దక్షిణం: బేబీమూన్‌కు రెడీయా?! | Travel with babymoon ? | Sakshi
Sakshi News home page

దక్షిణం: బేబీమూన్‌కు రెడీయా?!

Published Sun, Aug 25 2013 3:00 AM | Last Updated on Fri, Sep 1 2017 10:05 PM

దక్షిణం: బేబీమూన్‌కు రెడీయా?!

దక్షిణం: బేబీమూన్‌కు రెడీయా?!

జీవితంలో గుర్తుండే అరుదైన విషయం హనీమూన్! ప్రపంచం మనల్ని, మనం ప్రపంచాన్ని వదిలేసిన ఏకాంతం అది. ఆ కబుర్లు, ఆ చేష్టలు, ఆ ముచ్చట్లు.. రాజు-రాణి ఒకరికొకరు సేవకులుగా తరించే ఆ మధుర క్షణాలు అలిఖిత ఆటోబయోగ్రఫీలో చెరగని క్షణాలు. అందుకే దాన్నెవరూ వదులుకోరు. సరే...గాని! మీరింకా అక్కడే ఆగిపోయారా... జీవితంలో కొత్త మార్పులు ఎంత వేగంగా వస్తున్నాయండీ! అవన్నీ తెలుసుకోకుంటే ఎలా? మనం నూరేళ్లు హాయిగా జీవించాలంటే... జీవితం దశలు దశలుగా మారుతూ ఉండాలి. బాల్యం, యవ్వనం, మధ్యవయసు, పెద్దరికం, వృద్ధాప్యం. ఇందులో ప్రీతిపాత్రమైన యవ్వనమే ఎప్పటికీ జ్ఞాపకం. అందులో మంచి జ్ఞాపకాలు ఒకటి హనీమూన్, రెండు బేబీమూన్. ఈ రెండోదేంటి? ఇంకా ఇండియాలో పూర్తిగా పాపులర్ కాలేదు గాని వచ్చేసింది. పెళ్లయిన తర్వాత దంపతులకు ఏకాంతం ఎంతో సుఖం. దాన్ని మాయం చేసేది పిల్లలు.
 
 రెండూ ఇష్టమైనవే. కానీ ఏదో ఒకటి వదులుకోవాలి. అలా ఏకాంతాన్ని వదులుకునే ముందు దాన్ని ఓ పరాకాష్టలో అనుభవించాలనే ఆలోచనే బేబీమూన్. ఇక నుంచి జీవితంలోకి కొత్త వ్యక్తులు వస్తారు. పిల్లలయ్యాక ఏకాంతం అన్నది కొంచెం కష్టమే. బాధ్యతలు కూడా కుదరుగా ఉండనివ్వవు. అందుకే దాన్ని మరింతగా అనుభూతి చెందేందుకు పిల్లలు పుట్టబోయే రెండు నెలల ముందు వెళ్లేదే బేబీమూన్. చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇద్దరూ ఊసులు చెప్పుకుంటూ గడిపి లోకాన్ని మరిచిపోతే అది జీవితకాల జ్ఞాపకాల ఆస్తి. కాబట్టి ఆ వెలకట్టలేని క్షణాలను మిస్ అవ్వద్దు. గర్భంతో ఉన్నపుడు ఆహ్లాదకరంగా గడిపే క్షణాలు బిడ్డకూ క్షేమమే. ఇంకా ఇది మీ భాగస్వామికి తెలియకముందే ప్లాన్ చేసి సర్‌ప్రైజ్ చేయండి. ఎవ్వరూ డిస్టర్బ్ చేయని జీవితాన్ని ఎంజాయ్ చేయండి. ఇపుడు ఇండియాలోని ప్రఖ్యాత పర్యాటక ప్రదేశాల్లో బేబీమూన్ ఏర్పాట్లు కూడా ఉన్నాయి. టూర్స్ అండ్ ట్రావెల్స్ కూడా దీనికి ఏర్పాట్లు చేస్తున్నాయి.
 
 బేబీ మూన్ టిప్స్:  కబుర్లు ఎంత చిలిపిగా ఉంటే అంత మంచిది  తక్కువ ప్రయాణం చేసేలా దగ్గరలో ఉన్నవాటికి వెళ్లడం మంచిది  బేబీమూన్ ఏడునెలల లోపే చేయాలి  వాటర్ స్పోర్ట్స్, జాయ్ రైడ్స్ వద్దు  ఎత్తయిన ప్రదేశాలకు వెళ్లకపోవడం మంచిది  ప్రకృతి అందాలతో నిండిప్రదేశాలకు వెళ్లాలి. తక్కువగా తిరగండి  ఇపుడు అంతర్జాతీయ ట్రావెల్స్ సంస్థలు దీన్ని ప్లాన్‌చేసి ఇస్తున్నాయి.  
 
 గిఫ్ట్ ఐడియా !
 పుట్టిన రోజు గిఫ్ట్ ఎక్స్‌పెక్టెడ్. పెళ్లి రోజు గిఫ్ట్ ఎక్స్‌పెక్టెడ్. వాలెంటైన్స్ డే కూడా ఊహించేదే. మరింత సర్‌ప్రైజ్ చేసి, మరింత ప్రేమ పంచాలనుకునేవారికి ఇంకా అవకాశాలున్నాయి. అదే...‘కిస్ డే’. ప్రేమ కూడా వెన్నెల వంటిదే. అది ఎప్పుడూ ఉంటుంది. కానీ అన్నిసార్లు ఒకేలా కనిపించదు. అమావాస్యలా ఒకోసారి ఏమీ లేదనిపిస్తుంది. ఇంకోరోజు పున్నమి వెన్నైలై కురుస్తుంది. ప్రేమ కూడా ఒక భావోద్వేగమే. సందర్భాన్ని బట్టి అది వెలువడుతూ ఉంటుంది. అలాంటి ప్రేమ ఎక్స్‌ప్రెషన్ ‘ముద్దు’! జీవితంతో అంత కీలకమైన విషయానికి ఓ రోజు, ఒక గిఫ్టు ఉంటే ఎంత బాగుంటుంది. అందుకే ఇకనుంచి ‘కిస్ డే’ జరుపుకోండి. ఏరోజు జరుపుకోవాలి అని కంగారు పడక్కర్లేదు.
 
 ఆల్రెడీ దానికోరోజు ఉంది. అంతర్జాతీయ కిస్ డే ...జులై 6న జరుపుకుంటారు. అలాగే వాలెంటైన్స్ డే ముందు రోజు (ఫిబ్రవరి 13) ను కూడా ముద్దుల దినోత్సవంగా జరుపుకుంటారు. ఎందుకంటే ప్రేమకు ముద్దు మొదటి మెట్టు!  మీ హృదయబాంధవికి ఆ రోజున ఓ గిఫ్టు, ఓ ముద్దు... ముద్దుగా అందజేయండి. ప్రేమను విచ్చలవిడిగా గెలుచుకోండి! ఇంకో విషయం... ఆరోజు ఎలాంటి బహుమతి ఇస్తే బాగుంటుందా అని బుర్ర చించుకోనక్కర్లేదు. ఆల్రెడీ దానికి బహుమతులున్నాయి. హార్ట్ షేప్ పిల్లోపై ముద్దాడుతున్న టెడ్డీ బేర్, రెండు పెదవులపై కూర్చున్న టెడ్డీ బేర్ జంట, కిస్ మి పిల్లోస్ వంటివి అందుబాటులో ఉన్నాయి.
 -  ప్రకాష్ చిమ్మల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement