ఫ్రెంచ్ సాహితీవేత్తకు నోబెల్!
స్టాక్‌హోం: ఈ సంవత్సరం సాహిత్యంలో నోబెల్ పురస్కారం ఫ్రెంచ్ సాహితీవేత్త పాట్రిక్ మొడియానో(69)ను వరించింది. ఫ్రాన్స్‌పై నాజీల ఆక్రమణ, అది తన దేశంపై చూపిన ప్రభావం.. వీటిని తన జీవితకాలం అధ్యయనం చేసిన పాట్రిక్ ఈ పురస్కారం కింద 80 లక్షల స్వీడిష్ క్రొనార్లను(రూ. 6.71 కోట్లు) అందుకోనున్నారు. అంత తేలికగా అర్థం కాని మానవ జీవితాలను, ఆక్రమణలో ఉన్న జీవితాల్లోని చీకట్లను, కోల్పోయిన సొంత అస్తిత్వ గుర్తులను.. తన జ్ఞాపకాలతో నిండిన రచనల ద్వారా వెలుగులోకి తెచ్చిన పాట్రిక్‌ను ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారానికి ఎంపిక చేసినట్లు స్వీడిష్ ఎకాడమీ గురువారం ప్రకటించింది. ‘కాలం, అస్తిత్వం, జ్ఞాపకాలు పాట్రిక్ రచనల్లో తారసపడే అం శాలివి. ఆయన రచనలు పరస్పరం సంభాషించుకుం టాయి ఒకదాన్నొకటి ప్రతిఫలిస్తుంటాయి. ఇదే ఆయ న రచనలకు ఒక ప్రత్యేకతను ఆపాదిస్తాయి’ అని ఎకాడమీ శాశ్వత కార్యదర్శి పీటర్‌ఎంగ్లండ్ ప్రశంసించారు.
మిస్సింగ్ పర్సన్: యూరోప్‌లో రెండో ప్రపంచయుద్ధం ముగిసిన రెండు నెలల తరువాత 1945, జూలైలో పశ్చిమ పారిస్‌లో పాట్రిక్ మొడియానో జన్మించారు. ఆయన తండ్రి అల్బర్బో మొడీయానో జ్యూయిష్ ఇటాలియన్ కాగా, తల్లి లూయిసా కాల్పిన్ బెల్జియన్ నటీమణి. పారిస్ ఆక్రమణ సందర్భంగా వారిరువురికీ పరిచయమై, ఒక్కటయ్యారు. 20 ఏళ్ల వయసు నుంచే సాహిత్య సృజన ప్రారంభించిన పాట్రిక్ ఫ్రెంచ్‌లో 40కి పైగా రచనలు చేశారు. వాటిలో అనేకం ఆంగ్లంలోకి అనువాదం అయ్యాయి. వాటిలో ‘మిస్సింగ్ పర్సన్’ నవల 1978లో ప్రతిష్టాత్మక ప్రిక్స్‌గాన్‌కోర్ట్ అవార్డ్‌ను గెలుచుకుంది. 1968లో ఆయన రాసిన ‘లా ప్లేస్ డి లెటాయిల్’ నవల యూదులపై నాజీల నరమేథం అనంతరం వచ్చిన అత్యుత్తమ రచనగా ప్రశంసలందుకుంది.
విల్లా ట్రిస్ట్, అ ట్రేస్ ఆఫ్ మాలైస్, హనీమూన్, డొరా బ్రుడర్.. తదితర నవలలు పాట్రిక్‌కు గొప్ప పేరు తెచ్చాయి. బాలసాహిత్యంలోనూ, సినిమా స్క్రిప్ట్‌ల రూపకల్పనలోనూ ఆయన తన సృజనాత్మకతను నిరూపించుకున్నారు. 1974లో లాకోంబ్ అనే సినిమాను కూడా తీశారు. 2000 సంవత్సరం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ జ్యూరీలో సభ్యుడిగా ఉన్నారు. 2012లో యూరోపియన్ సాహిత్యంలో చేసిన కృషికి గానూ ఆస్ట్రేలియా జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. పారిస్‌లో నివసించే పాట్రిక్ అరుదుగా మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తుంటారు. నోబెల్ సాహిత్య పురస్కారం విజేతల్లో 107వ వ్యక్తి పాట్రిక్ మొడియానో. అలాగే ఆ అవార్డ్ అందుకుంటున్న 11వ ఫ్రెంచ్ రచయిత.