పేదరికంపై పోరుకు నోబెల్‌ | Indian-American MIT Prof Abhijit Banerjee and wife win Nobel Prize | Sakshi
Sakshi News home page

పేదరికంపై పోరుకు నోబెల్‌

Published Tue, Oct 15 2019 3:03 AM | Last Updated on Tue, Oct 15 2019 8:43 AM

Indian-American MIT Prof Abhijit Banerjee and wife win Nobel Prize - Sakshi

స్టాక్‌హోమ్‌: ప్రపంచవ్యాప్తంగా పేదరికాన్ని నిర్మూలించడానికి వినూత్న కోణంలో పరిశోధనలు చేసి ఆర్థిక రంగంలో విప్లవాత్మక మార్పుల్ని తెచ్చినందుకు ప్రవాస భారతీయుడు అభిజిత్‌ బెనర్జీకి అర్థశాస్త్రంలో నోబెల్‌ పురస్కారం వరించింది. ఈ ఏడాది ఆర్థిక నోబెల్‌ పురస్కారాన్ని ముగ్గురికి ప్రకటించారు. అభిజిత్, ఆయన భార్య ఎస్తర్‌ డఫ్లో, మరో అమెరికన్‌ ఆర్థికవేత్త మైకేల్‌ క్రెమెర్‌లు సంయుక్తంగా ఈ అవార్డును అందుకోనున్నారు. భార్యతో కలిసి ఒక ప్రవాస భారతీయుడు అర్థశాస్త్రంలో నోబెల్‌ను దక్కించుకోవడం ఒక విశేషమైతే, ఆర్థిక శాస్త్రంలో నోబెల్‌ పురస్కారాన్ని పొందిన రెండో మహిళ డఫ్లో. ఈ పురస్కారం కింద తొమ్మిది లక్షల 18 వేల అమెరికా డాలర్ల నగదు, ఒక బంగారు పతకం, డిప్లొమా అందిస్తారు.

అమెరికన్‌ ఆర్థికవేత్త మైకేల్‌ క్రెమెర్‌

పురస్కారం కింద వచ్చే నగదు బహుమానాన్ని ముగ్గురు ఆర్థికవేత్తలు సమానంగా పంచుకుంటారు. ‘‘వీరు చేసిన పరిశోధనలు, ప్రతిపాదనలతో ప్రపంచవ్యాప్తంగా పేదరికాన్ని సమర్థమంతంగా ఎదుర్కొంటున్నాం. కేవలం రెండు దశాబ్దాల్లోనే ఆర్థిక రంగంలో స్పష్టమైన మార్పుల్ని , అభివృద్ధిని చూడగలుగుతున్నాం. అధ్యయనాలు చేయడానికి ఇప్పుడు ఈ రంగమే అత్యంత కీలకంగా ఉంది. ఎందరో అధ్యయనకారు లు ఈ ముగ్గురు అడుగుజాడల్లోనే నడుస్తూ పేదరికాన్ని పారద్రోలడానికి శక్తిమంతమైన ప్రతిపాదనలు చేస్తున్నారు’’ అని నోబె ల్‌ పురస్కారాన్ని ప్రకటించిన రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ ప్రకటించింది. వినూత్న ధోరణితో వీరు చేసిన అధ్యయనాలు పేదరికం నిర్మూలనకు  పరిష్కార మార్గాలను చూపించిందని కొనియాడింది.  

ప్రధాని అభినందనలు: ఆర్థిక నోబెల్‌కు ఎంపికైన ప్రవాస భారతీయుడు అభిజిత్‌ బెనర్జీకి  ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. పేదరిక నిర్మూలనలో బెనర్జీ గణనీయ కృషి చేశారన్నారు.

ఏపీ సీఎం జగన్‌ అభినందనలు
సాక్షి, అమరావతి: ఆర్థిక శాస్త్రంలో నోబెల్‌ బహుమతిని ఎస్తర్‌ డఫ్లో, మైఖేల్‌ క్రెమెర్‌తో కలిసి సంయుక్తంగా గెలుచుకున్నందుకు అభిజిత్‌ బెనర్జీకి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ట్విట్టర్‌లో అభినందనలు తెలిపారు. ప్రపంచంలోని పేదరికాన్ని నిర్మూలించడంలో వారు చేసిన కృషిని ఆయన కొనియాడారు.

భారత్‌ పుంజుకునే పరిస్థితి లేదు: అభిజిత్‌
కోల్‌కతా/న్యూయార్క్‌: భారత ఆర్థిక వ్యవస్థ పరిస్థితి అంత ఆశాజనకంగా ఏమీ లేదని అభిజిత్‌ బెనర్జీ వ్యాఖ్యానించారు. భారత ఆర్థిక వ్యవస్థ అస్థిరంగా ఉందన్న బెనర్జీ.. మళ్లీ పుంజుకునే అవకాశాలు కూడా కనుచూపు మేరలో కనిపించడం లేదని అమెరికాలోని ఒక న్యూస్‌ చానల్‌తో అన్నారు.

మళ్లీ నిద్రపోయా..: ‘నోబెల్‌ పురస్కారం ప్రకటించారన్న సమాచారం తెల్లవారు జామున ఒక ఫోన్‌కాల్‌ ద్వారా తెలిసింది. నేను ఉదయమే నిద్రలేచే వ్యక్తిని కాదు. అందుకే ఆ వార్త విన్న తరువాత మళ్లీ పడుకున్నాను. కానీ, వరస ఫోన్‌కాల్స్‌తో ఎక్కువసేపు నిద్ర పోలేకపోయాను’ అని బెనర్జీ వివరించారు. భార్యకు తనకు కలిపి నోబెల్‌ రావడంపై స్పందిస్తూ. ‘అది మరింత స్పెషల్‌’ అన్నారు. దంపతులిద్దరికీ నోబెల్‌ రావడం గతంలో ఐదు పర్యాయాలు జరిగింది.   

నోబెల్‌ భారతీయం  
► రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ (సాహిత్యం, 1913)
► సీవీ రామన్‌ (భౌతికశాస్త్రం, 1930)
► హర గోవింద్‌ ఖురానా (ఇండియన్‌      అమెరికన్‌), వైద్యం, 1968
► మదర్‌ థెరిసా (శాంతి పురస్కారం, 1979)
► సుబ్రహ్మణ్యన్‌ చంద్రశేఖర్‌ (ఇండియన్‌ అమెరికన్‌), భౌతికశాస్త్రం, 1983
► అమర్త్యసేన్‌ (ఆర్థికశాస్త్రం, 1998)
► వెంకటరామన్‌ రామకృష్ణన్,
(రసాయనశాస్త్రం, 2009)
► కైలాస్‌ సత్యార్థి (శాంతి పురస్కారం, 2014)
► అభిజిత్‌ బెనర్జీ (ఇండియన్‌ అమెరికన్‌), ఆర్థికశాస్త్రం, 2019


కోల్‌కతా వాసి
పశ్చిమబెంగాల్‌కు చెందిన ఆర్థికవేత్తలు ప్రొఫెసర్‌ నిర్మల, దీపక్‌ బెనర్జీలకు కోల్‌కతాలో 1961లో అభిజిత్‌ బెనర్జీ జన్మించారు. ఆయన విద్యాభ్యాసం అంతా భారత్‌లోనే సాగింది. కోల్‌కతా ప్రెసిడెన్సీ కాలేజీలో డిగ్రీ చేశారు. ఉన్నతాభ్యాసం కోసం అమెరికా వెళ్లి 1988లో హార్వర్డ్‌ యూనివర్సిటీ నుంచి ఆర్థికశాస్త్రంలో పీహెచ్‌డీ చేశారు. 2003లో ఎస్తర్‌ డఫ్లోతో కలిసి అబ్దుల్‌ లతీఫ్‌ జమీల్‌ పోవర్టీ యాక్షన్‌ ల్యాబ్‌ (జే–పాల్‌)ను స్థాపించారు. ప్రస్తుతం ప్రతిష్టాత్మక మాసాచూసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎంఐటీ)లో ఆర్థికశాస్త్రంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.

2015 తర్వాత అభివృద్ధి ఎజెండా అనే అంశంలో ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసిన హైలెవల్‌ ప్యానెల్‌ ఆఫ్‌ ఎమినెంట్‌ పర్సన్స్‌లో కూడా అభిజిత్‌ పనిచేశారు. ఫ్రాన్స్‌కు చెందిన ఎస్తర్‌ డఫ్లో ఎంఐటీ నుంచి ఆర్థిక శాస్త్రంలో పీహెచ్‌డీ చేశారు. విద్య, ఆరోగ్యం, ఆర్థికం, పర్యావరణం, పరిపాలన వంటి పలు రంగాల్లో పనిచేశారు. ప్రస్తుతం ఎంఐటీలో ప్రొఫెసర్‌గా ఉన్న ఆమె తనకు వచ్చిన ఈ అవార్డు ద్వారా మహిళా లోకం స్ఫూర్తి పొంది ఆర్థిక రంగంలో అద్భుతాలు చేయాలని పిలుపునిచ్చారు. 47 ఏళ్ల వయసుకే అవార్డు దక్కించుకొని అతి చిన్న వయస్కురాలిగా రికార్డు సృష్టించారు.  పురస్కారం పొందిన మరో ఆర్థికవేత్త 54 ఏళ్ల వయసున్న క్రెమర్‌ హార్వర్డ్‌ వర్సిటీలో ప్రొఫెసర్‌గా ఉన్నారు.

సూటి ప్రశ్నలు సంధిస్తూ.. 
అభిజిత్‌ బెనర్జీది మొదట్నుంచి సూటిగా ప్రశ్నలు వేసే తత్వం. వాటికి తగిన సమాధానాలు దొరికేవరకు ఆయన విస్తృతంగా అధ్యయనం చేసేవారు. ఇలాంటి వినూత్న ధోరణిని అవలంబించడం వల్లే ఆయనకు నోబెల్‌ పురస్కారం అంది వచ్చింది. ఒక ఆర్థికవేత్తగా అభిజిత్‌ ఎన్నో ఆర్టికల్స్‌ రాశారు. కొన్ని డాక్యుమెంటరీలు తీశారు. పలు పుస్తకాలు కూడా రచించారు. వాటిలో భార్య డఫ్లోతో కలిసి రచించిన పూర్‌ ఎకనామిక్స్‌ అనే పుస్తకం విశేషంగా గుర్తింపు పొందింది. 17 భాషల్లోకి అనువాదమైంది. 2011లో ఫైనాన్షియల్‌ టైమ్స్, గోల్డ్‌మ్యాన్‌ సాచ్స్‌ బిజినెస్‌ బుక్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డుల్ని గెలుచుకుంది.  


► మొరాకోలో ఒక వ్యక్తికి కడుపు నిండా తిండి లేకపోయినా టీవీ కొనుక్కోవాల్సిన అవసరం ఏమిటి ?
► దారిద్య్ర ప్రాంతాల్లో చిన్నారులు పాఠశాలలకు వెళ్లినా వారికి చదువు నేర్చుకోవడం ఎందుకు కష్టంగా మారుతోంది ?
►  గంపెడు మంది పిల్లలు ఉంటే నిరుపేదలుగా మారుతారా ? వంటి ప్రశ్నలకు సమాధానాలు దొరకడం దుర్లభం. చిత్తశుద్ధితో వీటికి సమాధానాలు దొరికే మార్గాలను వెతకాలి అని బెనర్జీ ఆ పుస్తకంలో పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement