ఇంకా సమయం పడుతుంది!
సాక్షి, హైదరాబాద్: భారత్‌లో మెరుగైన శాస్త్ర పరిశోధనలు జరుగుతున్నప్పటికీ భారతీయ శాస్త్రవేత్తలకు నోబెల్ అవార్డు దక్కాలంటే మరింత సమయం పడుతుందని 2009లో ఈ అవార్డు సాధించిన ప్రవాస భారత శాస్త్రవేత్త వెంకటరామన్ రామకృష్ణన్ అభిప్రాయపడ్డారు. దేశంలోని కొన్ని సంస్థల్లో ఉన్నతస్థాయి పరిశోధనలు జరుగుతున్నాయని, కానీ ప్రాంతీయ స్థాయిలోని విశ్వవిద్యాలయాల్లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉందని అన్నారు. సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘నోబెల్ అవార్డు అకస్మాత్తుగా వచ్చిపడేది కాదు. అంతర్జాతీయ స్థాయి పరిశోధనలు చేయడంతోపాటు ఆ స్థాయి సంస్థల్లో భాగస్వాములు కావాలి. తద్వారా పరిశోధనలు చేసే క్రమంలో ఎదురయ్యే ఇబ్బందులను పరిష్కరించుకోవడం సులువవుతుంది’’ అని వివరించారు.
యాంటీబయోటిక్స్‌పై అంతర్జాతీయ కృషి...
ఏటికేడాదీ పెరిగిపోతున్న యాంటిబయాటిక్స్ నిరోధకతను అధిగమించాలంటే అంతర్జాతీయ స్థాయి ప్రయత్నం జరగాలని వెంకటరామన్ రామకృష్ణన్ అభిప్రాయపడ్డారు. వైద్యులు, లేదా తగిన శిక్షణ పొందిన ఆరోగ్య కార్యకర్తల ప్రిస్క్రిప్షన్ ద్వారా మాత్రమే యాంటీబయాటిక్స్ అందేలా చూడాలన్నారు. ‘‘చాలామంది యాంటీబయాటిక్స్ విచ్చలవిడిగా వాడుతూంటారు. వ్యాధి లక్షణాలు తగ్గాయనుకుంటే వెంటనే మందులు వాడటం నిలిపివేస్తారు. ఇవి రెండూ తప్పే. తగిన మందులు వాడటంతోపాటు, పూర్తిగా వాడటం ద్వారా నిరోధకత సమస్యను అధిగమించవచ్చు’’ అని తెలిపారు. భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రభుత్వాలు ప్రజలందరికీ మెరుగైన, చౌకైన వైద్యం అందించేందుకు ప్రయత్నించాలని, అప్పుడే సామాన్యుడు సైతం డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ద్వారా మాత్రమే మందులు కొనుగోలు చేసే వీలేర్పడుతుందన్నారు.
బ్రిటన్‌లోని జాతీయ ఆరోగ్య సేవల సంస్థ దేశ ప్రజలందరికీ ఉచితంగా వైద్యం అందిస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. భారత్‌లో ఒకప్పుడు ఇలాంటి ప్రజారోగ్య వ్యవస్థలు మెరుగ్గా పనిచేసేవని ఇప్పటి పరిస్థితి దురదృష్టకరమని అన్నారు. కొత్త యాంటీబయాటిక్స్‌ను తయారు చేసేందుకు ప్రైవేట్ కంపెనీలు ఉత్సాహం చూపడంలేదని, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వాలే ఈ పరిశోధనలకు వనరులు సమకూర్చాలని సూచించారు. అంత కుముందు వెంకటరామన్ ఐఐసీటీ ఆడిటోరియంలో ‘‘యాంటీబయాటిక్స్.. కణంలోని ప్రొటీన్ ఫ్యాక్టరీ’ అన్న అంశంపై ప్రసంగించారు. యాంటీబయాటిక్స్ మందుల పుట్టుక నేపథ్యం.. కణాల్లో ప్రొటీన్లను తయారు చేసే రైబోజోమ్‌లపై ఈ మందులు ఎలాంటి ప్రభావం చూపుతాయన్న అంశాలను ఆయన వివరించారు. కార్యక్రమంలో సీసీఎంబీ డెరైక్టర్ డాక్టర్ మోహన్‌రావు, మాజీ డెరైక్టర్లు పుష్పా ఎం. భార్గవ, ఐఐసీటీ శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.