ఎలైస్ మన్రోకు సాహిత్యంలో నోబెల్ | alice munro wins nobel literature prize | Sakshi
Sakshi News home page

ఎలైస్ మన్రోకు సాహిత్యంలో నోబెల్

Published Fri, Oct 11 2013 12:38 AM | Last Updated on Tue, Aug 27 2019 4:33 PM

ఎలైస్ మన్రోకు సాహిత్యంలో నోబెల్ - Sakshi

ఎలైస్ మన్రోకు సాహిత్యంలో నోబెల్

కెనడా చెహోవ్‌గా గుర్తింపు పొందిన రచయిత్రి
సాహిత్యంలో నోబెల్ పొందిన 13వ మహిళ...
ఈ బహుమతి పొందిన తొలి కెనడా మహిళగా ఘనత


స్టాక్‌హోమ్: ప్రముఖ కెనడా రచయిత్రి ఎలైస్ మన్రో (82) సాహిత్యంలో నోబెల్ బహుమతికి  ఎంపికయ్యారు. స్వీడిష్ అకాడమీ మన్రోను ఈ బహుమతికి ఎంపిక చేసినట్లు గురువారం ప్రకటించింది. కథా రచయిత్రిగా ప్రఖ్యాతి పొందిన ఎలైస్ మన్రోను స్వీడిష్ అకాడమీ సమకాలీన కథానికా నిష్ణాతురాలిగా అభివర్ణించింది. కథా రచనలో ఆమె కనపరచిన మానసిక వాస్తవికత, స్పష్టత సాటి లేనివంటూ శ్లాఘించింది. ఎలైస్ మన్రోను కొందరు విమర్శకులు కెనడియన్ చెహోవ్‌గా అభివర్ణిస్తారు. చిన్న చిన్న పట్టణాల్లోని సామాజిక వాతావరణాన్ని, మానవ సంబంధాలను, నైతిక సంఘర్షణలను తన కథల్లో చిత్రించిన ఎలైస్ మన్రో సాహిత్యంలో నోబెల్ బహుమతి పొందిన వారిలో 13వ మహిళ కావడంతో పాటు మొట్టమొదటి కెనడా మహిళ కావడం విశేషం. స్టాక్‌హోంలో డిసెంబర్ 10న జరగనున్న కార్యక్రమంలో ఆమె ఈ బహుమతి కింద 8 మిలియన్ల స్వీడిష్ క్రోనర్లు (రూ.7.64 కోట్లు) అందుకోనున్నారు. ఇదిలా ఉండగా, తనకు నోబెల్ బహుమతిని ప్రకటించడంపై ఎలైస్ మన్రో హర్షం వ్యక్తం చేశారు. నోబెల్ బహుమతి కోసం తన పేరు పరిశీలనలో ఉన్న విషయం తనకు తెలుసునని, అయితే, తనకు బహుమతి లభిస్తుందని ఊహించలేదని ఆమె అన్నారు.

కథల కాణాచి

కెనడా రచయిత్రి ఎలైస్ మన్రోను కథల కాణాచిగా చెప్పుకోవచ్చు. కథా వస్తువు కంటే కథ చెప్పే తీరుకే ప్రాధాన్యమిచ్చే శైలితో ఆమె అనతి కాలంలోనే సాహిత్య రంగంలో విశిష్ట స్థానాన్ని సంపాదించుకోగలిగారు. ఓంటారియోలోని వింగ్‌హామ్ ప్రాంతంలో 1931 జూలై 10న ఎలైస్ జన్మించారు. ఆమె తండ్రి రాబర్ట్ ఎరిక్ లెయిడ్‌లా ఒక రైతు. తల్లి ఏన్ క్లార్క్ లెయిడ్‌లా ఉపాధ్యాయురాలు. వెస్టర్న్ ఓంటారియో వర్సిటీలో ఇంగ్లీష్ ప్రధానాంశంగా చదువుకుంటున్న కాలంలోనే 1950లో ‘ది డెమైన్షన్స్ ఆఫ్ ఏ షాడో’ పేరిట తొలి కథ రాశారు. వర్సిటీలో చదువుకుంటూనే వెయిట్రెస్‌గా, లైబ్రరీ క్లర్క్‌గా పనిచేశారు. పొగాకు తోటల్లోనూ పొగాకు కోసే పని చేశారు. వర్సిటీని విడిచిపెట్టాక 1951లో జేమ్స్ మన్రోను పెళ్లాడారు. తర్వాత 1963లో మన్రో దంపతులు విక్టోరియాకు తరలిపోయారు. అక్కడే ‘మన్రో బుక్స్’ ప్రచురణ సంస్థను ప్రారంభించారు. జేమ్స్ నుంచి 1972లో విడిపోయాక, భౌగోళిక శాస్త్రవేత్త గెరాల్డ్ ఫ్రెమ్లిన్‌ను 1976లో పెళ్లాడారు. ‘డాన్స్ ఆఫ్ ది హ్యాపీ షేడ్స్’ పేరిట 1968లో వెలువరించిన తొలి కథా సంపుటి ఎలైస్ మన్రోకు అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చి పెట్టింది. ఈ పుస్తకానికి కెనడా గవర్నర్ జనరల్ అవార్డు లభించింది. ఆమెకు 2009లో మాన్ బుకర్ బహుమతి కూడా లభించింది. ‘ది న్యూయార్కర్’, ‘ది అట్లాంటిక్ మంత్లీ’, ‘గ్రాండ్ స్ట్రీట్’, ‘ది పారిస్ రివ్యూ’ వంటి పత్రికలు ఆమె రచనలను విరివిగా ప్రచురించాయి. 1980, 90లలో ఎలైస్ దాదాపు ప్రతి నాలుగేళ్లకు ఒక కథా సంపుటి చొప్పున వెలువరించారు. ఇవన్నీ ఆమెకు పలు అవార్డులు తెచ్చిపెట్టాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement