Nobel Prize
-
Nobel Prize in Economics 2024: అర్థశాస్త్రంలో ముగ్గురికి నోబెల్
స్టాక్‌హోమ్: దేశంలోని సంస్థలు, వ్యవస్థల అసమర్థత కారణంగా ఆ దేశం ఎలా పేదరికంలోనే మగ్గిపోతుందనే అంశాలపై విస్తృత పరిశోధనలు చేసిన ముగ్గురు ఆర్థికవేత్తలకు అర్థశాస్త్రంలో ఈ ఏడాది నోబెల్ పురస్కారం దక్కింది. ఆయా సమాజాల్లో నిబంధనలను తుంగలో తొక్కడం, సంస్థలు, వ్యవస్థల్లో లోపాలు ఆ దేశాభివృద్ధికి ఎలా పెనుశాపాలుగా మారతాయనే అంశాలను డరేన్ ఎసిమోగ్లూ, సైమన్ జాన్సన్, జేమ్స్ ఏ రాబిన్సన్లు చక్కగా విడమర్చి చెప్పారని రాయల్ స్వీడిష్ అకాడమీ సైన్స్ విభాగ నోబెల్ కమిటీ కొనియాడింది. ఈ మేరకు ముగ్గురికీ నోబెల్‌ను ప్రకటిస్తూ సోమవారం కమిటీ ఒక ప్రకటన విడుదలచేసింది. ఎసిమోగ్లూ, జాన్సన్‌లు అమెరికాలోని ప్రతిష్టాత్మక మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో సేవలందిస్తుండగా షికాగో విశ్వవిద్యాలయంలో రాబిన్సన్ పనిచేస్తున్నారు. ‘‘ దేశాల మధ్య ఆర్థిక అసమానతలను తగ్గించడం అనేది శతాబ్దాలుగా ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లలో ఒకటి. ఆదాయ, ఆర్థికాభివృద్ధి అసమానతలను రూపుమాపడంలో అక్కడి వ్యవస్థల కీలకపాత్రను ఆర్థికవేత్తలు స్పష్టంగా పేర్కొన్నారు’’ అని ఆర్థికశాస్త్ర కమిటీ చైర్మన్ జాకబ్ సెవెన్సన్ వ్యాఖ్యానించారు. తనకు నోబెల్ రావడంపై 57 ఏళ్ల ఎసిమోగ్లూ ఆశ్చర్యం వ్యక్తంచేశారు. దేశాలు ఎందుకు సక్సెస్ కాలేవు? అవార్డ్ విషయం తెలిశాక తుర్కియే దేశస్థుడైన ఎసిమోగ్లూ మాట్లాడారు. ‘‘ప్రజాస్వామ్యయుత వ్యవస్థల గొప్పతనాన్ని ఈ అవార్డ్ గుర్తించింది. అభివృద్ధిలో దేశాలు ఎందుకు వెనుకబడతాయని రాబిన్సన్, నేను కలిసి పరిశోధించాం. ప్రజాస్వామ్యం అనేది సర్వరోగ నివారిణి కాదు. ఒక్కోసారి ఎన్నికలు వచి్చనప్పుడే సంక్షోభాలు ముంచుకొస్తాయి’’ అని అన్నారు. ఒకే పార్టీ ఏలుబడిలో ఉన్న చైనా ఎలా అభివృద్ధి పథంలో దూసుకుపోగల్గుతోందని విలేఖరులు ప్రశ్నించగా.. ‘‘ శక్తివంతమైన అధికారయంత్రాంగం ఉన్న చైనా లాంటి దేశాల్లో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు, వినూత్న ఆవిష్కరణల కోసం ఎన్నో అవరోధాలను దాటుతున్నారు’’ అని అన్నారు. 12 ఏళ్ల క్రితం ఎసిమోగ్లూ, రాబిన్సన్ రాసిన ‘ వై నేషన్స్ ఫెయిల్: ది ఆరిజన్స్ ఆఫ్ పవర్, ప్రాస్పారిటీ, పూర్’ పుస్తకం అత్యధిక కాపీలు అమ్ముడుపోయింది. వ్యక్తుల తప్పిదాలే ఆయా దేశాలను పేదదేశాలుగా మిగిలిపోవడానికి కారణమని రచయితలు ఆ పుస్తకంలో వివరించారు. సరిగ్గా అమెరికా–మెక్సికో సరిహద్దులో ఉన్న ఆరిజోనా రాష్ట్ర నోగేల్స్ సిటీ భిన్న పరిస్థితులను ఆర్థికవేత్తలు చక్కటి ఉదాహరణగా తీసుకున్నారు. అమెరికా వైపు ఉన్న నోగేల్స్ సిటీ ఉత్తరప్రాంత వాసులు ప్రశాంతంగా జీవిస్తున్నారు. ఆయుర్దాయం ఎక్కువ. ఎక్కువ మంది విద్యార్థులు హైసూ్కల్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేస్తున్నారు. అదే దక్షిణవైపు ప్రాంత ప్రజలు పేదరికంలో మగ్గిపోతున్నారు. అక్కడ వ్యవస్థీకృత నేరాలు ఎక్కువ. ఆ ప్రాంతంలో వ్యాపారాలు చేయడం కూడా రిస్క్‌తో కూడిన వ్యవహారం. అవినీతి రాజకీయనేతలను అధికారం నుంచి కిందకు దింపడం కూడా చాలా కష్టం. అమెరికాలో అయితే పౌరుల ఆస్తిహక్కుల పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుంది. ఇలాంటి విధానాలే ఒకరకంగా దేశం బాగుపడటానికి బాటలువేస్తాయి ’’ అని ఎసిమోగ్లూ వివరించారు. వ్యవస్థలకు తగ్గుతున్న ఆదరణ దురదృష్టవశాత్తు ఇటీవలి కాలంలో అమెరికా, యూరప్‌లలో ప్రజాస్వామ్యయుత వ్యవస్థలకు ఆదరణ తగ్గుతోంది. తమకు అన్యాయం జరిగిందని ప్రజలు భావించిన సందర్భాల్లో ప్రజాస్వామ్యదేశాలు ఓడిపోయినట్లే లెక్క. ఇలాంటి ఉదంతాలు ప్రజాస్వామ్యదేశాలు మేల్కొనాల్సిన తరుణం వచి్చందని గుర్తుచేస్తాయి. సుపరిపాలన అందించేందుకు దేశాలు మళ్లీ ప్రయత్నించాలి’’ అని ఎసిమోగ్లూ అన్నారు. -
దక్షిణ కొరియా రచయిత్రికి సాహిత్యంలో నోబెల్
దక్షిణ కొరియా రచయిత్రి హాన్ కాంగ్‌కు సాహిత్యంలో 2024 ఏడాదిగాను నోబెల్ పురస్కారం దక్కింది. మానవ జీవితపు దుర్బలత్వాన్ని, చారిత్రక విషాదాలను తన గద్య కవిత్వంతో కళ్లకు కట్టించిన కృషికి గాను స్వీడిష్ నోబెల్ కమిటి గురువారం నోబెల్ పురష్కారాన్ని ప్రకటించింది. ఉత్తర కొరియా నుంచి సాహిత్యంలో నోబెల్ పురస్కారం దక్కించుకున్న తొలి మహిళ హాన్ కాంగ్.BREAKING NEWSThe 2024 #NobelPrize in Literature is awarded to the South Korean author Han Kang “for her intense poetic prose that confronts historical traumas and exposes the fragility of human life.” pic.twitter.com/dAQiXnm11z— The Nobel Prize (@NobelPrize) October 10, 2024 హాన్ కాంగ్ 1970లో దక్షిణ కొరియాలోని గ్వాంగ్జులో జన్మించారు. ఆమెకు సాహిత్య నేపథ్యం ఉంది. ఆమె తండ్రి ప్రసిద్ధ నవలా రచయిత. హాన్ కాంగ్ 1993లో మున్హాక్-గ్వా-సాహో (సాహిత్యం, సమాజం) శీతాకాల సంచికలో ‘వింటర్ ఇన్ సియోల్’పేరుతో ఐదు కవితలను ప్రచురించారు. దీని ద్వారా కవయిత్రిగా సాహిత్య రంగ ప్రవేశం చేశారు. అనంతరం నవలా రచయిత్రిగా తన కెరీర్‌ను ప్రారంభించారామె. -
ప్రోటీన్లపై పరిశోధనకు నోబెల్
స్టాక్‌హోమ్: మనిషి ఆరోగ్యకరమైన జీవనానికి మూలస్తంభాలైన ప్రోటీన్ల డిజైన్లు, వాటి పనితీరుపై విశేష పరిశోధనలు చేసిన ముగ్గురు శాస్త్రవేత్తలకు ఈ సంవత్సరం రసాయనశాస్త్ర విభాగంలో నోబెల్ అవార్డ్ వరించింది. ప్రోటీన్లపై శోధనకుగాను శాస్త్రవేత్తలు డేవిడ్ బెకర్, డెమిస్ హసాబిస్, జాన్ జంపర్లకు 2024 ఏడాదికి కెమిస్ట్రీ నోబెల్ ఇస్తున్నట్లు కెమిస్ట్రీ నోబెల్ కమిటీ సారథి హెనర్ లింక్ బుధవారం ప్రకటించారు. పురస్కారంతోపాటు ఇచ్చే దాదాప రూ.8.4 కోట్ల నగదు బహుమతిలో సగం మొత్తాన్ని బేకర్‌కు అందజేయనున్నారు. మిగతా సగాన్ని హసాబిస్, జాన్ జంపర్లకు సమంగా పంచనున్నారు. జీవరసాయన శాస్త్రంలో గొప్ప మలుపు ‘‘అమైనో ఆమ్లాల క్రమానుగతి, ప్రోటీన్ల నిర్మాణం మధ్య ఉన్న అవినాభావ సంబంధాన్ని శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. వీరి పరిశోధన రసాయనరంగంలో ముఖ్యంగా జీవరసాయన శాస్త్రంలో మేలి మలుపు. ఈ ముందడుగుకు కారకులైన వారికి నోబెల్ దక్కాల్సిందే’’ అని నోబెల్ కమిటీ కొనియాడింది. అమెరికాలోని సియాటెల్‌లో ఉన్న వాషింగ్టన్ విశ్వవిద్యాలయంలో డేవిడ్ బేకర్ పనిచేస్తున్నారు. హసాబిస్, జాన్ జంపర్ లండన్‌లోని గూగుల్ సంస్థకు చెందిన డీప్‌మైండ్ విభాగంలో పనిచేస్తున్నారు. ‘‘బేకర్ 2003లో ఒక కొత్త ప్రోటీన్‌ను డిజైన్‌చేశారు. అతని పరిశోధనా బృందం ఇలా ఒకదాని తర్వాత మరొకటి కొత్త ప్రోటీన్లను సృష్టిస్తూనే ఉంది. వాటిల్లో కొన్నింటిని ప్రస్తుతం ఫార్మాసూటికల్స్, టీకాలు, నానో మెటీరియల్స్, అతి సూక్ష్మ సెన్సార్లలో వినియోగిస్తున్నారు. వీళ్ల బృందం సృష్టించిన సాంకేతికతతో వెలువడిన ఎన్నో కొత్త డిజైన్ల ప్రోటీన్లు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి’’అని నోబెల్ కమిటీలో ప్రొఫెసర్ జొహాన్ క్విస్ట్ శ్లాఘించారు. BREAKING NEWSThe Royal Swedish Academy of Sciences has decided to award the 2024 #NobelPrize in Chemistry with one half to David Baker “for computational protein design” and the other half jointly to Demis Hassabis and John M. Jumper “for protein structure prediction.” pic.twitter.com/gYrdFFcD4T— The Nobel Prize (@NobelPrize) October 9, 2024 నిర్మాణాలను అంచనా వేసే ఏఐ మోడల్ డెమిస్ హసాబిస్, జంపర్లు సంయుక్తంగా ప్రోటీన్ల నిర్మాణాలను ఊహించగల కృత్రిమమేధ నమూనాను రూపొందించారు. దీని సాయంతో ఇప్పటిదాకా కనుగొన్న 20 కోట్ల ప్రోటీన్ల నిర్మాణాలను ముందే అంచనావేయొచ్చు. చదవండి: ఏఐ మార్గదర్శకులకు...ఫిజిక్స్ నోబెల్ -
భౌతిక శాస్త్రంలో ఇద్దరికి నోబెల్ బహుమతి
-
ఏఐ మార్గదర్శకులకు...ఫిజిక్స్ నోబెల్
స్టాక్ హోం: వైద్య శాస్త్రం మాదిరిగానే ఫిజిక్స్‌లో కూడా ఈ ఏడాది నోబెల్ అవార్డు ఇద్దరు సైంటిస్టులను వరించింది. మెషీన్ లెరి్నంగ్‌ను కొత్త పుంతలు తొక్కించి.. కృత్రిమ మేధ వికాసానికి మార్గదర్శకులుగా నిలిచిన సైంటిస్టులు జాన్ హాప్ఫీల్డ్, జెఫ్రీ హింటన్‌లు అత్యున్నత పురస్కారం అందుకోనున్నారు. రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ మంగళవారం ఈ మేరకు ప్రకటించింది. గతేడాది ఫిజిక్స్ నోబెల్‌ను ముగ్గురు సైంటిస్టులకు అందించడం తెలిసిందే. హింటన్.. ఫాదర్ ఆఫ్ ఏఐ హింటన్ ఫాదర్ ఆఫ్ ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)గా ప్రసిద్ధుడు. కెనడా, బ్రిటన్ పౌరసత్వమున్న ఆయన టొరంటో వర్సిటీలో పని చేస్తున్నారు. హాప్‌ఫీల్డ్‌ది అమెరికా. ప్రిన్స్టన్ వర్సిటీలో పని చేస్తున్నారు. వారు రూపొందించి, అభివృద్ధి చేసిన భౌతిక శాస్త్ర నియమాలు, పనిముట్లు నేటి శక్తిమంతమైన మెషీన్ లెర్నింగ్‌కు పునాదులని నోబెల్ కమిటీ కొనియాడింది. ‘వారు అభివృద్ధి చేసిన ఆర్టిఫీషియల్ న్యూరల్ నెట్వర్క్స్ సహాయక మెమరీలుగా ఎన్నో రంగాల్లో కీలక సేవలు అందిస్తున్నాయి.ఫేషియల్ రికగ్నిషన్ మొదలుకుని, యాంత్రిక అనువాదం దాకా అన్నింటా అవి మన జీవితంలో భాగంగా మారాయి‘ అని ప్రశంసించింది. అయితే, ఈ సాంకేతిక ప్రగతి మన భవిష్యత్తుపై ఎన్నో సందేహాలను లేవనెత్తిందని అభిప్రాయపడింది. మానవాళికి మేలు జరిగేలా దీన్ని సురక్షిత, నైతిక పద్ధతుల్లో వాడటం చాలా ముఖ్యమని పేర్కొంది. ఈ ఆందోళనలు సహేతుకమేనని హింటన్ తరచూ చెబుతుంటారు. వీటిపై మరింత స్వేచ్చగా మాట్లాడేందుకు వీలుగా ఆయన గూగుల్‌లో ఉన్నతోద్యోగాన్ని కూడా వదులుకోవడం విశేషం. ఈ నేపథ్యం దృష్ట్యా తనకు అత్యున్నత పురస్కారం రావడం నమ్మశక్యంగా లేదని చెప్పారాయన. మానవాళిని ఏఐ కనీవినీ ఎరగని రీతిలో ప్రభావితం చేయడం ఖాయమని ఆయన ఇప్పటికే జోస్యం చెప్పారు. దీన్ని ఏకంగా పారిశ్రామిక విప్లవంతో పోల్చారు. -
భౌతికశాస్త్రంలో ఇద్దరికి నోబెల్ బహుమతి
2024 సంవత్సరానికిగానూ భౌతిక శాస్త్రంలో ఇద్దరికి నోబెల్ బహుమతి లభించింది. జాన్ జోసెఫ్ హాప్ఫీల్డ్, జెఫ్రీ ఎవరెస్ట్ హింటనల్‌కు ఈ పురస్కారం దక్కింది. కృత్రిమ న్యూరల్ నెట్‌వర్క్‌లతో మెషిన్ లెర్నింగ్ ఆవిష్కరణలు చేసినందుకుగానూ వీరిద్దరికి ఈ ఏడాది నోబెల్ ప్రకటిస్తున్నట్లు స్టాక్‌హోమ్‌లోని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వెల్లడించింది.కాగా గతేడాది భైతిక శాస్తంలో ఈ పురస్కారం ముగ్గురిని వరించింది. 1901 నుంచి ఇప్పటివరకు మొత్తంగా 117సార్లు భౌతికశాస్త్రంలో నోబెల్ ప్రకటించారు. ఇక సోమవారం మెడిసిన్ విభాగంలో ఇద్దరికి నోబెల్ బహుమతి ప్రకటించిన సంగతి తెలిసిందే. అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రువ్‌కున్‌లకు నోబెల్ బహుమతి దక్కింది. మైక్రోఆర్ఎన్ఏను ఆ ఇద్దరు శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. స్వీడన్‌కు చెందిన శాస్త్రవేత్త, ఇంజినీర్, వ్యాపారవేత్తగా పేరుగాంచిన ఆల్ఫ్రెడ్ నోబెల్ పేరు మీదుగా ప్రపంచంలో వివిధ రంగాల్లో విశేష సేవలందించినవారికి ఈ అవార్డును ప్రదానం చేస్తారు. 1896లో ఆల్ఫ్రెడ్ నోబెల్ మరణించగా.. 1901 నుంచి ఆయన ట్రస్ట్ ద్వారా ఈ అవార్డులను ఏటా ప్రదానం చేస్తున్నారు. వీటిని ఆల్ఫ్రెడ్ జయంతి సందర్భంగా డిసెంబర్ 10న విజేతలకు బహుమతులు అందజేస్తారు. -
మెడిసిన్‌లో విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రువ్‌కున్‌కు నోబెల్
2024 సంవత్సరానికిగానూ మెడిసిన్ విభాగంలో ఇద్దరికి నోబెల్ బహుమతి ప్రకటించారు. అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రువ్‌కున్‌లకు నోబెల్ బహుమతి దక్కింది. మైక్రోఆర్ఎన్ఏను ఆ ఇద్దరు శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. జీన్ రెగ్యులేషన్‌లో మైక్రో ఆర్ఎన్ఏ పాత్రను విశ్లేషించినందుకు ఆ ఇద్దరికి అవార్డును ప్రకటిస్తున్నట్లు నోబెల్ కమిటీ సోమవారం వెల్లడించింది.స్వీడెన్లోని కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ మెడికల్ యూనివర్సిటీ నోబెల్ అసెంబ్లీ మెడిసిన్ లో విజేతను ప్రకటించింది. అవార్డు కింద 11 మిలియన్ల స్వీడిష్ క్రానర్(మిలియన్ అమెరికా డాలర్లు) బహుమతిగా అందిస్తారు. గతేడాది ఫిజియాలజీ, మెడిసిన్ విభాగంలో.. కొవిడ్-19 వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసినందుకుగాను హంగేరియన్ శాస్త్రవేత్త కాటలిన్ కరికో , అమెరికాకు చెందిన డ్రూ వెయిస్మన్తకు నోబెల్ పురస్కారం వచ్చింది. BREAKING NEWSThe 2024 #NobelPrize in Physiology or Medicine has been awarded to Victor Ambros and Gary Ruvkun for the discovery of microRNA and its role in post-transcriptional gene regulation. pic.twitter.com/rg3iuN6pgY— The Nobel Prize (@NobelPrize) October 7, 2024వైద్యశాస్త్రంలో మొత్తంగా ఇప్పటివరకు నోబెల్ బహుమతిని 114 సార్లు ప్రకటించగా.. 227 మంది అందుకున్నారు. ఇందులో కేవలం 13 మంది మహిళలు మాత్రమే ఉన్నారు. కాగా ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మక నోబెల్స్ బహుమతి విజేతల్లో ప్రతి ఏడాది ముందుగా మెడిసిన విభాగంలోనే ప్రకటిస్తారు. మంగళవారం భౌతికశాస్త్రం, బుధవారం రసాయనశాస్త్రం, గురువారం సాహిత్య విభాగాల్లో విజేతలను ప్రకటిస్తారు. శుక్రవారం రోజున నోబెల్ శాంతి బహుమతి, అక్టోబర్ 14న అర్థశాస్త్రంలో నోబెల్ గ్రహీతల పేర్లను వెల్లడిస్తారు.స్వీడన్‌కు చెందిన శాస్త్రవేత్త, ఇంజినీర్, వ్యాపారవేత్తగా పేరుగాంచిన ఆల్ఫ్రెడ్ నోబెల్ పేరు మీదుగా ప్రపంచంలో వివిధ రంగాల్లో విశేష సేవలందించినవారికి ఈ అవార్డును ప్రదానం చేస్తారు. 1896లో ఆల్ఫ్రెడ్ నోబెల్ మరణించగా.. 1901 నుంచి ఆయన ట్రస్ట్ ద్వారా ఈ అవార్డులను ఏటా ప్రదానం చేస్తున్నారు. వీటిని ఆల్ఫ్రెడ్ జయంతి సందర్భంగా జ డిసెంబర్ 10న విజేతలకు బహుమతులు అందజేస్తారు. -
"కృష్ణ కృష్ణ - ఇదేమి ఘోరం!"
కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో టీఎం కృష్ణగా పేరు తెచ్చుకున్న తోడూరు మాడభూషి కృష్ణ చుట్టూ వివాదాలు ఎగసిపడుతున్నాయి. సంగీతంలో 'నోబెల్ ప్రైజ్' స్థాయిలో అభివర్ణించే మద్రాస్ మ్యూజిక్ అకాడమీవారి 'సంగీత కళానిధి' పురస్కారం-2024 టీఎం కృష్ణకు ప్రదానం చేయబోతున్నామని ఈ నెల 18వ తేదీన అకాడమీ ప్రకటించింది. అప్పటి నుంచి సంప్రదాయ సంగీత వాదుల నుంచి నిరసనల గళం పెద్దఎత్తున వినపడుతోంది. ఇది ప్రస్తుతం సంగీత ప్రపంచంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. టీఎం కృష్ణను సమర్థిస్తూ కూడా కొన్ని వర్గాలు తమ వాణిని బలంగా వినిపిస్తున్నాయి. ఆయనకు మద్దతు పలికేవారిలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా వున్నారు. ముఖ్యంగా ద్రవిడ సిద్ధాంతాలను బలపరిచేవారు, సనాతన సంప్రదాయం పట్ల గౌరవంలేనివారు, నాస్తికులు అందులో వున్నారు. టీఎం కృష్ణకు సంగీత కళానిధి పురస్కార ప్రకటనను నిరసిస్తూ, గతంలో ఈ పురస్కారాన్ని తీసుకున్న కొందరు వెనక్కు ఇచ్చేస్తున్నారు. చాలామంది కళాకారులు ఇక నుంచి మద్రాస్ మ్యూజిక్ అకాడమీలో పాడబోమని, సంగీత కచేరీలు చేయబోమని తమ నిరసనను చాటుకుంటున్నారు. ఒక ప్రఖ్యాత ఇంగ్లీష్ పత్రిక అధినేతలలో ఒకరైన ఎన్.మురళి ప్రస్తుతం మద్రాస్ మ్యూజిక్ అకాడమీకి అధ్యక్షులుగా వున్నారు. టీఎం కృష్ణను ఈ పురస్కారానికి ఎంపిక చేయడంలో మురళి పాత్ర ప్రధానంగా వున్నదని సంగీత సమాజంలో గట్టిగా వినపడుతోంది. ఈ వివాదం ఇంతటితో ముగిసేట్టు లేదు. రకరకాల రూపం తీసుకుంటోంది. మద్రాస్ మ్యూజిక్ అకాడమీ చరిత్రలో ఇంతటి వివాదం గతంలో ఎన్నడూ చెలరేగలేదు. టీఎం కృష్ణకు ఒక వర్గం మీడియా మద్దతు, సహకారం కూడా బాగా వున్నాయని అనుకుంటున్నారు. ఈయన ప్రస్థానాన్ని గమనిస్తే.. మొదటి నుంచీ వివాదాస్పద వ్యక్తిగానే ప్రచారం వుంది. వేదికలపైన పాడేటప్పుడే కాక, వివిధ సందర్భాల్లోనూ ఆయన చేసే విన్యాసాలు, హావభావాలపై చాలా విమర్శలు వచ్చాయి. అట్లే, ఆయనను మెచ్చుకొనే బృందాలు కూడా వున్నాయి. సంప్రదాయవాదులు ఎవ్వరూ ఇతని తీరును ఇష్టపడరు. ఈ క్రమంలో రేపు డిసెంబర్ లో మద్రాస్ మ్యూజిక్ అకాడమీ వేదికలో జరగబోయే ప్రతిష్ఠాత్మకమైన వేడుకలకు చాలామంది దూరంగా జరుగుతారని అనిపిస్తోంది. ప్రసిద్ధ జంట కళాకారిణులు రంజని - గాయత్రి పెద్ద ప్రకటన కూడా చేశారు. హరికథా విద్వాంసులు దుష్యంతి శ్రీథర్, విశాఖ హరి వంటీఎందరో నిరసన స్వరాన్నే అందుకున్నారు. తెలుగునాట కూడా అవే ప్రతిధ్వనులు వినిపిస్తున్నాయి. 1976లో తమిళనాడులో బ్రాహ్మణ కుటుంబంలో, శాస్త్రీయ సంగీత కుటుంబంలో జన్మించిన కృష్ణ మొదటి నుంచీ కొత్త గొంతును వినిపిస్తున్నారు. బ్రాహ్మణత్వంపైన, కర్ణాటక సంగీత ప్రపంచంలో బ్రాహ్మణుల పెత్తనం పెరిగిపోతోందంటూ కృష్ణ నినదిస్తున్నారు. సమాజంలో, సంగీత సమాజంలో ఎన్నో సంస్కరణలు రావాలని, సమ సమాజ స్థాపన జరగాలని మాట్లాడుతున్నారు. తాను గురుశిష్య పరంపరలోనే సంగీతం నేర్చుకున్నప్పటికీ దాని పైన తన దృక్పథం వేరని చెబుతున్నారు. చెంబై విద్యనాథ భాగవతార్ - కె జె ఏసుదాసు, పారుపల్లి రామకృష్ణయ్య పంతులు - అన్నవరపు రామస్వామి వంటివారి గురుశిష్య బంధాలు ఆయనకు ఏ విధంగా అర్ధమవుతున్నాయో? అనే ప్రశ్నలు వస్తున్నాయి. త్యాగయ్య మొదలు మహా వాగ్గేయకారులందరిపైనా ఆయన వివిధ సమయాల్లో విమర్శనాస్త్రాలు సంధించారు. ఎం.ఎస్ సుబ్బలక్ష్మి దేవదాసి కుటుంబం నుంచి వచ్చినప్పటికీ బ్రాహ్మణత్వంతోనే ప్రవర్తించారని, అదే పద్ధతిని అనుసరించి పాడుతూ పెద్దపేరు తెచ్చుకున్నారని, ఆ కీర్తి కోసమే ఆమె ఆలా చేశారని గతంలో కృష్ణ చేసిన విమర్శలు పెద్ద దుమారం రేపాయి. బ్రాహ్మణత్వాన్ని పులుముకోకపోతే ఈ శాస్త్రీయ సంగీత రంగంలో ఇమడలేరని, రాణించలేరని, అందుకే సుబ్బలక్ష్మికి కూడా అలా ఉండక తప్పలేదని కృష్ణ బాధామయ కవి హృదయం. కులాన్ని బద్దలు కొట్టాలని, కళలు, సంగీతం అందరికీ అందాలని, అది జరగడంలేదని వాదిస్తూ, సముద్ర తీరాలలో, మత్స్యకార వాడల్లో, వివిధ సమాజాల్లో కచేరీలు, సంగీత ఉత్సవాలు చేస్తూ వార్తల్లోకి ఎక్కారు. పర్యావరణ విధ్వంసంపైన, బీజేపీ ప్రభుత్వ విధానాలపైన, వివిధ ఉద్యమ వేదికల ద్వారా తన వ్యతిరేకతను చాటుకుంటూ వస్తున్నారు. కర్ణాటక సంగీతాన్ని గ్రామీణ ప్రాంతాలకు, వెనుకబడిన వర్గాల దగ్గరకు తీసుకెళ్లాలంటూ చేసిన ప్రదర్శనలు మీడియాను కూడ బాగా ఆకర్షించాయి. ఈ నేపథ్యంతో 2016లో ప్రతిష్ఠాత్మక 'రామన్ మెగసెసే అవార్డు' కూడా అందుకున్నారు. తమిళ భాషను, యాసను ప్రచారం చేసే క్రమంలో కృష్ణ తెలుగును చిన్నచూపు చూస్తూ వస్తున్నారు. త్యాగయ్య కీర్తనలు ఈనాటికి పనికిరావని, ఆ సాహిత్యం మూఢమైనదనే భావనలను కూడా ప్రచారం చేశారు. మహా వాగ్గేయకారులు రచించిన కీర్తనలను సాహిత్యానికి, భావానికి, భాషకు సంబంధం లేకుండా నడ్డివిరచి పాడుతూ మహనీయులను హేళన చేస్తున్నాడని, తెలుగు భాషను అవమానపరుస్తున్నాడనే విమర్శలు పెద్ద ఎత్తున ఉన్నాయి. ఇతను కేవలం సంగీత విద్వాంసుడుగానే కాక, ఉద్యమకారుడుగానూ ప్రచారంలోకి వచ్చాడు. ఈ.వి రామస్వామి పెరియార్ భావాలను అనుసరిస్తూ, గీతాలను సృష్టిస్తూ, గానం చేస్తూ, ప్రచారం చేస్తూ వున్నారు. ఇస్లాం, క్రిస్టియన్ పాటలు కూడా కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో స్వరపరచి ఎందుకు పాడకూడదు? అన్నది అతి వాదన. బ్రాహ్మణులు, దైవం, హిందూమతం, కాంగ్రెస్, మహాత్మాగాంధీని పెరియార్ వ్యతిరేకించారు. కృష్ణ కూడా ఇంచుమించు అవే భావనలలో వున్నారు. బీజేపీ, సంఘ్ పరివార్పైన కూడా అనేకసార్లు తీవ్రమైన విమర్శలు చేశారు. ఈయన ప్రస్తుత పురస్కారం ఎంపిక విధానాన్ని, అర్హతను గమనిస్తే, ఇతని కంటే గొప్పవాళ్ళు, జ్ఞాన, వయో వృద్ధులు ఎందరో వున్నారు. వాళ్లందరినీ కాదంటూ ఈయనకు ఈ పురస్కారం ఇవ్వాల్సినంత శక్తి సామర్ధ్యాలు, అనుభవం ఆయనకు లేవన్నది మెజారిటీ వర్గాల అభిప్రాయం. సంప్రదాయ వ్యతిరేకత ముసుగులో, సంస్కరణ మాటున సాహిత్యంతో పాటు శాస్త్రీయ సంగీతాన్ని కూడా అవమానిస్తున్నాడని సంప్రదాయవాదులంతా ముక్తకంఠంతో ఘోషిస్తున్నారు. ముఖ్యంగా తెలుగు భాషను ముక్కలు ముక్కలుగా నరికివేస్తున్నాడని తెలుగు భాషాప్రియులెందరో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శాస్త్రీయ సంగీతం పట్ల, వాగ్గేయకార మహనీయుల పట్ల, తెలుగు భాష పట్ల గౌరవం లేనప్పుడు అసలు ఈ రంగాన్ని ఎందుకు ఎంచుకున్నాడని అనేకులు మండిపడుతున్నారు. సంగీత కళానిధి పురస్కారం సంగతి అటుంచగా, ఇంతటి విపరీత ధోరణులతో ప్రవర్తిస్తున్న వ్యక్తిని చూస్తూ ఊరుకోబోమనే మాటలు సనాతన సమాజాల నుంచి వినపడుతున్నాయి. ఈ పురస్కార ప్రకటనను మ్యూజిక్ అకాడమీ విరమించుకుంటుందని చెప్పలేం. ఈ ధోరణులతో నడుస్తున్న కృష్ణ శాస్త్రీయ రాగాలను ఎంచుకోకుండా, తాను కొత్త కొత్త రాగాలను పుట్టించుకొని అందులో పాడుకొమ్మని కొందరు సలహా ఇస్తున్నారు. ఈ సనాతన భారతంలో "కృష్ణ కృష్ణ - ఇదేమి ఘోరం " అని సంప్రదాయ ప్రేమికులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇప్పటికే అనేకమంది అతనిపై న్యాయస్థానాలలో కేసులు కూడా పెడుతున్నారు. ఏమవుతుందో చూద్దాం. - రచయిత, మా శర్మ, సీనియర్ జర్నలిస్టు -
నాకు నోబెల్ ప్రైజ్ రావాలి!: సీఎం కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వినర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బీజేపీపై విమర్శలు గుప్పించారు. కేంద్రంతో ఢిల్లీ ప్రభుత్వానికి ఉన్న విభేదాల నేపథ్యంలో తాను ఢిల్లీలో పరిపాలన కొనసాగిస్తున్నందుకు ‘నోబెల్ ప్రైజ్’ రావాలని అన్నారు. నీటి బిల్లులపై ఆప్ కార్యకర్తలు చేపట్టిన నిరసన కార్యక్రమంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడారు. ‘ఢిల్లీలో పాఠశాలలు, ఆస్పత్రులు నిర్మించకుండా బీజేపీ అడ్డుపడుతోంది. వాళ్ల(బీజేపీ)పిల్లలు స్థాయిలో పేద పిల్లలు విద్య ద్వారా మంచి స్థానంలోకి ఇష్టం లేదు. నాకు తెలుసు.. నేను ఢిల్లీలో ఆప్ ప్రభుత్వాన్ని ఎలా నడుపుతున్నానో. దానికి నాకు నోబుల్ ప్రైజ్ రావాలి’ అని సీఎం కేజ్రీవాల్ అన్నారు. పెండింగ్‌లో ఉన్న నీటి బిల్లుల విషయంలో ఆప్ ప్రభుత్వం వన్ టైం సెటిల్మెంట్ అమలను కేంద్రం ప్రభుత్వం అడ్డుకుంటోందని మండిపడ్డారు. ఢిల్లీ ప్రభుత్వ అధికారులు.. కేంద్ర ప్రభుత్వానికి భయపడి తమ ఆదేశాలను పట్టించుకోవటం లేదన్నారు. ‘ఢిల్లీ వాటర్ బోర్డు పథకానికి ఆమోదం తెలిపింది. ఇప్పుడు ఈ పథకానికి కేబినెట్ ఆమోదం పొందాలి. ఈ పథకాన్ని ఆపేయాలని బీజేపీ లెఫ్టినెంట్ గవర్నర్‌ను కోరుతోంది. అధికారులు భయపడుతున్నారు. రాష్ట్ర మంత్రులు బిల్లు ఎందుకు తీసుకురావటం లేదని అడిగితే.. ఈ పథకాన్ని కేబినెట్ ఆమోదిస్తే మమ్మల్ని సస్పెండ్ చేస్తారని అధికారులు తెలిపారు. నకిలీ కేసుల బనాయించి తమపై కేసులు పెడతామని బెదిరిస్తున్నారని అధికారులు చెబుతున్నారు’ అని సీఎం కేజ్రీవాల్ బీజేపీపై మండిపడ్డారు. #WATCH | Delhi CM Arvind Kejriwal says "...They (BJP) tried to stop the construction of schools and hospitals in Delhi. They do not want the poor to get the same level of education as their children...Only I know, how am I running the government in Delhi, I should get a Nobel… pic.twitter.com/8AduBk30tw — ANI (@ANI) February 25, 2024 చదవండి: ‘బీజేపీకి ఒమర్ అబ్దుల్లా సవాల్.. ఎన్నికలు నిర్వహించండి’ -
ఆలోచన రేపుతున్న ఎంపిక
ఏటా ఇచ్చే పురస్కారాలు సైతం విజేతల ఎంపిక, వారు చేసిన కృషి రీత్యా విశిష్టంగా నిలుస్తాయి. రాయల్ స్వీడిష్ అకాడెమీ ఆఫ్ సైన్సెస్ ఈ ఏడాదికి గాను ఇప్పటి దాకా ప్రకటించిన పురస్కారాల్లో కొన్ని అలాంటివే! స్వెరిజెస్ రిక్స్‌బ్యాంక్ ప్రైజ్ అనే పేరు కన్నా ఆల్ఫ్రెడ్ నోబెల్ స్మారకార్థం ఇచ్చే ‘నోబెల్ పురస్కారం’గానే ప్రసిద్ధమైన ఈ గౌరవం దక్కిన ఇద్దరు మహిళల గురించి ఇప్పుడు ప్రపంచమంతా ఆసక్తి కనబరుస్తోంది. మహిళా శ్రామికశక్తిపై విస్తృత పరిశోధన జరిపిన ఆర్థిక శాస్త్రవేత్త క్లాడియా గోల్డిన్‌కు అర్థశాస్త్రంలో నోబెల్ ప్రైజ్, అలాగే ఇరాన్లో జైలులో మగ్గుతున్న మానవ హక్కుల ఉద్యమకారిణి నర్గిస్ మొహమ్మదీకి నోబెల్ శాంతి బహుమతి దక్కడం వారు దీర్ఘకాలంగా చేస్తున్న కృషికి అతి పెద్ద అంతర్జాతీయ గుర్తింపు. ఈ ఇద్దరి ఎంపిక వేతనాల్లో స్త్రీ పురుష వ్యత్యాసం మొదలు లింగ సమానత్వం దాకా అనేక అంశాలపై మరోసారి చర్చ రేపుతోంది. గోల్డిన్ కృషికి అర్థశాస్త్రంలో నోబెల్ పురస్కారం దక్కడం బాగున్నా, అందులోనూ వైచిత్రి ఉంది. ఆమె నాలుగు దశాబ్దాల కృషి అంతా శ్రామిక విపణుల్లో మహిళలు, లింగ సమానత్వం గురించి! విచిత్రం ఏమిటంటే 1969లో అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతిని స్థాపించినప్పటి నుంచి నిన్నటి వరకు ఆ పురస్కారం దక్కింది ఇద్దరంటే ఇద్దరు మహిళలకే! అదీ వేరేవాళ్ళతో కలసి! ఆ గౌరవం దక్కిన మూడో మహిళ గోల్డినే! పైగా, ఒక మహిళకు ఒంటరిగా అర్థశాస్త్రంలో నోబెల్ దక్కడమూ ఇదే ప్రప్రథమం. నోబెల్ బహుమతుల్లో లింగ అసమానత్వంపై విమర్శలు వస్తున్న వేళ లేబర్ మార్కెట్లో మహిళా విజయం లోతుపాతులు విశ్లేషించిన గోల్డిన్‌కు ఈ గౌరవం దక్కడం గమనార్హం. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసరైన గోల్డిన్ అమెరికాలోని శ్రామిక విపణినీ, అలాగే వేతనాల్లో లింగ అసమానత్వానికి కారణాలనూ నాలుగు దశాబ్దాలుగా లోతుగా అధ్యయనం చేస్తూ వచ్చారు. 200 ఏళ్ళ అమెరికా చరిత్రను లోతుగా విశ్లేషిస్తూ, చారిత్రకంగా స్త్రీ పురుషుల ఆదాయాల్లో తేడాకు ప్రధానంగా చదువు, వివిధ రకాల ఉద్యోగాలే కారణమని తేల్చారు. వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ నుంచి పారిశ్రామిక ఆధారిత వ్యవస్థ వైపు దేశం మారడంతో శ్రామిక విపణిలో వివాహిత స్త్రీల భాగస్వామ్యం పడిపోయిందనేది ఆమె అధ్యయన సారం. ఆ తర్వాత 20వ శతాబ్దంలో సర్వీసుల పరిశ్రమ వృద్ధి చెందడంతో, మరింత విద్యావంతులైన మహిళలు రంగంలోకి వచ్చారు. గర్భనిరోధక విధానాల లాంటివి ఆరోగ్యరంగంలో వ్యాప్తిలోకి వచ్చాయి. తత్ఫలితంగా, శ్రామికశక్తి లోకి మహిళలు మళ్ళీ ప్రవేశించారు. కానీ, అప్పటికే తలెత్తిన అంతరం మాత్రం పూడిపోలేదు. ముఖ్యంగా, తొలిచూలుతో ఈ తేడా తలెత్తుతోందని గోల్డిన్ పరిశోధన. ఇక, మరణశిక్షకు వ్యతిరేకంగా గళం విప్పినందుకూ, దేశంలో మహిళలకు సైతం సమాన హక్కులు ఉండాలని కోరినందుకూ ఇరాన్లో కటకటాలు లెక్కపెడుతున్న నర్గిస్ పోరాటం మరో పెద్ద కథ. ఇప్పటికి ఆమె 13 సార్లు అరెస్టయి, అయిదుసార్లు దోషిగా తీర్మానమై, 31 ఏళ్ళ జైలుశిక్షను ఎదుర్కొంటోంది. 2022 నాటి డబ్యూఈఎఫ్ గ్లోబల్ జెండర్ గ్యాప్ నివేదికలో అట్టడుగున అఫ్గానిస్తాన్, పాకిస్తాన్లతో పాటు నిలిచిన దేశంగా ఇరాన్ పేరుమోసింది. అలాంటి దేశాల్లో నర్గిస్ లాంటి మహిళలు కడకు తమ ఉనికిని కాపాడుకొనేందుకు సైతం పోరాడాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో అటు క్లాడియా గోల్డిన్ అధ్యయనానికీ, ఇటు నర్గిస్ మొహమ్మదీ అలుపెరుగని పోరాటానికీ నోబెల్ గుర్తింపు రావడం ఆనందదాయకం. సరిగ్గా గోల్డిన్‌కు నోబెల్ ప్రకటించిననాడే మన దేశంలో వార్షిక ‘పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే‘ (పీఎల్ఎఫ్ఎస్) విడుదలైంది. గత 2022 జూలై నుంచి ఈ 2023 జూన్‌కి సంబంధించిన ఈ సర్వే శ్రమజీవుల్లో మహిళల సంఖ్య మునుపటి కన్నా కొద్దిగా పెరిగిందని పేర్కొంది. అయితే, అది సహజ మైన పెరుగుదల కాక కరోనా తర్వాత కుటుంబ ఆదాయాలు దెబ్బతినడంతో తప్పని పరిస్థితుల్లో వచ్చిన పాలపొంగు అని విశ్లేషకుల అభిప్రాయం. వెరసి, లోతుగా గమనిస్తే భారత్‌లోనూ మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్యం రేటు ఇవాళ్టికీ తక్కువగానే ఉందన్నది విచారకరమైన వాస్తవం. ఇది మారాలంటే... అర్థవంతమైన ఉపాధి, అదే సమయంలో మహిళా శ్రామికశక్తి భాగస్వామ్యం పెరి గేలా విధాన నిర్ణయాలు తీసుకోవాల్సిన బాధ్యత మన ప్రభుత్వాలది. అందుకు ప్రొఫెసర్ గోల్డిన్ అధ్యయనం నుంచి భారతదేశం సైతం పాఠాలు నేర్వాలి. ఏ దేశమైనా సరే ఆర్థిక పురోగతి సాధించినంత మాత్రాన శ్రామిక విపణిలో లింగ వ్యత్యాసం దానంతట అది తగ్గిపోదని గోల్డిన్ నిరూపించారు. అలాగే, సామాజిక, వ్యవస్థాపరమైన అవ రోధాలు ఉన్నంత కాలం కేవలం స్త్రీ విద్య సైతం శ్రామికశక్తిలో లింగ అంతరాల్ని తగ్గించలేదు. సాంప్రదాయిక సమాజాల్లో పిల్లల పెంపకమూ ఓ కీలకాంశం. విధాన నిర్ణేతలు వీటిని దృష్టిలో ఉంచుకోవాలి. లింగ కోణం నుంచి అర్థశాస్త్ర అధ్యయనం ప్రధాన స్రవంతిలో భాగం కాదన్న భావనల్ని గోల్డిన్ బద్దలుకొట్టారు. అమెరికా నుంచి ఇరాన్ దాకా ప్రపంచంలో ప్రతి చోటా ఇవాళ్టికీ ఆడవారి పరిస్థితి ఒకేలా ఉంది. ఇవాళ పురుషుల్లో నూటికి 80 మంది ఉద్యోగాల్లో ఉంటే, ప్రపంచ మహిళా జనాభాలో కేవలం సగం మందే వేతన ఉపాధి పొందుతున్నారు. అదీ మగవాళ్ళ కన్నా తక్కువ వేతనాలకే పనిచేస్తూ, వృత్తిలో ఉన్నత శిఖరాల అధిరోహణకు అవకాశాలూ తక్కువే. అందుకే, లింగ సమానత్వ సాధనలో ప్రపంచం ప్రయాణించాల్సిన దూరం ఇంకా ఎంతో ఉంది. ఆ దిశలో నోబెల్ విజేతలైన గోల్డిన్ అధ్యయనం, నర్గిస్ పోరాటం మనకు తాజా మార్గదర్శకాలు. -
ఆర్థిక శాస్త్రంలో క్లాడియా గోల్డిన్‌కు నోబెల్ పురస్కారం
స్టాక్‌హోమ్: 2023 ఏడాదికి గాను ఆర్థిక శాస్త్రంలో అమెరికాకు చెందిన క్లాడియా గోల్డిన్‌కు నోబెల్ పురస్కారం లభించింది. మహిళల లేబర్ మార్కెట్ ఫలితాలపై విశేష కృషి చేసినందుకుగాను ఆమెకు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఈ బహుమతిని కేటాయించింది. క్లాడియా గోల్డిన్ అమెరికాకు చెందిన ప్రముఖ లేబర్ ఎకనమిస్ట్. హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. మహిళా శ్రామిక శక్తి, సంపాదనలో లింగ వ్యత్యాసం, ఆదాయ అసమానత, సాంకేతిక మార్పు, విద్య, వలసలతో సహా అనేక రకాల అంశాలపై ఆమె పరిశోధన చేశారు. 1990ల్లోనే హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఆర్ధిక విభాగంలో పనిచేసిన ఏకైక మహిళ క్లాడియా గోల్డిన్. మహిళా ఆర్థిక శక్తిపై ఆమె ఎనలేని పరిశోధన చేశారు. BREAKING NEWS The Royal Swedish Academy of Sciences has decided to award the 2023 Sveriges Riksbank Prize in Economic Sciences in Memory of Alfred Nobel to Claudia Goldin “for having advanced our understanding of women’s labour market outcomes.”#NobelPrize pic.twitter.com/FRAayC3Jwb — The Nobel Prize (@NobelPrize) October 9, 2023 నోబెల్ బహుమతుల విజేతలను ప్రకటించే క్రమంలో ఇప్పటికే వైద్య, భౌతిక రంగంలోని అవార్డు గ్రహీతలను ప్రకటించిన కమిటీ బుధవారం రసాయన శాస్త్రం, గురువారం సాహిత్యం, శుక్రవారం నోబెల్ శాంతి రంగాల్లో బహుమతుల విజేతలను ప్రకటించనుంది. చివరిగా ఈ నెల 9న అర్థశాస్త్రంలో విజేతను ప్రకటించింది జ్యురీ. నోబెల్ విజేతలకు డిసెంబర్ 10న బహుమతులను ప్రదానం చేస్తారు. గత ఏడాది నోబెల్ గ్రహీతలకు 10 మిలియన్ల స్వీడిష్ క్రోనర్లు అందజేశారు. ఈసారి ఆ బహుమతిని మరింత పెంచుతూ 11 మిలియన్ల క్రోనర్లు ఇవ్వనున్నారు. ఇదీ చదవండి: Nobel Prize 2023 In Chemistry: రసాయన శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ పురస్కారం -
నానో టెక్నాలజీపై కృషికి ముగ్గురు శాస్త్రవేత్తలకు దక్కిన గౌరవం
-
అలుపెరగని పోరాటానికి నోబెల్ బహుమతి
-
జాన్ ఫోసేకు సాహిత్య నోబెల్
నార్వే రచయిత జాన్ ఫోసేకు సాహిత్యంలో నోబెల్ పురస్కారం వరించింది. బయటకు చెప్పుకోలేని ఎన్నో అంశాలకు తన నవలలు, నాటకాలు, చిన్న పిల్లల పుస్తకాల ద్వారా గళంగా నిలిచినందుకు ఫోసే ఈ ఏడాది ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికయ్యారు. నోబెల్ లిటరేచర్ కమిటీ చైర్మన్ ఆండర్స్ ఓల్సన్ గురువారం అవార్డును ప్రకటించారు. ఫోసే చేసిన రచనల్లో నార్వే సంస్కృతి, స్వభావాలు ఉట్టిపడుతూ ఉంటాయని కొనియాడారు. ఈ పురస్కారం కింద ఫోసేకు 1.1 కోట్ల స్వీడిష్ క్రోనర్లు (10 లక్షల డాలర్లు) లభిస్తాయి. సాహిత్యంలో నోబెల్ పురస్కారం లభించిందంటే తనని తాను నమ్మలేకపోయానంటూ జాన్ ఫోసే తీవ్ర ఉద్విగ్నానికి లోనయ్యారు. ‘‘నోబెల్ కమిటీ ఫోన్ చేసి చెప్పగానే సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాను. మళ్లీ నన్ను నేనే నిలవరించుకున్నారు. గత పదేళ్లుగా నోబెల్ వస్తుందేమోనని ఎదురు చూస్తున్నాను. ఈ అవార్డు విపరీతమైన ఆనందాన్ని ఇస్తోంది. కాస్త కూడా భయం వేస్తోంది. ’’ అని నార్వే మీడియాకు చెప్పారు. నార్వేలో అత్యంత ప్రతిభావంతుడైన నాటక రచయితగా గుర్తింపు పొందిన ఫోసే 43 వరకు నవలలు, నాటకాలు, చిన్న కథలు, పిల్లల పుస్తకాలు, అనువాదాలు, పద్యాలు, గద్యాలు రచించారు. అయితే నాటక రచయితగానే ఆయనకు విశేషమైన గుర్తింపు లభించింది. మాటల్లో తమ బాధల్ని చెప్పుకోలేని ఎన్నో వర్గాలకు ఆయన తన రచనలతో ఒక గళంగా మారి సామాజిక పరిస్థితుల్ని అద్దంలో చూపించారంటూ ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. రోజువారీ ఘటనలే కథా వస్తువు నిత్యజీవితంలో మనకు ఎదురయ్యే ఘటనలే జాన్ ఫోసే రచనలకు ఆధారం. అలాంటి ఘటనల్ని సరళమైన భాషలో,, శక్తిమంతమైన భావ ప్రకటనతో రచనలు చేసి సామాన్యుల మనసుల్ని కూడా దోచుకున్నారు. మానవ సంబంధాల్లోని బలమైన భావోద్వేగాలను , సామాజిక పరిస్థితుల్ని చిన్నారులకి కూడా అర్థమయ్యేలా రచనలు చేసి సమాజంలో వివిధ వర్గాలపై ఎంతో ప్రభావాన్ని చూపించారు. నార్వేలో 1959లో క్రిస్టియన్ మతాచారాల్ని గట్టిగా ఆచరించే ఒక సంప్రదాయ కుటుంబంలో జన్మించారు. విద్యార్థి దశలోనే ఆయన తన కుటుంబంపైన, మతంపైనా తిరుగుబాటు ప్రకటించారు. తాను నాస్తికుడినని ప్రకటించారు. చిన్నప్పట్నుంచి తిరుగుబాటు ధోరణి కలిగిన జాన్ ఫోసే రచనల్లో, నాటకాల్లో అది వ్యక్తమయ్యేది. 1983లో ఆయన రాసిన మొదటి నవల రెడ్, బ్లాక్‌లో ఆత్మహత్యల అంశాన్ని స్పృశించారు. అప్పట్నుంచి ఆయన వెనక్కి చూసుకోలేదు. నవలైనా, నాటకమైనా, పద్యాలైనా, గద్యాలైనా ఆ రచనల్లో ఆయన ముద్ర స్పష్టంగా కనిపించేది. 40 భాషల్లో పుస్తకాల అనువాదం ఫోసే చేసిన రచనలు ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 40 భాషల్లోకి అనువాదమ య్యాయి. 2015లో ది డైలీ టెలిగ్రాఫ్ రూపొందించిన భూమ్మీద ఉన్న లివింగ్ జీనియస్లలో టాప్ 100 జాబితాలో ఫోసే 83వ స్థానంలో నిలిచారు. 2022లో ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ అవార్డు కోసం ఆయన రాసిన ‘‘ఏ న్యూ నేమ్ :సెప్టాలజీ Vఐ– Vఐఐ’’ షార్ట్ లిస్ట్‌లో నిలిచింది. జాన్ ఫోసేకు మూడు పెళ్లిళ్లయ్యాయి. ఆరుగురు పిల్లలకు తండ్రి. 64 ఏళ్ల వయసున్న జాన్ ఫోసే ఆస్ట్రియాలోని తన రెండో భార్యతో కలిసి ఉంటున్నారు. యువకుడిగా ఉన్నప్పుడు దేవుడ్ని నమ్మని జాన్ ఫోసే ప్రస్తుతం కాథలిజంలోకి మారి దానినే అనుసరిస్తున్నారు. ఫోసే చేసిన రచనల్లో బోట్‌హౌస్, మెలాంకలి, సెప్టాలజీ అత్యంత ప్రజాదరణ పొందాయి. ఫోసే రచించిన నాటకాలను వేలాది ప్రొడక్షన్ హౌస్‌లు వివిధ దేశాల్లో ప్రదర్శించాయి. ఇంగ్లిష్ భాషలోకి అనువదించిన ఫోసే సెప్టాలజీ సిరీస్‌లో ది అదర్ నేమ్, ఐ ఈజ్ అనదర్, ఏ న్యూనేమ్ ఆయనకు చాలా గుర్తింపు తీసుకువచ్చాయి. భాషకు పట్టాభిషేకం జాన్ ఫోసే రచనలు నార్వేజియన్ భాషలో రాస్తారు. నార్వేలో 10% మంది మాత్రమే ఈ భాష మాట్లాడే ప్రజలు ఉన్నారు. నార్వేలో ఉన్న రెండు అధికారిక భాషల్లో ఇదొకటి. గ్రామీణ ప్రాంత ప్రజలు మాట్లాడే మాండలికంలో ఉండే ఈ భాష 19వ శతాబ్దంలో డానిస్కు ప్రత్యామ్నాయంగా పుట్టింది. స్వచ్ఛమైన సెలయేరులాంటి భాషలో ప్రజలు రోజువారీ ఎదుర్కొనే సమస్యలకి తన రచనల్లో కొత్త కోణంలో పరిష్కారం మార్గం చూపించడంతో ఆయన పుస్తకాలు అపరిమితమైన ఆదరణ పొందాయి. అందుకే ఈ పురస్కారం తనకే కాకుండా, తన భాషకి కూడా పట్టాభిషేకం జరిగినట్టుగా ఉందని ఫోసే ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
నానో ప్రపంచం దగ్గరయింది
బంగారం ఏ రంగులో ఉంటుందో తెలుసు కదా? ముదురు పసుపునకు కొంత కాంతి చేరిస్తే ఉండే రంగు. కానీ, ఇదే బంగారాన్ని నానోస్థాయిలో.. అంటే మన వెంట్రుకలో పదివేల వంతు సూక్ష్మస్థాయిలో చూస్తే దాని రంగు ఎరుపు లేదా వంగపూతగా కనిపిస్తుంది! అదెలా అని ఆశ్చర్యపోనవసరం లేదు. ఇలా నానోస్థాయిలో పదార్థాల ధర్మాల ఆసరాతో అత్యాధునిక ఎల్రక్టానిక్స్ తయారీకి మార్గం చూపిన శాస్త్రవేత్తలకు ఈ ఏడాది రసాయన శాస్త్ర నోబెల్ బహుమతి దక్కిందని మాత్రం తెలుసుకోవాలి! ఆ విశేషాలేమిటో చూసేద్దాం.. క్వాంటమ్ డాట్స్ తయారీకి బాటలు నానోటెక్నాలజీ మనకేమీ కొత్త కాదు. చాలా కాలంగా వేర్వేరు రంగాల్లో వాడకంలో ఉన్నదే. స్పష్టమైన, పలుచని ఎల్ఈడీ స్క్రీన్ల తయారీ మొదలుకొని శరీరంలోని కేన్సర్ కణితులను కత్తిరించడం వరకూ రకరకాలుగా నానో టెక్నాలజీ ఉపయోగపడుతోంది. ఈ అత్యద్భుతమైన టెక్నాలజీ ఆవిష్కరణలకు బీజం వేసిన క్వాంటమ్ డాట్స్‌ను తయారు చేసేందుకు అవసరమైన సాంకేతికతను అభివృద్ధి చేశారు కాబట్టే స్వీడిష్ నోబెల్ అవార్డు కమిటీ.. మసాచూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన మౌంగి బావెండీ, కొలంబియా యూనివర్సిటీ శాస్త్రవేత్త లూయిస్ బ్రూస్, నానో క్రిస్టల్స్ టెక్నాలజీ ఇన్‌కార్పొరేషన్‌కు చెందిన అలెక్సీ ఎకిమోవ్‌లకు ఈ ఏడాది రసాయన శాస్త్ర నోబెల్ అవార్డు ప్రకటించింది. సూక్ష్మస్థాయి కణాల ఉత్పత్తి రసాయన శాస్త్రం చదువుకున్న వారు ఎవరికైనా మూలకాల ధర్మాలు వాటిలోని ఎల్రక్టాన్ల సంఖ్యపై ఆధారపడి ఉంటాయని తెలిసే ఉంటుంది. అయితే మూలకం నానోస్థాయికి చేరిందనుకోండి... సాధారణ స్థితిలో ఉండే ధర్మాల స్థానంలో క్వాంటమ్ స్థాయి తాలూకూ ప్రభావం కనిపించడం మొదలవుతుంది. మూలకం సైజును బట్టి ఈ ధర్మాలుంటాయి. ఉదాహరణకు పైన చెప్పుకున్న బంగారం రంగు! అలాగే సైజును బట్టి మూలకాల యాంత్రిక, ఉపరితల, అయస్కాంత, ఎలక్ట్రా్టనిక్, ఆప్టికల్, ఉ్రత్పేరక ధర్మాలు కూడా మారిపోతాయి. సాధారణ సైజులో విద్యుత్తు ప్రవాహాన్ని అడ్డుకోని పదార్థాలు సైజు తగ్గుతున్న కొద్దీ సెమీ కండక్టర్లుగా మారిపోవచ్చు. మరికొన్ని పదార్థాలు సాధారణ సైజులో సెమీకండక్టర్లుగా ఉన్నప్పటికీ నానోస్థాయిలో సూపర్ కండక్టర్లుగా వ్యవహరించవచ్చు. ఇంతటి సూక్ష్మస్థాయిలో ఉండే కణాలను ఉత్పత్తి చేయడంలో ఈ ఏటి రసాయన శాస్త్ర నోబెల్ అవార్డు గ్రహీతలు విజయం సాధించారు. నానో ప్రపంచంలో మూలకాల ధర్మాలు మారిపోతాయని చాలాకాలంగా తెలుసు కానీ.. వీటితో వాస్తవిక ప్రయోజనం తక్కువని అనుకునేవారు. 1980లో అలెక్సీ ఎకిమోవ్ రంగుల గాజులో క్వాంటమ్ ఎఫెక్ట్‌ను సృష్టించడంలో విజయం సాధించారు. కణం సైజు ఆధారంగా రంగు మారుతుందని ఆయన నిరూపించడంతో క్వాంటమ్ డాట్స్‌పై ఆసక్తి పెరిగింది. కొన్నేళ్ల తరువాత ఒక ద్రవంలో స్వేచ్ఛగా కదులుతున్న కణాల సైజుకు అనుగుణంగా క్వాంటమ్ ఎఫెక్ట్స్ మారుతాయని మొట్టమొదటిసారి నిరూపించగలిగారు. భవిష్యత్తులో సురక్షితమైన సమాచార వ్యవస్థ! 1993లో మౌంగి బావెండీ రసాయనికంగా క్వాంటమ్ డాట్స్‌ను ఉత్పత్తి చేయడం మొదలు పెట్టడంతో వీటిని మన ప్రయోజనాలకు వాడుకోవడం సులువు అయ్యింది. ఇప్పుడు మన కంప్యూటర్ మానిటర్లు, క్యూఎల్ఈడీ స్క్రీన్‌లో విస్తృత స్థాయి రంగులు వెదజల్లడం ఈ క్వాంటమ్ డాట్స్ పుణ్యమే. అలాగే మన ఎల్ఈడీ బల్బుల రంగులు మారడానికి కూడా ఇవే కారణం. శరీరంలోని కణజాలాన్ని స్పష్టంగా గుర్తించేందుకు బయో కెమిస్టులు, వైద్యులు ఇప్పుడు క్వాంటమ్ డాట్స్‌ను వాడుతున్నారు. భవిష్యత్తులో ఈ క్వాంటమ్ డాట్స్ ద్వారా ఎటు కావాలంటే అటు మడిచేసుకోగల ఎల్రక్టానిక్స్, అతి సూక్ష్మమైన సెన్సార్లు, పలుచటి సోలార్ సెల్స్ తయారీతోపాటు అత్యంత సురక్షితమైన సమాచార వ్యవస్థను అభివృద్ధి చేసుకునేందుకూ ఉపయోగపడుతుందని అంచనా. క్వాంటమ్ డాట్స్‌పై పరిశోధనలకు నోబెల్ రసాయన శాస్త్రంలో ముగ్గురు అమెరికా సైంటిస్టులకు ప్రతిష్టాత్మక బహుమతి స్టాక్‌హోమ్: రసాయన శాస్త్రంలో ఈ ఏడాది నోబెల్ బహుమతిని ‘ద రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్’ బుధవారం ప్రకటించింది. ఈ ప్రతిష్టాత్మక బహుమతి ఈసారి ముగ్గురు అమెరికా శాస్త్రవేత్తలను వరించింది. నానో టెక్నాలజీకి సంబంధించిన క్వాంటమ్ డాట్స్ ఆవిష్కరణలో పరిశోధనలకు గాను మౌంగి బావెండీ, లూయిస్ బ్రూస్, అలెక్సీ ఎకిమోవ్‌లకు రసాయన శాస్త్ర నోబెల్ ప్రైజ్ లభించింది. క్వాంటమ్ డాట్స్ విశ్లేషణ, ఆవిష్కరణలో, నానో పారి్టకల్స్ అభివృద్ధిలో ఈ ముగ్గురు సైంటిస్టులు కీలక పాత్ర పోషించారని నోబెల్ కమిటీ తెలియజేసింది. ‘ద రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్’ అధికారికంగా విజేతల పేర్లు ప్రకటించకముందే ముగ్గురు సైంటిస్టుల పేర్లను స్వీడన్ మీడియా సంస్థలు బహిర్గతం చేయడం కలకలం రేపింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఎలక్ట్రాన్ల ప్రపంచానికి కొత్త ‘కాంతి పుంజం’
ఫిజిక్స్‌లో ముగ్గురికి నోబెల్ భౌతిక శాస్త్రంలో ఈ ఏడాది ముగ్గురు శాస్త్రవేత్తలకు ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతి లభించింది. అమెరికాలోని ఒహాయో స్టేట్ యూనివర్సిటీకి చెందిన పియరీ అగోస్తినీ, జర్మనీలోని మాక్స్‌ప్లాంక్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్వాంటమ్ ఆప్టిక్స్, లుడ్వింగ్ మాక్సిమిలియన్ యూనివర్సిటీ ఆఫ్ మ్యూనిచ్కు చెందిన ఫెరెంక్ క్రౌజ్, స్వీడన్‌లోని లుండ్ యూనివర్సిటీకి చెందిన అన్నె ఎల్ హుయిలర్ను ఈ బహుమతి వరించింది. 24 ఫ్రేమ్స్ గురించి మీరు వినే ఉంటారు. సెకనుకు ఇరవై నాలుగు ఫ్రేమ్‌ల చొప్పున రీలు తిరిగితే తెరపై బొమ్మ, ఆట, పాట, మాట అన్నీ సవ్యంగా కనిపిస్తాయి! సినిమాకైతే ఇలా ఓకే కానీ పరమాణువుల్లోని ఎల్రక్టాన్లను చూడాలనుకోండి లేదా వాటి కదలికలను అర్థం చేసుకోవాలనుకోండి. అస్సలు సాధ్యం కాదు! ఈ అసాధ్యాన్నీ సుసాధ్యం చేయడంలో కీలకపాత్ర పోషించారు కాబట్టే పియరీ అగోస్తినీ, ఫెరెంక్ క్రౌజ్, అనే ఎల్ హుయిలర్ చేసిన ప్రయోగాలకు ఈ ఏటి భౌతికశాస్త్ర నోబెల్ బహుమతి లభించింది. ఇంతకీ ఏమిటీ ప్రయోగాలు? వాటి ప్రయోజనాలేమిటి? అట్టోసెకను ఫిజిక్స్ ఒక సెకను కాలంలో కాంతి ఎంత దూరం ప్రయాణిస్తుందో మీకు తెలుసా? మూడు లక్షల కిలోమీటర్లకు పిసరంత తక్కువ. మరి అట్టోసెకను కాలంలో? సెకను.. అర సెకను.. పావు సెకను తెలుసు కానీ ఈ అట్టోసెకను ఏమిటి? 3,711 కోట్ల సంవత్సరాల కాలంలో ఒక సెకను ఎంతో సెకనులో అట్టోసెకను అంతన్నమాట! ఇంకోలా చెప్పాలంటే.. టెన్ టు ద పవర్ ఆఫ్ మైనస్ 18. గందరగోళం లేకుండా ఉండాలని అనుకుంటే.. సూక్ష్మాతి సూక్ష్మమైన కాలావధి అని అనుకుందాం. ఇంత తక్కువ సమయంలోనూ కాంతి 0.3 మైక్రోమీటర్లు లేదా ఒక వైరస్ పొడవు అంత దూరం ప్రయాణించగలదు. ఈ సంవత్సరం భౌతికశాస్త్ర నోబెల్ ప్రైజ్ గ్రహీతలు ఇంత సూక్ష్మస్థాయిలో కాంతి పుంజాలను విడుదల చేయగల టెక్నాలజీని అభివృద్ధి చేయడంలో కీలకపాత్ర పోషించారు. ముందుగా చెప్పుకున్నట్లు ఎల్రక్టాన్ల కదలికలు, కాంతికి, పదార్థానికి మధ్య ఉన్న సంబంధాలను అర్థం చేసుకునేందుకు ఈ అట్టోసెకను ఫిజిక్స్ చాలా ఉపయోగపడుతుంది. అంతేకాదు.. వీరి ప్రయోగాల పుణ్యమా అని అణువులు, పరమాణువుల లోపలి కణాలను మరింత క్షుణ్నంగా అర్థం చేసుకునేందుకు ఆస్కారం ఏర్పడింది. కాంతి పుంజాల విశ్లేషణ 2001లో అమెరికాకు చెందిన పియరీ అగోస్తినీ ఈ అట్టోసెకను కాంతి పుంజాలను ఉత్పత్తి చేయడం మాత్రమే కాకుండా సుమారు 250 అట్టోసెకన్ల కాలం ఉండే కాంతి పుంజాలను విశ్లేషించడంలోనూ విజయం సాధించారు. ఈ కాలంలోనే జర్మనీకి చెందిన ఫెరెంక్ క్రౌజ్ కూడా ఈ అట్టోసెకను కాంతి పుంజాలపై పరిశోధనలు చేస్తూండేవారు. కాకపోతే ఈయన 650 అట్టోసెకన్ల కాలపు కాంతి పుంజాన్ని వేరు చేయడంలో విజయవంతం కావడం గమనార్హం. ఒకప్పుడు అసాధ్యం అని అనుకున్న ప్రాసెస్లను కూడా గమనించడం ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు చేసిన ప్రయోగాల వల్ల ఇప్పుడు వీలైంది. ‘‘ఎలక్ట్రాన్ల ప్రపంచానికి ఈ ప్రయోగాలు తలుపులు తెరిచాయి. అట్టోసెకన్ ఫిజిక్స్ ద్వారా ఎల్రక్టాన్లలో జరుగుతున్న కార్యకలాపాలను గమనించడం వీలైంది. ఇకపై ఈ విషయాలను వాడుకోవడం ఎలా? అన్నది మొదలవుతుంది’’ అని నోబెల్ అవార్డు భౌతిక శాస్త్ర కమిటీ అధ్యక్షులు ఎవా ఓల్సన్ వ్యాఖ్యానించడం విశేషం. వ్యాధుల నిర్ధారణలోనూ ఉపయోగకరం ఈ అట్టోసెకను ఫిజిక్స్‌ను ఎల్రక్టానిక్స్‌లో సమర్థంగా ఉపయోగించుకునేందుకు అవకాశముంది. ఎల్రక్టాన్లు ఏ రకమైన పదార్థంతో ఎలా ప్రవర్తిస్తుందో తెలుసుకోగలిగితే.. అతితక్కువ విద్యుత్తును ఉపయోగించుకుని మరింత సమర్థంగా పనిచేయగల ఎల్రక్టానిక్ పరికరాలను తయారు చేయడం వీలవుతుంది. ఎలక్ట్రాన్ల ప్రవాహాన్నే మనం విద్యుత్తు అంటామన్నది తెలిసిందే. వేర్వేరు మూలకాలను గుర్తించేందుకు అట్టోసెకను కాంతి పుంజాలు ఉపయోగపడతాయి కాబట్టి.. భవిష్యత్తులో వ్యాధుల నిర్ధారణకు కూడా వీటిని వాడుకోవడం వీలవుతుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ 1987లో శ్రీకారం అట్టోసెకను కాలపు కాంతి పుంజాలతో ఫొటోలు తీస్తే అణువులు, పరమాణువుల్లో జరిగే కార్యకలాపాలేమిటన్నది స్పష్టంగా తెలుస్తాయి. ఈ అట్టోసెకను కాంతి పుంజాల తయారీకి 1987లో స్వీడన్‌కు చెందిన ఎల్ హుయిలర్ శ్రీకారం చుట్టారని చెప్పాలి. అప్పట్లో ఈ శాస్త్రవేత్త జడ వాయువు గుండా పరారుణ కాంతిని ప్రసారం చేసినప్పుడు వేర్వేరు ఛాయలున్న రంగులు బయటకొస్తున్నట్లు గుర్తించారు. ఒక్కో ఛాయ పరారుణ కాంతి జడ వాయువులోని పరామాణువులతో జరిపిన పరస్పర చర్యల ఫలితం. కొన్ని ఎల్రక్టాన్లు ఈ లేజర్ కిరణాల ద్వారా అదనపు శక్తి పొంది దాన్ని విడుదల చేస్తూంటాయి అన్నమాట. ఈ అంశంపై ఎల్ హుయిలర్ తన ప్రయోగాలు కొనసాగించగా ఆ తరువాతి కాలంలో అనేక కీలకమైన ఫలితాలు లభించాయి. సెకను కంటే తక్కువ సమయాన్ని ఇలా సూచిస్తారు సెకనులో వెయ్యో వంతు... ఒక మిల్లీ సెకను మిల్లీ సెకనులో వెయ్యో వంతు.. ఒక మైక్రో సెకను ఒక మైక్రో సెకనులో వెయ్యో వంతు... ఒక నానో సెకను ఒక నానో సెకనులో వెయ్యో వంతు.. ఒక పికో సెకను ఒక పికో సెకనులో వెయ్యో వంతు.. ఒక ఫెమ్టో సెకను (లాసిక్ కంటి శస్త్రచికిత్సల్లో ఈ స్థాయి లేజర్ కిరణాలను వాడతారు) ఒక ఫెమ్టో సెకనులో వెయ్యో వంతు.. ఒక అట్టో సెకను -
Nobel Prize 2023: భౌతిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ పురస్కారం
స్టాక్‌హోమ్: ఆయా రంగాల్లోని ప్రజ్ఞావంతులకు నోబెల్ పురస్కారాలను అందించడం సంప్రదాయంగా వస్తోంది. ఇదే క్రమంలో 2023 సంవత్సరానికిగాను భౌతిక శాస్త్రంలో అపార ప్రతిభ కనబరిచిన ముగ్గురు శాస్త్రవేత్తలను ఈ నోబెల్ బహుమతి వరించింది. అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు పెర్రీ అగోస్టిని, ఫెరెంక్ క్రౌజ్, ఎల్'హ్యులియర్‌లకు 'ఒక పదార్థంలోని ఎలక్ట్రాన్ డైనమిక్స్'పై చేసిన విస్తృత పరిశోధనలకుగాను వీరిని నోబెల్ బహుమతి వరించింది. BREAKING NEWS The Royal Swedish Academy of Sciences has decided to award the 2023 #NobelPrize in Physics to Pierre Agostini, Ferenc Krausz and Anne L’Huillier “for experimental methods that generate attosecond pulses of light for the study of electron dynamics in matter.” pic.twitter.com/6sPjl1FFzv — The Nobel Prize (@NobelPrize) October 3, 2023 విభిన్న రంగాల్లోని ప్రతిభావంతులకు నోబెల్ అవార్డులను ప్రకటించే ప్రక్రియ సోమవారం ప్రారంభం కాగా మొదట వైద్య రంగంలోని అవార్డు గ్రహీతలను ప్రకటించింది కమిటీ. ఈరోజు భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతికి ఎంపికైన శాస్త్రవేత్తలు పేర్లను ప్రకటించారు. కాగా ఈ ఏడాది ముగ్గురు శాస్త్రవేత్తలకు సంయుక్తంగా ఈ అవార్డును ప్రకటించడం విశేషం. వీరు ఒక పదార్ధంలోని ఎలక్ట్రాన్ డైనమిక్స్‌లను అధ్యయనం చేసేందుకు అట్టోసెకెండ్ పల్సెస్ డెవలప్మెంట్పై చేసిన ప్రయోగాలకుగాను ఈ అత్యున్నత పురస్కారానికి ఎంపికైనట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకటించింది. 2023 physics laureate Pierre Agostini succeeded in producing and investigating a series of consecutive light pulses, in which each pulse lasted just 250 attoseconds. At the same time, his 2023 co-laureate Ferenc Krausz was working with another type of experiment, one that made it… pic.twitter.com/pEFAM0ErNP — The Nobel Prize (@NobelPrize) October 3, 2023 వీరిలో ఎల్'హ్యులియర్ భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి సాధించిన ఐదవ మహిళగా ఘనత సాధించారు. 1903లో మేరీ క్యురీ, 1963లో మరియా గొప్పెర్ట్-మేయర్, 2018లో డొన్నా స్ట్రిక్లాండ్, 2020లో ఘెజ్ భౌతిక శాస్త్రంలో నోబెల్ పురస్కారాలను సాధించగా 2023 సంవత్సరానికి గాను హ్యులియర్ ఈ పురస్కారాన్ని సాధించి చరిత్రలో చోటు సంపాదించారు. Electrons’ movements in atoms and molecules are so rapid that they are measured in attoseconds. An attosecond is to one second as one second is to the age of the universe.#NobelPrize pic.twitter.com/5Bg9iSX5eM — The Nobel Prize (@NobelPrize) October 3, 2023 This year’s #NobelPrize laureate in physics Anne L’Huillier discovered that many different overtones of light arose when she transmitted infrared laser light through a noble gas. Each overtone is a light wave with a given number of cycles for each cycle in the laser light. They… pic.twitter.com/bJWD4kiE5Z — The Nobel Prize (@NobelPrize) October 3, 2023 నోబెల్ బహుమతుల విజేతలను ప్రకటించే క్రమంలో ఇప్పటికే వైద్య, భౌతిక రంగంలోని అవార్డు గ్రహీతలను ప్రకటించిన కమిటీ బుధవారం రసాయన శాస్త్రం, గురువారం సాహిత్యం, శుక్రవారం నోబెల్ శాంతి రంగాల్లో బహుమతుల విజేతలను ప్రకటించనుంది. చివరిగా ఈ నెల 9న అర్థశాస్త్రంలో విజేతను ప్రకటించనుంది జ్యురీ. నోబెల్ విజేతలకు డిసెంబర్ 10న బహుమతులను ప్రదానం చేస్తారు. గత ఏడాది నోబెల్ గ్రహీతలకు 10 మిలియన్ల స్వీడిష్ క్రోనర్లు అందజేశారు. ఈసారి ఆ బహుమతిని మరింత పెంచుతూ 11 మిలియన్ల క్రోనర్లు ఇవ్వనున్నారు. ఇది కూడా చదవండి: పాక్‌లో జోరుగా కిడ్నీల దోపిడీ.. 328 సర్జరీలు..? -
2023 Nobel Prize: కోవిడ్–19 టీకా పరిశోధనలకు నోబెల్
స్టాక్‌హోమ్: కోవిడ్–19 మహమ్మారి నియంత్రణ కోసం ఎంఆర్ఎన్ఏ (మెసెంజర్ రైబోన్యూక్లియిక్ యాసిడ్) వ్యాక్సిన్ల అభివృద్ధికి తమ పరిశోధనల ద్వారా తోడ్పాటునందించిన ఇద్దరు శాస్త్రవేత్తలకు ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతి లభించింది. హంగేరీకి చెందిన కాటలిన్ కరికో, అమెరికన్ డ్రూ వీజ్‌మన్‌కు ఈ ఏడాది వైద్యరంగంలో నోబెల్ ప్రైజ్‌ను స్వీడన్‌లోని నోబెల్ కమిటీ సోమవారం ప్రకటించింది. న్యూక్లియోసైడ్ బేస్ మాడిఫికేషన్లలో వీరిద్దరూ చేసిన నూతన ఆవిష్కరణలు ఎంఆర్ఎన్ఏ టీకాల అభివృద్ధికి దోహదపడ్డాయి. కాటలిన్ కరికో, డ్రూ వీజ్‌మన్ పరిశోధనలతో రెండు ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లకు ఆమోదం లభించిందని, ఈ వ్యాక్సిన్లు కోట్లాది మంది ప్రాణాలను కాపాడాయని నోబెల్ కమిటీ వెల్లడించింది. మన శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ పట్ల ఎంఆర్ఎన్ఏ ఎలా ప్రతిస్పందిస్తున్న దానిపై వీరిద్దరి పరిశోధన మన అవగాహనను పూర్తిగా మార్చివేసిందని పేర్కొంది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి గాను ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ల అభివృద్ధి చేయడానికి సహాయపడే న్యూక్లియోసైడ్ బేస్‌కు సంబంధించిన ఆవిష్కరణలకు వీరిని నోబెల్‌తో సత్కరించనున్నట్లు తెలియజేసింది. ఇదిలా ఉండగా, భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని మంగళవారం, బుధవారం రసాయన శాస్త్రంలో, గురువారం సాహిత్యంలో నోబెల్ బహుమతి విజేతల పేర్లను ప్రకటిస్తారు. శుక్రవారం నోబెల్ శాంతి బహుమతిని ప్రకటించనున్నారు. ఈ నెల 9న అర్థశాస్త్రంలో ఈ బహుమతి గ్రహీత పేరును వెల్లడిస్తారు. విజేతలకు డిసెంబర్ 10న నోబెల్ బహుమతులు ప్రదానం చేస్తారు. గత ఏడాది నోబెల్ గ్రహీతలకు 10 మిలియన్ల స్వీడిష్ క్రోనర్లు అందజేశారు. ఈసారి 11 మిలియన్ల క్రోనర్లు ఇవ్వనున్నారు. సంకల్పానికి తోడైన కృషి 1997లో యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలో పనిచేస్తున్న సమయంలో కాటలిన్ కరికో, డ్రూ వీజ్‌మన్ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లపై ఉమ్మడి పరిశోధనలు మొదలుపెట్టారు. వీజ్‌మన్ ఇమ్యునాలజీ, మైక్రోబయాలజీలలో బోస్టన్ యూనివర్సిటీ నుంచి 1987లో పీహెచ్డీ పట్టా పొందారు. అమెరికా ప్రభుత్వ సంస్థ నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్‌లో హెచ్ఐవీ వైరస్‌పై పరిశోధనలు చేశారు. ఆ తరువాతి కాలంలో పెన్సిల్వేనియా యూనివర్సిటీలో వ్యాక్సిన్లపై పరిశోధనలకు శాస్త్రవేత్తల బృందం ఒకదాన్ని ఏర్పాటు చేశారు. మరోవైపు కాటలిన్ కరికో ఎంఆర్ఎన్ఏ బయో కెమిస్ట్రీలో నిపుణులు. ఎంఆర్ఎన్ఏను వైద్యానికి ఉపయోగించాలన్న సంకల్పం ఇరువురిలోనూ మెండు. వేర్వేరు ఆర్ఎన్ఏ రకాలపై వీరు పరిశోధనలు చేపట్టగా 2005లో న్యూక్లియోటైడ్ బేసెస్లో మార్పులకు, దు్రష్పభావాలకు మధ్య సంబంధం స్పష్టమైంది. దీని ఆధారంగానే వారు ఆ బేస్‌లను మారిస్తే అప్పటివరకూ ఉన్న పరిమితులు తొలగిపోతాయని ప్రతిపాదించారు. తదుపరి పరిశోధనలతో దాన్ని రుజువు చేశారు. ఎంఆర్ఎన్ఏ బేస్‌లు మార్చారు.. టీకా సిద్ధం చేశారు! 2019లో మొదలై నెలల వ్యవధిలోనే ప్రపంచాన్ని చుట్టేసిన కోవిడ్ మహమ్మారి గురించి ఇప్పుడు కొత్తగా చెప్పుకునేందుకు ఏమీ లేదు. తొలినాళ్లలో ఈ వ్యాధిని కట్టడి చేసేందుకు కావాల్సిన టీకా అంత తొందరగా తయారవుతుందా? తయారయ్యేలోపు ఎన్ని ప్రాణాలు పోవాలో అన్న ఆందోళన అందరిలోనూ వ్యక్తమైంది. కానీ.. మానవ సంకల్పం, ఆధునిక టెక్నాలజీల పుణ్యమా అని తక్కువ సమయంలోనే రికార్డు స్థాయిలో టీకాలు అందుబాటులోకి వచ్చాయి. ప్రపంచం పెను విపత్తు నుంచి చివరి క్షణంలో తప్పించుకుంది. అంతేకాదు, ఈ టీకాల్లో ఒక రకం (ఎంఆర్ఎన్ఏ) మనకు అందుబాటులోకి రావడానికి ఈ సంవత్సరం వైద్యశాస్త్ర నోబెల్ బహుమతి గ్రహీతలైన కాటలిన్ కరికో, డ్రూ వీజ్‌మన్‌ల పరిశోధనలు కీలకమయ్యాయి! ఎందుకు? ఏమిటి? ఎలా? 30 ఏళ్లుగా పరిశోధనలు టీకాల తయారీకి శాస్త్రవేత్తలు వందేళ్లుగా నాలుగు రకాల పద్ధతులను ఉపయోగిస్తున్నారు. వ్యాధికారక సూక్ష్మజీవిని నిరీ్వర్యం చేసి వాడేది ఒక రకమైతే.. ఆ సూక్ష్మజీవి భాగాన్ని ఉపయోగించుకోవడం ఇంకో పద్ధతి. వీటితోపాటు మరికొన్ని పద్ధతులను కూడా ఉపయోగిస్తారు. కానీ.. సుమారు 30 ఏళ్ల క్రితం శరీర కణాల్లోని అతి సూక్ష్మ భాగమైన ఎంఆర్ఎన్(మెసెంజర్ రైబోన్యూక్లియిక్ యాసిడ్)ను కూడా వాడుకోవచ్చని కొంతమంది శాస్త్రవేత్తలు ప్రతిపాదించారు. అప్పటి నుంచి ఇప్పటివరకూ ఈ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లపై పరిశోధనలైతే జరిగాయి గానీ సాధించిన ఫలితాలు అంతంతమాత్రంగానే ఉండేవి. కోవిడ్ వ్యాధి ప్రపంచంపై పంజా విసిరిన సందర్భంలో మాత్రం పరిస్థితి వేగంగా మారిపోయింది. వ్యాధి నియంత్రణకు ఎంఆర్ఎన్ఏ టీకా సిద్ధమైంది. ఎన్నో వ్యాధుల నియంత్రణకు ఉపయోగకరం? ఎంఆర్ఎన్ఏ టీకాలనేవి ప్రస్తుతం మనం కోవిడ్ నియంత్రణకు వాడుకున్నాం కానీ.. భవిష్యత్తులో ఈ టెక్నాలజీ చాలా వ్యాధుల కట్టడికి ఉపయోగపడుతుందని, కొన్నింటికి చికిత్సగానూ పనికొస్తుందని శాస్త్రవేత్తల అంచనా. కోవిడ్ తరువాత జంతువుల నుంచి మనుషులకు వైరస్ సంబంధిత వ్యాధులు సోకే అవకాశాలు పెరిగినట్లు ప్రపంచం గుర్తించింది. అయితే, ఇప్పటికీ గుర్తించని వైరస్ రకాలు చాలా ఉన్నాయి. ఒకవేళ భవిష్యత్తులో గుర్తు తెలియని వైరస్ ఏదైనా మనిషిపై దాడి చేస్తే ఎంఆర్ఎన్ఏ టెక్నాలజీతో సులువుగా టీకా తయారు చేసేందుకు అవకాశం ఏర్పడింది. 2000లో ఏర్పాటైన క్యూర్‌వ్యాక్, 2008లో ఏర్పాటైన బయో ఎన్‌టెక్, 2010 ఏర్పాటైన మోడెర్నా కంపెనీలు ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లపై పరిశోధనలను ముమ్మరం చేశాయి. ఈ మూడు కంపెనీల శాస్త్రవేత్తలు యూనివర్సిటీలతో కలిసి పనిచేయడం ద్వారా ఈ టెక్నాలజీ సాకారమయ్యేలా చేయగలిగారు. జీకా వైరస్ విరుగుడుకు ఇప్పటికే ఎంఆర్ఎన్ఏ వైరస్ ఒకటి అందుబాటులో ఉండగా హెచ్10ఎన్8, హెచ్7ఎన్9 ఇన్ఫ్లుయెంజా వైరస్ల కట్టడికీ ప్రయోగాలు జరుగుతున్నాయి. ఏమిటీ ఎంఆర్ఎన్ఏ? మన కణాల్లోపల కణ కేంద్రకం.. అందులోపల మైటోకాండ్రియా, ఉండచుట్టుకుని క్రోమోజోములు ఉంటాయని చిన్నప్పుడు చదువుకుని ఉంటాం. ఈ క్రోమోజోముల మెలికలను విడదీస్తే అది... మెలితిరిగిన నిచ్చెన ఆకారంలోని డీఎన్ఏ అని కూడా మనకు తెలుస్తుంది. దీంట్లో రెండు పోగులుంటాయి. ఈ డీఎన్ఏలో అక్కడక్కడ కొంత భాగంలో శరీర క్రియలకు అవసరమైన ప్రొటీన్లను తయారు చేసేందుకు కావాల్సిన సమాచారం ఉంటుంది. కొన్ని రసాయన ప్రక్రియల కారణంగా ప్రొటీన్ల తయారీ సమాచారమున్న డీఎన్ఏ భాగాలు పోగు నుంచి విడిపోతుంటాయి. ఇలా విడిపోయిన భాగాన్నే ఎంఆర్ఎన్ఏ అని పిలుస్తారు. ముందుగా చెప్పుకున్నట్లు ఈ ఎంఆర్‌ఎన్‌ఏలను టీకాలుగా వాడుకునేందుకు 30 ఏళ్లుగా పరిశోధనలైతే జరుగుతున్నాయి. అయితే దు్రష్పభావాలు కనిపిస్తున్న నేపథ్యంలో వీటిని వాడటం అసాధ్యమైంది. అలాగే ఎంఆర్‌ఎన్‌ఏలు తగినంత మోతాదులో ప్రొటీన్లు ఉత్పత్తి చేయగలిగేవి కాదు. ఈ నేపథ్యంలో కాటలిన్ కరికో, డ్రూ వీజ్‌మన్‌లు చేసిన పరిశోధనలకు ప్రాముఖ్యత ఏర్పడింది. ఎంఆర్ఎన్ఏ పోగులోని న్యూక్లియోటైడ్ బేసెస్(అడినైన్, థయామీన్, సైటోసైన్, గ్వానైన్ అని నాలుగు బేస్‌లు ఉంటాయి. రెండు పోగుల డీఎన్ఏ మెలితిరిగిన నిచ్చెన మాదిరిగా ఉంటే.. నిచ్చెన మెట్లకు రెండువైపుల ఉండే ఆధారం ఈ బేస్‌లు)మారితే రోగ నిరోధక వ్యవస్థ దాన్ని గుర్తించలేదని, తద్వారా ప్రొటీన్ ఉత్పత్తి పెరగడమే కాకుండా దు్రష్పభావాలూ ఉండవని వీరు తమ పరిశోధనల ద్వారా నిరూపించారు. ఈ పరిశోధనలకు మరికొన్ని ఇతర పరిశోధనలూ తోడు కావడం వల్లనే కోవిడ్–19 విరుగుడుకు రికార్డు సమయంలో రెండు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. BREAKING NEWS The 2023 #NobelPrize in Physiology or Medicine has been awarded to Katalin Karikó and Drew Weissman for their discoveries concerning nucleoside base modifications that enabled the development of effective mRNA vaccines against COVID-19. pic.twitter.com/Y62uJDlNMj — The Nobel Prize (@NobelPrize) October 2, 2023 “For the 20 years that we worked together before anybody knew about us or cared it was literally the two of us sitting side by side at a bench and working together. Usually at 3 or 5am we would be emailing each other with new ideas.” - 2023 medicine laureate Drew Weissman on… pic.twitter.com/WF3hNLJbK3 — The Nobel Prize (@NobelPrize) October 2, 2023 ఇది కూడా చదవండి: అమెరికన్లు త్వరగా ఎందుకు మరణిస్తున్నారు? – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘నోబెల్’ నగదు పురస్కారం భారీగా పెంపు
స్టాక్‌హోమ్: నోబెల్ బహుమతి గ్రహీతలకిచ్చే నగదు మొత్తాన్ని ప్రస్తుతమున్న 1 మిలియన్ క్రోనార్ల(రూ.74.80 లక్షల) నుంచి 11 మిలియన్ క్రోనార్ల (రూ.8.15 కోట్ల)కు పెంచుతున్నట్లు నోబెల్ ఫౌండేషన్ శుక్రవారం ప్రకటించింది. ఇటీవలి కాలంలో స్వీడన్ కరెన్సీ క్రోనార్ విలువ పడిపోవడమే ఇందుకు కారణమని ఒక సంక్షిప్త ప్రకటనలో వివరించింది. అమెరికా డాలర్, యూరోలతో పోలిస్తే క్రోనార్ విలువ ఇంత దిగువకు పడిపోవడం ఇదే మొదటిసారి. స్వీడన్లో ద్రవ్యోల్బణం ఆగస్ట్‌లో 7.2 శాతంగా ఉంది. నోబెల్ బహుమతులను 1901లో మొదటిసారి ప్రదానం చేసినప్పుడు ఒక్కో కేటగిరీకి 1.50 లక్షల క్రోనార్లు అందజేసింది. అప్పటి నుంచి నోబెల్ ఫౌండేషన్ క్రమంగా ఈ మొత్తాన్ని పెంచుకుంటూ వస్తోంది. ఈ ఏడాది నోబెల్ విజేతలను అక్టోబర్‌లో ప్రకటించనుంది. -
ఏపీ విద్యాసంస్కరణలు అద్భుతం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో విద్యాసంస్కరణలు అద్భుతంగా ఉన్నాయని నోబెల్ అవార్డు గ్రహీత ప్రొఫెసర్ మైకెల్ రాబర్ట్ క్రేమెర్ ప్రశంసించారు. ఆయన గురువారం చికాగో యూనివర్సిటీలోని డెవలప్మెంట్ ఇన్నోవేషన్ ల్యాబ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎమిలీ క్యుపిటో బృందంతో కలిసి రాష్ట్రానికి వచ్చారు. సెంట్రల్ స్క్వేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పర్సనలైజ్డ్ అండ్ అడాప్టివ్ లెర్ణింగ్ (పాల్) ప్రాజెక్టు అమలు చేస్తున్న పాఠశాలలను ఈ బృందం పరిశీలించనుంది. సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన ఈ బృందం పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేశ్‌కుమార్, సమగ్ర శిక్ష ఎస్పీడీ బి.శ్రీనివాసరావుతో విద్యాసంబంధ అంశాలపై చర్చించింది. విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలు, సంక్షేమ కార్యక్రమాలను అధికారులు ఆ బృందానికి వివరించారు. ఈ బృందం మూడురోజుల పాటు ఏలూరు జిల్లాలో వివిధ పాఠశాలలను సందర్శించనుంది. ఈ సందర్భంగా పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేశ్‌కుమార్ మాట్లాడుతూ.. ఏపీ విద్యావ్యవస్థపై చికాగో యూనివర్సిటీ బృందం పరిశోధించడం అభినందనీయమన్నారు. ఇలాంటి పరిశోధనలు రాష్ట్రంలో విద్యాభివృద్ధికి మరింత దోహదపడతాయని చెప్పారు. రాష్ట్రంలో విద్యార్థుల అభ్యాస ఫలితాలను మెరుగుపరిచేందుకు పర్సనలైజ్డ్ అండ్ అడాప్టివ్ లెర్ణింగ్ (పాల్) బాగుందని సమగ్ర శిక్ష ఎస్పీడీ శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఏఎస్పీడీ డాక్టర్ కె.వి.శ్రీనివాసులురెడ్డి, శామో జాయింట్ డైరెక్టర్ బి.విజయ్‌భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
C R Rao: తెలుగోడికి స్టాటిస్టిక్స్ నోబెల్ అవార్డు, 102 ఏళ్ల వయసులో ఘనత
ప్రపంచ ప్రఖ్యాత గణాంకశాస్త్ర నిపుణుడు, భారతీయ అమెరికన్ కల్యంపూడి రాధాకృష్ణరావు (102) స్టాటిస్టిక్స్ రంగంలో అత్యున్నత గౌరవం దక్కింది. గణాంక శాస్త్ర రంగంలో నోబెల్ అవార్డుగా భావించే ఇంటర్నేషల్ ప్రైజ్ ఇన్ స్టాటిస్టిక్స్ అవార్డు సీఆర్ రావును వరించింది. సాధించడానికి వయస్సుతో పని లేదని నిరూపించిన గొప్ప వ్యక్తి సీఆర్ రావు. వయస్సు అనేది కేవలం ఒక నెంబర్ అని మాత్రమే చెప్పే.. రాధాకృష్ణారావు.. జీవితంలో ఎన్నో సాధించి ఐకాన్‌గా నిలిచారు. 62 ఏళ్లకు కూతురి దగ్గర ఉండేందుకు అమెరికా వెళ్లిన రావు, 70 ఏళ్ల వయస్సులో పిట్స్బర్గ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా చేరారు. ఆయనకు 75 ఏళ్లున్నప్పుడు అమెరికా ప్రభుత్వం పౌరసత్వం ఇచ్చింది. 82 ఏళ్ల వయస్సులో రావు వైట్ హౌజ్ ఇచ్చే అత్యంత ప్రతిష్టాత్మకమైన నేషనల్ మెడల్ ఫర్ సైన్స్ అవార్డు అందుకున్నారు. 102 ఏళ్ల వయస్సులో స్టాటిస్టిక్స్ నోబెల్ అందుకుంటున్నారు. సీఆర్ రావు 1920 సెప్టెంబరు 10న బళ్లారి జిల్లా హడగళిలోని తెలుగు కుటుంబంలో పుట్టారు. ఏపీలోని గూడూరు, నూజివీడు, నందిగామల్లో చదువుకున్నారు. ఆంధ్ర యూనివర్సిటీలో ఎమ్మెస్సీ మ్యాథ్స్, కోల్‌కతా యూనివర్సిటీలో ఎంఏ స్టాటిస్టిక్స్ చేశారు. కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలోని కింగ్స్ కాలేజీలో 1948లో పీహెచ్డీ పూర్తి చేశారు. (చదవండి: ‘మహా’ రాజకీయాల్లో మరో ట్విస్ట్.. అజిత్‌ను కలిసిన ఉద్ధవ్) ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్లో విద్యార్థిగా చేరి అదే సంస్థకు డైరెక్టర్‌గా ఎదిగారు. ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్‌గా పదవీ విరమణ చేసిన అనంతరం అమెరికాలో స్థిరపడిన ఆయన ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్ బఫెలోలో రీసెర్చ్ ప్రొఫెసర్‌గా సేవలందిస్తున్నారు. కలకత్తా మ్యాథమెటికల్ సొసైటీలో ప్రచురితమైన సీఆర్ రావు పరిశోధన పత్రానికిగాను ఈ అవార్డు దక్కింది. ప్రతి రెండేళ్లకు ఒకసారి ఈ అవార్డును అందజేస్తారు. 2019లో అమెరికాకు చెందిన ప్రొఫెసర్ బ్రాడ్లీ ఎఫ్రాన్, 2021కి అమెరికాకు చెందిన ప్రొఫెసర్ Emerita Nan Laird లకు అందజేశారు. (చదవండి: భార్యాపిల్లల గుర్తుగా చేసిన పనికి.. రూ. 90 కోట్లు అదృష్టం వరించింది!) 2023కి సీఆర్ రావుకు అవార్డు అందనుంది. భారత స్టాటిస్టిక్స్ రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా ప్రొఫెసర్ రావును భారత ప్రభుత్వం 1968లో పద్మభూషణ్, 2001లో పద్మవిభూషణ్‌తో సత్కరించింది. -
ఆమె కథ మన జీవిత కథ
ఆనీ ఎర్నౌ రచనలకు గానీ, శైలికి గానీ అంత ‘వాడి’ ఎక్కడిదంటే... ఎవరు చదువుతుంటే వాళ్లకు అది తమ కథలానే అనిపించడంతో అవి ఎప్పటికప్పుడు పదును తేలుతూ ఉంటాయి! రచయిత్రిగా ఆనీ పోరాటం, ఆమె రచనలు చదివే స్త్రీల పోరాటం వేర్వేరు కాదు. స్త్రీలు తమ శరీరాలపై అధికారాన్ని కలిగి ఉండటానికీ, పురుషులతో సమానంగా జీవించడానికీ చేసే పోరాటమే ఆమె రచనల సారం. ఒక తరం స్త్రీల ఉద్యమగానం అది. ఆమె రచనలన్నీ కూడా కల్పనలా అనిపించే స్వీయ వాస్తవానుభవాలే. సాహిత్యం, సామాజిక శాస్త్రం, చరిత్ర అనే మూడు కూడళ్ల నడుమ నిలబడి సమాజం మరుపున పడి ఉన్న వాళ్ల కోసం ఎలుగెత్తుతున్న స్వరం ఆనీ! సాహిత్యంలో ఇప్పటివరకు పదహారు మంది నోబెల్ గ్రహీతలతో అత్యధికంగా విజేతలను కలిగి ఉన్న దేశం ఫ్రాన్స్. వారిలో ఏకైక మహిళ ఆనీ ఎర్నౌ. 2022 సంవత్సరానికి గాను ఆనీ నోబెల్ విజేతగా నిలిచారు. ఆమె కంటే ముందు 2014లో ప్యాట్రిక్ మాడియానో, 2008లో జె.ఎం.జి. క్లెజియో ఈ ఘనత సాధించారు. ఫ్రాన్స్‌లోని నార్మాండీలో 1940లో జన్మించిన ఆనీ ఎర్నౌ నిరాడంబరమైన కుటుంబంలో పెరిగారు. జీవిక కోసం ఆమె తల్లిదండ్రులు నిత్యావసర వస్తువులను విక్రయించే దుకా ణాన్ని నడుపుతుండేవారు. తర్వాతి కాలంలో ఆ దుకాణం బార్గా, కెఫేగా విస్తరించింది. అక్కడికంతా శ్రామిక వర్గమే వస్తుండేది. తల్లి ప్రోత్సాహం, ప్రోద్బలంతో ఆనీ యూనివర్సిటీ స్థాయి వరకు విద్యను అభ్యసించి, అనంతరం టీచరుగా మారారు. రచయిత్రిగా మారారు. వర్గ వ్యత్యాసాలు, పితృస్వామ్య వ్యవస్థ, అసమానతలు వంటి విస్తృత సామాజిక అంశాలను తన రచనల్లో చర్చించారు. ఆనీ ఎర్నౌ తొలి నవల ‘క్లీన్డ్ ఆఫ్’ (ఫ్రెంచిలో లెజ్ ఆర్మ్వార్ విడేస్) 1974లో వచ్చింది. అయితే ఆమెకు గుర్తింపు వచ్చింది మాత్రం 1983లో వచ్చిన ‘ఎ మ్యాన్స్ ప్లేస్’తోనే. తల్లిదండ్రులు నడిపిన కెఫేలో తను ఎదుగుతున్నప్పటి జ్ఞాపకాలను అందులో రాసుకున్నారామె. తర్వాత 1987లో ‘ఎ ఉమన్ స్టోరీ’ అనే నవల రాశారు. అది ఆనీ తల్లి కథ. అక్కడి నుంచి అంతా రచనా ప్రవాహమే. 2008లో ‘ది ఇయర్స్’ పుస్తకం వచ్చే నాటికి కాలానుక్రమ వైయక్తిక స్మృతుల సమ్మేళనంగా అనేకానేక రచనల్ని చేశారు. ‘ది ఇయర్స్’ ఆనీ స్వీయ గాథ. ఆ నవల ఇంగ్లిష్‌లోకి అనువాదం కాగానే (లెజ్ అన్నీస్ అన్నది ఫ్రెంచి టైటిల్) ఆనీ పేరు సాహితీ ప్రపంచంలో మార్మోగిపోయింది. 1940లు, 90ల మధ్య కాలంలో ఒక స్త్రీ జీవితంలోని ఉత్థాన పతనాలను కథనపరచిన ఈ రచన... మూడో మనిషి చెబుతున్నట్లుగా ముందుకు సాగుతుంది. పాత ఫొటోలను, సినిమా జ్ఞాపకాలను జత పరుస్తూ బాల్యం నుంచి తల్లి అయ్యేవరకు తన జీవితాన్ని అందులో అక్షరబద్ధం చేశారు ఆనీ. 1960లలో తమ కుటుంబం ఎలా జీవించిందీ చెబుతూ, ‘‘మేమెంత సమయాన్ని పొదుపు చేశామో చూసుకుని ఆశ్చర్యపోయే వాళ్లం. సిద్ధంగా అందుబాటులో ఉండే మిరప పొడులతో మా సూప్ తయారయ్యేది. ప్రెస్టో ప్రెషర్ కుక్కర్‌తో త్వరత్వరగా వంట చేసే వాళ్లం. ‘యమోనైజ్’ అయితే రెడీమేడ్‌గా ట్యూబులలో దొరికేసేది. గుడ్డు పచ్చసొన, నూనె, నిమ్మరసం కలిపి తయారు చేసే ఈ మసాలా సాస్‌ను మేమెప్పుడూ సమయం వెచ్చించి సొంతంగా సిద్ధం చేసు కున్నది లేదు. బఠాణీలను తోటలోంచి తెంపుకొచ్చే పని లేకుండా క్యాన్లలో లభించేవాటిని ఇంట్లో తెచ్చి పెట్టుకునేవాళ్లం. చెట్టుపై పండే బేరీ పండ్లను కాకుండా బేరీ పండ్ల సిరప్‌ను వాడేవాళ్లం. జీవితం ఎంత సరళం అయిపోయింది! అదంతా కూడా శతాబ్దాల ప్రయాసలను తుడిచిపెట్టేసే అద్భుతమైన ఆవిష్కరణల ఫలితమే. ఒకరోజు వస్తుంది.. మనమిక ఏదీ చేసుకునే పని లేకుండా’’ అని రాశారు ఆనీ. 1967 గురించి, గర్భ నిరోధక మాత్రల చట్టబద్ధత గురించి చెబుతూ– ‘‘ఆ మాత్రలు జీవితాన్ని ఒక్కసారిగా మార్చేస్తాయని మేము భావించాం. భీతిగొలిపే మా దేహాల నుంచి మాకు విముక్తి లభిస్తుం దనీ, మగవాళ్లకు ఉన్నంత స్వేచ్ఛ ఆ మాత్రలతో మాకూ వచ్చేస్తుందనీ అనుకున్నాం’’ అని రాసుకున్నారు. తన దేశ పౌరురాలికి సాహిత్యంలో నోబెల్ వచ్చిందని తెలియగానే, ఫ్రాన్స్ అధ్యక్షులు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్ ఇలా ట్వీట్ చేశారు. ‘‘గత యాభై ఏళ్లుగా ఆనీ ఎర్నౌ దేశ క్రమానుగతులతో పాటు దేశంలోని ప్రజా సమూహాల చారిత్రక జ్ఞాపకాలను అక్షరీకరిస్తున్నారు’’ అని ప్రశంసించారు. ఆనీ రచనా శైలి కత్తిలా పదునైనది. ‘కత్తి పదునులా రాయడం’ పేరుతో 2003లో ఆమె ఒక వ్యాసం కూడా రాశారు. ఆమె రచనలకు గానీ, శైలికి గానీ అంత పదును ఎక్కడిదంటే... ఎవరు చదువుతుంటే వాళ్లకు అది తమ కథలానే అనిపించడంతో అవి పదునెక్కుతాయి. రచయిత్రిగా ఆనీ పోరాటం, ఆమె రచనలు చదివే స్త్రీల పోరాటం వేర్వేరు కాదు. స్త్రీలు తమ శరీరాలపై అధికారాన్ని కలిగి ఉండటానికీ, పురుషులతో సమానంగా జీవించడానికీ చేసే పోరాటమే ఆనీ రచనల్లోని పోరాటం కూడా. ఒక తరం స్త్రీల ఉద్యమగానం అది. ఆమె రచనలన్నీ కూడా కల్పనలా అనిపించే స్వీయ వాస్తవానుభవాలే. ఫ్రాన్స్‌లో గర్భవిచ్ఛిత్తిపై నిషేధం ఉన్నకాలంలో 2000 సంవత్సరంలో ఆమె ‘హ్యాపెనింగ్’ నవల రాశారు. ఆ నవలను అదే పేరుతో ఆడ్రీ దివాన్ సినిమాగా తీశారు. గత ఏడాది విడుదలైన ఆ సినిమా 2021 వెనిస్ చలన చిత్రోత్సవంలో ‘గోల్డెన్ లయన్’ అవార్డు గెలుచుకుంది. సూపర్ మార్కెట్ సంస్కృతి దృక్కోణం నుంచి ఆనీ 2014 లో రాసిన నవల ‘రిగార్డ్లెస్ ల్యూమినరీస్’ సామాజిక అసమానతల్ని సునిశి తంగా పరిశీలించింది. ఈ ఏడాదే విడుదలైన ఆమె కొత్త పుస్తకం ‘జ్యాన్ ఓమె’ తన కన్నా 30 ఏళ్లు చిన్నవాడైన వ్యక్తితో ఆమెకున్న సాన్నిహిత్యం గురించి దాపరికం లేకుండా చెబుతుంది. సాహిత్యం, సామాజిక శాస్త్రం, చరిత్ర అనే మూడు కూడళ్ల నడుమ నిలబడి సమాజం మరుపున పడిపోయిన వాళ్ల కోసం, అసమానతలపై మూగ సాక్షులుగా మిగిలిపోయిన బాధితులకోసం ఎలుగెత్తుతున్న స్వరం ఆనీ ఎర్నౌ. ప్రఖ్యాత ఫ్రెంచి రచయిత మార్సెల్ ప్రూస్ట్ రచనా సంవిధానానికి ప్రూస్టియన్ స్టెయిల్ అని పేరు. కోల్పోయిన గతాన్ని పునరుద్ధరించే, అపస్మారక జ్ఞాపకశక్తిని ప్రేరేపించే గుణం కలిగి ఉండే ఆయన ధోరణే ఆనీ రచనల్లోనూ కనిపిస్తుంది. సమయం గడిచేకొద్దీ కనుమరుగైపోయే జ్ఞాపకాలను అంటి పెట్టుకుని ఉండేందుకు తన రచనను ఒక మార్గంగా ఆమె నిర్మించుకున్నారు. ‘‘ఒక్క సెకనులో అంతా తుడిచి పెట్టుకు పోతుంది. ఊయలకు, మరణశయ్యకు మధ్య పేరుకుపోయిన పదాల నిఘంటువు పక్కకు ఒరిగిపోతుంది. ఇక మిగిలింది నిశ్శబ్దం. మాటలకు పదాలు ఉండవు. ‘నేను’, ‘నాకు’ అనేవి నోటిలోంచి బయ టికి రావు. నలుగురు చేరి నవ్వుకునే వేళ తరాల విస్తారమైన అనామ కత్వంలోకి అదృశ్యం అయ్యే వరకు మనం మన పేరు తప్ప మరేమీ కాదు... మన పేరును ఎవరైనా ఒక కాగితం మీద పెట్టేవరకు’’ అని రాస్తారామె. ఫ్రెంచి సామాజిక శాస్త్రవేత్త పియర్ బోర్డ్యూ ‘‘కళంకానికి గురైనవారికి జ్ఞాపకశక్తి అధికం’’ అంటారు. అవమానం జరిగిన జ్ఞాపకాలను అస్సలు మర్చిపోలేము. 1997లో ఆనీ రాసిన ‘షేమ్’ పుస్తకంలోని కథాంశం ఇదే. భారతీయ దళిత రచయితలు రాసిన కొన్ని పుస్తకాలను కూడా ఆమె చదివారు. ఓం ప్రకాశ్ వాల్మీకి రాసిన ‘జూఠన్ : యాన్ అన్‌టచబుల్ లైఫ్’ వాటిలో ఒకటి. ఇటీవలే ఈ పుస్తకం ఫ్రెంచిలోకి తర్జమా అయింది. అదొక ప్రామాణికమైన అత్మకథ. ముల్క్ రాజ్ అనంద్ రచనలు కూడా ఆమెకు సుపరిచితమే. మరికొన్ని నెలల్లో ఢిల్లీలో వరల్డ్ బుక్ ఫెయిర్ జరగబోతోంది. ఆనీ ఎర్నౌ నోబెల్ గెలుచుకున్న సందర్భం ఒక్కటే కాదు... ఇండియా గౌరవ అతిథిగా ఫ్రాన్స్ ఆ పుస్తక ప్రదర్శనకు వస్తుండటం, 20 కంటే ఎక్కువ మంది ఫ్రెంచి రచయితల బృందం హాజరవుతుండటం కూడా బుక్ ఫెయిర్‌కు మరింత ప్రాధ్యాన్యం తెచ్చింది. ‘పి.ఎ.పి. (పబ్లికేషన్ అసిస్టెంట్ ప్రోగ్రామ్) టాగోర్’ పేరుతో ఇండియా, రొమెయిన్ రోలాండ్ అవార్డ్’ (అపీజే ఆక్స్ఫర్డ్ బుక్ స్టోర్స్ భాగస్వామ్యంతో ఉత్తమ అనువాదానికి ప్రదానం చేసే అవార్డు)తో ఫ్రాన్స్ ఈ పుస్తక ప్రదర్శనలో ఇచ్చుకోబోయే పరస్పర ప్రచురణ సహకారంతో మరిన్ని ఫ్రెంచి పుస్తకాలు భారతీయ భాషల్లోకి తర్జుమా అయ్యే అవకాశం కలుగుతుందని మనం ఆశించవచ్చు. యాదృచ్ఛికమే అయినా ఇక్కడ ఒక విశేషాన్ని గమనించాలి. టాగోర్ (1913), రొమెయిన్ రోలాండ్ (1915) ఇద్దరూ సాహిత్యంలో నోబెల్ గ్రహీతలే. ఎమ్మాన్యుయేల్ లెనెయిన్ వ్యాసకర్త ఇండియాకు ఫ్రాన్స్ రాయబారి (‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ సౌజన్యంతో) -
నోబెల్ బహుమతికి మోదీ అర్హులే!: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ నోబెల్ బహుమతికి అర్హులే.. మరి ఏ కేటగిరీలో దక్కొచ్చునని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. కోవిడ్ వ్యాక్సిన్‌ను కనుగొన్నందుకు మెడిసిన్ విభాగంలో ఇవ్వాలా..? నోట్ల రద్దు, స్విస్ బ్యాంకుల్లో నల్లధనం తీసుకొచ్చినందుకు ఆర్థికశాస్త్రంలో ఇవ్వాలా..? రష్యా–ఉక్రె యిన్ యుద్ధాన్ని ఆరు గంటలు ఆపినందుకు శాంతి విభాగంలో ఇవ్వాలా..? రాడార్ థియరీకి ఫిజిక్స్‌లో ఇవ్వాలా? అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. అంతకుముందు కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి తన ప్రసంగంలో కోవిడ్ వ్యాక్సిన్‌ను మొట్టమొదట ప్రధాని మోదీ కను గొన్నారని చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందిస్తూ ‘సైన్స్/మెడిసిన్‌లో నోబెల్ బహుమతిని ప్రధానికి ఇవ్వాలని డిమాండ్ చేద్దామని’.. ఎద్దేవా చేస్తూ ట్వీట్ చేశారు. ‘కేంద్ర కేబినెట్లో అందరూ తెలివిమంతులేనని.. ముఖ్యంగా కిషన్ రెడ్డి’.. అంటూ వ్యాఖ్యానించారు. ఆస్కార్ కాకపోయినా భాస్కర్ అవార్డు ఇవ్వాల్సిందే అంటూ ప్రధాని మోదీని ఉద్దేశించి మరో వెటకారపు ట్వీట్ చేశారాయన. Modi Ji deserves Nobel prize but in which category? ❇️ Nobel for Medicine - discovering Covid Vaccine ❇️ Nobel for Economics - Demonetisation & Swiss Black Money Returns ❇️ Nobel for Peace - Stopping the Russia-Ukraine war for 6 hours ❇️ Nobel for Physics - Radar Theory — KTR (@KTRTRS) October 17, 2022 To all those BJP folks who feel that Vish Guru deserves more than a Nobel👇 I would also like to nominate Modi Ji of 2013 for his amazing histrionics & theatrical skills in criticising the then Union Govt on Rupee devaluation ఆస్కార్ కాకపోయినా భాస్కర్ అవార్డు ఇవ్వాల్సిందే 👍 pic.twitter.com/QceFay8eVS — KTR (@KTRTRS) October 17, 2022 ఇదీ చదవండి: తెలంగాణను అప్పుల కుప్పగా మార్చారు! -
ఆర్థికశాస్త్రంలో నోబెల్: ఈ ఏడాది ముగ్గురికి పురస్కారం
స్టాక్‌హోమ్: ఆర్థిక వ్యవస్థలో బ్యాంకుల పాత్రను వివరించడంలో చేసిన కృషికి గాను ఈ ఏడాది ముగ్గురికి నోబెల్ పురస్కారం లభించింది. అమెరికాకు చెందిన బెన్ బెర్నాంకే, డగ్లస్ డైమండ్ , ఫిలిప్ డైబ్విగ్లకు సోమవారం నోబెల్ బహుమతిని ప్రదానం చేశారు. బ్యాంకులు, ఆర్థిక సంక్షోభాలపై ఈ ముగ్గురి పరిశోధనలకు గాను రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఈ అవార్డును ప్రకటించింది. ఆర్థిక వ్యవస్థలో బ్యాంకుల పాత్ర, ముఖ్యంగా ఆర్థిక సంక్షోభాల సమయంలో, అలాగే ఆర్థిక మార్కెట్లను ఎలా నియంత్రించాలనే దానిపై అవగాహనను గణనీయంగా మెరుగుపరిచినందుకు ఈ అవార్డుకు ఎంపిక చేసినట్టు జ్యూరీ పేర్కొంది. ఆర్థిక సంక్షోభాల వేళ బ్యాంకుల పాత్ర ఎంత ముఖ్యమైందన్న విషయాన్ని ఈ ముగ్గురూ తమ పరిశోధనల్లో వెల్లడించారు..బ్యాంకులు దివాళా తీయకుండా ఉండేందుకు ఈ స్టడీ చాలా కీలకమైందని పేర్కొంది. BREAKING NEWS: The Royal Swedish Academy of Sciences has decided to award the 2022 Sveriges Riksbank Prize in Economic Sciences in Memory of Alfred Nobel to Ben S. Bernanke, Douglas W. Diamond and Philip H. Dybvig “for research on banks and financial crises.”#NobelPrize pic.twitter.com/cW0sLFh2sj — The Nobel Prize (@NobelPrize) October 10, 2022 -
Annie Ernaux: స్వీయ అనుభవాలే సాహిత్యం
ఆనీ ఎర్నౌకు 23 ఏళ్లు ఉండగా అవాంఛిత గర్భం వచ్చింది. దాంతో చట్టవిరుద్ధంగా అబార్షన్ చేయించుకోవాల్సి వచ్చింది. ఇది జరిగింది 1963లో. 1999లో ఈ అనుభవాన్ని ఆమె నవలగా రాసింది. 130 పేజీల ఈ నవల 2000 సంవత్సరంలో ‘హ్యాపెనింగ్’ పేరుతో వెలువడి సంచలనం రేపింది. కాల్పనిక సాహిత్యం రాసే ఫ్రెంచ్ రచయిత్రి ఆనీ ఎర్నౌ ఆ రకమైన సాహిత్యాన్ని వదిలిపెట్టి స్వీయ జీవితంలోని పరాభవాలు, ఆందోళనలు దాపరికం లేకుండా రాయడం కూడా సాహిత్యమేనని గ్రహించింది. 2022 సంవత్సరానికి ప్రతిష్టాత్మక నోబెల్ ప్రెయిజ్ గెలుచుకున్న ఆనీ ఎర్నౌ ఇంగ్లిష్‌లో రాయకున్నా ఈ బహమతి గెలుచుకున్న అతి కొద్దిమంది మహిళల్లో ఒకరు. ఆమె గురించి... ఆమె పుస్తకాల గురించి... ‘ఇది పురుషాధిక్య ప్రపంచం. దీనిని బోనెక్కించాల్సిన సమయం వచ్చినప్పుడు బోనెక్కించాల్సిందే’ అంటుంది 82 సంవత్సరాల ఫ్రెంచ్ రచయిత్రి ఆనీ ఎర్నౌ. తన జీవితంలో జరిగిన ఒక సంఘటన– చట్ట విరుద్ధంగా అబార్షన్ చేయించుకోవాల్సి రావడాన్ని– 1999లో ఫ్రెంచ్‌లో ‘ఇవెన్మో’ పేరుతో నవలగా రాస్తే మరుసటి సంవత్సరం అది ‘హ్యాపెనింగ్’ పేరుతో ఇంగ్లిష్‌లో అనువాదం అయ్యి వెలువడింది. ఆ సందర్భంగా ఆనీ ఎర్నౌ అన్న మాట అది. ‘నా జీవితంలో నాకు జరిగింది రాయడం ఎందరో స్త్రీలకు గొంతునివ్వడమే’ అని ఆమె అంది. ‘నాకు అవాంఛిత గర్భం వచ్చినప్పుడు అది నా వ్యక్తిగతమైన విషయంగా మిగల్లేదు. బయటపడితే నా కుటుంబం మొత్తం సామాజిక నీతిలో విఫలమైందన్న విమర్శను మోయాల్సి వచ్చేది’ అంటుందామె. కాకతాళీయమే అయినా ఇండియాలో అబార్షన్ గురించి సుప్రీంకోర్టు స్త్రీలకు సంపూర్ణ హక్కులు ఇచ్చిన సందర్భంలోనే అబార్షన్ గురించి, స్త్రీల దైహిక వేదనల గురించి, మనో సంఘర్షణల గురించి, వారికి మాత్రమే ఎదురయ్యే అనుభవాల గురించి అది కూడా శ్రామిక వర్గ కోణం నుంచి విస్తృతంగా రాసిన ఆనీ ఎర్నౌకు నోబెల్ సాహిత్య బహుమతి లభించింది. ఇప్పటి వరకు 119 మంది నోబెల్ సాహిత్య బహుమతి లభిస్తే వారిలో కేవలం 16 మందే స్త్రీలు. ఆనీ ఎర్నౌ 17వ రచయిత్రి. బాల్యం నుంచి గుణపాఠాలే ఫ్రాన్స్‌లోని ఇవెట్తో అనే ఊళ్లో చిన్న పచారీ కొట్టు నడిపేవారు ఆనీ తల్లిదండ్రులు. తండ్రికి పట్టకపోయినా జీవితాలు మారాలంటే చదువు ముఖ్యం అని ఆమె తల్లి గట్టిగా భావించింది. దాంతో తమ స్థాయికి చెందకపోయినా కాస్త మంచిబడిలో ఆనీని చేర్పించింది. ఆ బడికి కలిగిన పిల్లలు వచ్చేవారు. ‘అక్కడే నాకు తొలిపాఠం తెలిసింది. శ్రామిక వర్గానికి దక్కే మర్యాదలు కూడా తెలిశాయి. నిన్ను నువ్వు చిన్నబుచ్చుకుంటూ బతకాల్సి రావడం కంటే ఘోరమైన విషయం లేదు. మన స్థాయికి మించిన విషయాల్లో అడుగు పెట్టకూడదని నాకు గట్టిగా అందిన సందేశం అందింది’ అంటుందామె. ఆమె తన స్వీయానుభవాల ఆధారంగా ‘ఏ గర్ల్స్ స్టోరీ’ (2016) అనే నవల రాసింది. ‘18 ఏళ్ల అమ్మాయి స్టూడెంట్స్ క్యాంప్‌లో లైంగిక అనుభవం పొందితే అది సంతోషకరంగా ఉండాలి. కాని ఇది తెలిసిన వెంటనే మగ విద్యార్థులు ఆ అమ్మాయిని గేలి చేశారు. ఆమె అద్దం మీద అసభ్యకరంగా రాసి వెక్కిరించారు. ఎన్నాళ్లు గడిచినా నైతికంగా పతనమైన భావనను కలిగించారు’ అని రాసిందామె. చదువు ముగిశాక ఆమె టీచర్‌గా మారి ఆనీ ఎర్నౌ 2000 సంవత్సరంలో రిటైరయ్యి పూర్తికాలం రచయిత్రిగా రచనలు కొనసాగిస్తూ ఉంది. సూటిగా, సులభంగా ఆనీ ఎర్నౌ రచనా శైలి సూటిగా సులభంగా ఉంటుంది. నేరుగా పాఠకులకు అందేలా ఆమె వచనశైలి ఉంటుంది. నోబెల్ కమిటీ కూడా ఇదే మాట అంది. ‘ఆమె సాహిత్యం అత్యంత సాధారణ భాషలో అత్యంత పరిశుభ్రంగా ఉంటుంది’ అని అభిప్రాయపడింది. ఆనీ ఎర్నౌ రాసిన పుస్తకాల్లో ‘క్లీన్డ్ ఔట్’ (1974), ‘షేమ్’ (1997), ‘గెటింగ్ లాస్ట్’ (2001), ‘ది ఇయర్స్’ (2008) ముఖ్యమైనవి. 1988లో పారిస్‌లో ఉద్యోగం చేస్తున్న ఒక సోవియెట్ దౌత్యవేత్తతో ఆనీ ఎర్నౌ బంధం ఏర్పరుచుకుంది. అతడు ఆమె కంటే 12 ఏళ్లు చిన్నవాడు. కొంత కాలానికి ఆ బంధం ముగిసింది. ఆ సమయంలో తన భావోద్వేగాలను ‘గెటింగ్ లాస్ట్’ పేరుతో నవల రాసిందామె. అలాగే తన గురించి, ఫ్రాన్స్ సమాజం గురించి రెండో ప్రపంచ యుద్ధం నాటి నుంచి ఇటీవలి కాలం వరకూ జరిగిన ఘటనలను ‘ది ఇయర్స్’గా రాసింది. ఒక రకంగా ఇది స్వీయ చరిత్ర, ఫ్రాన్స్ చరిత్ర కూడా. స్త్రీ పక్షపాతి ఆనీ ఎర్నౌ తనను తాను ‘రచనలు చేసే మహిళ’గా చెప్పుకున్నా ఆమె స్త్రీ పక్షపాతి. స్త్రీవాద ఉద్యమానికి ప్రోత్సాహకురాలు. ‘రాజకీయాలు భ్రష్టుపట్టిన ఈ సమయంలో ఫెమినిస్టులే సరిహద్దులను ప్రశ్నిస్తూ కొత్త ఆలోచనలను చేస్తూ ఆశలు రేకెత్తిస్తున్నారు’ అంటుందామె. ఇటీవల జరిగిన మీటూ ఉద్యమం ఆమెకు చాలా సంతోషాన్నిచ్చింది. ‘తమతో ఎలాగైనా వ్యవహరించవచ్చనే స్థితిని స్త్రీలు ఇక మీద ఏ మాత్రం అంగీకరించరు’ అంటారామె. ‘నేను రాయగలను కాబట్టే నాకు వినూత్న అనుభవాలు ఎదురవుతున్నాయి’ అని చెప్పుకున్న ఆనీ రాయగలిగే మహిళలంతా తమ జీవన అనుభవాలను బెరుకు లేకుండా చెప్పడాన్ని ప్రోత్సహిస్తుంది. అప్పుడే స్త్రీలు, స్త్రీలతో ఉన్న సమాజం మరింత మెరుగ్గా అర్థమవుతాయి. స్వీయ అనుభవాలే రచనలు ఆనీ ఎర్నౌ ఏవో ఊహించి కథలు అల్లడం కన్నా తన జీవితంలో జరిగినవే రాయాలని నిర్ణయం తీసుకుంది. దాంతో ఆమె జ్ఞాపకాల రచయిత్రి అయ్యింది. మన జీవితంలో జరిగినదాన్ని రాయడం వల్ల మిగిలినవారు పోల్చుకోవడానికో, సహానుభూతి చెందడానికో అది ఉపయోగపడుతుంది అంటుందామె. మనుషులు వేరే చోట్ల ఉన్నా వారు భావోద్వేగాలు ఒకటే కదా. ఆనీ ఎర్నౌ రాసిన ‘హ్యాపనింగ్’ నవల ఒక కాలపు ఫ్రాన్స్‌లో స్త్రీల సంఘర్షణను సూటిగా నిలపడంతో ఆమెకు ప్రశంసలు వచ్చాయి. 1963లో ఆమె అబార్షన్ చేయించుకోవాల్సి వస్తే ఆ తర్వాత 12 ఏళ్లకు కాని ఫ్రాన్స్‌లో (అవివాహితులకు) అబార్షన్‌ను చట్టబద్ధం చేయలేదు. ‘అబార్షన్ హక్కు లేకపోవడం అంటే.. చట్టం, సంఘపరమైన నియమాలు వ్యక్తి స్వేచ్ఛను పూర్తిగా ధ్వంసం చేయడమే’ అంటుందామె.