Indian scientists
-
గగన్‌యాన్ తరహాలో ‘సముద్రయాన్’
రేణిగుంట/ఏర్పేడు(తిరుపతి జిల్లా): గగన్‌యాన్ తరహాలో సముద్రయాన్‌కు భారత శాస్త్రవేత్తలు సిద్ధమవుతున్నారని, వచ్చే ఏడాది ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించే అవకాశం ఉందని కేంద్ర ఎర్త్ సైన్సెన్ సెక్రెటరీ, ప్రఖ్యాత శాస్త్రవేత్త డాక్టర్ రవిచంద్రన్ తెలిపారు. డీప్ ఓషన్ టెక్నాలజీ మిషన్‌లో భాగంగా సముద్ర వనరులు, సముద్రగర్భంలోని జీవ వైవిధ్యంపై అధ్యయనం చేసేందుకు ఈ ప్రాజెక్ట్‌ను చేపడుతున్నట్లు చెప్పారు. తిరుపతి ఇన్నోవేషన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, విజ్ఞానభారతి సంయుక్తంగా తిరుపతి ఐఐటీలో మంగళవారం నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ మిషన్‌పై నిర్వహించిన జాతీయ స్థాయి సదస్సులో రవిచంద్రన్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ..ముగ్గురు ఆక్వానాట్స్తో ప్రయాణం చేయడానికి అనువైన జలాంతర్గామిని ఈ పరిశోధనకు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. ఆయిల్ అండ్ గ్యాస్, మెటల్స్ వంటి సముద్ర ఆర్థిక వనరులను సమగ్రంగా గుర్తించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటుందన్నారు. నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ సారస్వత్ మాట్లాడుతూ..సమాజ స్థితి గతులను సైన్స్ మారుస్తుందన్నారు. డీఆర్డీవో డైరెక్టర్ జనరల్ డాక్టర్ బికే దాస్ డీఆర్డీవో సాధించిన ప్రగతిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. శాంతాబయోటెక్ వ్యవస్థాపకులు డాక్టర్ వరప్రసాదరెడ్డి మాట్లాడుతూ..జ్ఞానం లేని విద్య, మానవత్వం లేని మనిషి వ్యర్థమన్నారు. తిరుపతి ఐఐటీ డైరెక్టర్ సత్యనారాయణ, ఐఎస్టీఎఫ్(తిరుపతి) ప్రెసిడెంట్ నారాయణరావు, విజ్ఞాన భారతి ప్రతినిధి త్రిస్టా ఠాకూర్ తదితరులు పాల్గొన్నారు. -
క్యాన్సర్ కణాలకు చెక్!
న్యూఢిల్లీ: మహమ్మారి క్యాన్సర్ కణాల అంతానికి నడుం బిగించిన భారతీయ శాస్త్రవేత్తల బృందం ఆ క్రతువులో విజయవంతమైంది. అతి సూక్ష్మ బంగారు, రాగి సలై్ఫడ్ రేణువులను శాస్త్రవేత్తలు సృష్టించారు. రోగి శరీరంలో క్యాన్సర్ సోకిన చోట ఈ రేణువులను ప్రవేశపెట్టి వీటిని ఫొటో థర్మల్, ఆక్సీకరణ ఒత్తిడికి గురిచేసినపుడు ఇవి క్యాన్సర్ కణాలను విజయవంతంగా వధించాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్సీ)కి చెందిన అధ్యయన బృందం సాధించిన ఈ ఘనత తాలూకు వివరాలు ఏసీఎస్ అప్లయిడ్ నానో మెటీరియల్స్ జర్నల్ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి. గోల్డ్, కాపర్ సలై్ఫడ్ రేణువులు క్యాన్సర్ కణాలను అత్యంత సులభంగా గుర్తించగలవు కూడా. రేణువులను రోగమున్న చోట ప్రవేశపెట్టాక అక్కడ కాంతిని ప్రసరింపజేయాలి. కాంతిని శోషించుకున్న రేణువులు ఉష్ణాన్ని జనింపజేస్తాయి. వేడితోపాటే విషపూరిత స్వేచ్ఛాయుత ఆక్సిజన్ అణువులను ఇవి విడుదలచేస్తాయి. ఇవి క్యాన్సర్ కణాలను ఖతంచేస్తాయి. గోల్డ్, కాపర్ సల్ఫైడ్ రేణువులు వ్యాధి నిర్ధారణ కారకాలుగా పనిచేస్తాయి. కాంతిని సంగ్రహించి అల్ట్రాసౌండ్ తరంగాలను విడుదలచేస్తాయి. దీంతో ఏ దిశలో ఎన్ని క్యాన్సర్ కణాలు ఉన్నాయో స్పష్టంగా తెల్సుకోవచ్చు. ఈ విధానం క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ ప్రక్రియను మరింత మెరుగుపరచనుంది. క్యాన్సర్ కణజాలం గుండా ఈ అ్రల్టాసౌండ్ తరంగాలు ప్రసరించినపుడు క్యాన్సర్ కణతులపై ఆక్సిజన్ ఆనవాళ్లు, వాటి ఆకృతులు అత్యంత స్పష్టంగా కనిపించనున్నాయి. గతంలో ఈ రేణవులను పెద్ద పరిమాణంలో తయారుచేయగా ఐఐఎస్సీ శాస్త్రవేత్తలు ఈసారి అత్యంత సూక్ష్మ స్థాయిలో అంటే 8 నానోమీటర్ల పరిమాణంలో తయారుచేయగలిగారు. కాపర్ సలై్ఫడ్ ఉపరితలంపై అత్యంత సూక్ష్మమైన పుత్తడి రేణువులను చల్లి ఈ గోల్డ్, కాపర్ మిశ్రమధాతు రేణువులను సృష్టించారు. ఇవి ఇంత చిన్న పరిమాణంలో ఉండటంతో సులువుగా క్యాన్సర్ కణజాలంలోకి చొచ్చుకుపోగలవు. ఊపిరితిత్తులు, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ కణాలపై ఈ రేణువులను ప్రయోగించి చక్కని ఫలితాలను సాధించారు. -
ఆదిత్య హృదయం
రెండు వారాల్లో రెండు ప్రయోగాలు! ఒకటి చంద్రుడి పైకి... మరొకటి సూర్యుడి గురించి! భారత శాస్త్రవేత్తలు మన అంతరిక్ష ఆకాంక్షలను మరింత ఉన్నత కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ఆగస్ట్ 23న చంద్రయాన్–3 ప్రయోగంతో ఇప్పటిదాకా పరిశోధనల్లో అసూర్యంపశ్యగా మిగిలిపోయిన చంద్రుడి దక్షిణ ధ్రువప్రాంతంపైకి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఉపగ్రహాన్ని పంపడం, రోబోటిక్ ల్యాండర్ విక్రమ్– రోవర్ ప్రజ్ఞాన్లు చంద్రునిపై సుతిమెత్తగా దిగడం, వాటిలో పరికరాలు పంపు తున్న అపూర్వడేటా దేశ కీర్తిప్రతిష్ఠల్ని పెంచాయి. ఆ విజయ పరంపర సాగుతుండగానే, భూమికి అతి సమీప నక్షత్రం సూర్యుడి అధ్యయనానికి భారత్ తొలిసారి ఉపగ్రహాన్ని పంపడం విశేషం. చంద్రయాన్–3తో పోలిస్తే, ‘ఆదిత్య– ఎల్1’ ప్రయోగంలో నాటకీయత తక్కువే. కానీ, సెప్టెంబర్ 2న సక్సెసైన ఈ సౌరశోధనా ఉపగ్రహ ప్రయోగం మరో 4 నెలల్లో కీలకమైన భౌమ– సౌర లాగ్రేంజ్ పాయింట్1 (ఎల్1)కు సురక్షితంగా చేరగలిగితే, ఎన్నో సౌర రహస్యాలు బయటకొస్తాయి. ఇప్పటికే చంద్రునిపై ఆక్సిజన్ జాడ సహా అనేకం కనుగొని, చంద్ర మండలం ఊహిస్తున్న దాని కన్నా ఎక్కువగానే ఆవాసయోగ్యమని మనం తేల్చాం. రేపటి శోధనలో ఆదిత్య హృదయం ఏం వెల్లడిస్తుందో ఆసక్తికరమే. దేశంలోని మరో ఆరు సంస్థల భాగస్వామ్యంతో ఇస్రో చేస్తున్న ఈ రోదసీ గవేషణతో సౌర వర్తన, అంతరిక్ష వాతావరణం, వైపరీత్యాల నుంచి మన అంతరిక్ష ఆస్తుల సంరక్షణ వగైరాలపై లోతైన అవగాహన కలగవచ్చు. అంతరిక్ష పరిశోధనలో అంతకంతకూ భారత్ ముంద డుగులు వేస్తున్నదనడానికి ఇది మరో కొండగుర్తు. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘నాసా’, అలాగే యూరోపియన్ అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘ఈసా’లు సూర్యుడి గురించి ఇప్పటికే 20కి పైగా శాస్త్రీయ అంతరిక్ష ప్రయోగాలు జరిపాయి. అమెరికా, యూకేల సాయంతో జపాన్ సైతం తన పరిశోధక ఉపగ్రహాన్ని 2006లో ప్రయోగించింది. అయితే, మన ఇస్రో మాత్రం ‘చంద్రయాన్’ లాగానే ఈ సూర్య మండల గవేషణలోనూ తన వైన ప్రత్యేక ఆవిష్కరణలు చేయాలని నడుం బిగించింది. ముఖ్యంగా సూర్య గోళానికి వెలుపల విస్తరించి ఉండే కాంతివలయమూ, సౌర వాతావరణానికి పైభాగమైన (కరోనా); సూర్యునిలో భాగమైన వెలుగులు విరజిమ్మే ప్రకాశమండలం (ఫోటోస్పియర్); ఆ చుట్టూ వ్యాపించే, సౌర వాతా వరణానికి దిగువ ప్రాంతమైన వర్ణమండలం (క్రోమోస్పియర్); సౌర పవనాలు – వీటన్నిటిపైనా దృష్టి సారించాలని రంగంలోకి దిగింది. ‘ఆదిత్య ఎల్1’లోని శాస్త్రీయ పరికరాల ద్వారా సౌర విద్యు దయస్కాంత క్షేత్రాలనూ, వెలువడే కణ ఉద్గారాలనూ లెక్కించాలని ప్రణాళిక వేసుకుంది. తద్వారా సూర్యుడి ప్రవర్తన గురించి కొత్త అంశాలను వెలికి తీసుకురావాలనేది ప్రధాన లక్ష్యం. చంద్రయాన్ ద్వారా చంద్రుడు, వెంటనే ఆదిత్య–ఎల్1 ద్వారా సూర్యుడు, ఆ వెంటనే శుక్రుడు, అటు పైన మానవ సహిత వ్యోమనౌకతో అంతరిక్ష యానమైన ‘గగన్‌యాన్’... ఇలా వరుసగా అనేక బృహత్ యజ్ఞాలను ఇస్రో చేపడుతోంది. బుధుడి తర్వాత మనకు అత్యంత సమీపంలో ఉన్న శుక్ర గ్రహపు మేళనాన్నీ, అక్కడి వాతావరణాన్నీ అధ్యయనం చేయడం ఒక ప్రాజెక్ట్ ఆలోచనైతే, ముగ్గురు భారత వ్యోమగాముల్ని అంతరిక్షంలోకి పంపి, మళ్ళీ వారిని సురక్షితంగా భూమి మీదకు తీసుకు రావడం మరో ప్రాజెక్ట్ లక్ష్యం. ఇప్పటి వరకు ప్రపంచంలో 3 దేశాలు (అమెరికా, రష్యా, చైనా) మాత్రమే ఇలా మనుషుల్ని అంతరిక్షంలోకి పంపాయన్నది గమనార్హం. ఈ ప్రాజెక్టులన్నిటిలో ఇస్రో ఎంచుకున్న మార్గం ఒక్కటే – వీలైనంత తక్కువ ఖర్చులో ఉన్నత సాంకేతిక నవకల్పన! తాజా సౌరశోధననే చూస్తే– భూమి నుంచి 15 కోట్ల కి.మీ.ల దూరంలో సూర్యుడుంటాడు. మన ఆదిత్య–ఎల్1 వెళ్ళేది అందులో 15 లక్షల కి.మీ.ల దూరమే. అంటే, భూమి కన్నా ఒక్క శాతం మాత్రమే సూర్యునికి దగ్గరగా వెళుతుంది. అయితేనేం, సూర్య, భూమి రెంటి గురుత్వాకర్షణ శక్తి సమానంగా ఉండి, అందుకు తగ్గట్టు వ్యోమనౌక తిరిగేందుకు కావాల్సిన కేంద్రోన్ముఖ బలాన్నిఅందించే పరివేష కక్ష్య (హేలో ఆర్బిట్)లోని కీలకమైన లాగ్రేంజ్ పాయింట్1 (ఎల్1)లో ఈ ఆదిత్య ఉపగ్రహాన్ని ప్రవేశపెడతారు. దీనివల్ల ఎక్కువగా ఇంధనం ఖర్చు కాకుండానే మన ఉపగ్రహం సౌర మండలాన్ని నిరంతరాయంగా పరిశీలించవచ్చు. భూమి నుంచి 9.9 కోట్ల కి.మీ.ల దగ్గరున్నప్పుడు కుజుడి అధ్యయనానికి గతంలో మంగళ్యాన్ చేసిన మన అనుభవమూ ఆదిత్యకు పనికొచ్చింది. ఎల్1 వైపు సాగుతున్న ప్రయాణంలో ఆదిత్య ఉపగ్రహ కక్ష్యను ఇప్పటికి రెండుసార్లు విజయవంతంగా పెంచగలిగాం. సెప్టెంబర్ 10న మూడోసారి కక్ష్య పెంపు ఉండనుంది. వెరసి, ప్రయోగం నాటి నుంచి 125 రోజులకు, అంటే సుమారు నాలుగు నెలలకు పరివేష కక్ష్యలో ఎల్1 వద్ద మన ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టే ప్రక్రియ పూర్తవుతుంది. వచ్చే అయిదేళ్ళ పాటు ఈ ఉపగ్రహం సూర్యుడికి సంబంధించిన సమాచారాన్ని సేకరించి, పంపనుంది. అంతా బాగుంటే, ఆ తర్వాత కూడా మరో పదేళ్ళ పైగానే అది పనిచేసే అవకాశం కూడా ఉందట. జ్ఞానమే సమున్నత అధికారమైన ఆధునిక సమాజంలో, దానిపై ఆధారపడ్డ ఆర్థిక వ్యవస్థలో అగ్రరాజ్యాలతో మనం దీటుగా నిలబడేందుకు అంతకు మించి ఇంకేం కావాలి! అనేక దేశాల వల్ల కాని సూర్యచంద్ర శోధనను మనం సాధించ గలగడం మన శాస్త్రవేత్తల నిర్విరామ కృషికి నిదర్శనమే! 2020 నుంచి ప్రైవేటీకరణ బాట పట్టిన భారత అంతరిక్ష విధానంతో, 360 బిలియన్ డాలర్ల ప్రపంచ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థలో గణనీయ మైన వాటా దక్కించుకోవడానికీ ఇలాంటి శోధనలు, విజయసాధనలు మరింత అవసరమే! -
6జీ టెక్నాలజీలో భారతీయులకు 100 పేటెంట్లు
న్యూఢిల్లీ: 6జీ టెక్నాలజీకి సంబంధించి భారతీయ సైంటిస్టులు, ఇంజినీర్లు, విద్యావేత్తలకు 100 పేటెంట్లు ఉన్నాయని కేంద్ర ఐటీ, టెలికం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఎలక్ట్రానిక్స్ అనేది చాలా సంక్లిష్టమైన అంశం అయినప్పటికీ మనవారు ఆ రంగంలో గణనీయ పురోగతి సాధిస్తున్నారని చెప్పారు. పీహెచ్డీ చాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వహించిన భారత్ స్టార్టప్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు వివరించారు. 5జీ నెట్వర్క్ విస్తరణ .. ప్రభుత్వం నిర్దేశించిన 200 నగరాలను కూడా దాటి ప్రస్తుతం 397 నగరాలకు చేరిందని ఆయన చెప్పారు. ప్రస్తుతం 3.5 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా ఉన్న భారత్.. పాలన, మౌలిక సదుపాయాలు, వ్యాపారాల నిర్వహణలో మార్పులతో ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగగలదని వైష్ణవ్ పేర్కొన్నారు. ఆ దిశగా అందరూ కృషి చేస్తే .. 30 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా భారత్ ఆవిర్భవించడాన్ని ఏ శక్తీ ఆపలేదని ఆయన చెప్పారు. -
నక్షత్రాల అవిర్భావం గుట్టు విప్పిన భారత టెలిస్కోప్!
న్యూఢిల్లీ: బిగ్‌బ్యాంగ్ తర్వాత 20 కోట్ల ఏళ్లకు ఏర్పడ్డ తొలి నక్షత్రాల రహస్యాలను భారత టెలిస్కోప్ బహిర్గతం చేసింది. బెంగళూరులోని రామన్ పరిశోధనా సంస్థ (ఆర్ఆర్ఐ)లో డిజైన్ చేసి, నిర్మించిన సరస్–3 రేడియో టెలిస్కోప్‌తో నక్షత్రాల గుట్టును బయట పెట్టారు. 2020 మార్చిలో కర్ణాటకలోని దండిగనహళ్లి చెరువు వద్ద, కొంతకాలం శరావతి బ్యాంక్ వాటర్స్ వద్ద ఈ టెలిస్కోప్‌ను ఏర్పాటు చేశారు. విశ్వం ఎలా ఏర్పడిందో తెలుసుకొనేందుకు ఆర్ఆర్ఐతోపాటు ఆస్ట్రేలియాకు చెందిన కామన్వెల్త్ సైంటిఫిక్, ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (సీఎస్ఐఆర్ఓ), యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్, యూనివర్సిటీ ఆఫ్ టెల్ అవివ్ పరిశోధకులు సంయుక్తంగా ఈ పరిశోధన నిర్వహించారు. సరస్–3 టెలిస్కోప్ డేటాను ఇటవలే విశ్లేషించారు. బిగ్‌బ్యాంగ్ అనంతరం తొలుత ఏర్పడిన నక్షత్ర మండలాల్లోని 3 కంటే తక్కువ శాతం వాయువులు నక్షత్రాలుగా రూపాంతరం చెందినట్లు గుర్తించామని ఆర్ఆర్ఐ ప్రతినిధి సౌరభ్ సింగ్ చెప్పారు. దేశీయంగా అభివృద్ధి చేసిన సరస్–3 రేడియో టెలిస్కోప్ కాస్మిక్ డాన్ ఆస్ట్రోఫిజిక్స్‌పై అవగాహన మరింత పెంచుకొనేందుకు ఉపయోగపడుతుందని అన్నారు. బిగ్‌బ్యాంగ్ అనంతర కాలాన్ని కాస్మిక్ డాన్‌గా వ్యవహరిస్తారు. అప్పటి గెలాక్సీల్లో అత్యధిక సాంద్రత కలిగిన కృష్ణ బిలాలు (బ్లాక్ హోల్స్) ఉండేవి. -
భారతీయులు భళా: ట్రంప్
వాషింగ్టన్: భారత్ శాస్త్రవేత్తలు, పరిశోధకులు చాలా గొప్పవారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసల జల్లు కురిపించారు. కోవిడ్ రోగులకు చికిత్స అందించడానికి మందులు, వ్యాక్సిన్ అభివృద్ధి చేయడంలో ఇండియన్ అమెరికన్ శాస్త్రవేత్తలు చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు. వైట్‌హౌస్ రోజ్ గార్డెన్లో శుక్రవారం ట్రంప్ విలేకరులతో మాట్లాడారు. ‘కోవిడ్‌ను ఎదుర్కోవడానికి వ్యాక్సిన్, మందులు కనుక్కోవడంలో ఇండియన్ అమెరికన్ శాస్త్రవేత్తలు, పరిశోధనకారులు చేస్తున్న కృషి మరువలేనిది’అని అన్నారు. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్ పరిశోధనకారులు, శాస్త్రవేత్తల్ని ప్రశంసిస్తూ మాట్లాడడం ఇదే తొలిసారి. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వర్సిటీలు, రీసెర్చ్ వర్సిటీలు, బయో ఫార్మా స్టార్టప్‌లలో ఇండియన్ అమెరికన్ శాస్త్రవేత్తలు కోవిడ్‌పై మందులు, వ్యాక్సిన్ కనుగొనే ప్రయత్నాల్లో ఉన్నారు. భారత్, అమెరికా సంయుక్త కృషితో ఈ ఏడాది చివరి నాటికి వ్యాక్సిన్ కనుక్కుంటామని ట్రంప్ చెప్పారు. భారత్‌కు వెంటిలేటర్లు పంపిస్తామన్న ట్రంప్..స్నేహం బలపడిందన్న మోదీ కోవిడ్ రోగులకు చికిత్స అందించడంలో ఎక్కువగా ఉపయోగపడే వెంటిలేటర్లను భారత్‌కు ఇవ్వడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంగీకరించారు. భారత్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనకు మంచి మిత్రుడని మరోసారి స్పష్టం చేశారు. ‘‘మా మిత్రదేశమైన భారత్‌కు వెంటిలేటర్లు పంపిస్తాం. భారత్‌కు అండగా ఉంటాం’అని ట్వీట్ చేశారు. దీనికి ప్రధాని మోదీ ట్వీట్ ద్వారా ట్రంప్‌కి ధన్యవాదాలు తెలిపారు. భారత్, అమెరికా మధ్య మైత్రికి మరింత బలోపేతంగా మారిందని అన్నారు. వైరస్ సోకిన తొలి రోజుల్లో అమెరికాకి క్లోరోక్విన్ మాత్రల్ని భారత్ భారీగా పంపడం తెల్సిందే. కరోనాను ఎదుర్కోవడానికి కలసికట్టుగా కృషి చేయాలని, ఈ సంక్షోభ సమయంలో ప్రపంచదేశాలన్నీ సమష్టిగా పోరుబాట పడితే ఆరోగ్యకరమైన ప్రపంచం ఆవిష్కృతమవుతుందని మోదీ పేర్కొన్నారు. శ్వేతసౌధంలోని రోజ్ గార్డెన్లో శనివారం జరిగిన కార్యక్రమంలో గర్ల్ స్కౌట్ ట్రూప్ 744 సభ్యురాలు శ్రావ్యా అన్నపరెడ్డిని సత్కరిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ -
మన శాస్త్రవేత్తల నైపుణ్యం గొప్పది
న్యూఢిల్లీ: జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ భారతీయ శాస్త్రవేత్తల నైపుణ్యాన్ని ప్రశంసించారు. ‘మన శాస్త్రవేత్తల వినూత్న ఆలోచనలు, పరిశోధనల పట్ల వారి మార్గదర్శకాలు దేశానితోపాటు ప్రపంచానికి ఎనలేని కీర్తిని తెస్తాయి’అని ట్విట్టర్లో పేర్కొన్నారు. దీంతో భారత్ శాస్త్ర, సాంకేతిక రంగం వృద్ధిలో కొనసాగడమే కాక.. యువతకు సైన్స్ పట్ల ఉత్సుకతను పెంపొందించేందుకు దోహదం చేస్తుందన్నారు. ‘మన శాస్త్రవేత్తలను గౌరవించుకునేందుకు జాతీయ సైన్స్ దినోత్సవం ఒక మంచి సందర్భం’అని పేర్కొన్నారు. ఇందులో భాగంగా భారత్‌లో పరిశోధన, ఆవిష్కరణల్లో అనుకూల వాతావరణాన్ని కల్పించడానికి ప్రభుత్వం అన్ని రకాలుగా కృషి చేస్తుందన్నారు. పరిశోధనల్లో మహిళలు 15 శాతమే: కోవింద్ శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మహిళలు తక్కువ సంఖ్యలో ఉన్నారని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వ్యాఖ్యానించారు. పరిశోధన, అభివృద్ధి రంగాల్లో మహిళలు 15 శాతానికే పరిమితం అయ్యారని పేర్కొన్నారు. శుక్రవారం జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా శాస్త్రవేత్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. దేశంలోని పరిశోధన, అభివృద్ధి సంస్థల్లో లింగ సమానత్వం, అభివృద్ధికి సంబంధించి మూడు కార్యక్రమాలను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రారంభించారు. -
సింహాల గణనకు కొత్త విధానం
డెహ్రడూన్: దేశంలో సింహాల సంఖ్యను లెక్కించేందుకు శాస్త్రవేత్తలు కొత్త విధానాన్ని కనుగొన్నారు. దీంతో వాటి సంరక్షణ చర్యలు సమర్థంగా చేపట్టొచ్చని చెబుతున్నారు. సంరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా గుజరాత్‌లోని గిర్ అడవుల్లో ఉన్న 50 ఆసియా సింహాల సంఖ్య ప్రస్తుతం 500 వరకు పెరిగినట్లు వైల్డ్‌లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు చెందిన కేశబ్ వివరించారు. ప్రస్తుతం ఉన్న లెక్కింపు విధానాల వల్ల కొన్ని సింహాలను లెక్కించకపోవచ్చు. లేదా డబుల్ కౌంటింగ్ జరగొచ్చు.. దీనివల్ల వాటి సంఖ్య వివరాలు పరిమితంగానే తెలుస్తాయి. అందుకే ఆయన సహచరులు కలసి కంప్యూటర్ ప్రోగ్రాం ఉపయోగించి లెక్కించే కొత్త విధానాన్ని రూపొందించారు. ఈ విధానంలో సింహం ముఖంపై ఉన్న మీసాలు, శరీరంపై ఉన్న మచ్చల ఆధారంగా గుర్తిస్తారు. సింహాల ఆహార లభ్యత, ఇతర కారకాలు సింహాల సంఖ్యను ప్రభావితం చేసే అవకాశం ఉందని కేశబ్ చెప్పారు. తాజా అధ్యయనంలో గిర్ అడవుల్లో 368 సింహాల్లో 67 సింహాలను 725 చదరపు కి.మీ.ల విస్తీర్ణంలో గుర్తించారు. -
బ్రహ్మోస్ సక్సెస్
బాలాసోర్ (ఒడిశా): ప్రపంచంలోనే అత్యంత వేగమైన బ్రహ్మోస్ సూపర్ క్రూయిజ్ క్షిపణిని భారత శాస్త్రవేత్తలు సోమవారం విజయ వంతం గా ప్రయోగించారు. ఒడిశా తీరంలోని చాం దీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ లాంచ్ ప్యాడ్ 3లోని మొబైల్ లాంచర్ ద్వారా ఉదయం 10.40 గంటలకు క్షిపణి ప్రయోగాన్ని చేపట్టినట్లు డీఆర్ డీవో వెల్లడించింది. బ్రహ్మోస్ జీవిత కాలాన్ని పొడిగించేందుకుగాను తాజా ప్రయోగాన్ని చేపట్టినట్లు డీఆర్డీవో అధికారులు తెలిపారు. ఈ ప్రయోగానికి సంబంధించిన సాంకేతికతను డీఆర్డీవో, బ్రహ్మోస్ శాస్త్రవేత్తలు సంయుక్తంగా తొలిసారి భారత్‌లో అభివృద్ధి చేశారు. ప్రస్తుత ప్రయోగంతో ఇండియన్ ఆర్మీకి మిస్సైల్స్ కోసం చేయాల్సిన ఖర్చు భారీగా తగ్గనుంది. మిస్సైల్ వినియోగ కాలాన్ని 10 ఏళ్ల నుంచి 15 ఏళ్లకు పెంచుతూ దీని సాంకేతికతలో మార్పులు చేశా రు. జీవిత కాలాన్ని పొడిగించిన భారతదేశ మొ దటి క్షిపణి బ్రహ్మోస్ కావడం గమనార్హం. భూ మిపై నుంచి ఆర్మీ, నీటిలో నుంచి నౌకాదళం, ఆకాశం నుంచి వాయుసేన.. ఇలా త్రివిధ దళా ల్లో ఎక్కడి నుంచైనా ప్రయోగించడానికి అనువు గా ఉండే సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణిగా బ్రహ్మోస్ దేశ భద్రతకు సేవలందిస్తోంది. -
గురుత్వ ప్రయోగాల వెనుక మనోళ్లు!
న్యూఢిల్లీ: గురుత్వ తరంగాలను గుర్తించినందుకుగాను ఖగోళ భౌతిక శాస్త్రంలో ముగ్గురు అమెరికన్లకు నోబెల్ వరించింది. అయితే ఈ ఘనత సాధిం చడంలో భారతీయ శాస్త్రవేత్తల కృషి కూడా ఎంతో ఉంది. గురుత్వ తరంగాలను గుర్తించేం దుకు చేసిన ప్రయోగాలకు నోబెల్ లభించడంతో కల నెరవేరినట్లయిందని బెంగళూరులోని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ థియరిటికల్ సైన్సెస్‌కు చెందిన ప్రొఫెసర్ బాలా అయ్యర్ పేర్కొన్నారు. గురుత్వ తరంగాలను గుర్తించేందుకు అధునాతనమైన ప్రయోగాలు నిర్వహించేందుకు ఉద్దేశించిన ‘ఇండిగో’ ప్రోగ్రాంలో బాలా అయ్యర్ సాంకేతికంగా సాయమందించారు. గురుత్వ తరంగాలను గుర్తించడం ద్వారా కొత్త తరం శాస్త్రవేత్తలు ఖగోళ పరిశోధనలపై దృష్టి పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఈ ప్రయోగాల్లో పాలుపంచుకున్న, ఐఐఎస్ఈఆర్– కోల్‌కతాకు చెందిన రాజేశ్ నాయక్ పేర్కొన్నారు. ఈ ప్రయోగాల్లో పుణేలోని ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రోనమీ, ఆస్ట్రోఫిజిక్స్‌కు చెందిన సంజీవ్ దురంధర్ కూడా పాలుపంచుకున్నారు. -
ఇక గాలిని తాగెయ్యొచ్చు!
అదేంటి... నీటిని కదా తాగాలి అనుకుంటున్నారా? ఏమీలేదండి ఆ గాలిలోని నీటిని ఒడిసిపట్టి, పరిశుభ్రమైన నీటిగా మారిస్తే తాగలేమా? కానీ అలా మార్చడం సాధ్యమేనా? అని అడిగే మీ ప్రశ్నకు ఇదిగో సమాధానమంటూ చూపుతున్నారు భారత సంతతి పరిశోధకులు. గాలిలోని నీటిని సేకరించడమే కాకుండా దానిని పరిశుభ్రమైన తాగునీటిగా మార్చే సరికొత్త పరికరాన్ని రూపొందించారు. అయితే ఈ పరికరం సౌరశక్తి ద్వారా పనిచేయడం విశేషం. భూమిపై ఉన్న వాతావరణంలో సుమారు 13,000 ట్రిలియన్ లీటర్ల నీరుందట. అంటే ఇది భూమిపై ఉన్న మొత్తం సరస్సుల్లోని నీటిలో 10 శాతమన్నమాట. గాలిలోని నీటిని వినియోగించుకున్నా జలాశయాల నుంచి మళ్లీ నీరు ఆవిరి కావడంతో ఎటువంటి సమస్యా ఉండదని చెబుతున్నారు. దీనిని ఉపయోగించడం ద్వారా తాగునీటి సమస్యను కొంతమేర అయినా తగ్గించవచ్చని చెబుతున్నారు. ఈ పరికరంలోని అత్యంత కీలకమైన భాగాన్ని మాసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎమ్ఐటీ) తయారుచేసింది. 20 శాతం నీటి ఆవిరి ఉన్న ప్రాంతంలోని గాలి నుంచి కూడా ఇది నీటిని ఒడిసి పడుతుందని నిట్ ప్రొఫెసర్లు చెబుతున్నారు. 12 గంటల్లో 2.8 లీటర్ల నీటిని గాలి నుంచి శోషిస్తుందని, ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లో ఈ పరికరాన్ని ఉపయోగించవచ్చని రూపకర్తలు చెబుతున్నారు. -
'తరంగాల'ను కనిపెట్టిన శాస్త్రవేత్తల్లో 37 మంది మనోళ్లే!
విఖ్యాత శాస్త్రవేత్త ఐన్‌స్టీన్ ప్రతిపాదించిన, వందేళ్లకు పైగా మిస్టరీగా ఉన్న గురుత్వాకర్షణ తరంగాలను శాస్త్రవేత్తలు గురువారం కనుగొన్న విషయం తెలిసిందే. ఈ పరిశోధనల్లో పాల్గొన్న వారిలో 37 మంది భారత సంతతికి చెందిన శాస్త్రవేత్తలు ఉండడం గమనార్హం. సుమారు దశాబ్దం కిందటే పుణెలోని ఇంటర్ యూనివర్సీటీ ఫర్ ఆస్ట్రనమీ, ఆస్ట్రోఫిజిక్స్‌కి చెందిన సంజీవ్‌దురందర్, సత్యప్రకాశ్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు గురుత్వాకర్షణ తరంగాలను గుర్తించే పద్ధతిని కనుగొన్నారు. ఈ ప్రయోగంలో పుణె,ముంబై,బెంగళూరుకి చెందిన సుమారు 30 మంది శాస్త్రవేత్తలు పాలుపంచుకున్నారు. సుమారు రూ.వెయ్యి కోట్లతో గురుత్వాకర్షణ తరంగాలపై పరిశోధనల నిమిత్తం ‘లేజర్ ఇన్ఫర్మేషన్ గ్రావిటేష్నల్ వేవ్ అబ్సర్వేటరీ’ (లిగో)ని భారత్‌లో ఏర్పాటు చేయనున్నారు. దీన్ని భారత్, అమెరికా సమ్యుక్తంగా నిర్వహించనున్నారు. అమెరికా 140 మిలియన్ డాలర్ల విలువైన పరికరాలను సమకూర్చనుంది. ప్రయోగంలో భాగస్వామ్యులైనా భారత శాస్త్రవేత్తలకు ప్రధాని నరేంద్రమోదీ ట్విట్టర్లో శుభాకాంక్షలు తెలిపారు. -
అమెరికాలో 9.5 లక్షల మంది భారత శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు!
ఆసియా నుంచి అత్యధికంగా వలస వెళ్లింది భారత్ నుంచే.. 2003 నుంచి 2013కు 85 శాతం పెరిగిన సంఖ్య ఎన్‌సీఎస్‌ఈఎస్ తాజా నివేదికలో వెల్లడి వాషింగ్టన్: ఆసియా దేశాల నుంచి అమెరికాకు వలస వెళ్లిన శాస్త్రవేత్తలు, ఇంజనీర్లలో భారత్ అగ్రస్థానంలో ఉన్నట్లు తాజా నివేదికలో వెల్లడైంది. ఆసియా ఖండంలోని 29.60 లక్షల మంది వలస శాస్త్రవేత్తలు, ఇంజనీర్లలో 2013 నాటికి భారత్ నుంచి 9.50 లక్షల మంది అగ్రరాజ్యంలో పనిచేస్తున్నట్లు అమెరికాకు చెందిన నేషనల్ సైన్స్ ఫౌండేషన్‌లోని నేషనల్ సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ స్టాటిస్టిక్స్ (ఎన్‌సీఎస్‌ఈఎస్) పేర్కొంది. 2003తో పోలిస్తే వారి సంఖ్య 85 శాతం పెరిగిందని వివరించింది. అలాగే అదే కాలానికి ఫిలిప్పీన్స్‌కు చెందిన వారి సంఖ్య 53 శాతం, హాంకాంగ్, మకావు సహా చైనాకు చెందిన వారి సంఖ్య 34 శాతం పెరిగినట్లు ఎన్‌సీఎస్‌ఈఎస్ తెలిపింది. 2003లో 2.16 కోట్ల మంది శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు అమెరికాలో ఉండగా 2013 నాటికి వారి సంఖ్య 2.9 కోట్లకు చేరిందని నివేదిక పేర్కొంది. ఇందులో వలస వచ్చిన శాస్త్రవేత్తలు, ఇంజనీర్ల సంఖ్య 34 లక్షల నుంచి 52 లక్షలకు పెరిగిందని నివేదిక వివరించింది. 2013 గణాంకాల ప్రకారం 63 శాతం మంది అమెరికా శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు జన్మతః పౌరులుకాగా 22 శాతం మంది శాశ్వత నివాసితులు, 15 శాతం మంది తాత్కాలిక వీసాలపై నివసిస్తున్న వారు ఉన్నట్లు ఎన్‌సీఎస్‌ఈఎస్ చెప్పింది. ఈ నివేదిక ప్రకారం 2013 నాటికి వలస శాస్త్రవేత్తలు, ఇంజనీర్లలో 57 శాతం మంది ఆసియా ఖండంలో పుట్టినవారు ఉండగా 20 శాతం మంది ఉత్తర అమెరికా ఖండం (అమెరికాను మినహాయించి), సెంట్రల్ అమెరికా, కరీబియన్ లేదా దక్షిణ అమెరికాలో పుట్టిన వారు, 16 శాతం మంది యూరప్‌లో పుట్టిన వారు, 6 శాతం ఆఫ్రికాలో పుట్టిన వారు ఉన్నారు. 2013లో 32 శాతం మంది వలస శాస్త్రవేత్తలు తమ అత్యధిక విద్యాభ్యాసం మాస్టర్స్ డిగ్రీ అని చెప్పగా 9 శాతం మంది తమ అత్యధిక విద్యాభ్యాసం డాక్టరేట్ అని చెప్పారు. అమెరికాలో పుట్టిన శాస్త్రవేత్తలు, ఇంజనీర్లతో సమానంగా 2013లో 80 శాతం మందికిపైగా వలస శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు ఉపాధి పొందారు. వలస శాస్త్రవేత్తలు, ఇంజనీర్లలో అత్యధికంగా 18 శాతం మంది కంప్యూటర్, గణిత శాస్త్రాల్లో పనిచేస్తుండగా 8 శాతం మంది ఇంజనీరింగ్‌లో పనిచేస్తున్నారు. -
సైన్స్‌నూ విభజిస్తారా?
ఏపీ అకాడమీ ఆఫ్ సెన్సైస్ విభజన సరికాదు గవర్నర్ నరసింహన్ అసంతృప్తి విభజన గాయాల తీవ్రతను రోజూ చూస్తున్నా సైన్స్‌కు హద్దులు ఉండరాదు... స్వర్ణోత్సవాలు ఘనంగా ప్రారంభం సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అకాడమీ ఆఫ్ సెన్సైస్‌ను రెండుగా విడగొట్టడంపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ ఈ.ఎస్.ఎల్ నరసింహన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సైన్స్‌కు ఎల్లలు లేవు, ఉండరాదని వ్యాఖ్యానించారు. విభజన తాలూకు గాయాలు ఎంత లోతుగా ఉంటాయో తాను ప్రతిరోజూ చూస్తున్నానని చెప్పారు. ఆంధప్రదేశ్ అకాడమీ ఆఫ్ సెన్సైస్ స్వర్ణోత్సవాలను గవర్నర్ గురువారం ప్రారంభించి మాట్లాడారు. విభజన గాయాలు మానేందుకు ఎంతో సమయం పడుతుందన్నారు. శాస్త్ర పరిశోధనల విషయంలో జాప్యం జరిగేందుకు వీలు లేదన్నది తన నిశ్చితాభిప్రాయమన్నారు. ఒకవేళ ఇప్పుడు ఉన్న పేరుతో ఏవైనా చిక్కులొస్తాయని భావిస్తే ‘అకాడమీ ఆఫ్ సెన్సైస్’గా మార్చి ఉండాల్సిందన్నారు. తగిన ప్రణాళికలు సమర్పించి నిధులు కేటాయించాలని ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలను కోరి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. ఉద్దండ శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో మొదలైన ఈ సంస్థ ప్రజల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేందుకు పలు కార్యక్రమాలు చేపట్టటం తనకు ఎంతో సంతోషం కలిగించిందన్నారు. పిల్లల్లో శాస్త్ర అంశాలపై ఆసక్తి పెంచేందుకు పూర్తిగా సౌరశక్తితో నడిచే పార్కు ఏర్పాటును పరిశీలించాలని శాస్త్రవేత్తలకు సూచించారు. ఈ పార్క్‌లో ప్రయోగాలు చేసేందుకు పిల్లలకు అవకాశం కల్పించాలన్నారు. గుండె గుభేల్మనేలా వైద్య బిల్లులు.. భారత శాస్త్రవేత్తలు సాధించిన గొప్ప విజయాలు నిరుపమానమైనవని, అయితే ఓ సామాన్యుడిగా వారి నుంచి మరింత ఆశిస్తున్నానని గవర్నర్ పేర్కొన్నారు. అందరికీ ఆహారం, ఇంధన భద్రత, వైద్యం, వైద్యవిద్య చౌకగా అందించటం, వీటన్నింటికీ మించి జాతీయ భద్రతపై అంకితభావంతో కృషి చేయాలని కోరారు. ప్రస్తుతం వైద్యం చాలా ఖరీదైపోయిందని, సామాన్యుడు వ్యాధితో కాకుండా ఆసుపత్రి బిల్లు చూసి మరణించే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త వైద్యకళాశాలలు పుట్టుకొస్తున్నా సౌకర్యాలు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. వైద్యవిద్యలో డొనేషన్లు లేకుండా చూడాలని, దీన్ని ఉల్లంఘిస్తే శిక్షించేలా నిబంధనలు రూపొందించాలని అభిప్రాయపడ్డారు. ఇంజనీరింగ్ పట్టభద్రులు తగినంత నైపుణ్యాలు లేక కానిస్టేబుళ్లుగా, ప్యూన్లుగా ఉద్యోగాలు చేస్తున్నారని చెప్పారు. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని, ఈ పరిస్థితిని మార్చేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నించాలని ప్రభుత్వాలను కోరారు. కలసి పనిచేస్తే విజయాలు: కటోచ్ శాస్త్ర, పరిశోధన రంగాల్లో ఎన్ని గొప్ప విజయాలు సాధించినా అంతర్జాతీయ స్థాయిలో మన ముద్ర లేకపోవటానికి ఒక సమస్య పరిష్కారానికి సంబంధిత రంగాల వారంతా కలసికట్టుగా ప్రయత్నించకపోవడమే కారణమని భారత వైద్య పరిశోధన సమాఖ్య డెరైక్టర్ విశ్వమోహన్ కటోచ్ పేర్కొన్నారు. ఇప్పుడిప్పుడే పరిస్థితిలో మార్పు రావటంతో సత్ఫలితాలు సాధిస్తున్నామని చెప్పారు. మెదడువాపు వ్యాధి చికిత్సతోపాటు నీటిశుద్ధీకరణ ప్లాంట్ల ఏర్పాటు వరకూ అనేక అంశాల్లో ఏడు కేంద్ర ప్రభుత్వ శాఖల అధికారులు కలిసి పనిచేస్తున్నారని చెప్పారు. కాన్పూర్‌కు 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ కుగ్రామంలో ఐదేళ్ల సంయుక్త కృషితో క్షయ, కుష్టు వ్యాధులను గణనీయంగా తగ్గించగలిగామని తెలిపారు. ఉద్దండ శాస్త్రవేత్తలకు సత్కారం ఆంధ్రప్రదేశ్ అకాడమీ ఆఫ్ సెన్సైస్ 50 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా సంస్థ సీనియర్ శాస్త్రవేత్తలను ఘనంగా సత్కరించారు. సంస్థ వ్యవస్థాపక సభ్యుడు డాక్టర్ పి.ఎం.భార్గవ, ఎం.కృష్ణమూర్తిలను గవర్నర్ సత్కరించారు. వయోభారం వల్ల వీరిద్దరూ స్టేజిపైకి వచ్చేందుకు ఇబ్బంది పడుతున్న విషయాన్ని గమనించిన గవర్నర్ స్వయంగా కిందకు దిగి వారిని సత్కరించారు. డాక్టర్ విశ్వమోహన్ కటోచ్, ఏ.వి.రామారావులను జీవితకాల సాఫల్య పురస్కారాలతో గౌరవించారు. సంస్థ మాజీ అధ్యక్షులను కూడా ఘనంగా సన్మానించారు. వై.నాయుడమ్మ స్మారక అవార్డును ఎల్వీ ప్రసాద్ నేత్ర పరిశోధన విభాగం అధ్యక్షుడు డాక్టర్ బాలసుబ్రమణ్యం అందుకున్నారు. -
టెంక లేని మామిడిపళ్లు!!
మామిడిపళ్లు.. తలుచుకుంటేనే నోరు ఊరుతుంది కదూ. కానీ, రసం మామిడిపళ్లు తినాలంటే మధ్యలో పెద్ద టెంక ఉంటుంది. అది లేకుండా మొత్తం అంతా రసమే ఉంటే ఎంతో బాగుంటుంది కదూ. సరిగ్గా ఇదే ఆలోచన కొంతమంది భారతీయ శాస్త్రవేత్తలకు వచ్చింది. వచ్చిందే తడవుగా వాళ్లు పరిశోధనలు మొదలుపెట్టారు. గింజలు లేని ద్రాక్షపళ్లను సృష్టించినప్పుడు.. టెంకలు లేని మామిడిపళ్లు సాధ్యం కాదా అనుకున్నారు. అంతే.. తియ్యటి మధురమైన రసాలూరే టెంకలేని మామిడిపండు సిద్ధం అయిపోయింది. రత్న, ఆల్ఫోన్సో (కలెక్టర్) రకాల నుంచి హైబ్రిడ్ పద్ధతిలో ఈ కొత్త మామిడిపండును రూపొందించినట్లు బీహార్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని ఉద్యానశాఖ ఛైర్మన్ వీబీ పటేల్ తెలిపారు. ఈ కొత్త రకానికి సింధు అనే పేరు పెట్టారు. దీన్ని దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో నాటి.. ఫలితాలు ఒకే రకంగా వస్తున్నాయో లేవోనని చూస్తున్నారు. భారీగా తోటల్లో వేయడంతో పాటు ఇళ్లలో వేసినా ఒకే రకం రుచి వచ్చేలా ప్రయోగాలు చేస్తున్నారు. సగటున ఒక్కో పండు 200 గ్రాములు తూగుతుందని, ఇతర రకాల కంటే దీంట్లో పీచు తక్కువగా ఉంటుందని పటేల్ చెప్పారు. మహారాష్ట్రలోని కొంకణ్ ప్రాంతంలో గల కొంకణ్ కృషి విద్యాపీఠ్‌లో దీన్ని రూపొందించారు. దీని పంట కూడా ఇతర మామిడి రకాల్లా వేసవిలో కాకుండా జూలై మధ్యవారంలో వస్తుందట. 2015 నాటికల్లా రైతులకు ఈ సింధు రకం మామిడి మొక్కలను అందిస్తామని చెబుతున్నారు. -
ఇంకా సమయం పడుతుంది!
సాక్షి, హైదరాబాద్: భారత్‌లో మెరుగైన శాస్త్ర పరిశోధనలు జరుగుతున్నప్పటికీ భారతీయ శాస్త్రవేత్తలకు నోబెల్ అవార్డు దక్కాలంటే మరింత సమయం పడుతుందని 2009లో ఈ అవార్డు సాధించిన ప్రవాస భారత శాస్త్రవేత్త వెంకటరామన్ రామకృష్ణన్ అభిప్రాయపడ్డారు. దేశంలోని కొన్ని సంస్థల్లో ఉన్నతస్థాయి పరిశోధనలు జరుగుతున్నాయని, కానీ ప్రాంతీయ స్థాయిలోని విశ్వవిద్యాలయాల్లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉందని అన్నారు. సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘నోబెల్ అవార్డు అకస్మాత్తుగా వచ్చిపడేది కాదు. అంతర్జాతీయ స్థాయి పరిశోధనలు చేయడంతోపాటు ఆ స్థాయి సంస్థల్లో భాగస్వాములు కావాలి. తద్వారా పరిశోధనలు చేసే క్రమంలో ఎదురయ్యే ఇబ్బందులను పరిష్కరించుకోవడం సులువవుతుంది’’ అని వివరించారు. యాంటీబయోటిక్స్‌పై అంతర్జాతీయ కృషి... ఏటికేడాదీ పెరిగిపోతున్న యాంటిబయాటిక్స్ నిరోధకతను అధిగమించాలంటే అంతర్జాతీయ స్థాయి ప్రయత్నం జరగాలని వెంకటరామన్ రామకృష్ణన్ అభిప్రాయపడ్డారు. వైద్యులు, లేదా తగిన శిక్షణ పొందిన ఆరోగ్య కార్యకర్తల ప్రిస్క్రిప్షన్ ద్వారా మాత్రమే యాంటీబయాటిక్స్ అందేలా చూడాలన్నారు. ‘‘చాలామంది యాంటీబయాటిక్స్ విచ్చలవిడిగా వాడుతూంటారు. వ్యాధి లక్షణాలు తగ్గాయనుకుంటే వెంటనే మందులు వాడటం నిలిపివేస్తారు. ఇవి రెండూ తప్పే. తగిన మందులు వాడటంతోపాటు, పూర్తిగా వాడటం ద్వారా నిరోధకత సమస్యను అధిగమించవచ్చు’’ అని తెలిపారు. భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రభుత్వాలు ప్రజలందరికీ మెరుగైన, చౌకైన వైద్యం అందించేందుకు ప్రయత్నించాలని, అప్పుడే సామాన్యుడు సైతం డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ద్వారా మాత్రమే మందులు కొనుగోలు చేసే వీలేర్పడుతుందన్నారు. బ్రిటన్‌లోని జాతీయ ఆరోగ్య సేవల సంస్థ దేశ ప్రజలందరికీ ఉచితంగా వైద్యం అందిస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. భారత్‌లో ఒకప్పుడు ఇలాంటి ప్రజారోగ్య వ్యవస్థలు మెరుగ్గా పనిచేసేవని ఇప్పటి పరిస్థితి దురదృష్టకరమని అన్నారు. కొత్త యాంటీబయాటిక్స్‌ను తయారు చేసేందుకు ప్రైవేట్ కంపెనీలు ఉత్సాహం చూపడంలేదని, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వాలే ఈ పరిశోధనలకు వనరులు సమకూర్చాలని సూచించారు. అంత కుముందు వెంకటరామన్ ఐఐసీటీ ఆడిటోరియంలో ‘‘యాంటీబయాటిక్స్.. కణంలోని ప్రొటీన్ ఫ్యాక్టరీ’ అన్న అంశంపై ప్రసంగించారు. యాంటీబయాటిక్స్ మందుల పుట్టుక నేపథ్యం.. కణాల్లో ప్రొటీన్లను తయారు చేసే రైబోజోమ్‌లపై ఈ మందులు ఎలాంటి ప్రభావం చూపుతాయన్న అంశాలను ఆయన వివరించారు. కార్యక్రమంలో సీసీఎంబీ డెరైక్టర్ డాక్టర్ మోహన్‌రావు, మాజీ డెరైక్టర్లు పుష్పా ఎం. భార్గవ, ఐఐసీటీ శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.