చంద్రయాన్‌-3: చంద్రుడిపై భారీ గుంత.. రోవర్‌ రూట్‌ మార్చిన ఇస్రో | Rover Pragyan Faces Large Crater During Moon Walk ISRO Sent On New Path - Sakshi
Sakshi News home page

Chandrayaan 3 Rover Pragyan: చంద్రయాన్‌-3: చంద్రుడిపై భారీ గుంత.. రోవర్‌ రూట్‌ మార్చిన ఇస్రో

Published Mon, Aug 28 2023 5:58 PM | Last Updated on Mon, Aug 28 2023 6:19 PM

Rover Pragyan Faces Large Crater During Moon Walk ISRO Sent On New Path - Sakshi

సాక్షి, బెంగళూరు: ఇస్రో చేపట్టిన చంద్రయాన్‌-3 ప్రయోగం విజయవంతమైన విషయం తెలిసిందే. కాగా, చంద్రుడి దక్షిణ ధృవం సమీపంలో దిగిన  చంద్రయాన్‌-3 ప్రజ్ఞాన్‌ రోవర్‌ తన పని తాను చేసుకెళ్తోంది. ఈ క్రమంలో రోవర్‌ ప్రయాణిస్తున్న మార్గంలో లోతైన గుంత కనిపించడంతో శాస్త్రవేత్తలు అలర్ట్‌ అయ్యారు. దీంతో, వెంటనే రోవర్‌ రూట్‌ మార్చారు. 

ఇ‍స్రో ట్విట్టర్‌ వేదికగా తెలిపిన వివరాల ప్రకారం..‘ఆగస్టు 27న రోవర్‌ ఉన్న ప్రాంతానికి మూడు మీటర్ల దూరంలో ఒక గుంత కన్పించింది. నాలుగు మీటర్ల వ్యాసంతో భారీ గుంత ఉంది. దీంతో తన మార్గాన్ని మార్చుకోవాలని రోవర్‌కు కమాండ్‌ ఇచ్చాం. ప్రస్తుతం రోవర్‌ తన కొత్త మార్గంలో సురక్షితంగా ప్రయాణిస్తోంది’ అని పేర్కొంది. ఈ మేరకు చంద్రుడిపై ఉన్న గుంతకు సంబంధించిన ఫొటోను ఇ‍స్రో సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ఈ క్రమంలోనే రోవర్‌లోని నావిగేషన్‌ కెమెరా ద్వారా ఈ గుంతను గుర్తించినట్లు ఇస్రో వెల్లడించింది. ఈ సందర్భంగా కొత్త మార్గంలో రోవర్‌ ప్రయాణించిన గుర్తులను కూడా షేర్‌ చేసింది. 


చంద్రుడిపై ఓవర్‌ హీట్‌..
ఇదిలా ఉండగా.. చంద్రయాన్‌–3 ప్రయోగం ద్వారా చంద్రుడికి సంబంధించిన ఎన్నో ఆసక్తికర అంశాలు వెల్లడవుతున్నాయి. చంద్రయాన్‌–3 మిషన్‌లో అంతర్భాగమైన విక్రమ్‌ ల్యాండర్‌లో అమర్చిన చంద్రాస్‌ సర్ఫేస్‌ థర్మో ఫిజికల్‌ ఎక్స్‌పెరిమెంట్‌ అనే పేలోడ్‌ చంద్రుడి ఉపరితలంపై ఉష్ణ లక్షణాలను ఇస్రోకు పంపిస్తోంది. ‘చంద్రుడి ఉపరితలంపై 20 లేదా 30 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు కాస్త అటూఇటూగా ఉష్ణోగ్రతలు ఉండొచ్చని అంచనా వేశారు. కానీ, ఆశ్చర్యకరంగా 70 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రతలు ఉన్నాయని ఇస్రో శాస్త్రవేత్త బీహెచ్‌ఎం దారుకేశ ఆదివారం పీటీఐకి చెప్పారు.

‘అదేవిధంగా, ఈ పేలోడ్‌లో అమర్చిన కంట్రోల్డ్‌ పెన్‌ట్రేషన్‌ మెకానిజం ద్వారా ఉపరితలానికి 10 సెంటీమీటర్ల లోతు వరకు ఉష్ణోగ్రతలను సెన్సార్లతో కొలవచ్చు. ఉపరితలంపై 70 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రత ఉండగా కేవలం రెండు, మూడు సెంటీమీటర్ల లోతు కెళ్లే సరికి రెండు మూడు డిగ్రీల సెంటీగ్రేడ్‌ మేర ఉష్ణోగ్రతలు తగ్గాయి. ఇంకాస్త లోతుకెళితే –10 డిగ్రీల కంటే తక్కువగా ఉష్ణోగ్రతలున్నాయి. ఉపరితలంతో పోలిస్తే రమారమి 50 డిగ్రీలు తేడాతో ఉండటం చాలా ఆసక్తికరమైన అంశం’అని ఆయన తెలిపారు.

‘కేవలం 8 సెంటీమీటర్ల లోతుకు వెళ్లగానే అది 10 డిగ్రీలకు పడిపోయింది. మరింత లోతుకు వెళితే మంచు ఆనవాళ్లు ఉన్నట్టుగా తెలుస్తోంది. తాజా పరిశోధనలను బట్టి చంద్రుడిపై ఉష్ణోగ్రతలు చాలా వేగంగా మారుతున్నట్లు స్పష్టమవుతోందని ఇస్రో పేర్కొంది. దక్షిణ ధ్రువానికి సంబంధించిన ఇలాంటి వివరాలను తెలుసుకోవడం ఇదే మొదటిసారని తెలిపింది. 

ఇది కూడా చదవండి: ఆదిత్య ఎల్‌-1 ప్రయోగంపై ఇస్రో కీలక ప్రకటన

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement