రెండు వారాల్లో రెండు ప్రయోగాలు! ఒకటి చంద్రుడి పైకి... మరొకటి సూర్యుడి గురించి! భారత శాస్త్రవేత్తలు మన అంతరిక్ష ఆకాంక్షలను మరింత ఉన్నత కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ఆగస్ట్ 23న చంద్రయాన్–3 ప్రయోగంతో ఇప్పటిదాకా పరిశోధనల్లో అసూర్యంపశ్యగా మిగిలిపోయిన చంద్రుడి దక్షిణ ధ్రువప్రాంతంపైకి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఉపగ్రహాన్ని పంపడం, రోబోటిక్ ల్యాండర్ విక్రమ్– రోవర్ ప్రజ్ఞాన్‌లు చంద్రునిపై సుతిమెత్తగా దిగడం, వాటిలో పరికరాలు పంపు తున్న అపూర్వడేటా దేశ కీర్తిప్రతిష్ఠల్ని పెంచాయి. ఆ విజయ పరంపర సాగుతుండగానే, భూమికి అతి సమీప నక్షత్రం సూర్యుడి అధ్యయనానికి భారత్ తొలిసారి ఉపగ్రహాన్ని పంపడం విశేషం.
చంద్రయాన్–3తో పోలిస్తే, ‘ఆదిత్య– ఎల్1’ ప్రయోగంలో నాటకీయత తక్కువే. కానీ, సెప్టెంబర్ 2న సక్సెసైన ఈ సౌరశోధనా ఉపగ్రహ ప్రయోగం మరో 4 నెలల్లో కీలకమైన భౌమ– సౌర లాగ్రేంజ్ పాయింట్1 (ఎల్1)కు సురక్షితంగా చేరగలిగితే, ఎన్నో సౌర రహస్యాలు బయటకొస్తాయి. ఇప్పటికే చంద్రునిపై ఆక్సిజన్ జాడ సహా అనేకం కనుగొని, చంద్ర మండలం ఊహిస్తున్న దాని కన్నా ఎక్కువగానే ఆవాసయోగ్యమని మనం తేల్చాం.
రేపటి శోధనలో ఆదిత్య హృదయం ఏం వెల్లడిస్తుందో ఆసక్తికరమే. దేశంలోని మరో ఆరు సంస్థల భాగస్వామ్యంతో ఇస్రో చేస్తున్న ఈ రోదసీ గవేషణతో సౌర వర్తన, అంతరిక్ష వాతావరణం, వైపరీత్యాల నుంచి మన అంతరిక్ష ఆస్తుల సంరక్షణ వగైరాలపై లోతైన అవగాహన కలగవచ్చు. అంతరిక్ష పరిశోధనలో అంతకంతకూ భారత్ ముంద డుగులు వేస్తున్నదనడానికి ఇది మరో కొండగుర్తు.
అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘నాసా’, అలాగే యూరోపియన్ అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘ఈసా’లు సూర్యుడి గురించి ఇప్పటికే 20కి పైగా శాస్త్రీయ అంతరిక్ష ప్రయోగాలు జరిపాయి. అమెరికా, యూకేల సాయంతో జపాన్ సైతం తన పరిశోధక ఉపగ్రహాన్ని 2006లో ప్రయోగించింది. అయితే, మన ఇస్రో మాత్రం ‘చంద్రయాన్’ లాగానే ఈ సూర్య మండల గవేషణలోనూ తన వైన ప్రత్యేక ఆవిష్కరణలు చేయాలని నడుం బిగించింది.
ముఖ్యంగా సూర్య గోళానికి వెలుపల విస్తరించి ఉండే కాంతివలయమూ, సౌర వాతావరణానికి పైభాగమైన (కరోనా); సూర్యునిలో భాగమైన వెలుగులు విరజిమ్మే ప్రకాశమండలం (ఫోటోస్పియర్); ఆ చుట్టూ వ్యాపించే, సౌర వాతా వరణానికి దిగువ ప్రాంతమైన వర్ణమండలం (క్రోమోస్పియర్); సౌర పవనాలు – వీటన్నిటిపైనా దృష్టి సారించాలని రంగంలోకి దిగింది. ‘ఆదిత్య ఎల్1’లోని శాస్త్రీయ పరికరాల ద్వారా సౌర విద్యు దయస్కాంత క్షేత్రాలనూ, వెలువడే కణ ఉద్గారాలనూ లెక్కించాలని ప్రణాళిక వేసుకుంది. తద్వారా సూర్యుడి ప్రవర్తన గురించి కొత్త అంశాలను వెలికి తీసుకురావాలనేది ప్రధాన లక్ష్యం.
చంద్రయాన్ ద్వారా చంద్రుడు, వెంటనే ఆదిత్య–ఎల్1 ద్వారా సూర్యుడు, ఆ వెంటనే శుక్రుడు, అటు పైన మానవ సహిత వ్యోమనౌకతో అంతరిక్ష యానమైన ‘గగన్‌యాన్’... ఇలా వరుసగా అనేక బృహత్ యజ్ఞాలను ఇస్రో చేపడుతోంది. బుధుడి తర్వాత మనకు అత్యంత సమీపంలో ఉన్న శుక్ర గ్రహపు మేళనాన్నీ, అక్కడి వాతావరణాన్నీ అధ్యయనం చేయడం ఒక ప్రాజెక్ట్ ఆలోచనైతే, ముగ్గురు భారత వ్యోమగాముల్ని అంతరిక్షంలోకి పంపి, మళ్ళీ వారిని సురక్షితంగా భూమి మీదకు తీసుకు రావడం మరో ప్రాజెక్ట్ లక్ష్యం.
ఇప్పటి వరకు ప్రపంచంలో 3 దేశాలు (అమెరికా, రష్యా, చైనా) మాత్రమే ఇలా మనుషుల్ని అంతరిక్షంలోకి పంపాయన్నది గమనార్హం. ఈ ప్రాజెక్టులన్నిటిలో ఇస్రో ఎంచుకున్న మార్గం ఒక్కటే – వీలైనంత తక్కువ ఖర్చులో ఉన్నత సాంకేతిక నవకల్పన!
తాజా సౌరశోధననే చూస్తే– భూమి నుంచి 15 కోట్ల కి.మీ.ల దూరంలో సూర్యుడుంటాడు. మన ఆదిత్య–ఎల్1 వెళ్ళేది అందులో 15 లక్షల కి.మీ.ల దూరమే. అంటే, భూమి కన్నా ఒక్క శాతం మాత్రమే సూర్యునికి దగ్గరగా వెళుతుంది. అయితేనేం, సూర్య, భూమి రెంటి గురుత్వాకర్షణ శక్తి సమానంగా ఉండి, అందుకు తగ్గట్టు వ్యోమనౌక తిరిగేందుకు కావాల్సిన కేంద్రోన్ముఖ బలాన్నిఅందించే పరివేష కక్ష్య (హేలో ఆర్బిట్)లోని కీలకమైన లాగ్రేంజ్ పాయింట్1 (ఎల్1)లో ఈ ఆదిత్య ఉపగ్రహాన్ని ప్రవేశపెడతారు.
దీనివల్ల ఎక్కువగా ఇంధనం ఖర్చు కాకుండానే మన ఉపగ్రహం సౌర మండలాన్ని నిరంతరాయంగా పరిశీలించవచ్చు. భూమి నుంచి 9.9 కోట్ల కి.మీ.ల దగ్గరున్నప్పుడు కుజుడి అధ్యయనానికి గతంలో మంగళ్‌యాన్ చేసిన మన అనుభవమూ ఆదిత్యకు పనికొచ్చింది.
ఎల్1 వైపు సాగుతున్న ప్రయాణంలో ఆదిత్య ఉపగ్రహ కక్ష్యను ఇప్పటికి రెండుసార్లు విజయవంతంగా పెంచగలిగాం. సెప్టెంబర్ 10న మూడోసారి కక్ష్య పెంపు ఉండనుంది. వెరసి, ప్రయోగం నాటి నుంచి 125 రోజులకు, అంటే సుమారు నాలుగు నెలలకు పరివేష కక్ష్యలో ఎల్1 వద్ద మన ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టే ప్రక్రియ పూర్తవుతుంది. వచ్చే అయిదేళ్ళ పాటు ఈ ఉపగ్రహం సూర్యుడికి సంబంధించిన సమాచారాన్ని సేకరించి, పంపనుంది. అంతా బాగుంటే, ఆ తర్వాత కూడా మరో పదేళ్ళ పైగానే అది పనిచేసే అవకాశం కూడా ఉందట.
జ్ఞానమే సమున్నత అధికారమైన ఆధునిక సమాజంలో, దానిపై ఆధారపడ్డ ఆర్థిక వ్యవస్థలో అగ్రరాజ్యాలతో మనం దీటుగా నిలబడేందుకు అంతకు మించి ఇంకేం కావాలి! అనేక దేశాల వల్ల కాని సూర్యచంద్ర శోధనను మనం సాధించ గలగడం మన శాస్త్రవేత్తల నిర్విరామ కృషికి నిదర్శనమే! 2020 నుంచి ప్రైవేటీకరణ బాట పట్టిన భారత అంతరిక్ష విధానంతో, 360 బిలియన్ డాలర్ల ప్రపంచ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థలో గణనీయ మైన వాటా దక్కించుకోవడానికీ ఇలాంటి శోధనలు, విజయసాధనలు మరింత అవసరమే!
ఆదిత్య హృదయం
Published Wed, Sep 6 2023 12:22 AM | Last Updated on Wed, Sep 6 2023 4:48 AM
Comments
Please login to add a commentAdd a comment