సాక్షి, బెంగళూరు: బెంగళూరు రేవ్ పార్టీ కేసులో దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. రేవ్ పార్టీ కేసులో ప్రధాన నిందితుడు వాసు ముఖ్య అనుచరుడు, ఈ కేసులో ఏ2గా ఉన్న అరుణ్ కుమార్‌ను బెంగళూరు క్రైం బ్యాచ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
వివరాల ప్రకారం.. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో చిత్తూరు జిల్లాకు చెందిన అరుణ్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో అరుణ్ ఏ2గా ఉన్నాడు. బర్త్ డే పార్టీ నిర్వహించిన వాసుకు అరుణ్ ముఖ్య అనుచరుడు. కాగా, అరుణ్ కుమార్ బెంగళూరులో ఉంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. అలాగే, రేవ్ పార్టీలకు కూడా ప్లాన్ చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. దీంతో, అరుణ్‌ను పోలీసులు అరెస్ట్‌చేసి విచారిస్తున్నారు.
ఇక, బెంగళూరులోని బీఆర్ ఫామ్ హౌస్ యజమాని గోపాల్ రెడ్డికి కూడా సీసీబీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో సోమవారం విచారణకు రావాలని ఆదేశించారు. మరోవైపు.. రేవ్ పార్టీపై పోలీసులు దాడుల నేపథ్యంలో అక్కడి నుంచి పారిపోయిన పూర్ణారెడ్డి అనే వ్యక్తి కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు.
ఇదిలాఉండగా.. బెంగళూరు రేవ్ పార్టీకి వచ్చిన వారిలో 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్టు పోలీసులు గుర్తించారు. డ్రగ్స్ తీసుకున్న వారిలో టాలీవుడ్ నటి హేమా, ఆషీరాయ్ కూడా ఉన్నారు. వీరి బ్లడ్ శాంపిల్స్‌లో డ్రగ్స్ తీసుకున్నట్టు ఆనవాళ్లను గుర్తించిన విషయం తెలిసిందే. ఇక, మిగతా వారి పేర్లను కూడా పోలీసులు ప్రకటించాల్సి ఉంది.
ఇది కూడా చదవండి: బెంగళూరు రేవ్ పార్టీ.. తెలుగు డ్రగ్స్ పార్టీ..
Comments
Please login to add a commentAdd a comment