
స్టాక్‌హోమ్: 2018 సంవత్సరానికి గాను సాహితీ రంగంలో నోబెల్ బహుమతి పురస్కారం వాయిదాపడింది. 1949 తర్వాత సాహిత్యంలో నోబెల్ వాయిదాపడటం ఇదే ప్రథమం. పురస్కార గ్రహీతలను ఎంపిక చేసే స్వీడిష్ కమిటీ సభ్యురాలి భర్తపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావటం ఈ పరిణామానికి దారి తీసింది. ‘ఈ పరిస్థితుల్లో ప్రజల విశ్వాసాన్ని తిరిగి పొందేందుకు సమయం అవసరమని భావిస్తున్నాం. ఈ ఏడాది పురస్కారాన్ని 2019 సాహితీ పురస్కారంతో కలిపి ఇవ్వాలని నిర్ణయించాం’అని అకాడెమీ తాత్కాలిక కార్యదర్శి ఆండెర్స్ చెప్పారు.
స్వీడన్ సాహితీ రంగంలో పలుకుబడి ఉన్న జీన్ క్లౌడ్ ఆర్నాల్ట్ తమపై లైంగిక వేధింపులు, అత్యాచారం, లైంగిక దాడులకు పాల్పడ్డారంటూ 18 మంది మహిళలు గత ఏడాది నవంబర్‌లో ప్రపంచ వ్యాప్తంగా ప్రారంభమైన ‘మీ టూ ప్రచారోద్యమం’లో ఆరోపణలు చేశారు. కవయిత్రి, నోబెల్ సాహితీ పురస్కారాల ఎంపిక కమిటీ సభ్యురాలు అయిన క్యాథరినా ఫ్రోస్టెన్సన్ భర్తే ఆర్నాల్ట్. విజేతల పేర్లను ముందే చెప్పేస్తున్నారని కొందరు కమిటీ సభ్యులపై ఆరోపణలొచ్చాయి. అలజడి రేపిన ఈ పరిణామాలు ఎంపిక కమిటీలో విభేదాలకు ఆజ్యం పోసింది. దీంతో కమిటీ శాశ్వత కార్యదర్శి డేరియస్‌తోపాటు ఆరుగురు సభ్యులు రాజీనామా చేశారు. ‘నోబెల్ బహుమతి విశిష్టతను, గొప్పతనాన్ని కాపాడతామనీ, త్వరలోనే పూర్తిస్థాయి కమిటీని నియమించి, ఎంపికలు కొనసాగిస్తామని స్వీడన్ రాజు కార్ల్ గుస్తావ్ ప్రకటించారు.
జీన్ క్లౌడ్ ఆర్నాల్ట్
Comments
Please login to add a commentAdd a comment