Chinese Demands Nobel Prize For Wuhan Lab: వుహాన్‌ ల్యాబ్‌కు నోబెల్‌ ప్రైజ్‌ ఇవ్వాల్సిందే - Sakshi
Sakshi News home page

వుహాన్‌ ల్యాబ్‌కు నోబెల్‌ ప్రైజ్‌ ఇవ్వాల్సిందే: చైనా

Published Fri, Jun 25 2021 11:40 AM

China Demands its Wuhan Lab be Awarded Nobel Prize for Covid Research - Sakshi

బీజింగ్‌: కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైన నాటి నుంచి చైనా వుహాన్‌ ల్యాబ్‌ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. డ్రాగన్‌ దేశం వుహాన్‌ ల్యాబ్‌లోనే కరోనా వైరస్‌ను సృష్టించి.. ప్రపంచం మీదకు వదిలిందిని పలు దేశాలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చైనా ఓ వింత ప్రతిపాదనను తెర మీదకు తీసుకు వచ్చింది. కరోనా వైరస్‌కు సంబంధించి వుహాన్‌ ల్యాబ్‌ ఎన్నో పరిశోధనలు చేస్తుందని.. దీన్ని పరిగణలోకి తీసుకుని.. వుహాన్‌ ల్యాబ్‌కు ఈ ఏడాది నోబెల్‌ ప్రైజ్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేసింది. 

ఇటీవల నిర్వహించిన ఓ మీడియా సమావేశంలో చైనా విదేశాంగ శాఖ అధికారి ప్రతినిధి జౌ లిజియాన్‌ మాట్లాడుతూ.. ‘‘కరోనా వైరస్‌ అధ్యయనంలో వుహాన్‌ ల్యాబ్‌ కృషిని గుర్తిస్తూ మెడిసిన్‌ విభాగంలో నోబెల్‌ ప్రైజ్‌ ఇవ్వాలి’’ అని డిమాండ్‌ చేశారు. ఇప్పటికే చైనా ప్రభుత్వం వుహాన్‌ ల్యాబ్‌కి ఆ దేశ అత్యుత్తమ సైన్స్‌ అవార్డును ప్రధానం చేసింది. కరోనా వైరస్‌ జీనోమ్‌ని గుర్తించడంలో వుహాన్‌ ల్యాబ్‌ చేసిన కృషికి గాను చైనీస్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ దానికి అవుట్‌స్టాండింగ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ అచీవ్‌మెంట్‌ ప్రైజ్‌ 2021ని ప్రకటించింది. 

‘‘కోవిడ్‌ జీనోమ్‌ సిక్వేన్స్‌ని తొలుత వుహాన్‌ ల్యాబ్‌ గుర్తించింది. అంటే దానర్థం ఈ వైరస్‌ ఇక్కడ నుంచే వ్యాప్తి చెందిందని.. లేదంటే మా దేశ శాస్త్రవేత్తలే దానిని తయారు చేసినట్లు కాదు’’ అన్నారు లిజియాన్‌. డ్రాగన్‌ డిమాండ్‌పై చైనా వైరాలిజిస్ట్‌, డాక్టర్‌ లి మెంగ్‌ యాన్‌ స్పందించారు. వుహాన్‌కు నోబెల్‌ ప్రైజ్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేయడం చాలా హాస్యాస్పదంగా ఉంది అన్నారు. కరోనా వుహాన్‌ ల్యాబ్‌ నుంచి లీకైందని తెలిపిన వారిలో యాన్‌ కూడా ఒకరు.

ఇక చైనా డిమాండ్‌పై సోషల్‌ మీడియాలో సెటైర్లు ఓ రేంజ్‌లో పేలుతున్నాయి. ‘‘ఒకవేళ వుహాన్‌ ల్యాబ్‌కి మెడిసిన్‌ విభాగంలో నోబెల్‌ ప్రైజ్‌ ఇస్తే.. ఐసీస్‌కి నోబెల్‌ శాంతి బహుమతి ఇవ్వాల్సి ఉంటుంది’’.. ‘‘అవును మన జీవితాలను నాశనం చేయడానికి వుహాన్‌ ల్యాబ్‌ ఎంతో కష్టపడి కరోనాను అబివృద్ధి చేసింది. ఆ కృషిని గుర్తించి దానికి నోబెల్‌ ప్రైజ్‌ ఇవ్వాల్సిందే.. ప్రతి దేశం దీనికి మద్దతివ్వాల్సిందే’’ అంటూ కామెంట్‌ చేస్తున్నారు నెటిజనులు.

చదవండి: కరోనా గుట్టు.. చైనా మెడకు బిగుస్తున్న ఉచ్చు!

Advertisement
 
Advertisement
 
Advertisement