ఆనీ ఎర్నౌకు 23 ఏళ్లు ఉండగా అవాంఛిత గర్భం వచ్చింది. దాంతో చట్టవిరుద్ధంగా అబార్షన్ చేయించుకోవాల్సి వచ్చింది. ఇది జరిగింది 1963లో. 1999లో ఈ అనుభవాన్ని ఆమె నవలగా రాసింది. 130 పేజీల ఈ నవల 2000 సంవత్సరంలో ‘హ్యాపెనింగ్’ పేరుతో వెలువడి సంచలనం రేపింది. కాల్పనిక సాహిత్యం రాసే ఫ్రెంచ్ రచయిత్రి ఆనీ ఎర్నౌ ఆ రకమైన సాహిత్యాన్ని వదిలిపెట్టి స్వీయ జీవితంలోని పరాభవాలు, ఆందోళనలు దాపరికం లేకుండా రాయడం కూడా సాహిత్యమేనని గ్రహించింది. 2022 సంవత్సరానికి ప్రతిష్టాత్మక నోబెల్ ప్రెయిజ్ గెలుచుకున్న ఆనీ ఎర్నౌ ఇంగ్లిష్‌లో రాయకున్నా ఈ బహమతి గెలుచుకున్న అతి కొద్దిమంది మహిళల్లో ఒకరు. ఆమె గురించి... ఆమె పుస్తకాల గురించి...
‘ఇది పురుషాధిక్య ప్రపంచం. దీనిని బోనెక్కించాల్సిన సమయం వచ్చినప్పుడు బోనెక్కించాల్సిందే’ అంటుంది 82 సంవత్సరాల ఫ్రెంచ్ రచయిత్రి ఆనీ ఎర్నౌ.
తన జీవితంలో జరిగిన ఒక సంఘటన– చట్ట విరుద్ధంగా అబార్షన్ చేయించుకోవాల్సి రావడాన్ని– 1999లో ఫ్రెంచ్‌లో ‘ఇవెన్మో’ పేరుతో నవలగా రాస్తే మరుసటి సంవత్సరం అది ‘హ్యాపెనింగ్’ పేరుతో ఇంగ్లిష్‌లో అనువాదం అయ్యి వెలువడింది. ఆ సందర్భంగా ఆనీ ఎర్నౌ అన్న మాట అది. ‘నా జీవితంలో నాకు జరిగింది రాయడం ఎందరో స్త్రీలకు గొంతునివ్వడమే’ అని ఆమె అంది. ‘నాకు అవాంఛిత గర్భం వచ్చినప్పుడు అది నా వ్యక్తిగతమైన విషయంగా మిగల్లేదు. బయటపడితే నా కుటుంబం మొత్తం సామాజిక నీతిలో విఫలమైందన్న విమర్శను మోయాల్సి వచ్చేది’ అంటుందామె.
కాకతాళీయమే అయినా ఇండియాలో అబార్షన్ గురించి సుప్రీంకోర్టు స్త్రీలకు సంపూర్ణ హక్కులు ఇచ్చిన సందర్భంలోనే అబార్షన్ గురించి, స్త్రీల దైహిక వేదనల గురించి, మనో సంఘర్షణల గురించి, వారికి మాత్రమే ఎదురయ్యే అనుభవాల గురించి అది కూడా శ్రామిక వర్గ కోణం నుంచి విస్తృతంగా రాసిన ఆనీ ఎర్నౌకు నోబెల్ సాహిత్య బహుమతి లభించింది. ఇప్పటి వరకు 119 మంది నోబెల్ సాహిత్య బహుమతి లభిస్తే వారిలో కేవలం 16 మందే స్త్రీలు. ఆనీ ఎర్నౌ 17వ రచయిత్రి.
బాల్యం నుంచి గుణపాఠాలే
ఫ్రాన్స్‌లోని ఇవెట్తో అనే ఊళ్లో చిన్న పచారీ కొట్టు నడిపేవారు ఆనీ తల్లిదండ్రులు. తండ్రికి పట్టకపోయినా జీవితాలు మారాలంటే చదువు ముఖ్యం అని ఆమె తల్లి గట్టిగా భావించింది. దాంతో తమ స్థాయికి చెందకపోయినా కాస్త మంచిబడిలో ఆనీని చేర్పించింది. ఆ బడికి కలిగిన పిల్లలు వచ్చేవారు. ‘అక్కడే నాకు తొలిపాఠం తెలిసింది. శ్రామిక వర్గానికి దక్కే మర్యాదలు కూడా తెలిశాయి. నిన్ను నువ్వు చిన్నబుచ్చుకుంటూ బతకాల్సి రావడం కంటే ఘోరమైన విషయం లేదు.
మన స్థాయికి మించిన విషయాల్లో అడుగు పెట్టకూడదని నాకు గట్టిగా అందిన సందేశం అందింది’ అంటుందామె. ఆమె తన స్వీయానుభవాల ఆధారంగా ‘ఏ గర్ల్స్ స్టోరీ’ (2016) అనే నవల రాసింది. ‘18 ఏళ్ల అమ్మాయి స్టూడెంట్స్ క్యాంప్‌లో లైంగిక అనుభవం పొందితే అది సంతోషకరంగా ఉండాలి. కాని ఇది తెలిసిన వెంటనే మగ విద్యార్థులు ఆ అమ్మాయిని గేలి చేశారు. ఆమె అద్దం మీద అసభ్యకరంగా రాసి వెక్కిరించారు. ఎన్నాళ్లు గడిచినా నైతికంగా పతనమైన భావనను కలిగించారు’ అని రాసిందామె. చదువు ముగిశాక ఆమె టీచర్‌గా మారి ఆనీ ఎర్నౌ 2000 సంవత్సరంలో రిటైరయ్యి పూర్తికాలం రచయిత్రిగా రచనలు కొనసాగిస్తూ ఉంది.
సూటిగా, సులభంగా
ఆనీ ఎర్నౌ రచనా శైలి సూటిగా సులభంగా ఉంటుంది. నేరుగా పాఠకులకు అందేలా ఆమె వచనశైలి ఉంటుంది. నోబెల్ కమిటీ కూడా ఇదే మాట అంది. ‘ఆమె సాహిత్యం అత్యంత సాధారణ భాషలో అత్యంత పరిశుభ్రంగా ఉంటుంది’ అని అభిప్రాయపడింది. ఆనీ ఎర్నౌ రాసిన పుస్తకాల్లో ‘క్లీన్డ్ ఔట్’ (1974), ‘షేమ్’ (1997), ‘గెటింగ్ లాస్ట్’ (2001), ‘ది ఇయర్స్’ (2008) ముఖ్యమైనవి. 1988లో పారిస్‌లో ఉద్యోగం చేస్తున్న ఒక సోవియెట్ దౌత్యవేత్తతో ఆనీ ఎర్నౌ బంధం ఏర్పరుచుకుంది. అతడు ఆమె కంటే 12 ఏళ్లు చిన్నవాడు. కొంత కాలానికి ఆ బంధం ముగిసింది. ఆ సమయంలో తన భావోద్వేగాలను ‘గెటింగ్ లాస్ట్’ పేరుతో నవల రాసిందామె. అలాగే తన గురించి, ఫ్రాన్స్ సమాజం గురించి రెండో ప్రపంచ యుద్ధం నాటి నుంచి ఇటీవలి కాలం వరకూ జరిగిన ఘటనలను ‘ది ఇయర్స్’గా రాసింది. ఒక రకంగా ఇది స్వీయ చరిత్ర, ఫ్రాన్స్ చరిత్ర కూడా.
స్త్రీ పక్షపాతి
ఆనీ ఎర్నౌ తనను తాను ‘రచనలు చేసే మహిళ’గా చెప్పుకున్నా ఆమె స్త్రీ పక్షపాతి. స్త్రీవాద ఉద్యమానికి ప్రోత్సాహకురాలు. ‘రాజకీయాలు భ్రష్టుపట్టిన ఈ సమయంలో ఫెమినిస్టులే సరిహద్దులను ప్రశ్నిస్తూ కొత్త ఆలోచనలను చేస్తూ ఆశలు రేకెత్తిస్తున్నారు’ అంటుందామె. ఇటీవల జరిగిన మీటూ ఉద్యమం ఆమెకు చాలా సంతోషాన్నిచ్చింది. ‘తమతో ఎలాగైనా వ్యవహరించవచ్చనే స్థితిని స్త్రీలు ఇక మీద ఏ మాత్రం అంగీకరించరు’ అంటారామె.
‘నేను రాయగలను కాబట్టే నాకు వినూత్న అనుభవాలు ఎదురవుతున్నాయి’ అని చెప్పుకున్న ఆనీ రాయగలిగే మహిళలంతా తమ జీవన అనుభవాలను బెరుకు లేకుండా చెప్పడాన్ని ప్రోత్సహిస్తుంది. అప్పుడే స్త్రీలు, స్త్రీలతో ఉన్న సమాజం మరింత మెరుగ్గా అర్థమవుతాయి.
స్వీయ అనుభవాలే రచనలు
ఆనీ ఎర్నౌ ఏవో ఊహించి కథలు అల్లడం కన్నా తన జీవితంలో జరిగినవే రాయాలని నిర్ణయం తీసుకుంది. దాంతో ఆమె జ్ఞాపకాల రచయిత్రి అయ్యింది. మన జీవితంలో జరిగినదాన్ని రాయడం వల్ల మిగిలినవారు పోల్చుకోవడానికో, సహానుభూతి చెందడానికో అది ఉపయోగపడుతుంది అంటుందామె. మనుషులు వేరే చోట్ల ఉన్నా వారు భావోద్వేగాలు ఒకటే కదా. ఆనీ ఎర్నౌ రాసిన ‘హ్యాపనింగ్’ నవల ఒక కాలపు ఫ్రాన్స్‌లో స్త్రీల సంఘర్షణను సూటిగా నిలపడంతో ఆమెకు ప్రశంసలు వచ్చాయి. 1963లో ఆమె అబార్షన్ చేయించుకోవాల్సి వస్తే ఆ తర్వాత 12 ఏళ్లకు కాని ఫ్రాన్స్‌లో (అవివాహితులకు) అబార్షన్‌ను చట్టబద్ధం చేయలేదు. ‘అబార్షన్ హక్కు లేకపోవడం అంటే.. చట్టం, సంఘపరమైన నియమాలు వ్యక్తి స్వేచ్ఛను పూర్తిగా ధ్వంసం చేయడమే’ అంటుందామె.
Comments
Please login to add a commentAdd a comment