ఆస్తుల ధరల విశ్లేషణకు గుర్తింపు
స్టాక్‌హోం: ఆస్తుల ధరలను అనుభవపూర్వకంగా విశ్లేషించే విధానాన్ని ఆవిష్కరించిన ముగ్గురు అమెరికా ఆర్థిక శాస్త్రవేత్తలకు ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి దక్కింది. షేర్లు, బాండ్లు వంటి ధరలు రాబోయే కాలంలో ఎలా ఉంటాయో అంచనా వేసే పద్ధతిని కనిపెట్టిన ఈజెన్ ఫామా, లార్స్ పీటర్స్ హాన్సన్, రాబర్ట్ షిల్లర్‌లను 2013 ఏడాది గాను ఈ పురస్కారానికి ఎంపిక చేశామని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సెన్సైస్ సోమవారం వెల్లడించింది. ఫామా, హాన్సన్‌లు షికాగో వర్సిటీలో, షిల్లర్ యేల్ వర్సిటీలో పనిచేస్తున్నారు. షేర్లు, బాండ్ల ధరల ధోరణి రాబోయే కాలంలో ఎలా ఉంటుందో స్వానుభవ విశ్లేషణ ద్వారా అంచనా వేయొచ్చని వీరు ప్రతిపాదించారు. షేర్లు, నగదు, బ్యాంకు డిపాజిట్లు.. ఇలా ఏ రూపంలో డబ్బును పొదుపు చేయాలనేది వ్యక్తులు వేసే కష్ట నష్టాల అంచనాపై ఆధారపడి ఉంటుందని వీరు పేర్కొన్నారు. కాగా, షట్‌డౌన్ సమస్యతో అమెరికా అప్పులు చెల్లించలేక చేతులెత్తేస్తుందని తాననుకోవడం లేదని షిల్లర్ చెప్పారు.