టెంక లేని మామిడిపళ్లు!!
మామిడిపళ్లు.. తలుచుకుంటేనే నోరు ఊరుతుంది కదూ. కానీ, రసం మామిడిపళ్లు తినాలంటే మధ్యలో పెద్ద టెంక ఉంటుంది. అది లేకుండా మొత్తం అంతా రసమే ఉంటే ఎంతో బాగుంటుంది కదూ. సరిగ్గా ఇదే ఆలోచన కొంతమంది భారతీయ శాస్త్రవేత్తలకు వచ్చింది. వచ్చిందే తడవుగా వాళ్లు పరిశోధనలు మొదలుపెట్టారు. గింజలు లేని ద్రాక్షపళ్లను సృష్టించినప్పుడు.. టెంకలు లేని మామిడిపళ్లు సాధ్యం కాదా అనుకున్నారు. అంతే.. తియ్యటి మధురమైన రసాలూరే టెంకలేని మామిడిపండు సిద్ధం అయిపోయింది.
రత్న, ఆల్ఫోన్సో (కలెక్టర్) రకాల నుంచి హైబ్రిడ్ పద్ధతిలో ఈ కొత్త మామిడిపండును రూపొందించినట్లు బీహార్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని ఉద్యానశాఖ ఛైర్మన్ వీబీ పటేల్ తెలిపారు. ఈ కొత్త రకానికి సింధు అనే పేరు పెట్టారు. దీన్ని దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో నాటి.. ఫలితాలు ఒకే రకంగా వస్తున్నాయో లేవోనని చూస్తున్నారు. భారీగా తోటల్లో వేయడంతో పాటు ఇళ్లలో వేసినా ఒకే రకం రుచి వచ్చేలా ప్రయోగాలు చేస్తున్నారు.
సగటున ఒక్కో పండు 200 గ్రాములు తూగుతుందని, ఇతర రకాల కంటే దీంట్లో పీచు తక్కువగా ఉంటుందని పటేల్ చెప్పారు. మహారాష్ట్రలోని కొంకణ్ ప్రాంతంలో గల కొంకణ్ కృషి విద్యాపీఠ్లో దీన్ని రూపొందించారు. దీని పంట కూడా ఇతర మామిడి రకాల్లా వేసవిలో కాకుండా జూలై మధ్యవారంలో వస్తుందట. 2015 నాటికల్లా రైతులకు ఈ సింధు రకం మామిడి మొక్కలను అందిస్తామని చెబుతున్నారు.