెన్సీలో గిరిజనం తయారు చేసే తాండ్ర, తియ్యరకు మంచి గిరాకీ ఉంది. స్థానిక వ్యాపారులు తాండ్రను కేజీ రూ.80 వరకు కొనుగోలు చేస్తున్నారు. తియ్యరగు కేజీ రూ.50 ధర పలుకుతోంది. ఎటువంటి రసాయనాలు కలుపకుండా తయారు చేయటంతో వ్యాపారులు ఈ ప్రాంత తాండ్రపై మక్కువ చూపిస్తున్నారు. మామిడితో ఎంతో మేలు ప్రతీ ఏడాది మామిడితో గిరిజన కుటుంబాలకు అన్ని విధాలా మేలే. ఎందుకంటే తాము ఏడాదిపాటు వ్యవసాయ పనుల్లో ఉన్నప్పుడు తాండ్రను అన్నంతో, తియ్యరగు ఊరగాయగా వినియోగిస్తుంటాం, మామిడి టెంకను కూడా టెంక పిండి అంబలిగా చేసుకొని వృద్ధులు తాగుతారు. మరికొన్ని సందర్భాల్లో వ్యాపారులకు కూడా విక్రయిస్తుంటాం. మామిడితో మాకు అన్ని విధాలా మేలే. - బిడ్డిక తులసమ్మ, వలసబల్లేరు, కురుపాం మండలం -
ఆవకాయ.. టేస్టే వేరు..
ఆవకాయ పచ్చడిలేని ఇల్లు జంటనగరాల్లో ఉండదంటే అతిశయోక్తి కాదు. వేసవి వచ్చిందంటే మామిడి సీజన్ మొదలవుతుంది. తెలుగు లోగిళ్లలో ఆవకాయ పచ్చడికి ఉన్న ప్రత్యేకతే వేరు. నగరంలో ఊరగాయల వాడకం ఎప్పటి నుంచో ఉంది. కానీ ఈ మధ్య కాలంలో యూట్యూబ్ లో వీడియోలు చూసి చాలామంది ఇళ్లలోనే పచ్చడి చేసుకుంటున్నారు. దానికితోడు కరోనా కారణంగా పచ్చళ్ల కోసం మార్కెట్లను ఆశ్రయించకుండా ఇంట్లో తయారు చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే.. పచ్చడి ప్రియులు ఎంతగానో ఎదురుచూసే పచ్చడి మామిడి కాయలు మార్కెట్లోకి వచ్చేశాయి. గతంలో కంటే కాస్త ధర ఎక్కువగా ఉన్నా వాటికి ఏ మాత్రం డిమాండ్ తగ్గలేదు. మహిళలు మార్కెట్‌కు వచ్చి వాటిని కొనుగోలు చేసి వారి వద్దే ముక్కలు చేయించుకొని తీసుకెళ్తున్నారు. దిల్సుఖ్నగర్: మలక్‌పేట్, మహేశ్వరం జోన్ పరిధిలోని ఇళ్లలో మామిడికాయ పచ్చడి పెట్టడంలో అందరూ బిజీగా ఉన్నారు. పెళ్లిళ్లు, పేరంటాలు.. ఇంట్లో ఏ కార్యం జరిగినా అక్కడ ఆవకాయ ఉండాల్సిందే.. పప్పులో ఉప్పు తగ్గినా.. కూరలో కారం తగ్గినా.. ఆవకాయ తోడైతే భోజనం సంపూర్ణంగా ముగిసినట్లే.. లాక్డౌన్ కారణంగా బయటకు వెళ్లడం చాలా వరకు తగ్గించారు. కూరగాయల కోసం నిత్యం మార్కెట్లకు వెళ్లకుండా వారానికి సరిపడా తెచ్చుకుంటున్నారు. దాంతో కొన్ని సమయాల్లో ఆవకాయ పచ్చడితోనే భోజనం లాగించేస్తున్నారు. మామిడి పచ్చళ్లలో రకాలెన్నో... మామిడి పచ్చడిలో రకాలు అనేకం.. కానీ ఎక్కువగా ఇష్టపడేవి ఆవకాయ, అల్లం పచ్చడి మాత్రమే.. వేసవిలో వచ్చే పుల్లటి మామిడితో తయారు చేయించుకొని ఏడాదంతా నిల్వ ఉంచుకుంటారు. పేద, మధ్యతరగతి వారి ఇళ్లలోనే ఎక్కువగా మామిడి పచ్చడి ఉంటుందనేది ఒకప్పటి మాట.. సంపన్నులు సైతం మామిడి పచ్చడికే జైకొడుతున్నారు. పెరిగిన మామిడికాయ ధరలు.. గతేడాది మామిడి దిగుబడి అంతగా లేదు. అయినా వివిధ ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకున్న కాయలతో పచ్చళ్లను తయారు చేసుకున్నారు. గతేడాది ఒక్కో కాయ ధర రూ.10 నుంచి రూ.20 వరకు విక్రయించారు. ఈ సంవత్సరం మామిడి దిగుబడి బాగానే ఉంది. పచ్చడి ప్రియులకు కావాల్సిన రకం కాయలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో రైతులు, వ్యాపారులకు గిట్టుబాటు అయ్యింది. మార్కెట్లో మంచి రకం కాయ ఒక్కటి రూ.20 నుంచి రూ.25 వరకు ధర పలుకుతోంది. సీజన్ ముగిసే సమయం దగ్గర పడుతుండటంతో కొనుగోళ్లు కూడా పెరిగాయి. -
ఆవకాయ పచ్చడి మరింత ప్రియం
జనగామ అర్బన్: ఆవకాయ పచ్చడి. దాని పేరు చేపితేనే అబ్బో నోరూరిపోతుంది. ఇది ఈ ఏడాది మరింత ప్రియం కానుంది. జిల్లాలో మామిడి తోటలు కాపు లేక వెలవెలబోతున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని వ్యాప్తంగా 2301 మంది రైతులు 9,405 ఎకరాల్లో మామిడి తోటలు పెంచుతున్నారు. వీటిలో జనగామ రెవెన్యూ డివిజన్లో 3,419 ఎకరాల్లో, స్టేషన్‌ఘన్‌పూర్ డివిజన్లో 4,063 ఎకరాల్లో అదే విధంగా పాలకుర్తి డివిజన్లో 1,922 ఎకరాల్లో ఈ తోటలు ఉన్నాయి. ఉద్యానవన శాఖ అధికారులు అంచనా ప్రకారం 16,31 మొట్రిక్ టన్నుల దిగుబడిని అంచనా వేశారు. కానీ, 9 నుంచి 10వేల మెట్రిక్ టన్నులు వచ్చినా సంతోషమే అంటున్నారు. జిల్లా అంతటా ఇదే పరిస్థితి జిల్లాలోని మూడు డివిజన్ అంటే 12 మండలాల నుంచి ఆశించిన దిగుబడి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే ఈ సారి తోటలు అంతగా కాపు లేదు. దాదాపు అన్ని మండలాల్లో ఇదే పరిస్థితి. సాధారణంగా మంచిగా కాసిన తోటలు ఎకరానికి నాలుగు టన్నులు దిగిబడి వస్తుంది. కానీ అది కాస్త ఇప్పుడున్న పరిస్థితిని బట్టి చూస్తే 2 నుంచి 2.5 టన్నులు కూడ వచ్చే పరిస్థితి లేదు. ఇటీవల ఈదురుగాలుల కారణంగా దాదాపు 50 శాతం పైగా తోటలు దెబ్బతిన్నాయి. దీంతో ఈ సారి మామిడి ధరలు ఆకాశంటనున్నాయి. మామిడి రేటు ఇలా.. సాధారణంగా 50 గ్రాములున్న మామిడి కాయలను దాదాపు రూ.4 నుంచి రూ.6 కు విక్రయించే వారు. కానీ, ఈ సారి అదే సైజులో ఉన్న కాయలు కూడా రూ. 8 నుండి 10 వరకు పెరిగినా ఆశ్చర్యం లేదంటున్నారు. ఆశించిన దిగబడి రాకపోవచ్చు ఈ సారి జిల్లా వ్యాపంగా మామిడి తోటల నుండి ఆశించిన దిగుబడి రాకపోవచ్చు. చాల చోట్లు తోటలు పూత దశలో ఉన్నట్లుగా ఇప్పుడు లేవు. లక్ష్యం 16వేల మెట్రిక్ టన్నులు ఉంది. అయితే పది వేల మెట్రిక్ టన్నులపైగా తప్పకుండా వస్తుందని ఆశిస్తున్నాం. ఆశించిన దిగుబడి వస్తే కాస్త ఇబ్బంది ఉండదు.– కేఆర్.లత,జిల్లా ఉద్యాన అధికారి, జనగామ -
ఆహా! ఆవకాయ
పచ్చళ్ల సీజన్ వచ్చేసింది.. మార్కెట్లో మామిడి, ఊసిరి, పండు మిర్చి, చింతకాయలు సందడి చేస్తున్నాయి.. ఏడాదికి సరిపోను పచ్చళ్లు తయారు చేసుకోవడం ఆనవాయితీ.. మామిడికి మంచి గిరాకీ ఉంది.. ముద్దపప్పు, ఆవకాయకు తోడు నెయ్యి ఉంటే నోరురాల్సిందే.. ప్రస్తుతం లాక్డౌన్ ఉన్నా నిబంధనలు పటిస్తూనే పచ్చళ్ల తయారీలో మహిళలు మునిగిపోయారు. సాక్షి, విజయవాడ: ఊరగాయ పచ్చళ్ల తయారీకి కృష్ణా జిల్లా ప్రసిద్ధి. పచ్చడి నిల్వకు అనువుగా ఉండే కాయలు అందుబాటులో ఉన్నాయి. అందులో మామిడి పచ్చడికి అగ్రస్థానం ఉంది. ఇక్కడ తయారీ చేసినా పచ్చళ్లు దేశవిదేశాలకు సరఫరా చేస్తుంటారు. పల్లె నుంచి పట్టణాల వరకు ప్రజలు పచ్చళ్లు సొంతగా తయారు చేసుకునే అలవాటు తెలుగు ప్రజలకు ఎప్పటి నుంచో ఉంది. దీంతో మహిళలు రకరకాల ఊరగాయ పచ్చళ్లు, వడియాలు, అప్పడాలు, ఊరమిరపకాయలు ఏడాదికి సరిపడా సిద్ధం చేసుకునే పనిలో పడ్డారు. మామిడి తరువాత చింతకాయ, ఊసిరికాయ, మాగాయి పచ్చళ్లు ఉంటాయి. ఎవరి ఆర్థిక పరిస్థితి, ఇంట్లో తినేవారి తిండిపుష్టిని పట్టి ఏడాదికి సరిపోను పచ్చళ్లు తయారు చేసుకుని నిల్వ చేసుకుంటారు. లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూనే... కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం లాక్‌డౌన్‌ను అమలు చేస్తోంది. నిబంధనలు పరిధిలో మహిళలు వేసవిలో పట్టాల్సిన ఊరగాయపచ్చళ్లు పట్టేస్తున్నారు. ఉదయం లాక్డౌన్ సడలించిన సమయంలో మహిళలు హడావుడిగా మార్కెట్‌కు, రైతుబజార్లకు వచ్చి మామిడికాయలు కొనుగోలు చేసి అక్కడే అందుబాటులో ఉంటే మేదర్లు చేత ఆవకాయ ముక్కలు కొట్టించుకుని 9 గంటల లోగా ఇళ్లకు చేరుతున్నారు. అక్కడ నుంచి ఒకటి రెండు రోజుల్లో రుచికరమైన ఆవకాయ పచ్చడి సిద్ధం చేస్తున్నారు. పురుషులు ఇళ్లలోనే ఉండటం ఊరగాయ పచ్చళ్లు, వడియాలు తయారీలో మహిళలకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు. మహిళల ముందు చూపు.. రాత్రికి రాత్రి కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించినా ఆంధ్రా మహిళలు ఏమాత్రం బెదిరిపోలేదు. నెలరోజులుగా ఇళ్లలో కూరలు, సరుకులు లేకపోయినా.. కుటుంబాలు పస్తులు ఉండకుండా నాలుగు పచ్చడి మెతుకులతోనైనా భోజనం కానిచ్చేయడం వెనుక మహిళల ముందు చూపు ఎంతో ఉంది. పచ్చళ్లకు తోడుగా వడియాలు, అప్పడాలు కలిపారంటే భోజనం సంపూర్ణంగా పూర్తయినట్లే. ప్రస్తుత వేసవిలో ఊరగాయపచ్చళ్లు పెట్టుకోకపోతే ఏడాదంతా ఇబ్బంది పడాల్సి వస్తుందని పద్మావతి అనే మహిళ ‘సాక్షి’కి తెలిపింది. లాక్డౌన్ ఎత్తి వేసే వరకు ఆగితే మామిడికాయలు పండిపోయి పచ్చడి పాడైపోతుందని, అందువల్ల తప్పని పరిస్థితుల్లో ఇప్పుడే పెట్టేస్తున్నామని చెబుతున్నారు. నిరుపేదలకు ఉపాధి.. వెదురు కర్రతో తడికలు, బుట్టలు తయారు చేసుకునే మేదర్లకు ప్రస్తుత సీజన్లో మామిడి కాయలు ముక్కలుగా నరికి ఇచ్చి నాలుగు రూపాయలు సంపాదిస్తున్నారు. ఒక్కొక్క కాయను ముక్కలుగా కట్ చేయడానికి సైజును బట్టి రూ.5 నుంచి రూ.10 వసూలు చేస్తున్నారు. ప్రతి రోజు ఉదయం పూట మూడు గంటలు కష్టపడితే రూ.200 వరకు ఆదాయం వస్తోందని కేదారేశ్వరపేట వంతెన వద్ద మామిడి కాయలు తరిగే ప్రసాద్ తెలిపాడు. లోకమణికి డబ్బులు పంపిస్తున్న ఎన్నారైలు -
మామిడితాండ్ర C/O ఊనగట్ల
చాగల్లు: పశ్చిమగోదావరి జిల్లా చాగల్లు మండలం ఊనగట్ల గ్రామంలో మామిడి తాండ్ర తయారీ కుటీర పరిశ్రమగా అభివృద్ధి చెందింది. మామిడి పండ్ల గుజ్జు నుంచి తాండ్రను తయారు చేస్తారు. ఏటా ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ఈ గ్రామంలో మామిడి తాండ్ర తయారీ ముమ్మరంగా జరుగుతుంది. మామిడి పండ్లను గతంలో రోళ్లలో వేసి కుమ్మి గుజ్జు తీసేవారు. ఇప్పుడు అధునాతమైన యంత్రాలు సహాయంతో గుజ్జు తీస్తున్నారు. ఆ గుజ్జులో బెల్లం లేదా పంచదార కలిపి తాటాకు చాపలతో మామిడి గుజ్జును పూతగా పెడతారు. ఈ విధంగా ఎండాకాలంలో రోజుకు ఐదు నుంచి ఎనిమిది సార్లు చొప్పున వారం రోజులపాటు పూత పెడితే మామిడితాండ్ర తయారవుతుంది. చాపల మాదిరిగా ఉన్న తాండ్రను ఆరిన తరువాత వాటిని చిన్నసైజు ముక్కలుగా కోసి 50 కిలోలు చొప్పున పెట్టెల్లో ప్యాక్ చేసి భద్రపరుస్తారు. మామిడి పళ్లకు పెరిగిన గిరాకీ మామిడితాండ్రకు కలెక్టర్, రసాలు, బంగినపల్లి వంటి మామిడిపళ్ల రకాలను వినియోగిస్తారు. ఈ ఏడాది మామిడి పళ్లకు గిరాకీ ఎక్కవగా ఉండటంతో టన్ను రూ.13 వేల నుంచి రూ.15 వేల వరకు ధరకు కొనుగోలు చేస్తున్నట్లు మామిడితాండ్ర తయారీదారులు చెబుతున్నారు. నిడదవోలు, కొవ్వూరు పాడు, ద్వారకాతిరుమల, తాడేపల్లిగూడెం, నూజివీడు మార్కెట్ల నుంచి మామిడికాయలను టన్నుల లెక్కన కొనుగోలు చేస్తారు. గత రెండేళ్లుగా వాతావరణం అనుకూలించక మామిడికాయల కాపు తగ్గి రేట్లు గణనీయంగా పెరిగాయని తయారీదారులు చెబుతున్నారు. గ్రామంలో 450 మందికి ఉపాధి మామిడి తాండ్ర తాయారీ కేంద్రాలు పెద్ద కేంద్రాల్లో 25 నుంచి 30 మంది, చిన్న కేంద్రాల్లో 15 నుంచి 20 మంది ఉపాధి పొందుతున్నారు. గ్రామంలో సుమారు 450 మందికి పైగా మహిళలు, పిల్లలు ఉపాధి పొందుతున్నారు. వ్యవసాయ పనులు లేని సమయంలో మామిడితాండ్ర తయారీ సమయం కావడంతో మహిళలకు ఉపాధి కల్పించడంతో పాటు ఆదాయ వనరుగా కూడా ఈ ప్రాంత ప్రజల అభివృద్ధికి దోహదం చేస్తుంది. రైతులకు మామిడికాయలకు గిట్టుబాటు ధర రావడానికి కూడా ఇంది ఎంతగానో దోహదం చేస్తుంది. ఈ విధంగా ఈ ప్రాంత ప్రజలకు మామిడితాండ్ర తయారీ చక్కని ఉపాధి అవకాశాలను కలిగిస్తోంది. మార్కెట్ లేక తగ్గిన తయారీ కేంద్రాలు మామిడితాండ్ర తయారీ ద్వారా రోజుకు టన్ను మామిడికాయల వరకు దిగుమతి చేసుకుంటారు. మామిడితాండ్రను అందమైన ముక్కలు కోసి 50 కేజీలు చొప్పున పెట్టెలుగా పెట్టి 200 పెట్టెలను లారీకి ఎగుమతి చేస్తుంటారు. టోకున మామిడితాండ్ర ధర క్వింటాలు రూ.7 వేలు నుంచి రూ.8 వేల వరకు ధర ఉంటుంది. ఆ వంతున రూ.50 లక్షల వరకు వ్యాపారం జరుగుతుంది. ముంబై, చెన్నై తదితర ప్రాంతాలకు ఇక్కడి నుంచి తాండ్ర ఎగుమతి అధికంగా జరిగేది. అయితే గతంలో వ్యాపారస్తులు మామిడితాండ్ర తయారీదారులను మోసగించి డబ్బులు సక్రమంగా చెల్లించకపోవడం వల్ల చాలావరకు ఎగుమతులు తగ్గిపోయాయి. మార్కెటింగ్ లేక ఇబ్బందులు పడుతున్నామని వీరు చెబుతున్నారు. దీంతో ప్రస్తుతం మామిడితాండ్ర తయారీ కేంద్రాలు గత రెండేళ్ల క్రితం 50 వరకు ఉండగా ప్రస్తుతం 10 కేంద్రాలకు పరిమితమయ్యాయి. మామిడితాండ్రను స్థానికంగా అమ్మడానికే తయారీదారులు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. తయారీదారులే కాకుండా మామిడితాండ్రను సైకిళ్లపై విక్రయిస్తూ మరో వంద మంది వరకు ఉపాధి పొందుతున్నారు. రుణ సౌకర్యం కల్పించాలి ఎన్నో ఏళ్లుగా మామిడితాండ్ర తయారీ పరిశ్రమ నిర్వహిస్తున్నాం. బ్యాంకులు రుణ సౌకర్యం కల్పిస్తే ప్రైవేట్ వ్యక్తుల నుంచి అధిక వడ్డీకి రుణాలు తెచ్చుకునే అవకాశం ఉండదు. మామిడికాయల రేట్లు గత రెండేళ్లుగా బాగా పెరగడం, మార్కెటింగ్ సమస్య వల్ల తయారీదారులు తగ్గిపోయారు. రుణ సౌకర్యం కల్పించి ప్రోత్సహించాలి. – కె.శ్రీనివాసరావు, మామిడితాండ్ర తయారీదారుడు, ఊనగట్ల మహిళలకు ఉపాధి మామిడితాండ్రను కుటీర పరిశ్రమగా వేసవికాలంలో మహిళలకు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. పనిని బట్టి రోజుకు రూ.150 నుంచి రూ.200 వరకు కూలి లభిస్తుంది. ఈ ప్రాంత మహిళలకు తాండ్ర పరిశ్రమ అభివృద్ధికి దోహదం చేస్తుంది. ప్రభుత్వం మామిడితాండ్ర పరిశ్రమను గుర్తించి పోత్స్రహించాలి. – యాండ్ర మాణిక్యం, మామిడితాండ్ర తయారీ కూలీ, ఊనగట్ల సీజన్లో పనికి వెళతా నేను డిగ్రీ చదివాను. ఉపాధి అవకాశాలు లేకపోవడంతో వేసవిలో తాండ్ర తయారీ పనులకు వెళుతున్నాను. సీజన్లో ఈ పనులకు వెళ్లడం వల్ల కుటుంబానికి ఆర్థికంగా అసరాగా ఉపయోగపడుతున్నాను. సీజన్లోనే పని ఉంటుంది. ఆ సమయంలో ఎంతో కొంత సంపాదించుకుంటున్నాను. నాలాగే చాలా మంది దీనిపై ఆధారపడ్డాం. – కోడి సతీష్, యువకుడు, ఊనగట్ల -
పచ్చిళ్లు
పచ్చళ్లే! పచ్చికాయలు కనుక పచ్చిళ్లు!పచ్చిగా చెప్పాలంటే..కొంచెం వయలెన్స్ ఉంటే కానీతయారీలో ఘాటు..ప్లేట్లోకి వచ్చాక షూట్ ఎట్ సైటు.. ఉండవు.కారం... ఉప్పు.. ఆవపొడి.. నువ్వులనూనెకలిస్తే.. చేతినిండా కలిపితేజిహ్వ జిమ్మాస్టిక్సే. నోరు ఏరోబిక్సే. వడు మాంగా కావలసినవి: మామిడి పిందెలు – రెండు కప్పులు (మామిడి పిందెలు గుండ్రంగా ఉండాలి); ఉప్పు – తగినంత (రాతి ఉప్పు మంచిది. మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి); నువ్వుల నూనె – 2 టేబుల్ స్పూన్లు పొడి కోసం: ఎండు మిర్చి – 20; మెంతులు – అర టీ స్పూను; ఆవాలు – ముప్పావు టీ స్పూను; పసుపు – కొద్దిగా; ఇంగువ – పావు టీ స్పూను తయారీ: ►ముందుగా మామిడి పిందెలను శుభ్రంగా కడిగి, పొడి వస్త్రంతో తుడిచి, కొద్ది సేపు నీడలో ఆరబెట్టాలి ►ఒక పాత్రలో ఆరిన మామిడి పిందెలు వేసి వాటి మీద నూనె వేసి బాగా కలపాలి (అలా చేయడం వల్ల అన్ని మామిడి పిందెలకు నూనె పడుతుంది) ►బాణలిలో కొద్దిగా నూనె వేసి ఆవాలు, మెంతులు, ఎండు మిర్చి వరసగా ఒక దాని తరవాత ఒకటి వేసి వేయించి చల్లారాక, ఉప్పు, ఇంగువ జత చేసి మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి ►పావు కప్పు నీళ్లను మరిగించి చల్లార్చి, జత చేసి పొడిని మెత్తటి ముద్దలా అయ్యేలా చేయాలి ►ఈ మిశ్రమాన్ని మామిడిపిందెల మీద పోసి కిందకి పైకి బాగా కలపాలి ►రోజుకి మూడు నాలుగుసార్లు చొప్పున అలా మూడు రోజులు కలపాలి ►మామిడి పిందెలు మెత్తగా అయ్యి తినడానికి అనువుగా తయారవుతాయి ►వేడి వేడి అన్నంలోకి కమ్మటి నువ్వుల నూనెతో కలుపుకుని తింటే వడు మాంగా రుచిగా ఉంటుంది. టెండర్ మ్యాంగో పికిల్ కావలసినవి: మామిడి పిందెలు – ముప్పావు కిలో; ఉప్పు – ముప్పావు కప్పు; ఆవాలు – టేబుల్ స్పూను; పసుపు – ఒకటిన్నర టీ స్పూన్లు; నువ్వుల నూనె – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు; ఎండు మిర్చి – 20 తయారీ: ►మామిడి పిందెలను శుభ్రంగా కడిగి, పొడి వస్త్రంతో తుడిచి, నీడలో కొద్దిసేపు ఆరబెట్టాలి ►తొడిమలను చాకుతో కట్ చేయాలి ►రాతి ఉప్పును మిక్సీలో వేసి మెత్తగా చేసి పక్కన ఉంచాలి ►ఆవాలు మిక్సీలో వేసి మెత్తగా అయ్యాక పసుపు జత చేయాలి ►తగినన్ని నీళ్లు జత చేసి మెత్తగా చేయాలి ►పెద్ద పాత్రలో మామిడి పిందెలు వేసి వాటి మీద నువ్వుల నూనె వేసి బాగా కలపాలి ►ఆవ పొడి జత చేసి మరోమారు కలపాలి ►ఉప్పు వేసి బాగా కలిపి జాడీలోకి తీసుకోవాలి ►మూడు రోజుల పాటు ప్రతిరోజూ రెండు పూటలా పైకి కిందకి కలుపుతుండాలి ►నాలుగో రోజుకి ఊట కిందకి దిగుతుంది ►మిక్సీలో ఎండు మిర్చి వేసి పొడి చేయాలి ►ముందుగా తయారుచేసి ఉంచుకున్న ఊరగాయలో నుంచి వచ్చిన ఊట కొంత తీసి, ఎండు మిర్చి పొడిలో వేసి మెత్తగా చేయాలి ►ఒక పెద్ద పాత్రలోకి ఊరగాయ తిరగదీసి, దాని మీద ఈ మిశ్రమం వేసి, జాడీలోకి తీసుకోవాలి ►పది రోజుల పాటు ప్రతిరోజూ పైకి కిందకి కలపాలి ►వేడి వేడి అన్నంలోకి కమ్మటి నువ్వుల నూనెతో కలుపుకుంటే వడ దెబ్బ బారి నుంచి రక్షించుకోవచ్చు. కన్ని మాంగా అచార్ కావలసినవి: మామిడి పిందెలు – కేజీ; కారం – 4 టేబుల్ స్పూన్లు; ఉప్పు – పావు కేజీ; ఇంగువ – టీ స్పూను; ఆవాలు – 50 గ్రాములు (పొడి చేయాలి) తయారీ: ►మామిడి పిందెలను శుభ్రంగా కడిగి పొడి వస్త్రంతో తుడిచి, తడి పోయేవరకు ఆరబెట్టి, తొడిమలు తీసేయాలి ►తగినన్ని నీళ్లకు ఉప్పు జత చేసి మరిగించి చల్లార్చాలి ►పెద్ద జాడీలో ముందుగా మామిడి పిందెలు వేసి, వాటి మీద నీళ్లు పోసి (పిందెలన్నీ మునగాలి) మూత పెట్టి, మూడు రోజులు అలాగే ఉంచాలి ►నాలుగవ రోజున నీళ్లను వడకట్టి పిందెలు వేరు చేయాలి ►ఈ నీటికి కారం, ఇంగువ, ఆవ పొడి జత చేసి బాగా కలపాలి ►ఈ నీటిని మళ్లీ జాడీలో పోసి, ఆ పైన మామిడి పిందెలు వేసి బాగా కలిపి మూత గట్టిగా బిగించి, సుమారు వారం రోజుల తరవాత తీసి వాడుకోవాలి. కడు మాంగా అచార్ కావలసినవి: మామిడి పిందెలు – 5; ఆవాలు – టీ స్పూను; కరివేపాకు – రెండు రెమ్మలు; పచ్చిమిర్చి – 6; పసుపు – పావు టీ స్పూను; మెంతి పొడి – టీ స్పూను; కారం – 2 టీ స్పూన్లు; ఉప్పు – తగినంత; నూనె – 4 టేబుల్æస్పూన్లు తయారీ: ►మామిడి పిందెలను శుభ్రంగా కడిగి, తడిపోయేవరకు ఆరబెట్టి, చిన్న చిన్న ముక్కలుగా తరిగి పక్కన ఉంచాలి ►బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు వేసి చిటపటలాడించాలి ►కరివేపాకు, పచ్చిమిర్చి తరుగు వేసి వేయించాలి ►పసుపు, కారం కూడా వేసి బాగా వేయించి, చిన్న కప్పుడు నీళ్లు, ఉప్పు వేసి మరిగించాలి ►మామిడికాయ ముక్కలు వేసి సుమారు పది నిమిషాలు ఉడికించాలి ►మిశ్రమం దగ్గరపడి చిక్కగా తయారయ్యాక దింపేయాలి ►చల్లారాక గాలి చొరని సీసాలోకి తీసుకోవాలి (ఇష్టపడేవారు కొద్దిగా బెల్లం తురుము కలుపుకోవచ్చు మామిడి కాయ గ్రేవీ చట్నీ కావలసినవి: పచ్చి మామిడికాయ ముక్కలు – అర కేజీ; పసుపు – అర టీ స్పూను; ఉప్పు – తగినంత; బెల్లం – ఒక కప్పు; ధనియాలు – 2 టేబుల్ స్పూన్లు; ఎండు మిర్చి – 15 (కాశ్మీర్ మిర్చి); కొబ్బరి నూనె – 4 టేబుల్ స్పూన్లు; మెంతులు – పావు టీ స్పూను; మినప్పప్పు – ఒక టేబుల్ స్పూను; పచ్చి కొబ్బరి – రెండు కప్పులు; ఇంగువ – కొద్దిగా; కరివేపాకు – 2 రెమ్మలు తయారీ: ►తరిగిన పచ్చిమామిడికాయ ముక్కలను ఒక పెద్ద పాత్రలో వేసి పసుపు, ఉప్పు, బెల్లం జత చేసి కలిపి పక్కన ఉంచాలి ►స్టౌ మీద బాణలి వేడయ్యాక రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు వేసి వేయించి తీసి చల్లార్చాలి ►అదే బాణలిలో ఎండు మిర్చి వేసి వేయించి ఒక పాత్రలోకి తీసుకుని చల్లార్చాలి ►బాణలిలో ఒక టీ స్పూను కొబ్బరి నూనె వేసి కాగాక ఒక టీ స్పూను బియ్యం వేసి వేయించాలి ►మెంతులు కొద్దిగా జత చేయాలి ►మినప్పప్పు కూడా జత చేసి వేయించి ప్లేట్లోకి తీసుకోవాలి ►మిక్సీలో రెండు కప్పుల పచ్చి కొబ్బరి తురుము, వేయించిన బియ్యం, మెంతులు, మినప్పప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టాలి ►కొద్దిగా నీళ్లు జత చేయాలి ►స్టౌ మీద బాణలిలో మూడు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె వేసి కాగాక ఆవాలు, ఇంగువ, కరివేపాకు వేసి వేయించాలి ►మామిడికాయ ముక్కలు జత చేయాలి ►మిక్సీ పట్టిన మిశ్రమం జత చేయాలి ►కప్పుడు నీళ్లు పోసి కలపాలి ►ముప్పావు కప్పు కొబ్బరి పాలు పోసి మరోమారు కలిపి మూత పెట్టాలి ►పావు గంట తరవాత మూత తీయాలి ►మామిడి గ్రేవీ చట్నీ అన్నం, చపాతీలలోకి రుచిగా ఉంటుంది. మామిడికాయ పచ్చడి కావలసినవి: మామిడి కాయలు – 4 (పచ్చివి); ఎండు మిర్చి – 8 ; ఉప్పు – తగినంత; పసుపు – చిటికెడు. తయారీ: ►మామిడికాయల తొక్కు తీసి, చిన్న చిన్న ముక్కలుగా తరగాలి ►ఒక్కో ఎండు మిర్చిని మంట మీద దోరగా కాల్చాలి ►మిక్సీలో ఎండు మిర్చి, మామిడికాయ ముక్కలు, ఉప్పు, పసుపు వేసి మెత్తగా చేయాలి ►అన్నంలోకి వేడి వేడి నేతితో కలుపుకుంటే రుచిగా ఉంటుంది. మామిడికాయ – కొత్తిమీర పచ్చడి కావలసినవి: మామిడికాయ ముక్కలు – ఒక కప్పు; కొత్తిమీర – చిన్న కట్ట; నానబెట్టిన పచ్చి సెనగ పప్పు – ఒక టేబుల్ స్పూను; జీలకర్ర పొడి – అర టీ స్పూను; ఉప్పు – తగినంత; ఆవనూనె – అర టీ స్పూను; ఉల్లి తరుగు – పావు కప్పు; పచ్చి మిర్చి – 4; పంచదార – అర టీ స్పూను తయారీ: ►మామిడికాయ ముక్కలు, కొత్తిమీర, నానబెట్టిన పచ్చి సెనగ పప్పు, జీలకర్ర పొడి, ఉప్పులను మిక్సీలో వేసి మెత్తగా తిప్పాలి ►ఆవ నూనె వేసి మరోమారు తిప్పాలి ►ఉల్లి తరుగు, పచ్చిమిర్చి, కొద్దిగా నీళ్లు వేసి తిప్పాలి ►పంచదార జత చేసి మరోమారు తిప్పాలి ►అప్పటికప్పుడు చేసుకునే ఈ చట్నీ అన్నంలో ఏ పదార్థంతోనైనా నంజుకుని తింటే రుచిగా ఉంటుంది. పచ్చి మామిడికాయ పచ్చడి కావలసినవి: మామిడికాయ ముక్కలు – అరకప్పు; వెల్లుల్లి రెబ్బలు – 2; కొత్తిమీర – కొద్దిగా; కరివేపాకు – కొద్దిగా; మిరప కారం – 2 టీ స్పూన్లు; పచ్చి కొబ్బరి తురుము – ఒక టేబుల్ స్పూను; ఉప్పు – తగినంత పోపు కోసం: ►ఆవాలు – అర టీ స్పూను; జీలకర్ర – అర టీ స్పూను; నూనె – ఒక టేబుల్ స్పూను. ►పైన చెప్పిన పదార్థాలను (పోపు సామాను మినహాయించి) మిక్సీలో వేసి మెత్తగా తిప్పి గిన్నెలోకి తీసుకోవాలి ►స్టౌ మీద చిన్న బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర వేసి వేయించి పచ్చడిలో కలపాలి. -
కందకాలే మామిడి చెట్లను బతికించాయి!
కరువుతో భూగర్భ జలాలు అడుగంటి పెద్దలు నాటిన మామిడి చెట్లు ఒకటొకటీ నిలువునా ఎండిపోతున్నాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కని సంక్షోభ సమయంలో ‘సాక్షి సాగుబడి’ స్ఫూర్తితో, తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం పెద్దల సాంకేతిక సలహాల మేరకు కందకాలు తవ్వి తాతల నాటి మామిడి చెట్లను విజయవంతంగా కాపాడుకోగలిగామని చిత్తూరు జిల్లాకు చెందిన రైతు బాపు ప్రసాద రెడ్డి సంబరంగా చెబుతున్నారు. బాపు ప్రసాద రెడ్డి కుటుంబ ఉమ్మడి సేద్యం కింద పాకాల మండలం దామలచెరువు గ్రామపరిధిలో తాతల నాటి మామిడి తోటలున్నాయి. 2016లో తీవ్ర కరువు పరిస్థితుల నేపథ్యంలో పెద్ద మామిడి చెట్లు కొన్ని ఎండిపోయాయి. ఆ దశలో ‘సాక్షి సాగుబడి’ పేజీలో ‘చేను కిందే చెరువు’ శీర్షికన ప్రచురించిన కథనం ద్వారా తక్కువ ఖర్చుతోనే కందకాలు తవ్వుకుంటే భూగర్భ జలాలను పెంచుకొని నీటి భద్రత సాధించవచ్చని తెలుసుకొని, ప్రాణం లేచి వచ్చిందని ఆయన తెలిపారు. తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం ప్రధాన కార్యదర్శి మేరెడ్డి శ్యాంప్రసాదరెడ్డి, అధ్యక్షులు సంగెం చంద్రమౌళి (98495 66009) లను ఫోను ద్వారా సంప్రదించి, వారి సూచనల ప్రకారం వాలుకు అడ్డంగా మీటరు లోతు, మీటరు వెడల్పున జేసీబీతో కందకాలు తవ్వించామని బాపు రెడ్డి వివరించారు. కందకం పొడవు 25 మీటర్ల తర్వాత 5 మీటర్లు ఖాళీ వదిలి, అదే వరుసలో 25 మీటర్ల పొడవున మరో కందకం తవ్వించామని తెలిపారు. జేసీబీతో తవ్వించడానికి ఎకరానికి రూ. 2,500 వరకు ఖర్చయిందన్నారు. ఆ తర్వాత వర్షాలు పడినప్పుడు వర్షపు నీరు పూర్తిగా ఇంకి భూగర్భ జలాలు పెరిగాయని, ఆ తర్వాత నుంచి ఒక్క మామిడి చెట్టు కూడా ఎండిపోలేదన్నారు. అంతేకాదు, ఈ రెండేళ్లలో మామిడి తోట చాలా కళగా ఉంది. పంట దిగుబడి కూడా బాగా వచ్చిందని ఆయన సంతోషంగా చెప్పారు. అయితే, ధర అంత బాగాలేదు. ధర బాగుంటే మరింత లాభదాయకంగా ఉండేదన్నారు. చనిపోయిన చెట్ల స్థానంలో సీతాఫలం, జామ మొక్కలు నాటాలని భావిస్తున్నామన్నారు. కందకాల వల్ల నిజంగా ఎంతో మేలు జరుగుతున్నదని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదని బాపురెడ్డి(90301 81344) అన్నారు. -
కోహితూర్.. నిజమైన రాజ ఫలం!
చారిత్రక ప్రసిద్ధి పొందిన కోహితూర్ మామిడి పండుకు ప్రాదేశిక గుర్తింపు పొందడానికి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇది అత్యంత మధురమైన ఫలరాజం. దీనికున్న మరో విశిష్టత ఏమిటంటే.. ప్రత్యేకించి రాజ కుటుంబీకులు మాత్రమే తినేవారట. దాదాపు రెండున్నర శతాబ్దాల క్రితం ఈస్టిండియా కంపెనీ భారత ఉపఖండంలో రాజకీయ పగ్గాలు చేపట్టడానికి ముందు పశ్చిమ బెంగాల్‌ను పాలించిన ముర్షీదాబాద్ చివరి నవాబు సిరాజ్–ఉద్–దాలా హయాం(క్రీ.శ.1733–1757)లో ఈ మామిడి వంగడం రూపుదాల్చింది. ఈ ఫలరాజాన్ని రాజ కుటుంబీకులు అమితంగా ఇష్టపడేవారట. చారిత్రక ప్రసిద్ధి పొందిన ఈ మధుర ఫలరాజం ఒక్కొక్కటి రూ.1,500 వరకు మార్కెట్లో ధర పలుకుతోందిప్పుడు. ఇది సున్నితమైన ఫలం కావడం వల్ల చెట్టు మీదనే మిగల పండిన తర్వాత చేతితోనే కోసి.. భద్రంగా దూదిలో ఉంచుతూ ఉంటారు. కోసిన తర్వాత సాధ్యమైనంత త్వరగా తినేయాల్సి ఉంటుంది. అతి సున్నితమైన పండు కావడంతో నిల్వ, రవాణాలో పరిమితుల దృష్ట్యా ఈ వంగడం వాణిజ్యపరంగా సాగుకు అనుకూలమైనది కాదని రైతులు భావిస్తున్నారు. అందువల్ల ఈ వంగడం అంతరించిపోయే స్థితిలో ఉంది. ముర్షీదాబాద్ జిల్లాలో 15 మంది రైతుల దగ్గర 25–30 కొహితూర్ మామిడి చెట్లు మాత్రమే మిగిలి ఉన్నాయట. కొన్ని చెట్ల వయసు 150 ఏళ్లకు పైగానే ఉందట. ఒక్కో చెట్టు ఏడాదికి 40 పండ్ల కన్నా కాయదు. ఒక సంవత్సరం కాసిన చెట్టు రెండో ఏడాది కాయదు. ఈ నేపధ్యంలో కోహితూర్ మామిడి రకాన్ని పరిరక్షించడానికి ఉపక్రమించిన పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రాదేశిక గుర్తింపు ఇవ్వవలసిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని ఇటీవల కోరింది. ముర్షీదాబాద్ నవాబు సిరాజ్–ఉద్–దౌలా మామిడి పండ్లంటే అమితంగా ఇష్టపడే వారట. దేశవ్యాప్తంగా అనేక రకాల మామిడి రకాలను సేకరించి పెంచేవారు. మేలైన మామిడి రకాలను సంకరపరచి మంచి రకాలను తయారు చేసేందుకు ప్రత్యేక నిపుణులను ఆయన నియమించారు. హకీమ్ అదల మొహమ్మది అనే మామిడి ప్రజనన అధికారి.. రాజు గారికి బాగా ఇష్టమైన కాలోపహర్ను, మరో రకాన్ని సంకరపరచి కొహితూర్ వంగడాన్ని రూపొందించారు. రైతుకు పండుకు రూ. 500 వరకు రాబడి ఉంటుంది కాబట్టి.. ప్రాదేశిక గుర్తింపు(జి.ఐ.) ఇస్తే దీని సాగుకు రైతులను ప్రోత్సహించడం సాధ్యపడుతుందని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం భావిస్తోంది. ప్రాదేశిక గుర్తింపు లభిస్తే.. సంబంధిత అధికారుల వద్ద ముందుగా రిజిస్టర్ చేయించుకున్న రైతులే ఈ వంగడాన్ని సాగు చేయగలుగుతారు, అమ్ముకోగలుగుతారు. పూర్వం రాజులు కోహితూర్ మామిడి పండ్లను తేనెలో ముంచి ఉంచడం ద్వారా కొన్ని రోజుల పాటు నిల్వ ఉంచుకునే వారట! అంతేకాదు.. ఇనుప కత్తితో కోస్తే దీని రుచి పాడవుతుందట. వెదురు చాకులతో కోస్తేనే దీని రుచి బాగుంటుందని చెబుతుండటం విశేషం!! -
శంబాజీకి షోకాజ్ నోటీసులు
సాక్షి, ముంబై : తన తోటలోని మామిడి పళ్లు తింటే కొడుకులు పుడతారంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేసిన హిందుత్వ నేత శంబాజీ బిదేకు నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్ షోకాజ్ నోటీసు జారీ చేసింది. ‘మీ తోటలోని పళ్లు తిని మగ పిల్లల్ని సంతానంగా పొందిన జంట వివరాలు పేర్లతో సహా వెల్లడించాల్సి ఉంటుంది. మీరు చేసిన వ్యాఖ్యలను నిరూపించుకోవాల్సిన ఆవశ్యకత ఉందంటూ’ నోటీసులో పేర్కొంది. కాగా రాయ్‌గఢ్‌లో మరాఠాల యోధుడు చత్రపతి శివాజీ మహారాజ్ బంగారు సింహాసనాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ నాసిక్‌లో ర్యాలీ నిర్వహించిన శంబాజీ.. ‘మామిడి పళ్లలో మంచి పోషకాలుంటాయని, తమ తోట మామిడి పళ్లు తిన్న జంటలకు మగ పిల్లలే పుట్టారని’ వ్యాఖ్యానించారు. ‘ఇప్పటి వరకు ఈ విషయాన్ని నా తల్లికి మినహా ఎవరికి చెప్పలేదు. నాతోటలోని మామిడి పండ్లు తిన్న 150 జంటలకు 180 మంది మగపిల్లలు జన్మించారు. ఎవరికైనా మగపిల్లలు కావాలనిపిస్తే ఈ మామిడి పండ్లు తినండి. సంతానలేమి సమస్యతో బాధపడే దంపతులకు కూడా ఈ మామిడి పండు ఉపయోగపడుతోంది.’ అని శాంబాజీ చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలపై మండిపడిన న్యాయవాది, సామాజిక వేత్త అబా సింగ్... మూఢనమ్మకాలను ప్రచారం చేస్తోన్న శంబాజీపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. -
దారుణం: మామిడి పళ్లు కోయబోతే..
పట్నా : ఒక పక్క విచ్చలవిడి తుపాకీ సంస్కృతితో అమెరికాలో రోజుకో రక్తచరిత్ర నమోదవుతుండగా.. మన దేశంలో కూడా అలాంటి ఘటనలే చోటుచేసుకుంటున్నాయి. ఆకలిగా ఉందని మామిడి పళ్లు కోసుకోవడానికి ఒక తోటలోకి ప్రవేశించిన బాలున్ని యజమాని తుపాకీతో కాల్చి చంపాడు. ఈ దారుణ ఘటన బిహార్‌లోని గోర్గి పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుది. ఎస్సై దీపక్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. షేర్గర్ గ్రామ సమీపంలో స్నేహితులతో కలిసి ఆడుకుంటున్న పన్నెండేళ్ల పిల్లాడు పక్కనే ఉన్న తోటలోకి మామిడి పళ్లు కోసుకుందామని వెళ్లాడు. అక్కడే కాపలాగా ఉన్న యజమాని బాలున్ని పట్టుకునేందుకు ప్రయత్నించాడు. భయంతో పిల్లాడు పారిపోయేందుకు యత్నించడంతో తుపాకీతో కాల్చాడు. బుల్లెట్ సరాసరి తలలోకి దూసుకుపోవడంతో మైనర్ బాలుడు అక్కడిక్కడే ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనకు ప్రత్యక్ష సాక్షులుగా నిలిచిన మృతుని స్నేహితులు వెంటనే గ్రామస్తులకు సమచారం అందించారని ఎస్సై తెలిపారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, నిందితుని కోసం గాలిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. ఘటన అనుకోకుండా జరిగిందా.. లేదా వేరెవరినో కాల్చే క్రమంలో పొరపాటున పిల్లాడు బలయ్యాడా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామన్నారు. కాగా, తోట కాపలాదారుని వద్ద తుపాకీ ఎందుకుందనే విషయం కలకలం రేపుతోంది. -
‘స్వీటెస్ట్ మ్యాంగోస్ ఫ్రం స్వీటెస్ట్ కపుల్’
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన వివాహబంధంతో ఒక్కటై గురువారం(జూన్ 14) నాటికి ఆరేళ్ళు అయింది. తమ పెళ్ళి రోజు సందర్భంగా రామ్ చరణ్‌తో ఉన్న ఫొటోలను ఉపాసన సోషల్ మీడియాలో పోస్టు చేసిన విషయం విదితమే. ప్రస్తుతం ఆ రొమాంటిక్ ఫొటోలు వైరల్ అయ్యాయి. మెగా ఫ్యామిలీ సంబరాల్లో మునిగిపోయింది. ఈ సందర్భంగా తమ తోటలో పండిన మ్యాంగోస్‌ను కొంతమంది సన్నిహితులకు చెర్రీ దంపతులు పంపించారు. నిర్మాత డీవీవీ దానయ్యకు కూడా మామిడి పండ్ల బుట్టను ఈ దంపతులు పంపించారు. చెర్రీ దంపతులు పంపించిన మామిడి పండ్ల బుట్టను డీవీవీ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ‘స్వీటెస్ట్ మ్యాంగోస్ ఫ్రం స్వీటెస్ట్ కపుల్ రామ్ చరణ్, ఉపాసన కొణిదెల. థ్యాంక్యూ సో మచ్. ఇద్దిరికీ పెళ్లి రోజు శుభాకాంక్షలు’ తెలిపారు. గతంలో రామ్ చరణ్ హీరోగా నటించిన ‘బ్రూస్లీ’, ‘నాయక్’ చిత్రాలను కూడా డీవీవీ దానయ్య నిర్మించారు. -
మామిడి పళ్లు తింటే కొడుకులు పుడతారట!
ముంబై : తన తోటలోని మామిడి పళ్లు తింటే కొడుకులు పుడతారని వివాదస్పద హిందుత్వ నేత శాంబాజీ బిదే సంచలన వ్యాఖ్యలు చేశారు. రాయ్‌గఢ్‌లో మరాఠాల యోధుడు చత్రపతి శివాజీ మహారాజ్ బంగారు సింహాసనాన్ని ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేస్తూ నాసిక్‌లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా శాంబాజీ మాట్లాడుతూ.. మామిడి పళ్లలో మంచి పోషకాలుంటాయని, తమ తోట మామిడి పళ్లు తిన్న జంటలకు మగ పిల్లలే పుట్టారన్నారు. ‘ఇప్పటి వరకు ఈ విషయాన్ని నా తల్లితో మినహా ఎవరికి చెప్పలేదు. నాతోటలో ఈ రకమైన మామిడి చెట్లను పెంచాను. ఇప్పటి వరకు నాతోటలోని మామిడి పండ్లు తిన్న 150 జంటలకు 180 మంది మగపిల్లలు జన్మించారు. ఎవరికైనా మగపిల్లలు కావాలనిపిస్తే ఈ మామిడి పండ్లు తినండి. సంతానలేమి సమస్యతో బాధపడే దంపతులకు కూడా ఈ మామిడి పండు ఉపయోగపడుతోంది.’ అని శాంబాజీ చెప్పుకొచ్చారు. శాంబాజీ వ్యాఖ్యలపై సామాజిక కార్యకర్తలు, రాజకీయ నాయకులు మండిపడుతున్నారు. శాంబాజీ పిచ్చోడిలా మాట్లాడుతున్నాడని, అతని వ్యాఖ్యలు నవ్వుతెప్పిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూఢనమ్మకాలను ప్రచారం చేస్తున్న అతనిపై చర్యలు తీసుకోవాలని న్యాయవాది, సామాజిక వేత్త అబా సింగ్ డిమాండ్ చేశారు. మాజీ ఆరెస్సెస్ కార్యకర్త అయిన శాంబాజీ బిదే జనవరిలో బీమా-కొరిగన్ కులాల మధ్య చేలరిగిన హింసలో నిందితుడు. -
రాయగడ టు ఢిల్లీ
రాయగడ : రాయగడ జిల్లాలోని కాశీపూర్, కల్యాణసింగుపురం, బిసంకటక్, మునిగుడ, ప్రాంతంలో విదేశీ ఎగుమతికి సంబంధించిన ఉన్నత రకాల మామిడి పంటను ఈ సంవత్సరం జిల్లా యంత్రాంగం సహకారంతో ఢిల్లీలోని మదర్‌డైరీకి ఆదివారం పంపించారు. రాయగడ రైల్వేస్టేషన్ నుంచి మామిడిపండ్ల మొదటి ఎగుమతిని డీఆర్డీఏ పీడీ సుఖాంత్ త్రిపాఠి రైల్వే వ్యాగన్లకు పచ్చజెండా ఊపి ప్రారంభించారు. జిల్లాలో మామిడి రైతులకు నేరుగా వారి ఖాతాలో మామి డి మద్దతుధర లభించే విధంగా గత సంవత్సరం నుంచి జిల్లా యంత్రాంగం మామిడి ఎగుమతిని చేపట్టింది. గత సంవత్సరం మామిడి రైతులు దళారుల బెడద లేకుండా నేరుగా మంచి లాభా లను ఆర్జించారు. ఈ సంవత్సరం కూడా అదే రీతిలో మామిడి ఎగుమతి ప్రారంభం కాగా మొదటిరోజు 288కార్టన్ల(4.5 టన్నులు) మామిడి పండ్లు ఎగుమతి చేయగా ఢిల్లీలో కేజీ మామిడిపండ్లు రూ.50 నుంచి రూ.67 వరకు ధర పలుకుతున్నట్లు అధికారులు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరు కావలసి ఉండగా ఇతర కారణాల వల్ల రాలేకపోవడంతో ఆమెకు బదులుగా డీఆర్డీఏ పీడీ హాజరయ్యారు. మామిడి సీజన్ పూర్తయినంత వరకు రాయగడ నుంచి మామిడి ఎగుమతి జరుగుతుందని ఈ సందర్భంగా అధికారులు వివరించారు. -
ఒకే చెట్టు..12 రకాల కాయలు
కర్నూలు,జూపాడుబంగ్లా: ఒక్కోరకం మామిడి కాయలను చూడాలన్నా, తినాలన్నా ఒక్కో చెట్టు వద్దకు వెళ్లటమో లేక వ్యాపారుల వద్ద ఒక్కోరకం కొని తినడమో చేయాలి. అలాకాకుండా 12 రకాల మామిడి కాయలు ఒకే చెట్టుకు లభిస్తే వాటి రుచిని ఒకే రోజు ఆస్వాదించగలిగితే ఆ మజానే వేరు. ఇలాంటి అరుదైన సంఘటన జూపాడుబంగ్లాలోని నాగశేషులు ఇంటి పెరట్లో చోటుచేసుకుంది. ఇక్కడ ఒకే మామిడి చెట్టుకు కాసిన 12 రకాల మామిడి కాయలను చూసి ఆశ్చర్యచకితులవుతున్నారు. నాగశేషులు 1993 నుంచి హార్టిక ల్చర్లో చెట్లకు గ్రాఫ్టింగ్ (అంటుకట్టు పద్ధతి)లో నైపుణ్యం సంపాదించాడు. తనకున్న అనుభవంతో అతను తనపెరట్లో తినిపారేసిన మామిడిపిచ్చలు మొలకెత్తడంతో ఓ చెట్టుపై గ్రాఫ్టింగ్ పద్ధతి ద్వారా బనగానపల్లె, డోన్, పంచలింగాల, ఉయ్యాలవాడ తదితర ప్రాంతాల్లో లభించే అల్ఫాన్స్, పెద్దరసం, నీలిశా, స్వర్ణజాంగీర్, రెడ్డి పసంద్, బేనిషా, మల్లికారసం, అనుపాళి, పెద్దాచారి, చిన్నాచారి, నీల్గోవ, హిమయత్ తదితర 20 రకాల మొక్కలను తెచ్చి చెట్టుకు అంటుకట్టాడు. మూడేళ్ల అనంతరం ఈ ఏడాది నాగశేషులు పెరట్లోని మామిడి చెట్టు గుత్తులు గుత్తులుగా 12 రకాల మామిడి కాయలను కాసింది. ఈ చెట్టును చూసిన వారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నాగశేషులు తనకున్న నైపుణ్యం వల్ల ఒకే చెట్టుకు 12 రకాల మామిడి కాయలు కాయించగలగటాన్ని అందరూ ప్రశంసిస్తున్నా రు. ఇతని పెరట్లో ఉన్న మరో మా మిడి చెట్టు ఐదేళ్లు కావొస్తున్నా కాపునకురాలేదు. అంటుగట్టు పద్ధతి ద్వా రా త్వరగా చెట్లు కాపునకువస్తాయని నాగశేషులు పేర్కొంటున్నారు. గ్రాఫ్టింగ్ జిల్లాలో కొందరికే వస్తుంది గ్రాఫ్టింగ్ పద్ధతిలో నైపుణ్యం ఉన్న వారు జిల్లాలో కొంతమంది మాత్రమే ఉన్నారు. నేను 1993 నుంచి హార్టికల్చర్‌లో పనిచేయడం ద్వారా అప్పట్లోని అధికారులు తెలియజేసిన మెలకువలను నేర్చుకోవడం ద్వారా నైపుణ్యం సంపాదించాను. గ్రాఫ్టింగ్లో కొన్ని మెలకువలు పాటిస్తే తక్కువ కాలంలోనే చెట్లు కాపునకురావటంతోపాటు ఫలాలు త్వరగా పొందే అవకాశం ఉంటుంది. – నాగశేషులు, జూపాడుబంగ్లా, (సెల్ 9989491986) -
ఒరుగు.. ఎంతో మెరుగు
కుల్కచర్ల వికారాబాద్: మామిడి ఒరుగుతో మండల పరిధి లోని చౌడాపూర్, మందిపల్, వీరాపూర్, కాముని పల్లి, రాంరెడ్డిపల్లి గ్రామాలలో ప్రజలు ఉపాధి పొ ందుతున్నారు. స్థానికంగా మామిడి తోటలు త క్కువగా ఉండటంతో ఇతర ప్రాంత్రాల నుంచి మామిడి కాయలు దిగుమతి చేసుకుని ఇక్కడి ఒ రుగు చేసి మార్కెట్లకు తరలిస్తున్నారు. దీంతో చా లా మంది కూలీలు ఉపాధి పొందుతున్నారు. గ్రా మాలలో నీడకు కూర్చుని ఒరుగు తయారు చేస్తున్నారు. రోజుకు 200 నుంచి 300 రూపాయల వరకు ఉపాధి పొందుతున్నారు. గాలివానకు మామిడి కాయలు రాలిపోవడంతో అవి వృథా కాకుండా వాటిని కోసి ఒరుగు తయారు చేసుకున్నారు. ఆదే ఉపాధిగా ఈ గ్రామాలలో ప్రతి సంవత్సరం సీజన్ వ్యాపారంగా మారింది. నిరుద్యోగ యువకులు మండల పరిధిలోని పలు గ్రామలలో ఉన్న మామిడి తోటలను పూత దశలోనే కొనుగోలు చేస్తున్నారు. వాటిని కాపలా కాసీ మామిడి కాయలు కోసి మహిళల చేత ఒరుగు తయారు చేస్తున్నారు. దీంతో స్థానికులకు ఉపాధి కల్పిస్తున్నారు. మండల పరిధిలోని 6 గ్రామాలలో నెల రోజుల పాటు రోజు సూమారు 100 మంది మహిళలు ఉపాధి పొందుతున్నారు. ఇక్కడ మామిడి తోటలు లభ్యం కాకుంటే అనంతపురం నుంచి మామిడి కాయలు తీసుకువచ్చి ఒరుగు తయారు చేస్తున్నామని అంటున్నారు. ఒక సంచి మామిడి కాయలను 150 రూపాయల నుంచి 200 రూపాయలు వరకు ఇచ్చి ఒరుగు తయారు చేస్తున్నారు. ఈ ఒరుగుకు హైదరాబాద్‌లో మార్కెట్ లేదని నిజామాబాద్ తీసుకెళ్లి మార్కెట్ చేస్తున్నామని హైదరాబాద్ ప్రాంతంలో మార్కెట్ ఉంటే బాగుండేదని, స్థానికంగా మార్కెట్ సౌకర్యాం కల్పించాలని ఒరుగు వ్యాపారులు కోరుతున్నారు. సీజన్లో ఉపాధి పొందుతున్నాం ప్రతి సీజన్లో రోజు కూలీ వరకు సంపాది స్తాం. మామిడి కాయలు చిన్నగా ఉన్న సమయంలో తోటలను రై తుల నుంచి కొనుగో లు చేస్తాం. రెండు నెలలు వాటిని కాపలా కాసి కాయలు పెద్దగా అయిన తరువాత కో సి ఒరుగు తయారు చేయిస్తున్నాం. ఒక్కొక్క సారి కాయలు చిన్నగా ఉన్నప్పుడు రాలి పో తాయి. అప్పడప్పడు నష్టం కూడా వస్తుంది. – వెంకటేష్, వ్యాపారి, విఠలాపూర్ రోజూ రూ. 200 సంపాదిస్తున్నాం ఈ ఒరుగు ఉన్నని రో జులు రోజుకు 200 సంపాదిస్తాం. ఎండకు వెళ్లి పనిచేయాలంటే చే యలేక పోతున్నాం. చె ట్ల కింద కూర్చుని మా మిడి కాయలు కోసి ఒరుగు తయారు చేస్తా ం. ఒక సంచికి 150 రూపాయలు ఇస్తారు, ఇ ద్దరం కలిసి రెండు నుంచి మూడు సంచులు కోస్తాం. – లక్ష్మమ్మ విఠలాపూర్, కుల్కచర్ల -
విషం..నిగనిగ
కర్నూలు(అగ్రికల్చర్): మార్కెట్లో ఆకర్షణీయమైన రంగులో మామిడి పండ్లు నోరూరిస్తున్నాయా? అయితే..వాటిని కొనే ముందు, తినే ముందు ఒక్క నిమిషం ఆలోచించండి. అది స్వచ్ఛమైనదా? లేక ‘కార్బైడ్’ పండా అనే విషయం తెలుసుకోండి. లేదంటే అనారోగ్యాన్ని డబ్బు పెట్టి కొనుకున్నట్లే. కొద్ది రోజులుగా పెనుగాలుల తీవ్రతకు మామిడి కాయలు భారీగా నేలరాలుతున్నాయి. వీటిని కార్బైడ్‌తో కృత్రిమంగా మాగబెడుతూ.. అకర్షణీయమైన రంగు తెప్పించి మార్కెట్లోకి తెస్తున్నారు. జిల్లాలో కాపు కాసే తోటలు 12వేల హెక్టార్లలో ఉన్నాయి. ప్రధానంగా మామిడి తోటలు వెల్దుర్తి, బనగానపల్లె, బేతంచెర్ల, డోన్, ప్యాపిలి, ఓర్వకల్లు, తుగ్గలి, కల్లూరు తదితర మండలాల్లో విస్తరించి ఉన్నాయి. జిల్లాలోని దిగుబడి 60 శాతం వరకు హైదరాబాద్‌కు తరలిస్తుండగా, మిగిలిన 40 శాతంలో ఎక్కువ భాగం కర్నూలులోని గడియారం ఆసుపత్రి దగ్గర నిర్వహించే పండ్ల మార్కెట్‌కు వస్తోంది. కార్బైడ్ వాడకం ఏడాది పొడవునా ఉన్నా.. మామిడి సీజన్లో మరీ ఎక్కువవుతోంది. సాధారణంగా కాయ పక్వానికి వచ్చేందుకు కనీసం వారం, పది రోజులు పడుతుంది. దీంతో వ్యాపారులు రెండు, మూడు రోజుల్లో మాగబెట్టేందుకు నిషేధిత కార్బైడ్‌ను యథేచ్ఛగా వాడుతున్నారు. అరటి, సపోట, యాపిల్ తదితర వాటిని కూడా ఇదే పద్ధతిలోనే మాగబెడుతున్నారు. చివరికి నిమ్మ కాయలకు కూడా ఆకర్షణీయమైన రంగు తెప్పించేందుకు కార్బైడ్‌ను వాడుతుండటం గమనార్హం. బంగినపల్లి మామిడికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. ఈ రకం పండుకు ఇప్పటికే భౌగోళిక గుర్తింపు కూడా లభించింది. అయితే.. ఈ పండ్లను సైతం మాగించడానికి కార్బైడ్‌ను వినియోగిస్తుండటంతో ప్రతిష్ట మసకబారే ప్రమాదం ఏర్పడింది. తనిఖీలు నామమాత్రమే ప్రజలకు సురక్షితమైన పండ్లు అందేలా చూడాల్సిన బాధ్యత ఆహార పరిరక్షణ, ప్రమాణాల అమలు విభాగం అధికారులపై ఉంది. ఈ విభాగంలో సిబ్బంది కొరత వేధిస్తుండటం, ఉన్న వారు పట్టించుకోక పోవడంతో విషతుల్యమైన పండ్లను ప్రజలు తినాల్సిన దుస్థితి దాపురించింది. జిల్లాలో అసిస్టెంటు ఫుడ్ కంట్రోలర్ పోస్టు ఖాళీగా ఉండటంతో అనంతపురం జిల్లా అధికారి ఇన్చార్జ్గా వ్యవహరిస్తున్నారు. మొన్నటి వరకు గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ పోస్టు ఖాళీగా ఉండగా మూడు రోజుల క్రితమే భర్తీ అయింది. ఫుడ్ ఇన్స్పెక్టర్ పోస్టులు 4 ఉండగా, ఇందులో 2 ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం విధులు నిర్వర్తించే అధికారులకు వాహన సదుపాయం కూడా లేకపోవడంతో తనిఖీలు నామమాత్రంగా ఉన్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 65 శ్యాంపిల్స్ తీశారు. ఇందులో 6 శ్యాంపిల్స్ సురక్షితం కాదని, మరో మూడు శ్యాంపిల్స్ మిస్ బ్రాండ్ అని తేలింది. మరో 2 నాసిరకంగా ఉన్నట్లు గుర్తించారు. మిగిలిన వాటికి సంబంధించిన నివేదిక రావాల్సి ఉంది. కార్బైడ్ నిషేధం.. కాగితాలకే పరిమితం కార్బైడ్‌తో మాగించిన ఫలాలు తిని వినియోగదారులు వ్యాధుల బారిన పడుతుండటంతో ప్రభుత్వం 2012 మార్చి 19న కార్బైడ్ వాడకాన్ని నిషేధించింది. ఈ మేరకు జీవో ఆర్టీ నెంబర్ 288ని జారీ చేసింది. ఈ జీవోను అమలు చేయడానికి ప్రత్యేక చర్యలు లేకపోవడంతో నిషేధం కాగితాలకే పరిమితమైంది. సంబంధిత అధికారులు అడపాదడపా శ్యాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపడం మినహా ఎలాంటి చర్యలూ లేవు. రైతులు, వ్యాపారులకు కార్బైడ్ వాడకంతో కలిగే అనర్థాలను వివరించి, ప్రత్యామ్నాయ పద్ధతులపై అవగాహన కల్పించాల్సిన అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. నేడు జేసీ ప్రత్యేక సమావేశం మార్కెట్లో కార్బైడ్‌తో మాగించిన పండ్లు విక్రయిస్తున్నారని ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తుండటంతో జాయింట్ కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ బుధవారం ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. మలాయి చికెన్ వ్యాపారుల దందాపైనా ఈ సమావేశంలో చర్చించన్నారు. స్వచ్ఛమైన పండ్లు ఇలా ఉంటాయి. ♦ పుసుపు, లేత ఆకు పచ్చ రంగు కలిగి లోపల పండు మొత్తం పరిపక్వంగా ఉంటుంది. ♦ పండు మెత్తగా ఉండి, ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. తగినంత చక్కెర శాతం కలిగి ఉంటుంది. ♦ తియ్యగా, రుచిగా ఉండడంతో పాటు మంచి వాసన కొద్ది దూరం వరకు వస్తుంది. కార్బైడ్‌తో మాగించిన పండ్లు ఇలా ఉంటాయి.. ♦ పండు మొత్తం కాంతివంతమైన లేత పసుపు రంగు కలిగి ఉంటుంది. ♦ పైకి మాగినట్లుగా కనిపించినా లోపల అపరిపక్వంగా, రుచి పుల్లగా ఉంటుంది. ♦ పండును ముక్కు దగ్గర ఉంచినపుడు మాత్రమే మామిడి పండు వాసన వస్తుంది. ♦ పండు తొక్క మడతలు లేకుండా ఉండి, గట్టిగా ఉంటుంది. పండ్లు త్వరగా పాడైపోతాయి. ♦ తొక్కపై నల్లని మచ్చలు ఏర్పడతాయి. కాల్షియం కార్బైడ్వాడకంతో అనర్థాలు ♦ క్యాన్సర్, అల్సర్, కాలేయం, మూత్రపిండ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ♦ కాల్షియం కార్బైడ్ ద్వారా వెలువడే ఎసిటిలీస్ వాయువు నాడి వ్యవస్థ మీద ప్రభావం చూపడంతో తలనొప్పి, దీర్ఘకాలిక మత్తు, జ్ఞాపిక శక్తి కోల్పోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. ♦ చిన్నపిల్లలకు శ్వాస సంబంధిత వ్యాధులు, అధిక విరేచనాలు అవుతాయి. ♦ గర్భిణులకు అబార్షన్ అయ్యే ప్రమాదం ఉంది. -
అమామిడిని దూరం పెడుతున్నాం: చెంగల్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: విదేశాల నుంచి దిగుమతి అయిన పళ్లను తింటున్నాం కానీ, స్థానికంగా పండే మామిడి పండ్లను మాత్రం దూరం పెడుతున్నామని అఖిల భారత రైతు సంఘాల సమాఖ్య ముఖ్య సలహాదారు చెంగల్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సమాఖ్య ఆధ్వర్యంలో ‘పండ్ల సాగు రైతుల సమస్యలు– పరిష్కారాల’పై శుక్రవారమిక్కడ సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘కాలిఫోర్నియా నుంచి యాపిల్, న్యూజిలాండ్ నుంచి కివీ పండ్లను దిగుమతి చేసుకొని తింటున్న మనం వివిధ కారణాలతో మామిడి పండ్లను దూరం పెట్టే పరిస్థితి దాపురించింది. ఆయా దేశాలకు ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో పండ్లను ఎగుమతి చేస్తుంటే, అటువంటి పరిజ్ఞానం మామిడికి ఉపయోగించలేక పోతున్నాం. దీంతో రైతులు నష్టపోతున్నారు’ అని వాపోయారు. -
కందకాలే కరువుకు విరుగుడు!
కరువు కోరల నుంచి రైతులను రక్షించడానికి వ్యవసాయ భూముల్లో కందకాలు తీసుకోవడమే ఉత్తమ మార్గమనడానికి ప్రబల నిదర్శనం తన మామిడి తోటేనని నీటిపారుదల శాఖ విశ్రాంత చీఫ్ ఇంజినీర్ సంగెం చంద్రమౌళి స్వానుభవంతో తెలిపారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఈర్లపల్లి గ్రామపరిధిలో 3.5 ఎకరాల భూమిని గత ఏడాది వేసవిలో కొనుగోలు చేశారు. 500–650 అడుగుల లోతున రెండు బోర్లు వేసినా.. డస్ట్ తప్ప నీటి చుక్క కానరాలేదు. వాన నీటిని సంరక్షించుకుంటే తప్ప నీటి భద్రత సాధ్యం కాదన్న నిర్ణయానికి వచ్చారు. పొలంలో ప్రతి 50 మీటర్లకు ఒక చోట వాలుకు అడ్డంగా మీటరు లోతు, మీటరు వెడల్పున 2017 మేలో కందకాలు తవ్వించారు. ఎకరానికి రూ. 5 వేల వరకు ఖర్చయింది. వర్షాలు కురవడంతో కందకాల ద్వారా వర్షపు నీరు పుష్కలంగా భూమిలోకి ఇంకింది. భూగర్భ జలమట్టం పెరిగింది. నీటి కొరత తీరడంతో గత జూలైలో మామిడి మొక్కలు నాటారు. డ్రిప్ ద్వారా పొదుపుగా నీటిని అందిస్తున్నారు. గెస్ట్ హౌస్ కూడా నిర్మించారు. అయినా, ఇంత వేసవిలోనూ నీటి కొరత లేదని చంద్రమౌళి సంతోషంగా చెప్పారు. పొలాల్లో కురిసి వృథాగా పోతున్న వర్షపు నీటిని ఎక్కడికక్కడ భూమి లోపలికి ఇంకించుకుంటే ప్రతి రైతూ కరువును విజయవంతంగా అధిగమించవచ్చని తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అయిన సంగెం చంద్రమౌళి, మేరెడ్డి శ్యాంప్రసాద్ రెడ్డి (రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్) గత కొన్నేళ్లుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ‘సాక్షి’తో కలసి గతంలో వరుసగా రెండేళ్లు తెలుగు రాష్ట్రాల్లో ‘చేను కిందే చెరువు’ ప్రచారోద్యమాన్ని నిర్వహించి వేలాది మంది రైతుల్లో చైతన్యం నింపిన సంగతి తెలిసిందే. వేలాది ఎకరాల్లో పొలాలను స్వయంగా పరిశీలించి కందకాలు తవ్వించిన చంద్రమౌళి తన పొలంలోనూ కందకాలు తవ్వించి రైతులకు ఆదర్శప్రాయుడిగా నిలిచారు. ఎకరానికి రూ. 5 వేలు చాలు.. సాగు యోగ్యమైన భూముల్లో తెలంగాణ రాష్ట్రమంతటా ఎకరానికి రూ. 5వేల ఖర్చుతో కందకాలు తవ్వడానికి రూ. 8 వేల కోట్లు ఖర్చవుతుందని, వృథాగా పోతున్న 850 టీఎంసీల నీటిని భూమిలోకి ఇంకింపజేయవచ్చని ఆయన అంటున్నారు. భారీ ఖర్చుతో నిర్మిస్తున్న ప్రాజెక్టులన్నీ కలిపి అందించే నీరు 600 టీఎంసీలేనన్నారు. ఎకరానికి పంటకు రూ. 4 వేల చొప్పున రైతుకు పెట్టుబడిగా ఇస్తున్న ప్రభుత్వం.. ప్రతి రైతూ కందకాలు తవ్వుకోవడం తప్పని సరి చేస్తే ఒక్క ఏడాదిలోనే సాగునీటి భద్రత చేకూరుతుందని ఆయన సూచిస్తున్నారు. అదేవిధంగా, ఆంధ్రప్రదేశ్‌లోని సాగు యోగ్యమైన భూములన్నిటిలో కందకాలు తవ్విస్తే రూ.10 వేల కోట్లు ఖర్చవుతుందని, 950 టీఎంసీల నీటిని భూమిలోకి ఎక్కడికక్కడ ఇంకింపజేయవచ్చని చంద్రమౌళి (98495 66009) సూచిస్తున్నారు. చంద్రమౌళి మామిడి తోటలో కందకం -
ఒకే చెట్టుకు పది రకాల మామిళ్లు!
గుణదల (విజయవాడ తూర్పు): అంటుకట్టే విధానం ద్వారా విజయవాడ మాచవరం ప్రాంతానికి చెందిన చతుర్వేదుల శ్రీనివాస శర్మ తమ పెరట్లో పెంచిన మామిటి చెట్టు ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఒకే చెట్టుకు దాదాపు పది రకాల మామిడి కాయలు కాయడంతో వీక్షకులను అబ్బుర పరుస్తోంది. నాటు మామిడి మొక్క పెరుగుతున్న కొద్దీ దాని కొమ్మలకు బంగినపల్లి, పెద్దరసాలు, చిన్నరసాలు వంటి వివిధ రకాల కొమ్మలను శ్రీనివాసరావు అంటుకట్టారు. ప్రస్తుతం ఈ చెట్టుకు తోతపురి, బంగినపల్లి, సువర్ణరేఖ, సొరమామిడి, చిన్నరసాలు, పెద్దరసాలు, చెరుకురసం, తుమాని వంటి పది రకాలు మామిడి కాయలు కాస్తున్నాయి. తన ప్రయోగం ద్వారా ఒకే చెట్టుకు ఇన్ని రకాల మామిళ్లు కాయిస్తున్న శ్రీనివాస శర్మ పలువురి మన్ననలు అందుకుంటున్నారు. ఈ అంటుకట్టే విధానంలో ఆయన ఇప్పటివరకూ మామిడి, సీతాఫలం, నేరేడు, బత్తాయి, రేగు పండ్లతో పాటు మందారం, గన్నేరు, వంటి పుష్ప జాతులకూ అంటుకట్టారు. -
మామిడి ధర ఢమాల్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ గడ్డి అన్నారం పండ్ల మార్కెట్లో మార్చి 15న సాధారణ రకం మామిడి ధర టన్నుకు రికార్డు స్థాయిలో రూ.1.87 లక్షలు పలికింది.. అదే నెల 30న రూ. 65 వేలకు తగ్గిపోయింది.. ఏప్రిల్ 15న ధర రూ.50 వేలకు దిగజారింది. మే 1న(మంగళవారం) మామిడి ధర రూ.40 వేలకు పడిపోయింది. మామిడి ధరలు సగానికి సగం పడిపోవడంతో రైతన్నలు గగ్గోలు పెడుతున్నాడు. దళారుల ఇష్టారాజ్యంతో మామిడి రైతుకు నష్టాలే మిగులుతున్నాయి. మామిడి ధర పడిపోవడంతో వినియోగదారులకు ఏమైనా లబ్ధి చేకూరుతోందా అంటే అదీ లేదు. బహిరంగ మార్కెట్లో మాత్రం మామిడి ధరను రెండింతలు పెంచి విక్రయిస్తున్నారు. మొత్తంగా అటు రైతును, ఇటు వినియోగదారులను దళారులు ఎడాపెడా దోచేస్తున్నారు. 30 శాతానికిపైగా పడిపోయిన ఉత్పత్తి రాష్ట్రంలో 3.5 లక్షల ఎకరాల్లో మామిడి తోటలున్నాయి. సాధారణంగా ఎకరానికి ఎనిమిది టన్నుల ఉత్పత్తి వస్తుంది. అయితే వర్షాలు సరిగా లేకపోవడంతో ఈసారి ఎకరానికి రెండు మూడు టన్నులకు మించి ఉత్పత్తి కాలేదు. రాష్ట్రంలో సాధారణంగా 28 లక్షల టన్నుల మామిడి ఉత్పత్తి కావాల్సి ఉండగా, ఈసారి 8 నుంచి 10 లక్షల టన్నులలోపే ఉత్పత్తి అవుతుందని ఉద్యాన శాఖ అంచనా వేసింది. మొత్తంగా 30 శాతం వరకు ఉత్పత్తి పడిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో డిమాండ్ పెరిగి రైతుకు ఎక్కువ ధర రావాలి. కానీ రైతుకు దక్కాల్సిన సొమ్మును దళారులు సొంతం చేసుకుంటున్నారు. వినియోగదారులపై బాదుడే.. రైతుల నుంచి టన్నును రూ.40 వేలకు వ్యాపారులు కొంటున్నారు. అయితే బహిరంగ మార్కెట్లో వినియోగదారుల నుంచి దీనికి రెండు మూడింతలు వసూలు చేస్తున్నారు. ప్రస్తుత లెక్క ప్రకారం కిలో మామిడి రూ.40 వరకు ఉండాలి. కానీ మార్కెట్లో ఏకంగా రూ.100 పలుకుతోంది. కొన్ని రకాలైతే రూ.150–200 వరకూ ఉన్నాయి. మామిడికి నిర్ధారిత ధర ప్రకటించకపోవడంతో దళారుల హవానే నడుస్తుంది. డిమాండ్ ఉన్నా సరుకును గిట్టుబాటు ధరకు అమ్ముకోలేని దుస్థితిలో రైతన్న పడిపోయాడు. సరైన నియంత్రణ చర్యలు లేకపోవడంతోనే మామిడి ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు ఉంటున్నాయి. రూ. 41 వేలకే కొన్నారు రెండ్రోజుల కిందట నాలుగు టన్నుల మామిడి కాయలను తీసుకొచ్చాను. కానీ హైదరాబాద్‌లో దళారులు నాణ్యత సరిగా లేదనే సాకుతో టన్ను రూ. 41 వేలకే కొనుగోలు చేశారు. గత్యంతరం లేక దళారులకు నష్టాలకే మామిడి అమ్ముకున్నాను. – రాజశేఖర్, రైతు, సత్తుపల్లి