పరిశోధనలపై పెట్టుబడులు పెరగాలి: ప్రణబ్ ముఖర్జీ
పాట్నా: ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త సి.వి. రామన్ ప్రపంచ అత్యున్నత పురస్కారమైన నోబెల్ బహుమతి అందుకొని 80 ఏళ్లకుపైగా గడిచినా దేశంలో మరెవరూ ఆ పతకాన్ని అందుకోలేకపోవడంపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ విచారం వ్యక్తం చేశారు. దేశం మళ్లీ నోబెల్ అందుకోవాలంటే పరిశోధన, సృజనాత్మక సాంకేతిక రంగాల్లో పెట్టుబడులు గణనీయంగా పెరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఐఐటీ పాట్నా స్నాతకోత్సవంలో పాల్గొన్న ఆయన విద్యార్థులను ఉద్దేశించి ఉపన్యసించారు. హర్‌గోవింద్ ఖురానా, చంద్రశేఖర్, అమర్త్యసేన్ లాంటి భారతీయులు నోబెల్ అందుకున్నా.. వారు స్థానిక సంస్థల్లో పరిశోధనలు చేయలేదని చెప్పారు.
ప్రపంచ వ్యాప్తంగా టాప్ 200 యూనివర్సిటీల్లో భారత్‌కు చోటు దక్కకపోవడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బీహార్ చరిత్రలో నలంద, విక్రమశిల, తక్షశిల లాంటి విశ్వవిద్యాలయాలు ప్రపంచానికి విద్యనందించాయని, అలాంటి శోభను మళ్లీ తీసుకురాలేమా అంటూ ప్రశ్నించారు. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యలో వినియోగించుకుంటే ప్రస్తుత పరిస్థితి నుంచి గట్టెక్కవచ్చని ఉద్బోధించారు. ఈ కార్యక్రమంలో బీహార్ రాష్ట్ర గవర్నర్ డీవై పాటిల్, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పాల్గొన్నారు. స్నాతకోత్సవంలో గౌన్లు ధరించే సంస్కృతికి స్వస్తి చెప్పేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా నితీశ్ కుమార్ రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశారు.